అనుచిత ప్రతిపాదన

ABN , First Publish Date - 2022-10-08T10:26:52+05:30 IST

భారత ఎన్నికల సంఘం ఒక ప్రతిపాదన చేసి, మీ మీ అభిప్రాయాల్ని చెప్పండంటూ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసింది.

అనుచిత ప్రతిపాదన

భారత ఎన్నికల సంఘం ఒక ప్రతిపాదన చేసి, మీ మీ అభిప్రాయాల్ని చెప్పండంటూ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసింది. అదేమిటంటే పార్టీలు ఎన్నికలలో ఇవ్వబోయే హామీలు, ఆ హామీల్ని అమలుచెయ్యబోయే విధివిధానాలు, వాటికై ఎలా నిధులు సమీకరించబోయేదీ, ప్రణాళిక అమలయ్యాక ఏం లాభం కలిగేదీ వివరిస్తూ కమిషన్‌కి ముందస్తుగానే అఫిడవిట్ సమర్పించాలట. తద్వారా ప్రజానీకానికి అలవికాని హామీల బాధ తప్పడంతో బాటు, ప్రభుత్వ ఖజానా స్థితిగతుల పట్ల వాస్తవిక దృక్పథంతో ఎవరున్నారో తెలుస్తుందట. ఎన్నికల సంఘానిది విచిత్రమైన కోరిక. ఒకవేళ అమలుచేసినా అందువల్ల వచ్చే ఉపయోగమేమిటో తెలీదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఒక అభివృద్ధి కార్యక్రమం గురించో, సంక్షేమ విధానం గురించో చెప్పి, అది ఎందుకు తమ ప్రాథమ్యమో చెప్పగలదు. కానీ వాటికి నిధులెక్కడి నుంచి వస్తాయో, ఎలా మేనేజ్ చేస్తుందో సవివరంగా చెప్పాలంటే సాధ్యమేనా? పోనీ తెలుసుకుని ఎన్నికల సంఘం ఏమి చేస్తుంది? ఏదైనా ప్రతిపాదన తిరస్కరిస్తుందా? తిరస్కరిస్తే ఏ ప్రాతిపదికన ఆ నిర్ణయం తీసుకుంటుంది? మీకంత సీన్ లేదంటుందా? అలా జడ్జి చేసే రాజ్యాంగపరమైన హక్కు ఆ సంఘానికి ఉందా? నిధులు పొందే మార్గాల్ని అంకెల గారడీతో చూపిస్తే అడ్డుకోగలదా? మాట వరసకి ఒక పార్టీ పెద్దగా నిధులు అవసరమయ్యే కార్యక్రమం ప్రకటించి, అధికారంలోకి రాగానే నిధుల కోసం ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తాననవచ్చు లేదా అలా అంటే ఓట్లు పడవనుకుంటే పాకిస్థాన్‌ని ఆక్రమించుకుని, ఇస్లామాబాద్‌ని అమ్మేస్తాననవచ్చు. లేదా గెలిచిన తర్వాత ఆ పథకాన్నే ఎత్తేయవచ్చు. ఆ పథకంలో ముందు కనబడని లొసుగులు బయటపడి వద్దనుకోవచ్చు. పనికిరాని పరిజ్ఞానం సేకరించడం ద్వారా ఎన్నికల సంస్కరణలు సాధ్యమౌతాయా? ఆ మాత్రం మంచీచెడు ప్రజానీకానికి తెలియదా? ఇప్పుడు కావాల్సింది లోపరహితంగా, పక్షపాత రహితంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ. అది ఆ సంఘం బాధ్యత. అర్హులకు ఓటు గల్లంతవ్వకుండా ఉండడం, దొంగఓట్లు పడకుండా చెయ్యడం జరగాలి. ద్వేషపూరిత ప్రసంగాలపై, ఎన్నికల నియమాల అతిక్రమణపై వెంటనే చర్యలుండాలి. డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించాలి. ఎన్నికల హామీలపై నిర్ణయం తీసుకోగల చైతన్యం ప్రజలకు ఎటూ ఉంది. ఆట్టే బెంగ పెట్టుకోనక్కర లేదు.


అసలు ఏ హామీ ఇవ్వకపోయినా, ఆ ఊసే ఎత్తకపోయినా కార్పొరేట్ పెద్దలకు లక్షలాది కోట్లు రాయితీలు దొరుకుతున్నాయి. అప్పనంగా అదే స్థాయిలో రుణాలు మాఫీ అవుతున్నాయి. ఖజానాకు భారం మిగులుస్తున్నాయి. అలా ఇవ్వబోమని పార్టీల నుంచి అఫిడవిట్లు సేకరిస్తే కొంత ఊరట. జరిగేది ఏమీ లేకపోయినా అదో సంతృప్తి అయినా దక్కుతుంది.


-– డా. డి.వి.జి. శంకరరావు

పార్వతీపురం

Updated Date - 2022-10-08T10:26:52+05:30 IST