జగన్ ప్రభుత్వంపై విడివిడిగా కాదు, కలివిడిగా పోరాడండి!

ABN , First Publish Date - 2022-09-23T07:07:42+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీకి 2019 మేలో ఎన్నికలు జరిగి అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ పరాజయం పొందగా, వైఎస్‌ఆర్‌సీపీ భారీ మెజారిటీతో గెలిచి మే 30న ప్రభుత్వాన్ని...

జగన్ ప్రభుత్వంపై విడివిడిగా కాదు, కలివిడిగా పోరాడండి!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీకి 2019 మేలో ఎన్నికలు జరిగి అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ పరాజయం పొందగా, వైఎస్‌ఆర్‌సీపీ భారీ మెజారిటీతో గెలిచి మే 30న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గడిచిన మూడేళ్ల పాలనాకాలంలో ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని, ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశామని ప్రచారం చేసుకుంటూ ప్రజలను మరోసారి మోసగించాలని తాపత్రయపడుతున్నది. ఈ మూడు సంవత్సరాల జగన్‌ ప్రభుత్వ పాలన ఆర్థిక, రాజకీయ విధానాలు ఏ వర్గ ప్రయోజనాలను నెరవేర్చాయో పరిశీలిద్దాం.


జగన్‌ అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను సమీక్షించడానికి నిర్ణయించాడు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం, పోలవరం డ్యాం నిర్మాణ కాంట్రాక్టు, రాజధాని నిర్మాణం, కియా కార్ల కంపెనీకి ఇచ్చిన ప్రోత్సాహకాలపై సమీక్షలకు పూనుకున్నాడు. వీటిలో వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ప్రకటించాడు. వాస్తవంగా ఇటువంటి సమీక్షలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా జరిగే తంతులే. వీటి లక్ష్యం పాత పాలకవర్గ ముఠా చేతిలోని ఆర్థిక వనరుల్ని దెబ్బతీసి, ఆ వనరులను కొత్త పాలకవర్గ ముఠా దక్కించుకోవడానికే. అందుకే చంద్రబాబుపై జగన్‌ సమీక్షల యుద్ధం ప్రకటించాడు. ఇందులో ఏమాత్రం ప్రజాప్రయోజనాలు లేవు. పోలవరం కాంట్రాక్టు విషయంలో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో చంద్రబాబు నియమించిన సంస్థను తొలగించి, తనకనుకూలంగా ఉన్న కంపెనీకి అప్పగించాడు. కియా కార్ల కంపెనీకి చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహకాల సమీక్ష పేరుతో ఆ సంస్థపై ఒత్తిడి తెచ్చి జగన్‌ ప్రభుత్వం బ్లాక్‌మెయిల్‌ పద్ధతులననుసరించి ఆ సంస్థ నుంచి పెద్ద ఎత్తున కమీషన్లు గుంజుకుని మరిన్ని అదనపు ప్రోత్సాహకాలతో ఆ సంస్థ ఉత్పత్తులకు అనుమతినిచ్చింది. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందంలో ముఖ్యంగా 7,700 మెగావాట్ల విద్యుత్‌ కోసం ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందనీ, తిరిగి ఆయా సంస్థలతో కొత్త ఒప్పందాల కోసం చర్చలు జరిపి, 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. అయితే ఇది మదుపుదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని, అంటే రాష్ట్ర అభివృద్ధి గమనం మందగిస్తుందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో పాటు వ్యాపార సలహా సంస్థలు కూడా గగ్గోలు పెట్టడం ప్రారంభించాయి. జగన్‌ ప్రభుత్వం వ్యాపార సంస్థలను బెదిరించి, వారి నుంచి ముడుపులు సాధించడానికి ఈ తంతు నడిపింది. ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైనప్పుటి నుంచి విద్యుత్‌ ఒప్పందాలన్నీ అక్రమాల కుప్పలే.


ఇక రాజధాని విషయంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అయితే జగన్‌ అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి భూముల విషయంలో చంద్రబాబు, ఆయన అనుచరులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిపారని ఆరోపిస్తూ మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తన పార్టీకున్న మెజారిటీతో ఆ బిల్లును ఆమోదింపజేశాడు. ఈ రాజధాని మార్పులోని అసలు మతలబు అమరావతిలో గత పాలకపక్ష నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అక్రమంగా సంపాదించుకున్న స్థలాలను దెబ్బతీసి, విశాఖలో తాను, తన రియల్‌ ఎస్టేట్‌ మిత్రులు సంపదను పోగుచేసుకోవడం కోసమే. ఇప్పటికే విశాఖలో ఈ రాబందులు రెక్కలు కట్టుకుని వాలి పోయారు. ప్రభుత్వ భూములను కబ్జా చేయడం మొదలుపెట్టారు. వాస్తవం ఇది కాగా, వికేంద్రీకరణ, అభివృద్ధి సమన్యాయాన్ని సాధించడానికేనని అసత్యాలను ప్రచారంలో పెట్టారు. లక్షలాది మంది ఆదివాసీ ప్రజలను నిర్వాసితులను గావిస్తూ నిర్మిస్తున్న పోలవరం డ్యాం నిర్వాసితులకు పునరావాసం కింద నిర్ణయించిన నష్టపరిహారాన్ని నేటికీ చెల్లించలేదు. నిర్ణయించిన సమయంలో డ్యాం నిర్మాణం పూర్తికాక నిర్మాణ వ్యయ అంచనాలు పెంచుతూ, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.


ఎన్నికలకు ముందు ‘నవరత్నాలు’ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ఆకాశమే హద్దుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పథకాలేవీ ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించి, వారి జీవితాల్లో అభివృద్ధిని తీసుకువచ్చేవి కావు. కానీ ప్రజల కళ్లకు గంతలు కట్టి ప్రభుత్వ అసలు స్వభావాన్ని అర్థం చేసుకోకుండా భ్రమలకు గురి చేయడానికి కొంతకాలం ఉపయోగపడతాయి. ఇవన్నీ నగదు బదిలీ పథకాలే కనుక, తిరిగి ఈ డబ్బులు దేశీ, విదేశీ కార్పొరేట్‌ ఖజానాలకే చేరుతున్నాయి.


ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాడతామని, మడమ తిప్పేది లేదని, చేసిన వాగ్దానం బూటకమే అనేది అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తేలిపోయింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ రావడంతో దీనిని సాకుగా చూపి జగన్‌ జారుకున్నాడు. ప్రత్యేక హోదాపై మౌనం వహిస్తున్నాడు తప్ప, దానిని ప్రజల డిమాండ్‌గా పార్లమెంట్‌లో లేవనెత్తడానికి కూడా సిద్ధంగా లేడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన హామీలను నేటికీ అమలు చేయకపోయినా, కేంద్రాన్ని అడిగే స్థితిలో జగన్‌ ప్రభుత్వం లేదు. తండ్రి హయాంలో అక్రమంగా పోగేసుకున్న వేలకోట్ల రూపాయల ఆస్తులను, ఆయనపై ఉన్న కేసులను అడ్డుపెట్టుకొని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జగన్‌ను తన చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నది. ఇందుకు ప్రతిగా ఆయన రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టి విధేయత చాటుకుంటున్నాడు. అంబానీ, అదానీలకు అన్నీ అప్పగిస్తున్నాడు.


ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పుల వాటా 91.123 (2014) కోట్లు. గత టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు 1,65,000 కోట్లు. 2019 నాటికి మొత్తం అప్పు 2,62,163 కోట్లు. జగన్‌ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో చేసిన అప్పులతో కలిపి అది 4,93,394 కోట్లకు పెరిగింది. ఇదేకాక ఇతర ద్రవ్యసంస్థల, బ్యాంకుల వద్ద చేసిన అప్పులతో కలిపితే 7,00,000 కోట్ల ఋణభారాన్ని రాష్ట్ర ప్రజలు మోస్తున్నారు. ద్రవ్య నియంత్రణ, నిర్వహణ చట్టం ప్రకారం స్థూల రాష్ట్ర ఆదాయం (జిఎస్‌డిపి)తో పొంతన లేకుండా ప్రభుత్వం మితిమీరిన అప్పులు చేస్తున్నది. అందుకు వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెస్తున్నది. అందుకోసం నూతన కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తోంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నెలవారీగా జీతాలు చెల్లించలేని స్థితికి చేరింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు పుట్టబోయే బిడ్డతో సహా తలకు ఒక లక్ష చొప్పున ప్రజలు అప్పుల భారం మోస్తున్నారు. శ్రీలంక పాలకవర్గాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినట్లుగానే, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ అనతికాలంలోనే ఊహించని సంక్షోభంలోకి జారిపోయి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తుంది.


ఈ మూడేళ్ళలో వైఎస్ఆర్‌సిపి కార్యకర్తలకు గ్రామ సచివాలయ ఉద్యోగాలు తప్ప, అర్హులైన నిరుద్యోగులెవరికీ నూతన ఉద్యోగాలు రాలేదు. కేంద్ర ప్రభుత్వం విద్యను కేంద్రీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేసే జాతీయ నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టగా, జగన్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, విద్యాహక్కు చట్టాన్ని కూడా ఉల్లంఘించి మొత్తం ప్రభుత్వ పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరించి, ప్రాథమిక పాఠశాలలను రకరకాలుగా విడగొట్టి, 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో పాటు, విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి భిన్నంగా 1, 2 తరగతులను అంగన్‌వాడీలకు అప్పగించనున్నది. సుమారు 5,250 ప్రాథమిక పాఠశాలలను మూసివేసి, 2 లక్షల మంది విద్యార్థులు విద్యను మానేయడం లేదా ప్రైవేటు సూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది. ఉపాధ్యాయులను తొలగించి, విద్యను ప్రైవేటీకరించడంలో భాగంగా దావోస్‌ సమావేశంలో ‘బైజూస్‌ కంపెనీ’తో ఒప్పందం చేసుకున్నాడు. రేషనలైజేషన్‌ పేరుతో ఉపాధ్యాయ నియామకాలను నిలిపివేస్తే అదనపు ఋణాలు ఇస్తామని ప్రపంచబ్యాంకు విధించిన షరతులకు లోబడి, ఈ ప్రక్రియ చేపట్టాడు. దానితో స్కూల్‌ పిల్లలు, వారి తల్లిదండ్రులు ‘‘మాకు మీ అమ్మఒడి, విద్యాదీవెన, గోరుముద్దలు వద్దు, మా బళ్లు మాకే తెరవండి’’ అంటూ ఆందోళన చేస్తున్నారు.


ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో కొనసాగుతున్న ప్రజావ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి. పాలకుల నిర్లక్ష్యం మూలంగా వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర విభజన, పునర్వ్యవస్థీకరణ–2013 చట్టంలో పొందుపరచిన హామీల అమలు ప్రాతిపదికన ప్రజా ఉద్యమాలను నిర్మించాలి. బలమైన శతృవుతో పోరాడుతున్నాం కనుక తమ సమస్యలపై విడివిడిగా కాకుండా, సమైక్యమై, సరైన రాజకీయ నాయకత్వాన్ని ఏర్పరుచుకుని ఉద్యమాన్ని నిర్మించాలి. అందులో అన్ని వర్గాల పీడిత ప్రజలు, సాంఘిక సమూహాలు, ప్రజాపక్షం వహించే ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల శక్తులు, నిజమైన దేశభక్తులు, సంస్థలు, పార్టీలు, వ్యక్తులు భాగస్వాములు కావాలి.

జగబందు

అధికార ప్రతినిధి, ఏఓబీ ఎస్‌జడ్‌సీ, సీపీఐ (మావోయిస్టు)

Updated Date - 2022-09-23T07:07:42+05:30 IST