ఇక్కడ పాములు దూరే గుడిసెలు, అక్కడ పాలరాతి భవనాలు

ABN , First Publish Date - 2022-09-28T10:17:37+05:30 IST

తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం కుల సంఘాలను బుజ్జగించడంలో భాగంగా సంఘ భవనాలను నిర్మిస్తున్నది. దానిలో భాగంగా ఆదివాసులకు, గిరిజనులకు ప్రత్యేక భవానాలు...

ఇక్కడ పాములు దూరే గుడిసెలు, అక్కడ పాలరాతి భవనాలు

తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం కుల సంఘాలను బుజ్జగించడంలో భాగంగా సంఘ భవనాలను నిర్మిస్తున్నది. దానిలో భాగంగా ఆదివాసులకు, గిరిజనులకు ప్రత్యేక భవానాలు నిర్మించింది. పెద్ద ఎత్తున జన సమీకరణ మధ్య సెప్టెంబర్ 17న ఆ భవనాలను ఆవిష్కరించింది. ఇరవై రెండు కోట్ల ఖర్చుతో నిర్మించిన ఆదివాసీ భవనం వారి స్థితిగతులను ఏ మాత్రం మార్చదు. వారు అత్యంత అమానవీయ పరిస్థితులలో జీవిస్తున్నారు. భవనం ఆవిష్కరణ ఏర్పాట్లు జరుగుతుండగానే సెప్టెంబర్ 11న హృదయ విదారక సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఇంద్రవెల్లి మండలం, మారుతి పాటగూడ గ్రామానికి చెందిన కొలాం తెగ పిల్లలను (అత్యంత ఆదిమ తెగ, పీవీటీజీలు) తెల్లవారుజామున పాము కాటు వేయడంతో, వైద్యం అందక గంట వ్యవధిలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. కనీసం తలదాచుకోడానికి గూడు లేక ఆ కుటుంబం మనుషులకు నివాసయోగ్యంకాని గుడిసెలో నిద్రించడమే ఈ ఘటనకు కారణం. ఇలాంటి సంఘటన ఇది మొదటి కాదు. ఆ గ్రామంలోనే కాదు తెలంగాణలో ఆదివాసులు దుర్భర దారిద్ర్య పరిస్థితులలో జీవిస్తున్నారు. వారి నివాసాలు దారుణంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొందరికైనా పక్కా ఇండ్లు వచ్చేవి. కాని తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక డబుల్ బెడ్ రూములాంటి పథకం అమలులో లోపం వల్ల ఆదివాసులకు పక్కా ఇండ్లు లభించడం లేదు. తక్కువ ఖర్చుతో సురక్షిత ఆవాసాలను నిర్మించుకునే అవకాశాన్ని ఆదివాసులు కోల్పోయారు. ఒకపక్క సరైన వసతి లేక విష పురుగులు, అడవి జంతువుల వల్ల ఏటా మరణిస్తున్న ఆదివాసులను పట్టించుకోకుండా రాష్ట్ర రాజధానిలో ఆదివాసీలకు ప్రత్యేక భవనం మాత్రం కట్టిస్తే సరిపోతుందా?


ఈ గూడెం చుట్టూ చాలా గ్రామాలున్నా, సరైన వైద్యం అందించే ఆసుపత్రి భవనం లేదు. ఒకవేళ ఉన్నా వైద్య సిబ్బంది ఉండదు. ఆంటివీనం, పాలివీనం ఇంజక్షన్లు అసలుకే దొరకవు. ఆదివాసీ బాలింతల మరణాలకైతే లెక్కే లేదు. ఆదిలాబాద్ కేంద్రంలో ఐదు అంతస్తుల, అద్దంలా మెరిసే సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి ఉంది. కాని అందులో నలభై డాక్టర్లకు బదులు కేవలం ఇద్దరే ఉంటారు. వైద్యం కూడా అందని ద్రాక్షే.


ఆదివాసులకు ఏ విధంగాను ఉపయోగపడని ఆ ప్రత్యేక భవనాలకు పోవడానికి తళతళా మెరిసే రోడ్లు ఉంటాయి. గోరటి వెంకన్న అన్నట్లు నూనె ఒలికితే ఎత్తుకోవచ్చు. కాని కొలాం తెగకు చెందిన మాతృమూర్తి తన బిడ్డల్ని పాము కుడితే వారిని ఆసుపత్రికి తీసుపోడానికి అంబులెన్స్ రావడానికి గంట సమయం పట్టింది. అలాగని ఆ గ్రామం ఎక్కడో కాకులు దూరని కారడవిలో లేదు. ఆ గ్రామం నుంచి ఇంద్రవెల్లి మండల కేంద్రం కేవలం ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే. మరి రోడ్డు ఎవరు ఎత్తుకుపోయారు. ఆ రోడ్లు నరకానికి నకళ్లుగా ఎందుకున్నయి. రోడ్లు అనడానికి వీలులేని ఎడ్ల బండ్ల బాటలో ప్రాణాలు ఆవిరి కావల్సిందేనా? బంగారు తెలంగాణ అంటే ఇదేనా! ‘మా ప్రాణాలకు కనీస విలువ లేదా. మేము జంతువుల కంటే హీనమా?’ ఆ గ్రామ ప్రజలు తమ గ్రామానికి వచ్చిన బుద్ధి జీవులను ప్రశ్నిస్తున్నారు. ఆదివాసులు ఎంత దయనీయ స్థితిలో ఉన్నారో తెలియకుండా వారి స్థితిగతులు మార్చకుండా పంచరంగుల భవనం రాజధానిలో అవసరమా?


ఈ శతాబ్దంలో అత్యంత అమానవీయంగా అణచబడుతున్న ఆదివాసుల గొంతుకను వినే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. ప్రతిపక్షాల తీరు ఇంకా సందేహాస్పదం. మానవ నాగరికతకు బాటలు వేసిన ఆదివాసుల పాదముద్రలు చెరిపే ప్రయత్నంలో భాగంగా పది శాతం రిజర్వేషన్ అంశం ముందుకు వచ్చింది. ఆదివాసీలు ఆ భవన మ్యూజియంలో అంతరించిపోతున్న తెగలుగా మిగలకుండా పోరాట పంథాను ఎంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసీ భవనం ప్రారంభోత్సవం చేస్తున్న సమయంలోనే అటు ఆదివాసులు అక్రమంగా ఎస్.టి జాబితాలో చేర్చిన లంబాడాలను తొలగించాలని గోడం గణేష్, తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుండి జోడేన్ ఘాట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ‘మా సంక్షేమం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ఎట్లా ఉన్నా భరిస్తున్నాం. కాని విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందున్న లంబాడాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ పెంచడం ఆత్మహత్య సదృశ్యం’ అన్నది వారి ఆవేదన. ‘ప్రభుత్వం స్పృహతో ఆదివాసులకు, గిరిజనులకు వేరు వేరు భవనాలు కేటాయించి, నిర్మించినపుడు ఇద్దరిని కలిపి ఒకటే రిజర్వేషన్ ఎట్లా కొనసాగిస్తారు’. 


ఇక్కడ విషాదం ఏమంటే ఆదివాసులు ప్రభుత్వాన్ని తమ కోసం ఏమి కావాల్నో అడగకపోవడం. వారు చేసే డిమాండు ఏమంటే వలస వచ్చిన లంబాడాలను ఎస్.టి జాబితా నుండి తొలగించమని. డెబ్భై ఎనభైయ్యవ దశకంలో కేవలం 65వేలే ఉన్న లంబాడాలు ఇరవై నాలుగు లక్షలు అవడం ఏమిటి అని. పక్క రాష్ట్రం మహారాష్ట్రలో బీసీగా, కర్ణాటకలో యస్.సిగా ఉన్నవారిని పనిగట్టుకొని రాష్ట్రానికి తీసుకువచ్చిన ప్రభుత్వాలను ఏమనాలి? కళ్లకు గంతలు కట్టుకొని ధృతరాష్ట్ర పాలన చేశారా? ఇవీ ఆదివాసుల ఆవేదనాభరితమైన ప్రశ్నలు. ఆదివాసులకు దక్కాల్సిన ఉద్యోగాలు, వారికి అందవలసిన బడ్జెట్ తెలివి గల తెగ అనుభవించడం ప్రపంచంలోనే అత్యంత విషాదకర సంఘటన. Son of soil ఎప్పుడూ ఓడిపోతాడు అనే నానుడి ఆదివాసుల పట్ల నిజమవున్నది. అక్రమంగా ఎస్.టి జాబితాలో చేరిన తెగలను తొలగిస్తే గిరిజన రిజర్వేషన్ పది శాతంకు పెంచనవసరం లేదు. ఇపుడు కొనసాగుతున్న ఆరు శాతం రిజర్వేషన్‌ను ఇంకా కుదించి నాలుగు శాతం చేస్తే నిజమైన ఆదివాసులు, ఎస్టీలు లబ్ధి పొందుతారు. ఇప్పటికే తమ జాతిపట్ల సానుభూతి లేని వర్గాలను కలిపి తమ అస్తిత్వాన్ని దెబ్బతీశారని ఆదివాసులు ఆరోపిస్తున్నారు. ఆదివాసులు నాగరిక ప్రజలు చేసే అనేక తప్పులను దయతో మన్నించారు. తమ బిడ్డలను పొట్టన పెట్టుకున్న క్రూరమృగాలను సైతం ప్రాణంతో వదిలి పెడతారు. కాని నేడు వారి ఓపిక వారి స్వీయ హననానికి దారి తీస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో జిల్లేడమ్మ జిట్ట ఏ ఆఫీసులో చూసినా వారే అని గోరటి వెంకన్న పాటతో ఆంధ్రులను తిట్టారు. ఇపుడు ఆదివాసులు పాడుకుంటున్నారు ఏ ఆఫీసులో చూసిన వారే అని. తాము ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటేనే భయమైతున్నదని, తమ పనులు జరగక ఏళ్లకు ఏళ్లు నిరిక్షీస్తున్నామని అంటున్నారు.


ఇతర కులాలు, వర్గాలు ఏ పార్టీలో ఉన్నా తమ స్వంత ప్రయోజనాల కోసం విపరీతంగా కృషి చేస్తాయి. కాని ఆదివాసులకు ఆ అవకాశం లేదు. వారి ప్రయోజనాలను కాపాడుకోడానికి ఏ పార్టీలోను ఎదిగిన నాయకత్వం లేదు. వారి ఉద్యమాన్ని ముందుకు తీసుకపోయే దారులు లేకపోవడం విచారకరం.


ఆదివాసీ ఉద్యమానికి నాయకత్వం వహించిన తుడుం దెబ్బ నాయకుడు సోయం బాపురావుకు గత ఎన్నికలలో సీటు నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ కుటిల నీతి వలన, ఆదివాసులు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. బీజేపీ ఎంపీ సీటు ఇవ్వడంతో ఆదివాసులంతా సోయం బాపురావుకు అండగా ఉన్నారు. అయితే బీజేపీ రాజకీయాలకు ఆదివాసులు ఆకర్షితులైతున్నారని మేధావి వర్గం భ్రమించింది. తాజాగా బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్న సోయం బాపురావు తుడుందెబ్బకు న్యాయం చేయలేకపోతున్నానని, తుడుందెబ్బ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఇపుడు తుడుందెబ్బ స్వతంత్రంగా ఉద్యమాన్ని నిర్మిస్తున్నది. పది శాతం రిజర్వేషన్‌ను సమర్థిస్తున్న బీజేపీని ఆదివాసులు ఎపుడూ సమర్థించలేదు. కాంగ్రెస్ పార్టీని కూడా ఆదరించే స్థితిలో లేరు. ఎస్.టి రిజర్వేషన్ జాబితాలో కలిసిన, కలుస్తున్న వర్గాలు తాము ధర్మం తప్పుతున్నామని కించిత్ ఆలోచన చేయకపోవడం బాధాకరం. వీరి కోసమే పని చేస్తున్న ప్రభుత్వ అధికార దాహం క్షమింపరానిది.

బి.వేణుగోపాల్

కుమ్ర శ్యాంరావు

Read more