లెక్కల్లో తగ్గితే, తగ్గినట్టేనా?

ABN , First Publish Date - 2022-08-31T07:52:49+05:30 IST

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రతి ఏటా దేశంలో జరుగుతున్న ప్రమాదాలు, ఆత్మహత్యల వివరాలను ప్రకటిస్తుంటుంది. తాజాగా 2021 సంవత్సర నివేదిక వెలువడింది...

లెక్కల్లో తగ్గితే, తగ్గినట్టేనా?

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రతి ఏటా దేశంలో జరుగుతున్న ప్రమాదాలు, ఆత్మహత్యల వివరాలను ప్రకటిస్తుంటుంది. తాజాగా 2021 సంవత్సర నివేదిక వెలువడింది. రైతుల ఆత్మహత్యల గురించి పని చేస్తున్న సంస్థ ‘రైతు స్వరాజ్య వేదిక’ సభ్యులుగా మేము ఈ నివేదికలోని అంశాలను అధ్యయనం చేసి, కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాం.


సాధారణంగా రైతుల ఆత్మహత్యల నమోదు ఎలా జరుగుతుందంటే– రైతు ఆత్మహత్యల్లో ఎఫ్‌ఐఆర్ నమోదైన వాటిని మాత్రమే స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ‘డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (డీసీఆర్‌బీ)కి ఆత్మహత్య చేసుకున్న రైతు పేరుతో సహా వెళుతుంది. డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి ‘స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎస్‌సీఆర్‌బీ)కి కేవలం ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వెళ్తుంది. ఎస్‌సీఆర్‌బీ నుంచి ఎన్‌సీఆర్‌బీకి కూడా కేవలం సంఖ్య మాత్రమే వెళుతుంది. ఇది ప్రతి ఏటా జరిగే ప్రక్రియ. ఒక ఏడాది వివరాలను మరుసటి ఏడాది జూలైలోనో, ఆగస్టులోనో ఎన్‌సీఆర్‌బీ విడుదల చేస్తుంది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2015లో అత్యధికంగా 1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య బాధిత కుటుంబాలకు పరిహారం అందించే 194 జీవోను ఎంతో కొంత అమలు చేస్తూ ఉంది. రైతు మరణాన్ని ఆత్మహత్య అని అధికారులు నిర్ధారిస్తే ఆ రైతు కుటుంబానికి ఐదులక్షల రూపాయలు పరిహారంతో పాటు, అప్పుల వాళ్ళు మళ్ళీ ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా అప్పుల వారికి వన్ టైమ్ సెటిల్మెంటు (ఓటీఎస్)గా లక్ష రూపాయలు చెల్లించేవారు.


గతంలో గ్రామంలో ఏదైనా వ్యవసాయ సంబంధమైన ఆత్మహత్య జరిగిన వెంటనే గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు పోలీస్‌స్టేషనుకు ఫోను చేసి సమస్యను వివరించి కేసు నమోదు చేయించేవారు. అధికారుల విచారణలో అది నిజమైన రైతు ఆత్మహత్యగా నిర్ధారణ అయ్యి ఎక్స్‌గ్రేషియా వస్తుందా రాదా అన్నది వేరే విషయం. కానీ కనీసం పోలీస్ స్టేషనులో రైతు ఆత్మహత్య కేసు నమోదు అయ్యేది. 


తెలంగాణ రాష్ట్రంలో 2015లో 1400 మంది, 2016లో 645 మంది, 2017లో 851 మంది, 2018లో 908 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఎన్‌సీఆర్‌బీ నివేదికలిచ్చింది. 2018 ఆగస్టు 15న తెలంగాణలో రైతు బీమా పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద రికార్డుల పరంగా పట్టా భూమి కలిగి ఉన్న రైతు ఏ రకంగా చనిపోయినా ప్రభుత్వం నుండి ఐదు లక్షల బీమా పరిహారం వస్తుంది. రైతు బీమా అమలులోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు పరిహారం అందించే 194 జీవో అమలును అధికారులు ఆపేశారు. అప్పటినుంచీ ఏ రైతు ఆత్మహత్య విషయంలోనూ అధికారులు కనీసం కారణాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు.


రైతు పేరిట భూమి ఉన్నట్టయితే రైతు బీమా 5లక్షలు వస్తుంది. భూమి లేని కౌలురైతు ఆత్మహత్య చేసుకుంటే వారికి బీమా రాదు. అయినా అధికారులు 194 జీవో ప్రకారం చేయాల్సిన విచారణ చేయరు. ఆ కుటుంబానికి పరిహారం అందదు. ఈ క్రమంలోనే రైతు ఆత్మహత్యలు జరిగినా, వాటిని నమోదు చేయించే వారి సంఖ్య కూడా గ్రామాలలో తగ్గిపోయింది. 194 జీవో అమలు పూర్తిగా ఆపివేయటంతో భూమి ఉన్న రైతులు, మనకు ఎలాగూ రైతు బీమా వస్తుంది కదా, అధికారులు ఎలాగూ రైతు ఆత్మహత్య కింద చూడటం లేదని భావించి ఆత్మహత్యను నమోదు చేయించడం లేదు. మీరు ఎఫ్‌ఐఆర్ చేసినా వచ్చేది ఏమీ లేదని స్థానికులు అనటంతో, భూమి లేని కౌలురైతు కుటుంబాల వారు కూడా, మళ్ళీ ఎఫ్‌ఐ‌ఆర్, పోస్టుమార్టమ్ ఇదంతా ఎందుకులెమ్మని మిన్నకుండిపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, డీసీఆర్‌బీ వారు కూడా ఏది రైతు ఆత్మహత్యగా నమోదు చేస్తారో, ఏది చెయ్యరో ఎవరికీ అంతుపట్టదు. రైతు స్వరాజ్య వేదిక వేసిన ఒక ఆర్టీఐకి సమాధానం ఇస్తూ– ఎస్‌‌సిఆర్‌బి లెక్కల ప్రకారం మెదక్ జిల్లాలో 2019 నుంచి 2021 వరకు ఒక్క రైతు ఆత్మహత్య కూడా జరగలేదు. వ్యవసాయం, రైతు ఆత్మహత్యల గురించి అవగాహన ఉన్న ఏ ఒక్కరూ దీనిని నమ్మరు.


ఆత్మహత్యలు జరిగి కూడా అవి ఎఫ్‌ఐఆర్ కాకపోతే, ఒక రకమైన సమస్య. రైతు ఆత్మహత్యలు జరిగి అవి ఎఫ్‌ఐఆర్ అయ్యి కూడా, డీసీఆర్‌బీ, ఎస్‌సీఆర్‌బీలలో నమోదు కాకపోతే ఆ సమస్య తీవ్రమైనది. మెదక్ జిల్లా విషయంలో ఇదే జరిగింది. జిల్లాలో రైతు ఆత్మహత్యలు జరిగాయి కానీ, అవి ఎన్‌సీఆర్‌బీ వరకు వెళ్లలేదు. ఈ విషయంలో రైతు స్వరాజ్య వేదిక మెదక్ డీసీఆర్‌బీకి ఆర్‌టీఐ వేసింది. ఆ జిల్లాలో 2019 నుంచి రైతు ఆత్మహత్యలు అసలే లేవని సమాచారం వచ్చింది. మెదక్ జిల్లా గ్రామాల్లో జరిగిన రైతు ఆత్మహత్యలను ఉదాహరణలుగా చూపిస్తూ మరో ఆర్టీఐ వేశాం. అయినా మళ్ళీ అదే సమాధానం ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం కోసం అప్పటికే జరిగిన రైతు ఆత్మహత్యల ఉదాహరణలు, ఆంగ్ల దినపత్రిక హిందూలో వచ్చిన ఆర్టికల్ కట్టింగునూ పెట్టి సమాచార హక్కు చట్టం కింద మొదటి అప్పీలు వేశాం. కానీ అక్కడ కూడా అధికారులు అదే సమాధానం ఇచ్చారు. 


వికారాబాద్ జిల్లా డీసీఆర్‌బీ వారిది మరో సమస్య. సహజంగా ఒక రైతు ఆత్మహత్య బాధిత కుటుంబానికి ఎన్నో వడపోతలు అయ్యాక గానీ నష్టపరిహారం రాదు. ఎఫ్‍ఐఆర్‌లో ‘వ్యవసాయ సంబంధమైన రైతు ఆత్మహత్య’ అని ఉండాలి. అప్పుల కాగితాలు ఉండాలి. ఫైనల్ రిపోర్టును త్రిసభ్య కమిటీ అధికారులు విచారణ చేసి, రైతు ఆత్మహత్య అని నిర్ధారిస్తేనే ఆ కుటుంబానికి నష్టపరిహారం అందుతుంది. కానీ విచిత్రం ఏమిటంటే అలా పరిహారం అందిన రైతు ఆత్మహత్యల వివరాలు కూడా మేము ఆర్టీఐ వేసి తీసుకున్న డీసీఆర్‌బీ వాళ్ళ జాబితాలో కనపడవు. ఆ విషయాన్ని డీసీఆర్‌బీ వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళాం. పోలీస్‌స్టేషన్లకు రిమైండర్ పెట్టమని చెప్పాం. ఈ విషయంలో ఎన్ని రోజులు వెంటపడినా అధికారులలో చలనం లేదు. అంటే ప్రభుత్వం విచారణ చేసి నిజమైన రైతు ఆత్మహత్య అని నిర్ధారించినప్పటికీ కొన్నిసార్లు అవి ఎన్‌సీఆర్‌బీ దాకా వెళ్లవు అని అనుకోవాలి.


అదిలాబాద్ డీసీఆర్‌బీ వారిది ఇంకో సమస్య. 2015లో అక్కడ 220 రైతు ఆత్మహత్యలు జరిగాయి అని రికార్డులు చెబుతున్నాయి. 2016కు వచ్చేసరికి అవి కాస్తా 33కు తగ్గిపోయాయి. పోనీ 2015లో ఆత్మహత్య చేసుకున్న 220 మంది రైతుల పేర్లు అయినా ఇస్తారా అంటే ఇవ్వరు. పేర్లకు వచ్చేసరికి నంబర్లలో తేడా వస్తుంది. ఈ విషయంలో జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీసుతో చర్చించి, డీసీఆర్‌బీ డేటా చూసేవారితో చర్చిస్తే, వాళ్లు విచిత్రమైన జవాబు ఇచ్చారు. ‘అధికారులు రైతుది ఆత్మహత్య అని తేల్చిన తర్వాత మాత్రమే వాటిని మేము రైతు ఆత్మహత్యల జాబితాలో మీకు ఇస్తాము’ అని. మీ దగ్గర రైతు ఆత్మహత్య అని నమోదైన ప్రతి పేరూ ఎస్‌సీఆర్‌బీకి, అక్కడి నుంచి ఎన్‌సీఆర్‌బీకి వెళ్తుంది కదా అని అడిగితే, వారు అప్పటికి ఏవో సమాధానాలు చెప్పారు. వీటిపై వివరణ కోసం స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కార్యాలయం అధికారులతోనూ చర్చించాము. వారు ‘మా దగ్గర ఏమీ సమాచారం ఉండదు. డీసీఆర్‌బీ నుంచి ఏ నంబరు అయితే వస్తుందో ఆ నంబరును మేము ఎన్‌సీఆర్‌బీకి పంపుతాం’ అన్నారు.


ఒక రైతు ఆత్మహత్య కుటుంబం పేరు డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో మిస్ అయ్యిందంటే భవిష్యత్తులో ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఏ సహాయమూ అందకుండా పోతుంది. రైతు సంఘాలు ఈ ప్రక్రియలో ఏదైనా సహకారం అందించాలని అనుకున్నా, ఆ పేరు రికార్డులలో లేకపోతే ఏమీ చేయలేవు. ఒక రైతు ఆత్మహత్య నంబరు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వరకు వెళ్లకపోవటం అంటే ఉన్న వ్యవసాయ సంక్షోభాన్ని లేనట్టు చూపటమే. పశ్చిమ బెంగాల్‌ లాంటి రాష్ట్రంలో ఆలుగడ్డల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వార్తలు కనిపించాయి. ఆ రాష్ట్రం ఏ ప్రామాణికాలు తీసుకుంటుందో తెలియదు కానీ, అక్కడ దశాబ్దాల తరబడి ఎన్‌సీఆర్‌బీ రికార్డుల్లో రైతు ఆత్మహత్యలు కనిపించవు.


ఈ అన్ని కారణాల రీత్యా ఎన్‌సీఆర్‌బీ నివేదికను రైతు ఆత్మహత్యల సంఖ్యకు ఒక ప్రామాణికంగా మాత్రమే చూడాలి తప్ప అదే అంతిమం కాదు. ఎన్‌సీఆర్‌బీలో తక్కువ నమోదు అయినంత మాత్రాన రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గినట్టు అనుకోనక్కర్లేదు. నిజానికి తెలంగాణాలో రైతు బీమా పథకం ప్రకటించినప్పుడు, అంతకు ముందు నుంచీ అమలవుతున్న 194 జీవో నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ ఆచరణలో ఆ జీవోకు అనుగుణంగా చేయాల్సిన పనులను నిలిపివేసింది. అంటే రైతు ఆత్మహత్య జరిగిన వెంటనే మండల స్థాయిలో ముగ్గురు సభ్యుల కమిటీ ఆ కుటుంబాన్ని సందర్శించి, వివరాలు సేకరించి నివేదిక తయారుచేయడం, దానిని డివిజన్ స్థాయి కమిటీకి పంపటం, డివిజన్ స్థాయి కమిటీ పరిశీలించి తన సిఫారసులతో జిల్లా కమిటీకి పంపడం, జిల్లా కలెక్టరు ఆ కుటుంబానికి పరిహారం అందించడానికి అవసరమైన ప్రొసీడింగ్స్ ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే, ఆ కుటుంబానికి పరిహారం అందించడం... ఇలాంటి ప్రక్రియ అంతా నిలిచిపోయింది. దీనితో 2018 తరువాత ఏ రైతు ఆత్మహత్య బాధిత కుటుంబానికీ పరిహారం అందడం లేదు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించి, అన్ని కుటుంబాలకు పరిహారం అందించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం అందడం ఒక భాగం మాత్రమే. వ్యవసాయ రంగంలో నిజమైన సంస్కరణలు జరిగి, వాస్తవ సాగుదారులకు మేలు జరిగి రైతు ఆత్మహత్యలు తగ్గితే అదే నిజమైన పరిష్కారం.

బి. కొండల్ (రైతు స్వరాజ్య వేదిక)

Updated Date - 2022-08-31T07:52:49+05:30 IST