‘‘లోపల సంఘర్షణ ఎంత బలంగా ఉంటే కవిత అంత బలంగా నిలబడుతుంది’’

ABN , First Publish Date - 2022-11-21T00:28:43+05:30 IST

మాది నెల్లూరు జిల్లా ఓజిలిరాచపాలెం అనే చిన్న గ్రామం. మా నాన్న పేరు సుంకర కృష్ణయ్య. నా కవిత్వానికి నేను పుట్టిన ఊరు, ఇప్పుడు చూస్తున్న ప్రపంచం ప్రేరణగా నిలిచాయి...

‘‘లోపల సంఘర్షణ ఎంత బలంగా ఉంటే   కవిత అంత బలంగా నిలబడుతుంది’’

సుంకర గోపాలయ్య : పలకరింపు

త్వరలో రెండవ ముద్రణగా వస్తున్న మీ కవిత్వ సంపుటి ‘మా నాయన పాట’ నేపథ్యం ఏమిటి? ఈ పుస్తకంలోని ఎక్కువ కవితలకు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది?

మాది నెల్లూరు జిల్లా ఓజిలిరాచపాలెం అనే చిన్న గ్రామం. మా నాన్న పేరు సుంకర కృష్ణయ్య. నా కవిత్వానికి నేను పుట్టిన ఊరు, ఇప్పుడు చూస్తున్న ప్రపంచం ప్రేరణగా నిలిచాయి. మా నాన్న వీధి భాగవతాలు ఆడే కళాకారుడు. అయితే నాకు ఊహ తెలిసిన తర్వాత ఆయన వేషం కట్టి పద్యం పాడటం చూడలేదు. కానీ ఎప్పుడైనా రాత్రి పూట ఆయన నోటి వెంట సారంగధర, చెంచులక్ష్మి, దక్షయజ్ఞం, మైరావణ వధ లాంటి వీధి భాగవత పద్యాలు వినేవాడిని. మాది పల్లెటూరు కావడంతో మధ్యాహ్నం పూట మా నాన్న దగ్గరికి చుట్టూ ఉన్న కొంతమంది మిత్రులు వచ్చేవాళ్లు. మా నాయన వాళ్లకి భారత భాగవత రామాయణ కథల్ని జానపద శైలిలో వినిపించడం నాకు బాగా తెలుసు. 8, 9 తరగతుల నాటికి నేను ప్రాస పదాలు ఉపయోగించి మాట్లాడేవాడిని. ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం అనంతపురం వెళ్ళాక రాధేయ గారి పరిచయం జరిగాక వచన కవిత్వ నిర్మాణం మీద పట్టు దొరికింది. 2008 నుంచి రాస్తున్నాను. 2021 డిసెంబరులో ‘మా నాయన పాట’ పుస్తకంగా తెచ్చాను. చాలా ఆలస్యంగా పుస్తకం తీసుకురావడం వెనుక నా కవిత్వం నాకే పూర్తి తృప్తి ఇవ్వకపోవడం అనే భ్రమలో ఉండిపోవడం కారణం. ఇప్పుడు అది రెండవ ముద్రణకు రావడం చాలా సంతోషంగా ఉంది. సాహిత్యం, సామాజికతల మధ్య సమన్వయం ఉండాలి అనే సూత్రంతో నా కవిత్వాన్ని అంతర్లీనంగా నిర్మించుకున్నాను. గ్రామీణ వాతావరణం, మా నాయన ఇచ్చిన పద్యం ఇవి రెండూ ‘మా నాయన పాట’లో కనిపిస్తాయి. మానవ సంబంధాల పతనం నన్ను తీవ్రంగా కలచివేసే విషయం. ఇవే ఈ కవితా సంపుటిలో మీకు కనిపిస్తాయి.

సమకాలీన వస్తువు ఎంపికలోనూ, భిన్నమైన శిల్పాన్ని సాధించడంలోనూ మీ వ్యూహాలు ఎలా ఉంటాయి? కవిత్వంలో శిల్పం, నిర్మాణాల గురించి మీ అభిప్రాయాలు చెప్పండి?

నాకు తెలిసినంతవరకు కవిగా నేను ఎంచుకున్న వస్తువే తనకు కావాల్సిన శిల్పాన్ని అలవోకగా, అప్రయత్నంగా తెచ్చుకుంటుంది. శిల్పం కోసం తీవ్రమైన ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. సమకాలీన కవిత్వాన్ని ఎక్కువగా అధ్యయనం చేశాను. కవిత్వాన్ని విపరీతంగా చదువుకున్నాను. అలా చేయడం ద్వారా ఇంకా కొత్తగా ఎలా చెప్పాలి అనే తపన లోంచి వస్తువు ఎంపిక, శిల్ప నిర్మాణాలు వచ్చాయని చెప్పగలను. ఓ కవిత రూపుదిద్దుకుంటున్నప్పుడు భాష, భావం, శిల్పం లెక్కలేసుకుని సాధిద్దాం అంటే కష్టం అయిపోతుంది. సహజంగా వచ్చిన వాక్యానికి విలువ ఉంటుంది. ఈ సంపుటిలో చాలా కవితలు ఫోన్‌ కీప్యాడ్‌పై రెండు మూడు నిమిషాల్లో అది ఎలా వస్తే అలా అదే నిర్మాణంతో పూర్తి చేశాను. మన లోపల జరిగే సంఘర్షణ ఎంత బలంగా ఉంటే కవిత అంత బలంగా నిలబడుతుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం.

మీ కవిత్వంలో సంప్రదాయ అభివ్యక్తి, మాండలికం, సరికొత్త జానపద శైలి అనిపించే శైలీ కలగలిసి కనిపిస్తాయి. ఇది ఎలా సాధ్యమైంది?

బలమైన గ్రామీణ నేపథ్యం, మా నాయన వీధి బాగోతపు పాట, ఆయన చుట్టూ మనుషుల్ని కూర్చోబెట్టుకొని కథ చెప్పే విధానం... ఇవన్నీ నాకు తెలియకుండానే కవిత్వంలో ప్రవేశించాయి. నెల్లూరు జిల్లా గ్రామీణులు వాడే మాండలిక పదాలు నా కవిత్వంలో సహజంగా వచ్చినవే కానీ అనుకుని కుదుర్చుకున్నవి కాదు. మా ఆవిడ చేసిన రోటి పచ్చడి కవితలో విప్లవ ఉద్యమ ప్రస్తావనని తీసుకురాగలిగాను. ‘మా నాయిన పాట’ శీర్షిక కవితలో విప్లవ ఉద్యమ భూమికను తీసుకు రాగలిగాను. అప్పటివరకు మన మామూలుగా కనబడే వస్తువును, కొత్త దృష్టి కోణంతో చూడగలగడం అనేది ఈ కవితా సంపుటిలో కనిపిస్తుంది.

హిందూ పురాణాల నుంచి అభ్యుదయ ప్రతీకలుగా మీరు తీసుకున్న కొన్ని ఇమేజెస్‌ మిమ్మల్ని సంప్రదాయ నీడలో నిలబెడుతున్నాయన్న విమర్శకు మీరేం సమాధానం చెబుతారు?

ఏదేమైనప్పటికీ ఈ దేశానికి రెండు గొప్ప ఇతిహాసాలు ఉన్న మాట వాస్తవం. వాటి ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టం కూడా. అవి జరిగాయా లేదా అనే అంశం నాకు తెలియదు కానీ పురాణాన్ని నేను కథగా భావిస్తాను. అందులో వాస్తవానికి దగ్గరగా ఉన్న అంశాలు మాత్రమే గ్రహిస్తాను. వాస్తవ దూర అంశాల్ని హృదయంలోకి తీసుకోను. ఒకటి రెండు కవితల్లో సంప్రదాయ పురాణ ప్రతీకలు ఉన్న మాట నిజం. కానీ వాటిని అభ్యుదయ ప్రతీకలుగానే భావించాలి. ఒకటి రెండు పదాలు లేదా భావ చిత్రాలు వాడినంత మాత్రాన నేను సంప్రదాయ నీడలో ఉన్నాను అనే మాటని ఒప్పుకోవడం లేదు.

ఇంటర్వ్యూ : పాయల మురళీకృష్ణ

Updated Date - 2022-11-21T00:28:46+05:30 IST