భారతీయ స్ఫూర్తి కొరవడిన ‘గాంధీ’

ABN , First Publish Date - 2022-12-03T01:02:42+05:30 IST

మహాత్ముని మహోన్నత జీవిత గాథపై బ్రిటిష్ నటుడు, దర్శకుడు రిచర్డ్ అటెన్బరో (1923–2014) రూపొందించిన ‘గాంధీ’ సినిమా 40వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నది...

భారతీయ స్ఫూర్తి కొరవడిన ‘గాంధీ’

మహాత్ముని మహోన్నత జీవిత గాథపై బ్రిటిష్ నటుడు, దర్శకుడు రిచర్డ్ అటెన్బరో (1923–2014) రూపొందించిన ‘గాంధీ’ సినిమా 40వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నది. నవంబర్ 22, 1982న ఆ సినిమా తొలుత విడుదలయింది. ఆ సినిమా స్రష్ట వ్యక్తిగత పత్రాలను ఒక ఆర్కైవ్లో భద్రపరిచారు. అది, లండన్ నుంచి ఒక గంట రైలు ప్రయాణ దూరంలో ఉన్నది. ఇటీవల ఆ పురావస్తు భాండాగారాన్ని సందర్శించాను. ‘గాంధీ’ సినిమాపై వెలువడిన అనేక సమీక్షల ప్రతులు అటెన్బరో ఫైల్స్లో కనిపించాయి. ఆయన సినిమా లలో కెల్లా ‘గాంధీ’ చాలా ప్రముఖమైనది (యోగ్యమైన సినిమా అదొకటి మాత్రమేనని కొందరు అంటారు)గా పేరు పొందింది. అటెన్బరో ‘గాంధీ’పై ‘ది టెలిగ్రాఫ్’లో నాటి యువ పాత్రికేయురాలు తవ్లీన్ సింగ్ రాసిన సమీక్ష కూడా ఆ ఫైల్స్లో ఉన్నది.

‘నేను నా జీవితంలో చూసిన మూడు లేదా నాలుగు మహోన్నత చిత్రాలలో ‘గాంధీ’ ఒకటి. అది చాలా స్ఫూర్తిదాయకమైనదని నేను నిశ్చితంగా చెప్పగలను’ అని తవ్లీన్ రాశారు. మహాత్ముడిపై ఒక బ్రిటిష్ దర్శకుడు తలపెట్టిన సినిమాకు భారత ప్రభుత్వం ఆర్థిక సహాయ మందించడమేమిటని ఆనాడు సణిగిన వారు చాలా మంది ఉన్నారు. ‘ఆ ఆక్షేపణలు అసంబద్ధమైనవని’ తవ్లీన్ కొట్టివేశారు ‘గాంధీ’ సినిమాను వీక్షించిన తరువాత ఆమె ఇలా రాశారు: ‘అటెన్ బరో సినిమాకు భారత ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం చాలా ప్రయోజ నాత్మకంగా చేసిన వ్యయమని నేను భావిస్తున్నాను. గాంధీపై అటెన్బరో ఒక గొప్ప సినిమాను నిర్మించారు. భారత్ ఆయనకు కృతజ్ఞతా బద్ధమై ఉండాలి’.

మరో యువ సమీక్షకురాలు అమృతా అబ్రహం అభిప్రాయం భిన్నంగా ఉంది. తవ్లీన్ తరానికే చెందిన పాత్రికేయురాలు అమృత ‘సండే అబ్జర్వర్’లో ‘గాంధీ’ని పెద్దగా ప్రస్తుతించలేదు. మహాత్ముడి పాత్ర పోషించిన బెన్ కింగ్ స్లే నటనను ఈమె బాగా మెచ్చుకున్నారు. ‘గాంధీ సహచరుల పాత్రలను ప్రత్యామ్నాయ భావాల, వ్యూహాలను ప్రతిపాదించిన సమర్థ నాయకులు’గా చూపలేదని అమృత అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గాంధీ, ఇతర నాయకుల మధ్య జరిగిన సమావేశాల చిత్రణలో బిగువు లేదు. ఇది ఒక పెద్ద లోపమే కాకుండా దాని వల్ల గాంధీని, ఆయన స్ఫూర్తిని మీరు అర్థం చేసుకోవడానికి కూడా అవరోధమవుతుంది’ అని ఆమె విమర్శించారు.

అటెన్బరో తన సినిమాలో గాంధీకే అగ్ర ప్రాధాన్యమిస్తూ బహుముఖీనమైన భారత స్వాతంత్ర్యోద్యమాన్ని సరళీకరించి నివేదించారు. కథానాయకుని నైతిక దార్శనికతకు కూడా ఆ సినిమా సరైన న్యాయం చేయలేదు. అమృత ఇలా వ్యాఖ్యానించారు: ‘మూడు గంటల నిడివి గల సినిమాలో స్వదేశీ ఉద్యమం, నైతిక, రాజకీయ లక్ష్యాలకు ప్రతీకాత్మక కార్యాచరణగా సత్యాగ్రహం, శాసనోల్లంఘనోద్యమం, వలసపాలకుల దమనకాండకు అహింసాత్మక ప్రతిస్పందనలు మొదలైన ప్రధాన భావాలు, ఉద్యమాలను అనివార్య మార్గంగా మాత్రమే చూపించారు. అయితే వ్యక్తిగత చర్యలు, వాటి రాజకీయ పర్యవసానాలను ఏకీకరించి, వైయక్తిక అంతరాత్మను హిందూ విశ్వాస గీటురాయిగా రూపొందించిన ఒక ప్రధాన దార్శనికతగా గాంధేయవాదాన్ని సమగ్ర రీతిలో కాకుండా వేర్వేరు చారిత్రక ఘటనలుగా మాత్రమే చూపించారు’.

న్యూయార్క్ వారపత్రిక ‘విలేజ్ వాయిస్’లో వెలువడిన ఆండ్ర్యూ సర్రిస్ సమీక్ష చాలా తీవ్రమైనది. పలు విధాల ఆక్షేపించిన ఈ అమెరికన్ విమర్శకుడు సైతం ‘అటెన్బరో సినిమా ఒక వ్యక్తి గురించి కాకుండా కొన్ని విషయాల గురించిన సినిమా అని, భారత స్వాతంత్ర్యోద్యమం, అహింస, జాతి, మత పరమైన వివక్షలు, వలసవాదం, సామ్రాజ్యవాదం, దోపిడీ మొదలైనవి మన కళ్ల ముందుకు వస్తాయని’ అంగీకరించాడు. బ్రిటిష్ పత్రిక ‘న్యూ మ్యూజికల్ ఎక్స్ప్రెస్’లో రిచర్డ్ కుక్ సమీక్షిస్తూ గాంధీ ఆంతరంగిక ఘర్షణల విషయమై తగిన శ్రద్ధ చూపకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. అవి, భారత స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రభావితం చేశాయన్న వాస్తవాన్ని విస్మరించడం సమంజసం కాదని’ ఆయన వ్యాఖ్యానించారు.. ‘అటెన్బరో ‘గాంధీ’ కంటే సత్యజిత్ రే ‘గాంధీ’నే చూడడానికి నేను ఎక్కువ ఆసక్తి చూపుతానన్న’ ముక్తాయింపుతో రిచర్డ్ కుక్ తన సమీక్షను ముగించారు.

తన సినిమాపై వచ్చిన ప్రతికూల సమీక్షలనే కాకుండా అనుకూల సమీక్షలను సైతం రిచర్డ్ అటెన్ బరో సహజంగానే భద్రం చేసుకున్నారు. వీటిలో ఒకటి తార్జి విట్టాచి అనే శ్రీలంక పాత్రికేయుడు ‘ఆసియా వీక్’లో రాసిన సమీక్ష. న్యూయార్క్లో ‘గాంధీ’ ప్రివ్యూకు ప్రత్యేకంగా ఆహ్వానితులయిన 49 మందిలో విట్టాచి ఒకరు. ‘చలనచిత్రాలతో నా ఐదు దశాబ్దాల అనుబంధంలో నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా అటెన్బరో ‘గాంధీ’. సినిమా చూసి చాలా ఉల్లాసకరమైన మైమరపుతో బయటికి వచ్చాము. ఆ సమ్మోహనం నుంచి చాలా సేపు మేము బయటపడనేలేదు. ‘గాంధీ’ సినిమాను చూడడం ఒక ఆధ్యాత్మిక అనుభవం. నిజమైన అధికారం తుపాకీ గొట్టం నుంచి రాదనే సత్యగ్రహింపు కలిగించిన అద్భుత చిత్రమది’ అని ఆయన కొనియాడారు. ఈ ప్రత్యేక ప్రివ్యూను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న ఒక థియేటర్లో ప్రదర్శించారు. ఆ అంతర్జాతీయ సంస్థ కార్యాలయంలో చిత్తశుద్ధి లేని అగ్రరాజ్యాలు శాంతి చర్చలు జరుపుతుంటాయని విమర్శిస్తూ శ్రీలంక పాత్రికేయుడు ఇలా వ్యాఖ్యానించారు : ‘‘మహాత్మా గాంధీ ఈ ధరిత్రిపై అసలు నడయాడలేదన్నట్టుగా, యుద్ధానికి సన్నద్ధం కావడం శాంతికి మార్గం కాదని గాంధీ తన కృషి ద్వారా సందేహాతీతంగా నిరూపించనట్టుగా, చరిత్రలో అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యాన్ని ఆయన కూల్చివేయనట్టుగా, హింసాత్మక కార్యాచరణ మరింత హింసకే దారితీస్తుందని మహాత్ముడి నుంచి మనం నేర్చుకోనట్టుగా ఐరాసలో చర్చలు జరుగుతుంటాయి’. విట్టాచి ఇంకా ఇలా రాశారు: ‘నిరంతర ఘర్షణలు, యుద్ధాలతో సంక్షుభితమవుతున్న కాలమిది. ఉత్కృష్ణ సినిమా నిర్మాణ నైపుణ్యాలు, దర్శకత్వ ప్రతిభా పాటవాలతో రూపొందిన గాంధీ సినిమా ఎన్నటికీ మరచిపోలేనిది. అటెన్బరో సినిమాతో ఎటువంటి సంబంధం ఉన్నవారెవరైనా– నిర్మాణంతో ప్రమేయమున్నవారూ సినిమాను చూసినవారూ– మళ్లీ పాత వ్యక్తులుగా ఉండడం అసాధ్యమనిపిస్తుంది’.

గాంధీ తన జీవిత కాలంలో చాలా వివాదాస్పద వ్యక్తి. ప్రజలు ఆయన్ని హృదయపూర్వకంగా అభిమానించారు; చిత్తశుద్ధితో అనుసరించారు. ఆయన విధానాలు, పద్ధతులు తీవ్ర విమర్శలకు, ఖండన మండనలకు గురయ్యాయి. మరి గాంధీ జీవితంపై ఆయన మరణించిన మూడున్నర దశాబ్దాలకు రూపొందిన ఒక సినిమాకు విశేష ప్రజాదరణ లభించడం; విభిన్న, నిశిత ప్రతిస్పందనలు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ‘గాంధీ’ తొలుత విడుదలయినప్పుడు నేను ఒక థియేటర్లో ఆ సినిమాను చూశాను. దరిమిలా చాలాసార్లు చూశాను. ఏమిటి ఆ సినిమా విశిష్టత? ఒక కొత్త తరానికి గాంధీ సందేశాన్ని తీసుకువచ్చింది; భారతీయేతర జాతులకు ఒక విలువైన లక్ష్యాన్ని నిర్దేశించింది. మహాత్ముడిగా బెన్ కింగ్స్ లే అద్భుతంగా నటించాడు. గాంధీ తన అంతిమ రోజులలో మత సామరస్యాన్ని కాపాడేందుకు నిర్వహించిన నిరాహార దీక్షలు, మానవీయతా కృషిని సున్నితంగా, స్ఫూర్తిదాయకంగా చిత్రించారు. మహాత్ముని సమకాలికులు, ప్రత్యర్థులు అయిన అంబేడ్కర్, సుభాష్ బోస్లు ‘గాంధీ’లో అసలు కనిపించక పోవడాన్ని గుర్తించని భారతీయ ప్రేక్షకులు ఎవరు ఉంటారు? గాంధీ రాజకీయాల నైతిక శక్తిని సంతృప్తికరమైన రీతిలో చూపలేదన్న అమృతా అబ్రహం అభిప్రాయం పూర్తిగా సబబైనదే. ఈ ‘సమీక్షలపై సమీక్షాత్మక’ వ్యాసాన్ని, అటెన్బరో సినిమాకు భారత ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని సమకూర్చేందుకు అనుమతించిన వ్యక్తి – నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ– ప్రతిస్పందనల ప్రస్తావనతో ముగించదలుచుకున్నాను.

‘నిర్మాణ దశలోనే ‘గాంధీ’ని ప్రధాని ఇందిరకు చూపించాను. బాపు జీవితాన్ని మూడు గంటల కాలానికి సంగ్రహిస్తున్నందున సినిమా ఆరంభంలోనే ఆ మేరకు ఒక వివరణ ఇవ్వండని ఆమె సూచించారు. కస్తూరిబా సంభాషణలు, ముఖ్యంగా తొలి సంవత్సరాలకు చెందినవి ఈ కాలం ధోరణిలో ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.. పందొమ్మిదవ శతాబ్ది తుది దశకాలలో మహిళలు తమ భర్తలతో చాలా సంప్రదాయ బద్ధ రీతుల్లో మాట్లాడేవారు కదా. కస్తూరిబా పాత్ర చిత్రణ తీరు తెన్నులను మరొకమారు పరిశీలించండని ఆమె సూచించారు. ఇందిర సూచనలు రెండిటినీ నేను పాటించాను’ అని ప్రముఖ జర్నలిస్టు వినోద్ మెహతాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అటెన్బరో వెల్లడించారు.

సరే, ఇప్పుడు ‘గాంధీ’పై ఇందిర సొంత తీర్పు ఏమిటో చూద్దాం. డిసెంబర్ 2, 1982న తన అమెరికన్ స్నేహితురాలు డొరోతీ నార్మన్కు రాసిన ఒక లేఖలో ఇందిర ఇలా పేర్కొన్నారు: ‘గాంధీ సినిమా చాలా ఆర్భాటంగా విడుదలయింది. అది చాలా ప్రభావాత్మకంగా ఉన్నది. గాంధీ ఏ లక్ష్యం కోసం నిలబడ్డారో, ఏ ఆశయాల కోసం జీవించారో తెలుసుకోవడం ప్రపంచానికి చాలా మంచిది. గాంధీ కాలంలో నివశించిన వారికి అటెన్బరో సినిమా ఒక అద్భుతమైన దృశ్యం, శక్తిమంతమైన వినోదం. అయితే భారతీయ స్ఫూర్తిలోని కొన్ని ముఖ్యమైన గుణాలు దానిలో లోపించాయి. భారత స్వాతంత్ర్యానికై జరిగిన మహోన్నత ప్రజా ఉద్యమ మహనీయత, ఆ పోరాటానికి సారథ్యం వహించిన అసాధారణ స్త్రీ పురుషుల (దాదాపు ప్రతి జిల్లా తన సొంత స్వాతంత్ర్య వీరులు, ధీరలను కలిగివున్నది) నుంచి భారతీయ సినిమా స్రష్టలు ఎవరూ స్ఫూర్తి పొందకపోవడమే అసలు విషాదం. ఆ మహోద్యమ హిమాలయోత్తుంగ శిఖరం మహాత్ముడు. అటెన్బరో సినిమా ఆయన్ని ‘సూపర్ స్టార్’ తరహా మెస్సయ్యని చేసింది’. ‘గాంధీ’ సారహీనమైనదే అయినప్పటికీ, చూడదగిన సినిమా అని ఇందిర అభిప్రాయపడ్డారు. ఆమెతో ఏకీభవించకపోవడానికి కారణాలేమీ నాకు కన్పించడం లేదు.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-12-03T01:02:45+05:30 IST