ఈ ‘కుటుంబ చింత’కు అంతమున్నదా?

ABN , First Publish Date - 2022-09-27T06:34:07+05:30 IST

క్వీన్ఎలిజబెత్–2 ఆస్ట్రేలియాను తొలిసారిగా 1954లో సందర్శించినప్పుడు ఆమెను చూసే భాగ్యాన్ని మా అమ్మ దాదాపుగా పొందలేకపోయింది....

ఈ ‘కుటుంబ చింత’కు అంతమున్నదా?

క్వీన్ఎలిజబెత్–2 ఆస్ట్రేలియాను తొలిసారిగా 1954లో సందర్శించినప్పుడు ఆమెను చూసే భాగ్యాన్ని మా అమ్మ దాదాపుగా పొందలేకపోయింది. లక్షలాది ఇతర పాఠశాల పిల్లలవలే ఆ యువ ప్రభ్విణిని వీక్షించేందుకై గుమిగూడుతున్న జనసమూహంలో కలిసిపోవాలని అమ్మ అపేక్షించింది. సమస్యేమిటంటే మా అమ్మకు మేజోళ్లు లేవు. మా అమ్మ ఒక నిరుపేద ఆదివాసీ బాలిక. గుడిసెలో ఆమె బాల్యం గడిచింది. మేజోళ్లు ఆమెకు ఒక విలాసం. క్వీన్‌ను చూసేందుకు మేజోళ్లు లేని వారిని పంపించబోమని పాఠశాల చెప్పింది. మా అమ్మ పెద్దన్న ఒక రోజు ముందే క్వీన్‌ను చూసివచ్చి, బేలగా ఉన్న మా అమ్మకు తన మేజోళ్లను ఇచ్చాడు. పెద్దన్న మేజోళ్లను వేసుకుని క్వీన్‌ను చూసేందుకు వెళ్లిన ఆ ఉదంతాన్ని ఆమె అనేకసార్లు నాకు చెప్పింది.


అమ్మకు ఇతర జ్ఞాపకాలూ ఉన్నాయి. పోలీసులు ఆమె తండ్రిని ఒక కుక్కను కట్టివేసినట్టు ఒక చెట్టుకు కట్టివేశారు. ఆహారం, నీరు లేక ఒక రోజంతా ఎండలో అలా ఉండిపోవడంతో సొమ్మసిల్లిపోయాడు. మద్యపానం చేసిన ఆదివాసీ పురుషులు అందరినీ ఒక తాడుతో కట్టివేసి ప్రధాన వీధిలో అటూ ఇటూ, ఇటూ అటూ నడిపించడాన్ని అమ్మ చూసింది. ఇద్దరు తమ్ముళ్లు చిన్న పిల్లలుగానే చనిపోయిన విషాద గాథలనూ, సంక్షేమ గృహాలకు వెళ్లిన తోబుట్టువుల విషయాలూ, ఆకలితో నకనకలాడిపోయిన క్షణాల గురించిన గాథలూ చెప్పింది. ఒకసారి పాఠశాల ప్రాంగణంలో కేక్ తింటున్న ఒక శ్వేతజాతి బాలిక వెనుకనే వెళతూ ఆమె వదిలివేసిన రొట్టెముక్కను ఒక్క ఉదుటన తీసుకుని ఎంత ఆబగా, ఆత్రంగా తిన్నదీ ఆమ్మ గుర్తు చేసుకునేది. తాను ఆస్వాదించిన కేక్‌లలో అదే రుచివంతమైనదని అమ్మ ఇప్పటికీ చెప్పుతుంటది.


మేజోళ్లు లేని ఒక బాలిక ఎలాగైతేనేం క్వీన్ ఎలిజబెత్‌ను చూసింది. మరి ఆ ప్రభ్విణి మోపిన పేదరికంలోనే ఆ బాలిక కుటుంబమూ, అలాంటి ఇతర కుటుంబాలు ఎన్నో కునారిల్లుతున్నాయి. వలస పేరిట తమ నుంచి తస్కరించిన గడ్డపై గూడు లేకుండా నివసిస్తున్న నిర్భాగ్య కుటుంబాలవి. ఆ మహా సార్వభౌమికురాలు మరణించిన అనంతరం నేను మా అమ్మతో మాట్లాడాను. బాల్యంలో ఆ రాణీ గారిని చూసేందుకు తాను పడిన ఆరాటమూ, అవస్థల గురించి అమ్మ మళ్లీ చెప్పింది. తినడానికి మెతుకు లేక కటిక పేదరికంలో మగ్గిపోయి, నిర్బంధంలో బతుకులు వెళ్లదీసిన దీన జనులు నా ప్రజలు.


ఇప్పుడు నేను ఈ వాస్తవాల గురించి మాట్లాడకూడదు. క్వీన్ మరణించిన సందర్భంలో వలసీకరణ, సామ్రాజ్యం, ఆదివాసుల సార్వభౌమత్వంపై హింసాత్మక దాడులు, అంతేకాదు రిపబ్లిక్ గురించి మేము మాట్లాడనేకూడదు. అలా మాట్లాడడం సముచితం కాదని ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరూ మాకు చెప్పారు. వేగంగా సుడులు తిరుగుతున్న భావోద్వేగాలతో కుస్తీపడుతున్న ఆదివాసీని నేను ఒక్కణ్ణే కానని నాకు తెలుసు. మా అందరిలోనూ ఆగ్రహం రగులుతోంది. మా దేశవాళీ ప్రజలు భరిస్తున్న బాధలు, ఎదుర్కొంటున్న వెతలూ, అన్యాయాలపై కోపతాపాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ మండిపోతున్నాం. శ్వాసావరోధం కలిగించే ఈ ఆగ్రహం నాకు మంచిది కాదు. అయితే ఇదేమీ చాలా మంది ఇతర ఆదివాసులు రోజూ ఎదుర్కొంటున్న క్రూర, కఠిన అనుభవాలతో పోలిస్తే, ప్రస్తావనార్హమైనది కాదు. జైళ్లలో కొట్టుమిట్టాడుతున్నవారు, నిస్సహాయంగా సొంత ప్రాణాలు తీసుకుంటున్నవారు, అంతులేని నైరాశ్యం నుంచి ఎంతకూ బయటపడలేకపోతున్నవారు నా ఆదివాసీ ప్రజలు.


ఇది రాయడం నాకు మేలు చేయదు. తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి దేశవాళీ ప్రజలు మాట్లాడడాన్ని సహించని వారు నన్ను ఏ విధంగా దుర్భాషలాడుతారో నాకు తెలుసు. సామాజిక మాధ్యమాలలో నాపై వ్యాఖ్యలు వెల్లువెత్తుతాయి. నా కుటుంబమూ వాటికీ లక్ష్యమవుతుంది. అత్యంత నీచ భాషలో తిడతారు. ప్రాణాపాయానికి సిద్ధంగా ఉండాల్సిందే. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? ఎందుకు మాకు మేమే వివరణ ఇచ్చుకోవాలి? ఎందుకంటే మాకు ఉన్నదంతా ఒక గొంతుక మాత్రమే. ఆ గళాన్ని తరచూ మూకీ భావం వహించేలా చేస్తున్నారు. క్వీన్ ఎలిజబెత్ మరణించిన సందర్భంలోనే కాదు, సదా మమ్ములను నిరుత్తరులను చేస్తూనే ఉన్నారు. మా గొంతుక మాట్లాడడమంటూ జరిగితే చాలవరకు ఏమన్నా అవుతుందేమోనన్న భయంతో, విన్పించీ విన్పించకుండా మాట్లాడుతుంది. మా దేశవాళీ ప్రజల రాజకీయ నాయకుల గళాలు వినిపించవేమీ? మరణించిన క్వీన్‌ను చిన్నబుచ్చే విధంగా ఉన్నదంటున్న ఒక వ్యాఖ్యను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినందుకుగాను ఆదివాసీ అయిన రగ్బీ లీగ్ ఆటగాడు కెయిట్లాన్ మోరాన్ను ఆర్థికంగా శిక్షించినప్పుడు ఆ నాయకులు ఎక్కడ ఉన్నారు?


రాజ్యాంగ బద్ధంగా ప్రతిష్ఠించిన ‘ఇండిజినస్ వాయిస్ టు పార్లమెంట్’ (ఆదివాసుల వ్యవహారాలపై ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ఫస్ట్ నేషన్స్ పీపుల్స్ ప్రతినిధులతో ఎన్నికైన సంఘంగా ఉండాలని ఉద్దేశించిన సంస్థ)పై రిఫరెండమ్‌లో ఆస్ట్రేలియన్లు పాల్గొనవచ్చు. అయితే ప్రస్తుత సందర్భంలాంటి అవసరమైన సమయాలలో దాన్ని గుసగుసల సంఘంగా కుదించివేస్తున్నప్పుడు ఆ ‘గొంతుక’ వల్ల ఒరిగేదేమిటి? మా ప్రజలకు జరిగే మేలు ఏమిటి? చరిత్ర ఆవలి దిక్కునుంచి రానున్నదేమిటో నాకు గుర్తు చేశారు. శ్వేతజాతికి ఒక స్తోత్ర గీతంగా చరిత్ర తనకు తానే రాసుకుంది. చరిత్రను విజేతలు రాస్తారు. తరచు అది రుధిరాక్షరాలతో లిఖితమవుతుంది. ఒక ప్రగతి గాథ, నాగరికతను నేర్పే ఒక బృహత్ కర్తవ్యంగా చరిత్రను రూపొందిస్తారు. చరిత్రకారిణి కరోలిన్ ఎల్కిన్స్ తన ‘లెగసీస్ ఆఫ్ వయోలెన్స్’ (బ్రిటిష్ సామ్రాజ్య చరిత్ర)లో ఇలా వ్యాఖ్యానించారు: ‘సామ్రాజ్య సుకుమారతలో ఒక ఇనుప పిడికిలి ఉన్నదనే వాస్తవం కోట్లాది ప్రజలకు బాగా తెలుసు’. భారత్, ఆఫ్రికా, ఐర్లండ్, పసిఫిక్ దీవులు, కరీబియన్ దీవులు, ఆస్ట్రేలియాలోని వారికి, అంటే చరిత్ర ఆవలిపక్షంలోని వారికి ఆ ఇనుప పిడికిలి పోటు ఎటువంటిదో తెలుసు. అది ఒక జీరో –సమ్ గేమ్ (ఒకరికి నష్టం జరిగితే ఇంకొకరికి లాభం జరగడం) కాదు. అయితే చరిత్ర తూకం వేసే వస్తువుకాదు. మనకు అనుభవేకమైనదే చరిత్ర. దాని గురించి తెలుసుకుంటాం, అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం, మన చర్మంపై ధరిస్తాం. మన జ్ఞాపకాల్లో అది భీతిగొల్పుతుంది.


ఈ చరిత్ర భారాన్ని మోస్తూ ఎలా బతకాలి? ప్రతీకారం, విద్వేషానికి లోనుకాకుండా ఎలా ఉండాలి? న్యాయం కోసం మన ధర్మబద్ధ డిమాండ్‌పై వెనుకడుగు వేయకుండా ఎలా ఉండాలి? ఇదొక సందిగ్ధ పరిస్థితి. అప్పుడప్పుడు నేను ఈ సందిగ్ధతతో పెనుగులాడుతుంటాను. ఎందుకంటే ఫస్ట్ నేషన్స్ పీపుల్‌తో ఆస్ట్రేలియా ఒక న్యాయబద్ధమైన ఒప్పందానికి ఇప్పటికీ రానేలేదు. ‘ఇండిజినస్ వాయిస్ టు పార్లమెంట్’– సుగుణాలు ఏమైనప్పటికీ– న్యాయాన్ని సాధించగలదని నేను భావించడంలేదు. న్యాయసాధనకు చేస్తోన్న సుదీర్ఘ ప్రస్థానంలో అది మరొక అడుగు మాత్రమే. అయితే ప్రస్తుత సందర్భంలో మేము దాని గురించి మాట్లాడకూడదు. నా స్నేహితులు, సహచరులు చాలామంది నల్ల దుస్తులు ధరించి క్వీన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన విధ్యుక్త ధర్మనిర్వహణ పట్ల క్వీన్ చూపిన అంకిత భావాన్ని నా సహచరులు కొనియాడారు. ‘ప్రతి ఒక్కరి అమ్మమ్మ చనిపోయినందుకు’ వారు విచారగ్రస్తులయ్యారు.


నా ఆలోచనలు మా అమ్మమ్మ మీదకు వెళ్ళాయి. నా ప్రజల వాడుకలో ‘Yindyamarra’ అనే మాట ఒకటి ఉంది. ఆ మాటకు ఉన్న అర్థాన్ని ఆంగ్లంలోకి అనువదించలేము. అదొక తాత్వికత, ఒక జీవన విధానం. గౌరవించడం దానికి ప్రాతిపదిక. క్వీన్ మరణాన్ని విషాదభరితమైనదిగా భావిస్తున్న వారి విచారగ్రస్త మనోభావాలను ఆ Yindyamarra తాత్వికత స్ఫూర్తితో గౌరవిస్తాను. ఆ విచారగ్రస్తత వారి Sorry Business (ఆస్ట్రేలియా ఆదివాసుల సంస్కృతిలో తెగకు చెందిన వ్యక్తిని శాశ్వతంగా కోల్పోయినప్పుడు సంతాప లేదా కుటుంబ చింత కాలాన్ని, నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలను ఆ మాట సూచిస్తుంది). క్వీన్ అభిమానులు జీవన గమనంలో ఆ విచారగ్రస్తతను దాటి ముందుకు సాగిపోతారు. మా దేశవాళీ ప్రజల Sorry Business మాత్రం ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంటుంది.

స్టాన్ గ్రాంట్ 

ఆస్ట్రేలియా ఆదివాసీ పాత్రికేయుడు

Read more