దళితుల్లో బిజెపి వ్యాప్తిని అడ్డుకోగలరా?

ABN , First Publish Date - 2022-04-13T06:34:20+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ రెండోసారి ఘన విజయం సాధించిన తర్వాత దేశంలో ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది.

దళితుల్లో బిజెపి వ్యాప్తిని అడ్డుకోగలరా?

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ రెండోసారి ఘన విజయం సాధించిన తర్వాత దేశంలో ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. యూపీలో ఈసారి జరిగిన ఎన్నికలు అన్ని సామాజిక సమీకరణల్నీ తుత్తునియలు చేశాయి. దళితులు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడం, దళితుల పార్టీగా పేరు పొందిన బహుజన సమాజ్ పార్టీ కూడా తెరమరుగయ్యే క్రమం ఏర్పడడం అనేక మంది సామాజిక పండితులను ఆలోచించేలా చేస్తోంది. బిజెపి హిందూత్వ పార్టీ కదా, మనువాద పార్టీ కదా, అగ్రవర్ణాలకు ఆధిపత్యం వహిస్తున్న పార్టీ కదా, అలాంటి పార్టీ దళితులను ఏ విధంగా ఆకర్షించగలుగుతోంది అన్న ఆలోచనల్లో అనేకమంది పడిపోయారు. దళితులను బిజెపి మాయ నుంచి ఏ విధంగా తప్పించాలా అన్న విశ్లేషణలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు సంపాదకత్వంలో వెలువడిన ‘ద దళిత్ ట్రూత్- రీ థింకింగ్ ఇండియా’ పేరుతో వెలువడిన పుస్తకం. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి ప్రస్తావించడం ఆయన దేని గురించి ఆందోళన చెందుతున్నాడో అర్థం అవుతుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు తాము మాయావతిని సంప్రదించామని, ఆమెకు ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పామని, కాని ఆమె మా ప్రతిపాదనలను అంగీకరించలేదని రాహుల్ గాంధీ అన్నారు. ‘కాన్షీరామ్ దళితుల గొంతుకు స్ఫూర్తినిచ్చారు. కాని మాయావతి దళితులకోసం పోరాడననే చెబుతున్నారు. బిజెపి ప్రవేశించేందుకు ఆమె స్పష్టంగా దారినిచ్చారు’ అని రాహుల్ గాంధీ వాపోయారు.


ఇందుకు మాయావతి గట్టి జవాబే ఇచ్చారు. ‘రాహుల్ గాంధీ తన పార్టీ గురించి తాను బాధపడాలి కాని మా పార్టీ గురించి ఆయన కెందుకంత బాధ? అయినా మునిగిపోతున్న పడవలో ఎందుకు సవారీ చేయాలి?’ అని ఆమె ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఓటు శాతం 22 శాతం నుంచి 12.8 శాతానికి పడిపోయిన మాట నిజమే. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన 290 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన మాట నిజమే. 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో కేవలం ఒక్క సీటు మాత్రమే ఆ పార్టీ గెలుచుకున్న మాట నిజమే. 32 శాతం ఉన్న పంజాబ్‌లో బిఎస్‌పి కేవలం 1.77 శాతం ఓటు శాతం సంపాదించుకున్న విషయం కూడా సత్య దూరం కాదు. అయినా మాయావతి తన గురించి ఇతరులెవరూ బాధపడవద్దంటున్నారు. మునిగిపోతున్న పడవ కాంగ్రెస్ మాత్రమే కాదు, బిఎస్‌పి కూడా. ఇవాళ బిఎస్‌పి దుస్థితికి మాయావతి స్వయంకృతాపరాధాలే కారణం కాదా? మాయావతి హయాంలో బిఎస్‌పిని బహుజన పార్టీ నుంచి సర్వజన పార్టీగా మార్చే ప్రయత్నంలో ఆ పార్టీ తన గుర్తింపును కోల్పోయిందా? దళితుల్లో జాతవుల తర్వాత అణగారిన జాతి అయిన పాసీ వంటి వర్గాలను, యాదవేతర బీసీలను, ముస్లింలను చేర్చుకునేందుకు కాన్షీరామ్ చైతన్యవంతంగా చేసిన ప్రయత్నాలు మాయావతి హయాంలో నీరుకారిపోయాయా? కాంగ్రెస్ సంగతి సరే, భారతదేశంలో దళిత పార్టీలకు ఇక భవిష్యత్ లేదా? దళితులు అగ్రవర్ణాల అధిపత్యంలో ఉన్న రాజకీయ పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందేనా? అన్న ప్రశ్నలు యుపి ఎన్నికలు లేవనెత్తాయి. ఈ ప్రశ్నల విషయంలో మాయావతి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.


అయితే మాయావతి కోల్పోయిన స్థలాన్ని భారతీయ జనతా పార్టీ నుంచి సమీప భవిష్యత్‌లో కాంగ్రెస్ సంపాదించుకోగలిగిన స్థితి ఉన్నదా? భారతీయ జనతా పార్టీ విజృంభణ జరగనంత వరకూ, కాన్షీరామ్ ప్రవేశించనంతవరకూ, ప్రాంతీయ పార్టీలు రంగ ప్రవేశం చేయనంతవరకూ ఈ దేశంలో దళితులకు ఆశాకిరణంలా కనిపించిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా దళితుల మద్దతు ఎందుకు కోల్పోయింది? అసలు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో నిజంగా దళితులను సమాజంలో ప్రధాన స్రవంతిలో తీసుకువచ్చి, రాజ్యాంగాధికారం కల్పించడం వారి హక్కుగా ఏనాడైనా భావించిందా? దళితులు ఇవాళ బిజెపి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? బిజెపిని మనువాద పార్టీ, హిందూత్వ పార్టీ, అగ్రవర్ణ పార్టీ అని పేర్లు పెట్టి పిలవడం చాలా సులభం. కాని ఈ నిందలేవీ బిజెపిలో చేరుతున్న దళితులు, వెనుకబడిన వర్గాలను అడ్డుకోవడం లేదు.


కొప్పుల రాజు సంపాదకత్వం వహించిన పుస్తకంలో ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నాలు అనేకమంది రచయితలు చేశారు. అంబేడ్కర్‌ను రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా నియమించి, రాజ్యాంగాన్ని రూపొందించడానికి కాంగ్రెస్ పార్టీ కారణమైనప్పటికీ, దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారిత కోసం ఎన్ని విధానాలు రూపొందించినప్పటికీ, ఎందరో దళితులు కాంగ్రెస్ నుంచి నేతలుగా ఎదిగినప్పటికీ కాంగ్రెస్ నుంచి దళితులు ఇప్పుడు ఎందుకు దూరమవుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ పార్టీకి తెలియనిది కాదు. ‘రాహుల్ గాంధీ దళితులకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని భావించారు. కాని మా రాష్ట్ర పార్టీల్లో మాత్రం నేతలు దళితులకు అంత ప్రాధాన్యమివ్వడం లేదు. రాజ్యాధికారం వరకు వచ్చే సరికి దళితులను వెనక్కి నెట్టేయడమే జరుగుతోంది..’ అని ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వాపోయారు. ఒక పార్టీ నేతగా ఉండి, దళితులకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు సమూలంగా మార్పులు చేయగలిగిన స్థితిలో లేకపోతే ఎవరైనా ఏమి చేయగలరు?


దళితుల త్యాగాలకు విలువ లేకుండా పోతున్నదని కొప్పుల రాజు తన వ్యాసంలో వాపోయారు. సమాజమూ, రాజ్యం అణిచివేస్తున్నా, పేదరికంలో మగ్గిపోతున్నా, తమ శక్తిని దళితులు పూర్తిగా దేశాభివృద్ధికి వినియోగిస్తున్నారని, అయినప్పటికీ వారికి సమాన భాగస్వామ్యం లభించడం లేదని ఆయన అన్నారు. రాజ్యాంగ అసెంబ్లీలోని 15 మంది మహిళా సభ్యుల్లో ఒకరు, దేశంలో తొలి దళిత మహిళా గ్రాడ్యుయేట్ అయిన దాక్షాయణీ వేలాయుధన్ దళితుల కోసం ఆధునిక భారతంలో బలమైన పునాది నిర్మించాలని వాదించినప్పటికీ ఆమె గొంతుక వినపడలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎంతో నిజాయితీగా పనిచేసి పదవీ విరమణ తర్వాత ఆర్టీసీ బస్సులో కర్నూలుకు వెళ్లిన దామోదరం సంజీవయ్య కూడా కాంగ్రెస్ విధానాల రూపకల్పనలో కీలక భాగస్వామి కాలేకపోయారు. ఈ దేశంలో దళితుడు ఎంత ప్రముఖుడైనా, రాజ్యాంగ నిర్మాత అయినా అగ్రవర్ణాల చట్రంలో భాగం కాకపోతే, దళితేతర ఓట్లపై ఆధారపడకపోతే రాజకీయాల్లో విజయం సాధించడం సాధ్యం కాదని మరో దళిత మాజీ అధికారి రాజశేఖర్ ఉండ్రు తన వ్యాసంలో అన్నారు. రెండుసార్లు లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అంబేడ్కర్ రాజ్యసభకు ఎన్నిక కావల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అధికార పార్టీల కోసం పనిచేస్తూ తాము అధికారంలో ఉండేందుకు వాటి ప్రయోజనాలను పరిరక్షించాల్సిన దళిత నేతలు ఇతర అణగారిన వర్గాల ప్రయోజనాలను ఏ విధంగా కాపాడగలరు? అని ఆయన విలువైన ప్రశ్న వేశారు.


సమాజంలో కొంత శాతం మంది దళితులకు మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్న విషయాన్ని ఈ పుస్తకంలో మరోసారి చర్చించారు. భూమి లేని కార్మికులుగా, చిన్నతరహా రైతులుగా, గ్రామాల్లో హస్త కళాకారులుగా, భౌతిక శ్రమ చేసే కూలీలుగా, అనధికార రంగంలో హాకర్లుగా దళితులు ఎక్కువే ఉన్నారన్న మాట వాస్తవం. గ్రామాల్లో నివసించే ప్రజల్లో 74 శాతం దళిత కుటుంబాలే. 2011 గణాంక వివరాల ప్రకారం సగటున 0.3 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న అత్యధికులు దళితులే. అంటరాని తనం ఇంకా పోయిందని చెప్పలేము, దళితులపై అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. దళిత పారిశ్రామిక వేత్తలూ, యజమానులు కూడా వేళ్లపై లెక్కపెట్టినంత మంది ఉంటారు. విద్యావంతులైన దళిత యువతులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి లభించదు. మంత్రుల్లో శాఖల రీత్యా చూస్తే రాజకీయాధికారంలో కూడా దళితుల వాటా నామమాత్రమే. ఈ పరిణామాలకు 1947 తర్వాత దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలే కారణమని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ కూడా రూపంలో దళితులను ప్రోత్సహించినట్లు కనపడుతున్నప్పటికీ స్వభావంలో దళిత ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించిందన్న విషయంలో సందేహం లేదు. మరి ఇప్పుడు దళితులు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని వాపోవడంలో అర్థం ఏముంది?


నిజానికి భారతీయ జనతా పార్టీ కూడా పునాదిలో అగ్రవర్ణ పార్టీయే. దాని తొలి స్వభావం బాహాటంగా దళిత వ్యతిరేక స్వభావం. కాని ఆ పార్టీ తనను తాను ఎంతో మార్చుకున్నది. ఒకప్పుడు అంబేడ్కర్‌ను ఏ మాత్రమూ పట్టించుకోని ఆర్ఎస్ఎస్, బిజెపి ఇప్పుడు అంబేడ్కర్‌ను జాతీయ నేతల్లో ప్రధాన పురుషుడుగా గుర్తించాయి. అంబేడ్కర్‌తో సంబంధం ఉన్న అనేక స్థలాలను అది అద్భుతంగా అభివృద్ధిపరిచింది. సాంస్కృతిక జాతీయ వాదం ద్వారా హిందువులను ఏకం చేయడంలో, హిందూత్వ లక్ష్యం కోసం ఇవాళ దళితులను కూడా సేకరించడంలో అది విజయం సాధించింది. తమను తాము లౌకిక పార్టీలుగా చెప్పుకునే రాజకీయ పార్టీలు దళిత నాయకత్వాన్ని, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో విఫలమైనందువల్లే దళితులు అతివాద శక్తుల వైపు మళ్లారని మేఘవంశి అనే మేధావి రాశారు. అసలు లౌకిక వాదం అంటే ఏమిటి? కేవలం మతతత్వాన్ని వ్యతిరేకించడమా? సామాజిక న్యాయం లౌకిక వాద నిర్వచనం పరిధిలోకి రాదా? చర్చించాల్సి ఉన్నది.


ఒకప్పుడు దళితుల కోసం కాంగ్రెస్ చేసిన పనులే బిజెపి ఇవాళ చేస్తున్నదనడంలో సందేహం లేదు. కాని బిజెపికి ఇవాళ సైద్ధాంతిక బలం కూడా ఉన్నది. బిజెపిని ఎదుర్కోవడానికి ఇతర ప్రతిపక్షాలు కూడా సైద్ధాంతిక బలం రూపొందించుకోవాలి. బిజెపి ఆర్థిక విధానాలు నిజంగా దళితులు, ఆదీవాసీలు, రైతులు, ఇతర అణగారిన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకమయితే వాటికి ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను అనుసరించాలి. ముఖ్యంగా బలహీన వర్గాలకు సమాన రాజ్యాధికారం లభిస్తుందన్న నమ్మకం కలిగించినప్పుడే ప్రత్యామ్నాయ సిద్ధాంతం బలం పుంజుకోగలదు.



(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఎ. కృష్ణారావు

Updated Date - 2022-04-13T06:34:20+05:30 IST