దేవుడు, మనిషి, అభయం!

ABN , First Publish Date - 2022-04-10T06:07:01+05:30 IST

భగవంతుడు నిరాకారుడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేది లేదు, అంతటా ఉన్నాడు. రాగద్వేషాలు లేవు, మంచి చెడు అందరూ ఆయనకు ఒక్కటే....

దేవుడు, మనిషి, అభయం!

భగవంతుడు నిరాకారుడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేది లేదు, అంతటా ఉన్నాడు. రాగద్వేషాలు లేవు, మంచి చెడు అందరూ ఆయనకు ఒక్కటే. తనను పూజించేవాడైనా తన ఉనికిని పట్టించుకోనివాడైనా సమానమే. ఆకలి దప్పిక లేనివాడు. ఆయనకు పంచభూతాలలో నుంచి వచ్చిన లోహాలు, బంగారం గాని, ఇటుకలు గాని అన్నీ ఒక్కటే. జీవకోటికి ప్రాణాధారమైన గాలి, నీరు, నిప్పు, నింగి నేల ఏదీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆయన (క్షమించాలి, ఆమె అనుకోవచ్చు)కు లింగభేదం లేదు. ఆయన లేదా ఆమెకు పని చేయవలసిన అవసరం లేదు. పాడవలసిన అవసరం అసలే లేదు. అట్లాంటి ఏదో తెలియని ప్రకృతి లేదా దేవుడు దేవతకు కోపమే లేనప్పుడు ఆ వైపు నుంచి శాపం రావడానికి అవకాశమే లేదు. ఇవే ఆయన/ఆమె బేసిక్‌ క్వాలిటీస్‌. ఎవరైనా ఏమైనా చెప్పేటప్పుడు వీటిని దాటాడంటే-– అది రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, భగవద్గీత కావచ్చు-ఆ చెప్పేవాడు వాల్మీకి కావచ్చు, పోతన కావచ్చు, ఈ పైన పేర్కొన్న దేవుడు, దేవత లక్షణాలకు ఏమాత్రం తేడా ఉన్నా అది కచ్చితంగా అసత్యమే.


అట్లాంటి దేవుడు ఒకసారి ‘ముని’ (ముని–అతని ఇంటి పేరో అతని పేరో తెలియదు) ఇంటికి ‘గాలి’లా వచ్చాడు. ‘స్వామీ’ అని పిలిచాడు. ముని ఏదో రాసుకుంటూ పట్టించుకోలా.- మళ్లీ ‘స్వామీ నేను దేవుణ్ణి’ అన్నాడు. చూస్తే కనబడలా మెల్లగా మెల్లగా మనిషి ఆకారం ఏర్పడింది. అచ్చం మనిషిలాగానే ఉన్నాడు కాని కొద్ది తేడాగా ప్రకాశవంతంగా ఉన్నాడు. ‘ఎవరు మీరు ఈ ఊరికి కొత్తలా ఉన్నారు ఏమన్నా పని ఉన్నదా’ అన్నాడు ముని. ‘నాయనా నీ తపస్సుకు మెచ్చాను, ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు. మునికి ఆయన మాటల అర్థం తెలియలేదు. ముని ఇంతవరకు ఎవరినీ ఏమీ కోరలేదు. ఎవరి వద్ద నుంచి ఏమీ ఆశించలేదు. అన్నిటికన్నా విచిత్రం! కోరిక అంటే ఏమిటో తెలియదు. ఆఖరుకు డబ్బు కూడా ముని ముందు తన డాబుసరి చూపలేకపోయింది. ఆఖరి ప్రయత్నంగా మేనక ‘నాతో శఠం, భఠం సరసం చేయరాదా’ అంటూ భరతనాట్యం, కథకళి, రాక్‌ అండ్‌ రోల్‌, చివరకి బెల్లీడాన్సులూ చేసింది. చమటలు పట్టాయి గాని ముని మటుకు ‘ఏందీ గోల, నాకు అవతల పని ఉంది’ అన్నాడు. అప్పుడు మేనక బిత్తరపోయి కాస్త గట్టిగా మొహమాటం లేకుండా ‘ఓయీ.. మగ బుల్‌బుల్‌.. ఒక్కసారి నా మాట కాదనకు నీకు స్వర్గం చూపిస్తా, నా చేయి పట్టుకో’ అంది. అప్పుడు ముని ‘నీకు తెలుగు రాదా, ఏ దేశం నీది, ఏమైనా సహాయం కావాలా చేసి పెడతా’ అన్నాడు. అంతే మేనక గాలిలా మారిపోయి గాలివాటంగా ఎటో వెళ్లిపోయింది. 


అట్లాంటి ముని దేవలోకంలో వేసవికాలం వేడి పుట్టించాడు. దేవతలు కంప్యూటర్‌లో చూశారు, ముని కనబడ్డాడు. వాళ్లకు అనుమానం వచ్చింది. కంప్యూటర్‌కు వైరస్‌ ఎటాక్‌ అయ్యిందేమో అనుకున్నారు. ముని అయితే గడ్డాలు, జడలు, చుట్టూ పుట్టలు, అడవి కనబడాలి. కానీ, అదేం లేదు, సాదాసీదాగా ఉన్నాడు. చొక్కా ఉతికిందో, ఇస్త్రీదో కూడా తెలియడం లేదు. ఇట్టా కాదని మాస్టర్‌ కంప్యూటర్‌ తెరిచారు. అప్పుడు నిజమే ఇతను ముని అని తేల్చారు. తదుపరి కార్యక్రమంపై ఉన్నతస్థాయిలో ముగ్గురితో బెంచ్‌ ఏర్పాటు చేసి, ముని ఏమి కోరినా ఇచ్చేయ్యమని ఇతడిని పంపారు. మునికి కోపం, తాపం తెలియవు, వరం కోరుకో అంటే నిజంగా ఏమీ అర్థం కావడం లేదు. వచ్చిన మనిషి చూద్దామా ఏదో ఎట్రాక్షన్‌ ఉంది. అందుకని కూర్చోండి అన్నాడు. దేవుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఏదో వరం కోరుకుంటాడు, అక్కడ దేవలోకంలో వేడి చల్లారుద్ది అనుకున్నాడు. ఇక్కడో చిన్న లాజిక్‌ ఉంది. ఇక్కడ వరం ఇవ్వకపోతే అక్కడ వేడి చల్లారదు. అసలే సున్నితమైన వాళ్లు ఏదైనా తట్టుకుంటారు గాని, ముని వేడి మటుకు భరించలేరు. అందుకని తప్పనిసరిగా ‘వరం’ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్సాహంగా కూర్చుని, చేయి ఇట్లా తిప్పాడు. అంతా ‘ఇన్‌ కెమెరా’ అయిపోయింది. మునికి దేవుడు ఎల్‌ఈడి బల్బులా కనబడుతున్నాడు, ఆయన తప్ప ఏమీ కనబడడం లేదు. ఇక్కడ చిన్న గమ్మత్తు ఉన్నది. దేవుళ్లు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటారు. వాళ్లకు కూడా పని లేకపోయినా చిన్న చిన్న చట్టాలు ఉన్నాయి. వకాల్తా లేకుండా కోర్టులో ఆన్సరు దాఖలు చేస్తే ఎట్లా చెల్లుబాటు కాదో, అట్లాగే ముని తపస్సు చేస్తే దేవలోకంలో వేడి పుడుతుంది. ఆ వేడి చల్లారాలంటే ఇక్కడ ముని తపస్సు ఫెయిల్‌ చెయ్యాలి లేదా వరం ఇవ్వాలి. ఇదీ అక్కడ చట్టం. 


ముని తపస్సు ఫెయిల్‌ చేయడం కుదరలా. ఇక దేవతలకు మిగిలిన ఒకే ఆప్షన్‌ వరం ఇవ్వటం. పైగా ముని ఆ వరం స్వీకరించాలి. చూడండి ఎంత గడ్డు పరిస్థితో-. ముని ‘మే ఐ హెల్ప్‌ యు’ అన్నాడు నిజాయితీగానే. ‘లేదు నాయనా మా యందు దయవుంచి ఏదైనా చిన్న వరమైనా కోరుకో బాబ్బాబు’ అన్నాడు దీనంగా దేవుడు. ‘స్వామీ మీకు సహాయపడతాను అంటే ఏదో వరం అంటున్నారే! నాకేం తెలియటం లేదు’ అన్నాడు ముని. ‘మీ లోకంలో పిచ్చాడైనా డబ్బు చూపిస్తే చేయి చాపుతాడు.. డబ్బైనా కోరుకో!’ అన్నాడు దేవుడు. ‘డబ్బు దేనికి ఉపయోగపడుతుంది?’ ముని ప్రశ్న. ‘అదేమిటి? డబ్బుతో కానిది లేదు, మంచి తిండి, గుడ్డ-...’ అని దేవుడేదో చెప్పబోతుండగా ‘ఆగండి, నాకు తిండికి లోటు లేదు. గుడ్డకు లోటు లేదు. నాకు అవసరం లేని వస్తువు నాకు దేనికి-– అవసరం ఉన్న వాళ్లకు సర్దండి’ అన్నాడు ముని.- దేవుడు నీరుకారిపోయాడు. 


దేవలోకం నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి– ఏమయింది, ఏమయింది అని. ముని నాకు అన్నీ ఉన్నాయి ఏ లోటు లేదు, దేవుని దయవల్ల ఆరోగ్యం కూడ బాగున్నది అనగానే, అప్పటికే ఆశ వదులుకున్న దేవుడు– ‘నా బొంద మేమేమీ చేయలేదు. నీవే క్రమశిక్షణతో మితాహారము, నడక లాంటి మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నావు. ఇందులో ఏ దేవుని ప్రమేయం లేదు’  అని చెప్పి ‘నీకు వరం ఇవ్వకపోతే నన్ను దేవలోకం రానివ్వరని’ దీనంగా అన్నాడు. అప్పుడు ముని ‘అయినా పర్వాలేదు నేనున్నాను, నిన్ను నా బిడ్డలా చూసుకుంటాను, మా ఇంటిలోనే ఉందువుగాని, నా చొక్కాలు తొడుక్కో, నీకు చక్కగా విద్యాబుద్ధులు నేర్పి, నీవు బతకడానికి ఉద్యోగం కూడా వస్తుంది. నీ కష్టంతో నీవు బతికి, ఇతరులకు సాయపడి మానవసేవ చేసి ఈ లోకంలోకి వచ్చినందుకు నీ జన్మ సార్థకం చేసుకో, మంచి నేర్చుకో, చెడును పట్టించుకోమాకు. కొద్దిగా కష్టం అయినా సాధనమున సమకూరు సకలం. కష్టపడు ఇతరులకు సహాయపడు అదే తపస్సు. తపస్సుకు గడ్డాలు, జడలు పెంచనవసరం లేదు. అడవులు అక్కరలేదు. నీ పని ‘వర్క్‌ ఈజ్‌ వర్‌షిప్‌’గా భావించి కష్టపడు, దానిలో ఆనందం నీవే స్వయంగా అనుభవించు’’ అని అన్నాడు. దేవుని మనస్సు దూదిపింజలా తేలికైంది. ఆనందంగా లేచి ‘గురువుగారూ, ఈ వస్తువు పారవేయాలి.. దారి చూపండి’ అన్నాడు. ఏమిటా వస్తువు? అన్నాడు ముని. 


‘అమృతం. నీకు లంచంగా ఇవ్వమని మా వాళ్ళు ఇచ్చి పంపారు. నీకు దీని అవసరం లేదు, నాకు కూడ దీనితో పని లేదు. దీనిని తక్షణం వదిలించుకుంటాను’ అని దేవుడు సమాధానమిచ్చాడు.

గోపాళం సాంబశివరావు

Updated Date - 2022-04-10T06:07:01+05:30 IST