ఇంత ఆర్భాటం అవసరమా?

ABN , First Publish Date - 2022-10-14T06:14:28+05:30 IST

తాను రాజీనామా చేస్తేనే అభివృద్ధి అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి మారి మునుగోడుపై ఉప ఎన్నిక రుద్దారు. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఏమోగాని చేయాల్సిన దానిపై...

ఇంత ఆర్భాటం అవసరమా?

తాను రాజీనామా చేస్తేనే అభివృద్ధి అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి మారి మునుగోడుపై ఉప ఎన్నిక రుద్దారు. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఏమోగాని చేయాల్సిన దానిపై ఆయన కానీ, ఆయన పార్టీ బీజేపీ కానీ మాట్లాడడమే లేదు. ఇన్నిసార్లు తాను గెలిచినందున, పార్లమెంటు సభ్యుడిగా తన సోదరుడే ఉన్నందున ఇప్పటికే తన నియోజకవర్గాన్ని నిజంగా అభివృద్ధి చేసి ఉంటే అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు? ఉప ఎన్నిక కోసం రెండెకరాల్లో క్యాంప్‌ ఆఫీసు ఏర్పాటు చేసుకుని రోజుకు వెయ్యిమందికి భోజనాలు పెడుతూ గల్లీ లీడర్లకు, ప్రజలకు అడిగింది కాదనకుండా సమకూరుస్తూ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు? ఎన్నో ఏళ్లుగా అదే నియోజకవర్గం నుంచి అప్రతిహతంగా గెలుస్తున్న రాజగోపాల్‌రెడ్డికి ఇంత ఆర్భాటం అవసరమా? పొరుగు రాష్ట్రాల్లో ఉపాధి పొందుతున్న స్థానిక ఓటర్లను విమానాల్లో తీసుకురావడమెందుకు? బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రులు ఇక్కడే తిష్ఠవేసి ప్రచారం చేయడమెందుకు? అంటే ఆయన గెలుపుపై ఆయనకే నమ్మకం లేకనే. టీఆర్‌ఎస్‌కు సంబంధించి మంత్రివర్గ సభ్యులు, చివరకు ముఖ్యమంత్రి ప్రచారం చేయాల్సిన అగత్యం ఎందుకో? అసలు అభ్యర్థి మారలేదు.. నియోజకవర్గం ముఖ చిత్రం మారలేదే.. రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ స్వప్రయోజనాల కోసమే ప్రజలపై బలవంతంగా రుద్దుతున్న ఈ ఉప ఎన్నిక వల్ల తమకు ఒనగూరే ప్రయోజనమేంటో ఓటర్లు ఆలోచించాలి. భోజనాలు పెట్టారనో, మందు పోయించారనో, జేబులో డబ్బు కట్ట పెట్టారనో కాక విజ్ఞతతో ఆలోచించి ప్రధాన పార్టీల అభ్యర్థులను తిరస్కరిస్తేనే తమకు తాము, తమ నియోజకవర్గానికి మేలు చేసుకున్నవారవుతారు. కాగా, ఎన్నికకు రోజుకు ఎంత ఖర్చు పెడుతున్నారో, పూర్తయ్యేనాటికి అది ఎంతకు చేరుతుందో సామాన్యుడు సైతం లెక్కకట్టగలడు. కానీ ఎన్నికల కమిషన్‌ మాత్రం లెక్క కట్టలేదు. ఆ సంస్థ లెక్కల సార్ల(ఆడిటర్ల)కు లెక్కలు రావేమో. అంతా అయ్యాక ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన లెక్కలకు దగ్గరగా పద్దులు సరిచేసి అభ్యర్థులిచ్చే ఖర్చుల జాబితాను తూతూమంత్రంగా పరిశీలించడం వరకే తన పని అన్నట్లు ఎన్నికల కమిషన్‌ తీరు ఉంది. అలాంటపుడు ఇంతే ఖర్చు చేయాలి అని నిర్దేశించడంలో అర్థమే లేదు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్‌ పక్కాగా లెక్కలు తీయించి హద్దు మీరి ఖర్చు పెట్టిన అభ్యర్థులపై వేటు వేస్తుంటేనే అది పరతంత్ర కమిషన్‌ కాదని రుజువు చేసుకోగలుగుతుంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

మునిపల్లె శేషగిరిరావు, హైదరాబాద్‌

Read more