భారత జర్నలిజంలో చీకటి యుగం

ABN , First Publish Date - 2022-12-10T01:29:18+05:30 IST

భాaరత జర్నలిజంలో స్వర్ణయుగం అనబడేదేదీ లేదు. కాని పరిస్థితి ఇవాళ ఉన్నంత ఘోరంగా మరెప్పుడూ లేదు.

భారత జర్నలిజంలో చీకటి యుగం

భాaరత జర్నలిజంలో స్వర్ణయుగం అనబడేదేదీ లేదు. కాని పరిస్థితి ఇవాళ ఉన్నంత ఘోరంగా మరెప్పుడూ లేదు. జర్నలిజంలోని ప్రతి ఒక్క మంచి అంశాన్నీ వేగంగా ధ్వంసం చేస్తున్నారు. ఇది ఊహించినదే. కాని, ఇవాళ వాస్తవంగా నడుస్తున్నది జర్నలిజంలో ‘చీకటి యుగం’. దేశంలో లెక్కలేనన్ని వార్తా చానళ్లు ఉన్నాయి కాని అన్నిటికన్నీ నీతి తప్పి ఉన్నాయి. మన ప్రసారమాధ్యమాల పర్యావరణమే కుప్పకూలిపోయి, ధ్వంసమైపోయి ఉన్నది. ఇవాళ ప్రతి ఒక్కరూ తనను తాను జర్నలిస్టుననే చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అధికారబలం ఉన్నవారికి సన్నిహితంగా ఉన్నవారు, లేదా వారితో ఉన్నవారు. ఈ దేశంలో జర్నలిజం అణగిపోవడానికి అసలైన కారణం ఈ జర్నలిస్టుల ముఖాలూ, వారి సంస్థలూ కావడం ఒక వైచిత్రి. వారిపట్ల జాగ్రత్తగా, అనుమానంగా ఉండమని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రశ్నలే లేని ఈ జర్నలిస్టులూ, చివరికి ప్రభుత్వమూ కూడ జర్నలిజం గురించి వారి నిర్వచనాన్నే మీ గొంతుల్లోకి తోయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎన్డీటీవీతో నాకు ఆసక్తికరమైన జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. ఎవరో ఒక వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పడం చాల కష్టం. నేను ప్రతి ఒక్కరినుంచీ ఎంతో కొంత తీసుకున్నాను. అందుకు కృతజ్ఞుణ్ని. పెళ్లికూతురు పుట్టింటి నుంచి వెళ్లిపోయేటప్పుడు కన్న ఇంటి కోసం విలపిస్తుంది. మరొక ఇంటికి వెళ్లిపోయాక కూడ కన్న ఇంటిని గుర్తు చేసుకుంటుంది. ఇవాళ నేను ఆ పెళ్లికూతురిలా ఉన్నాను. ఒక టీవీని నిర్మించేది బృందాలే అని ఎన్డీటీవీ నాకు నేర్పింది. యాంకర్లకు ప్రాధాన్యత పెరిగిపోయి వాళ్లు స్టార్లుగా మారాక, ఈ భావన కొంత దెబ్బతిన్నది. అయినా, మీ బృందం ఎంత మంచిదైతే మీ పని అంత మంచిదవుతుందని ఇవాళ కూడ నేను నమ్ముతున్నాను.

ఎన్డీటీవీలో అనువాదకుడిగా లాంఛనంగా 1996 ఆగస్ట్లో చేరాను. అంతకు ముందు కూడ, ఎన్డీటీవీలో వీక్షకులు రాసిన చేతిరాత ఉత్తరాలు చదివే పనిచేసేవాణ్ని. ఆ పనిలో చేరిన మనిషి గ్రూప్ ఎడిటర్ అయ్యాడు. అది ఎన్డీటీవీలోనే సాధ్యం. ఇవాళ ఆ మనిషి తన రాజీనామా సమర్పిస్తున్నాడు.

నన్ను అంచనా కట్టేటప్పుడు, చాల కింది స్థాయిలో ప్రారంభించానని నా మీద జాలిపడరనే ఆశిస్తాను. చాల కింది స్థాయిలో ప్రారంభించామని చెప్పి సానుభూతి సంపాదించేవాణ్ని కాను నేను. అటువంటివాళ్లు తాను ఎట్లా ఒక చిన్న చాయ్ దుకాణంలో బాల్యం గడిపానో అని హఠాత్తుగా చెపుతుంటారు. అదే సమయంలో అత్యంత ఖరీదైన విమానాల్లో ప్రయాణిస్తుంటారు. నా జీవన ప్రయాణం అసాధారణమైనదని నేను అనుకోను. ఈ దేశంలో ప్రతి ఒక్కరిదీ కష్టభరితమైన జీవితమే.

ఇవాళ నేను మీతో టీవీ వీక్షకుల గురించి మాట్లాడదలచాను. వ్యవస్థలూ నిర్మాణాలూ పడిపోవడమూ, సమాజాలను విద్వేష కెరటాలు ముంచెత్తడమూ ఇటీవల మనందరమూ చూస్తున్నాం. కాని ఒక కొత్త వ్యవస్థ రూపుదిద్దుకోవడం నేను కళ్లారా చూశాను. ఆ వ్యవస్థ పేరు పౌరసత్వం. ఎన్డీటీవీ నాకొక అవకాశం ఇచ్చినప్పుడల్లా నేను మీ కోసమే పని చెయ్యడానికి ప్రయత్నించాను. నాకు అందిన అవకాశాన్ని మీ కథలతోనే నింపాను. మీరు మీ ఇళ్లలో, మీ మనసుల్లో నాకోసం ఒక న్యూస్ రూం నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు నాకు సహాయపడడానికి ముందుకొచ్చారు. చాలమంది నా పరిశోధనలో సహకరించారు. నాకు సమాచారం అందించారు, నా పొరపాట్లకు మందలించారు, నా కార్యక్రమాల్లో భాగమయ్యారు. నిపుణులు, విద్యార్థులు, ప్రవాసులు, భారతీయులు అందరూ వీక్షకులే. కాని నా సహప్రయాణికులయ్యారు, తమంతట తామే జర్నలిస్టులయ్యారు. ఆ విధంగా వాళ్లు జర్నలిజం అనే ఒక చిన్న ద్వీపాన్ని పరిరక్షించారు. మీ మద్దతు వల్లనే ఎంతోమంది జర్నలిస్టులు యూట్యూబ్ మీద, ట్విట్టర్ మీద ఉండగలుగుతున్నారు. మీరు వెబ్సైట్లకు చందాదారులయ్యారంటే, అవి నిలబడి ఉండడానికి సహాయపడుతున్నారన్నమాట.

ప్రజాస్వామిక వ్యవస్థలు బలహీనపడినప్పుడు, న్యాయస్థానాలు కూడ బలహీనపడినట్టు కనబడినప్పుడు, బలోపేతంగా నిలబడినది మీరే. ఇవాళ్టి పరిస్థితులలో జర్నలిజపు అతి పెద్ద వ్యవస్థ మీరే. ఇవాళ జర్నలిజం వివేకవంతులైన వీక్షకులలోనే జీవిస్తున్నది, బ్రహ్మాండమైన భవనాల్లో, సంస్థల్లో కాదు. ఈ కాలంలో మీరు చేస్తున్న అతి పెద్ద సహాయం ఏమంటే, మీరు కఠినమైన ప్రశ్నలు అడిగే జర్నలిస్టుల పక్కన నిలబడుతున్నారు.

ప్రజల గొంతును నొక్కేసే శక్తులుండవచ్చు. ప్రజల గొంతును మత విద్వేషంతో నింపే, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే శక్తులుండవచ్చు. కాని మీలో కొందరు నాలో ఆశలు రేకెత్తిస్తున్నారు. ఎందుకంటే, ప్రజాస్వామ్యమనేది చచ్చిపోయినప్పటికీ, సవ్యంగా సాగే ప్రజాస్వామ్యం ఉండాలనే కోరిక మిగిలే ఉంటుంది. అదంతా మీ వంటి బాధ్యతాయుత వీక్షకుల వల్లనే. ఈ కష్ట సమయంలో, అభిమానంతో నా బుగ్గలు పిండిన వృద్ధ స్త్రీలను, నేను ఆరోగ్యంగా ఉండాలని బలవర్ధక ఆహారం అందించినవాళ్లను కృతజ్ఞతతో తలచుకుంటున్నాను. మండుటెండల్లో పని చేస్తున్నప్పుడు నా మీద నీడగా గొడుగులు పట్టుకున్న వాళ్లున్నారు. మీరందరూ లేకపోతే నేననేవాణ్ని ఉండేవాణ్ని కాదు. నాకు పని చేసుకోవడానికి అవధులు లేని స్వేచ్ఛ లభించింది. నా జీవితమే దానిమీద ఆధారపడినట్టుగా నేనా స్వేచ్ఛను కాపాడుకున్నాను. నా కళ్ల ముందే ప్రపంచం మారిపోతూ ఉండగా, టెస్ట్ మ్యాచ్లో బాట్స్మన్ లాగ నేను రేఖ మీదనే నిలబడ్డాను. కాని హఠాత్తుగా ఎవరో అసలు మ్యాచ్నే ముగించారు, ఆట నియమాలను మార్చేశారు. సమాజంలోని సమస్త రంగాలనూ తమ అదుపులో ఉంచుకోగలమని ఇవాళ కొందరు భావిస్తున్నారు. పౌరులను గడ్డిపోచల్లా తీసేయగలమని లెక్కలేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రసార మాధ్యమాలనేవి మరణించాయి. రాజకీయ ప్రతిపక్షం పెనుగులాడుతున్నది. అదంతా నిజమే. కాని ఇటువంటి స్థితి శాశ్వతం కాదు. ఒకానొక రోజున ప్రజలు తమ విద్వేషాన్ని అధిగమిస్తారు. వారు ఒక కొత్త సమాజాన్ని నిర్మించడం గురించి ఆలోచిస్తారు. అప్పుడు వారు జర్నలిజం గురించి ఆలోచిస్తారు.

నేను చదవడమూ, మాట్లాడడమూ, రాయడమూ ఎన్డీటీవీ దగ్గరే నేర్చుకున్నాను. మంచి దుస్తులు ధరించడం ఎట్లాగో, టై కట్టుకోవడం ఎట్లాగో అక్కడే నేర్చుకున్నాను. ఖాళీ సమయమే దొరకలేదు గనుక నాట్యం ఎలా చేయాలో మాత్రం నేర్చుకోలేకపోయాను. నా మహిళా సహోద్యోగులను నేను ప్రత్యేకంగా తలచుకోదలచుకున్నాను. వాళ్లే నాకు నిజాయితీగా ఉండడం, కష్టపడి పనిచేయడం, నీతిగా ఉండడం నేర్పారు. సామాజిక సమస్యల పట్ల నా అవగాహనలను వాళ్లు విశాలం చేశారు. ఎందరో స్త్రీల, బాలికల అనుభవాలు నా ప్రయాణంలో కలిసిపోయాయి. నా సహచరి, నా కూతుళ్లు, మా అమ్మ నాకు మద్దతు ఇచ్చారు. జర్నలిజంలో పురుషుల రాజ్యమే, పితృస్వామ్యమే నడుస్తున్నది. వారి దూకుడు ఇబ్బందికరంగా ఉండేది. అటువంటి దూకుడు సృజనాత్మకతనూ, ఆలోచననూ చంపేస్తుంది. అటువంటి దూకుడుకు పాల్పడకుండా నన్ను నా మహిళా సహోద్యోగులే కాపాడారు. ఈ జర్నలిజం క్షేత్రంలో ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నట్టయితే మీకు నా సలహా ఏమంటే ఎల్లప్పుడూ మీ మహిళా సహోద్యోగులతో మన్ననగా ఉండండి. వాళ్ల సామర్థ్యాన్ని అంగీకరించండి, గౌరవించండి. వాళ్లను ప్రశంసించండి.

నేను ప్రైమ్ టైమ్ యాంకర్గా ఉన్న రోజుల్లో నా జీవితమంతా ఆ కార్యక్రమానికే ముడిపడి ఉండేది. టీవీ వార్తలతో నేను ప్రేమలో పడ్డాను. బహుశా అందువల్లనే ఇవాళ నా గుండె పగులుతున్నది కాబోలు. ఎన్డీటీవీ ఎర్ర మైక్రోఫోన్ ఎల్లవేళలా నా స్మృతిలో నిలిచే ఉంటుంది. భారతదేశపు ప్రసారమాధ్యమాల స్థలం మారిపోయింది. జర్నలిస్టులుగా మారాలనే కోరికతో ఖర్చుపెట్టి చదువుకుంటున్న భారతీయ యువకులను తలచుకుంటే నా హృదయం ద్రవిస్తున్నది. ఎందుకంటే, వాళ్లు చివరికి భారత రాజ్యపు సేవకులుగా పనిచేయవలసి వస్తుంది. నీతిమంతులైన జర్నలిస్టులు పనిచేయడానికి ఏ ఒక్క సంస్థా మిగలలేదు.

ఇవాళ జర్నలిస్టులుగా ఉన్నవారందరూ కూడా, ఊపిరిసలపని స్థితిలోనైనా ఉన్నారు, లేదా వృత్తినే వదిలేసి వెళ్లిపోయారు. జర్నలిజం అంటే నెల జీతం అందే ఒకానొక వృత్తే తప్ప మరేమీ కాదని నాకు ఎందరో చెప్పారు. జీతం మినహా జర్నలిజంలో ప్రోత్సాహకమైన ప్రేరణ ఏదీ లేదు. పవిత్రమైన జర్నలిస్టు పౌరప్రజానీకానికి బాధ్యత వహించాలి. కనుక నిర్భయంగా మాట్లాడండి. ఒత్తి పాదాలతో నడిచి మహాబలోపేతమైన బ్రిటిష్ పాలనను మట్టి కరిపించిన దేశపు పౌరులు మీరు. అనైతికమైన మాధ్యమాల వార్తాసందేశాల సంకెళ్లను మీరు తెంచుకోగలరు. పోరాడకపోతే మీకు తలెత్తి నడిచే అవకాశమే లేదు. మీరు ఆ పోరాటం చేయకపోతే, ఒక స్వతంత్ర దేశపు పౌరులుగా ఉంటారేమో గాని, అమ్ముడు పోయిన మాధ్యమాల బానిసలుగా మిగిలిపోతారు. తస్మాత్ జాగ్రత్త. చట్టవ్యతిరేకమైనదంతా చట్టబద్ధమైనదిగా కనబడేలా చేసేందుకు చట్టాల పేరు మీద ప్రజల హక్కులు కొల్లగొట్టబడుతున్నాయి.

ఈ క్షణాన, నా భవిష్యత్తు అనిశ్చితం. కచ్చితంగా ఉన్నదొకే ఒకటి, ఆశ.

రవీష్ కుమార్

(తెలుగుసేత: ఎన్. వేణుగోపాల్)

Updated Date - 2022-12-10T01:29:19+05:30 IST