రైతు ఆదాయం రెట్టింపు కాలేదు

ABN , First Publish Date - 2022-02-16T09:26:09+05:30 IST

రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని కేంద్రప్రభుత్వం చెప్పిన గడువు రానే వచ్చింది. ఒకసారి రైతుల ఆదాయం చూస్తే రైతు కుటుంబం నెలవారీ ఆదాయం సగటున...

రైతు ఆదాయం రెట్టింపు కాలేదు

రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని కేంద్రప్రభుత్వం చెప్పిన గడువు రానే వచ్చింది. ఒకసారి రైతుల ఆదాయం చూస్తే రైతు కుటుంబం నెలవారీ ఆదాయం సగటున 2015–16లో 8,059 రూపాయలు ఉన్నట్లు కేంద్రం అప్పట్లో ప్రకటించింది. ఇది రెట్టింపు కావాలంటే ప్రస్తుత ధరల ప్రకారం ఈ ఏడాది అది రూ.21,146కి చేరాలి. కానీ 2018-–19లో కేంద్రం జరిపిన అధ్యయనం ప్రకారం రూ.10,218 మాత్రమే ఉంది. 2015–19 మధ్య నమోదైన వృద్ధిరేటుతో లెక్కించినా ప్రస్తుతం 2022లో ఆదాయం 12,955 రూపాయలు దాటదు. జాతీయ నమూనా సర్వే ప్రకారం చూస్తే రైతులు పంటలపై వచ్చే ఆదాయం కన్నా రోజు కూలిపై వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్లు తేలిందని వివరించింది. రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం నిర్దిష్ట పథకాలేవి అమలు చెయ్యలేదు. పీఎం కిసాన్ పథకం పేరిట రైతులకి సంవత్సరానికి ఆరువేల రూపాయలు ఇస్తున్నా దానితో పెద్దగా ఒరిగిందేమీ లేదు. కేంద్రం రైతుల పంటలకు నీటి, రవాణా, మార్కెటింగ్ సదుపాయాలు, దళారీలు లేని వ్యవస్థ, పండించిన అన్నీ పంటలకు గిట్టుబాటు ధర, ఒకవేళ పంట నష్టపోతే సకాలంలో భీమా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఇవేమీ చెయ్యకుండా రైతుల ఆదాయం ఎలా రెట్టింపు చేస్తుందో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. ఇప్పటికైనా రైతుల ఆదాయం పెంచేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి.

కోనేటి నరేష్

అనంతపురం

Updated Date - 2022-02-16T09:26:09+05:30 IST