అతనొస్తున్నాడు..!

ABN , First Publish Date - 2022-10-05T06:43:39+05:30 IST

అతనొస్తున్నాడు విరిగిన, కూలిన నేలరాలిన కలలను కనులకెత్తుకుని అతనొస్తున్నాడు విడగొట్టిన, చెడగొట్టిన...

అతనొస్తున్నాడు..!

విరిగిన, కూలిన

నేలరాలిన కలలను

కనులకెత్తుకుని

అతనొస్తున్నాడు


విడగొట్టిన, చెడగొట్టిన

పెడదారులు తొక్కిన

తొడగొట్టిన ఉన్మాదాలను

లెక్కగట్టుకుని


అతనొస్తున్నాడు

రాలిన, తూలిన

పేలిన చరిత్ర శకలాలను

ముల్లెగట్టుకుని


అతనొస్తున్నాడు

దుర్దినాల, దుశ్చర్యల

దుస్సహ బాధల

జాడలు తెలుసుకుని

ఒకదారినేదో వెతుక్కుని

అతను అడుగేస్తున్నాడు

ముందుకు నడుస్తున్నాడు


జెండాలను పంచెలుగా కట్టి

అజెండాలను చొక్కాలుగా చుట్టి

పబ్బం గడుపుకుపోయిన

పోబోయిన

తరలిన

తరలించుకుపోయిన సంపదలను

రాశులుగా పోయించుకున్న

చిరునామాల చిట్టాను

దేశం ముందు

కుప్పలుగా పోస్తూ...


అతనొస్తున్నాడు

స్థానాలను త్యజించి

పదవులను వొదులుకుని

అధ్యక్షలాలసను ఆవలనెట్టి

రాజ్యరమను తృణీకరించి

అతనొస్తున్నాడు


అతడొక్కడే

గుండె, గొంతూ

ఉన్నవాడు

అతనొక్కడే

గెలిచినా, ఓడినా

తల్లి భారతిని

ముప్పుల నుంచి

అనేక తిప్పల నుంచి

కాపాడేందుకేనేమో!

దేశమే దేహమై

ఒంటరిగా ఒంటరిగా ఒంటరిగానే

అతనొస్తున్నాడు

సీతారాం

Read more