విద్యార్థులకూ ముఖహాజరు

ABN , First Publish Date - 2022-11-24T23:48:22+05:30 IST

అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి మాత్రమే అమలు చేస్తున్న ముఖహాజరు ఇకపై డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకూ వర్తింపజేయనున్నారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ముఖహాజరును పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

విద్యార్థులకూ ముఖహాజరు

డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌కు తప్పనిసరి

ప్రభుత్వ నిర్ణయంపై అధ్యాపకుల అభ్యంతరం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోత వేసేందుకేనా..?

విద్యార్థి సంఘాల అనుమానం

నెల్లూరు (విద్య) నవంబరు 24 : కళాశాల విద్యార్థులు ఇకపై కచ్చితంగా తరగతులకు సమయానికి హాజరై ముఖయాప్‌తో హాజరు వేసుకోవాలి. ఇందుకోసం అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు తమ ఫోన్లలో యాప్‌ను డౌనలోడ్‌ చేసుకోవాలి. కళాశాలల్లో చేరే విద్యార్థుల వివరాలను జ్ఞానభూమి పోర్టల్‌లో ఇప్పటివరకు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ తాజానిర్ణయంతో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ముందుగా విద్యార్థులను రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఉదయం తరగతి గదికి వెళ్లే ముందు అధ్యాపకులు తొలుత యాప్‌లో తమ ముఖ హాజరు వేసుకుని అనంతరం విద్యార్థుల ముఖ హాజరు వేయాల్సి ఉంటుంది. సంబంధిత ప్రిన్సిపాల్‌ సమన్వయంతో అధ్యాపకులు ఒక్కొక్కరు కనీసం పదిమంది విద్యార్థుల హాజరు కోసం వారి కళ్లను స్కాన చేసి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఈ ప్రక్రియ చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రీయింబర్స్‌మెంట్‌లో కోత పెట్టేందుకేనా ?

ప్రభుత్వం విద్యాదీవెన పేరుతో అందిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతిదీవెన పేరుతో అందిస్తున్న స్కాలర్‌షిప్‌లలో కోత విధించేందుకే ఈ ముఖ ఆధారిత యాప్‌ను ప్రవేశపెడుతోందా? అన్న అనుమానాలను విద్యార్థి సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ రకాల కారణాలతో వేలాదిమంది విద్యార్థులకు కోత విధించిన ప్రభుత్వం ఈ భారాన్ని మరింత తగ్గించేందుకే ఈ ముఖ యాప్‌ను అమలు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 70శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే విద్యాదీవెన, వసతి దీవెన అందిస్తున్నది. పలు కళాశాలలు విద్యార్థులు తరగతులకు రాకున్నా హాజరు వేస్తూ లబ్ధి పొందుతున్నాయన్న ఆరోపణల నేపఽథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు.

అధ్యాపకుల అభ్యంతరం

తరగతులు పక్కన పెట్టి నిత్యం విద్యార్థుల ముఖ హాజరు తీసుకోవాలా? అంటూ అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రెండుసార్లు సెల్‌ఫోన్లు పట్టుకుని వెళ్లి విద్యార్థుల ఫొటోలు తీస్తూ కూర్చుంటే ఇక పాఠాలు ఎప్పుడు బోధించాలని అభ్యంతరాన్ని, అసహనాన్ని తెలియచేస్తున్నారు. ప్రభుత్వ విధానంతో రెండు పీరియడ్ల సమయం వృథా అయిపోతుందని వారంటున్నారు. ఏది ఏమైనా డిసెంబరు నుంచి దీన్ని అమలు చేయాల్సి ఉండటంతో దీన్ని ఎలా నిర్వహించాలోనని పలువురు ప్రిన్సిపాళ్లు తర్జన భర్జన పడుతున్నారు.

Updated Date - 2022-11-24T23:48:53+05:30 IST

Read more