ప్రతి అడుగు ప్రజాస్వామ్య పరిరక్షణకే!

ABN , First Publish Date - 2022-11-03T03:58:13+05:30 IST

బిజెపి ప్రభుత్వ పాలనలో పెట్టుబడుదారుల సంపద పెరిగిందే కానీ సామాన్యుల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు, అక్షరాస్యత పెరగలేదు. ప్రపంచ దేశాలలో ఐదవ ఆర్థిక శక్తిగా భారత్...

ప్రతి అడుగు ప్రజాస్వామ్య పరిరక్షణకే!

బిజెపి ప్రభుత్వ పాలనలో పెట్టుబడుదారుల సంపద పెరిగిందే కానీ సామాన్యుల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు, అక్షరాస్యత పెరగలేదు. ప్రపంచ దేశాలలో ఐదవ ఆర్థిక శక్తిగా భారత్ నిలిచిందే కానీ నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేదు. దేశం ఆర్థికాభివృద్ధిని సాధించలేకపోయినా ఆర్థికవృద్ధి ఎలా సాధించిందనేది ఐదు ట్రిలియన్ల ఆదాయాన్ని లక్ష్యం పెట్టుకున్న బిజెపి ప్రభుత్వమే చెప్పాలి. బిజెపి పాలనలో పెట్టుబడిదారుల ఆధిపత్యం, జోక్యం భారతదేశ సంపదను అమాంతం లాగేసుకోవాలన్న ధన దాహం పరుగులు పెడుతున్నది. బలమైన పారిశ్రామికశక్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన విధానాలను, రోజువారీ కార్యక్రమాలను నిర్ణయించే స్థాయికి వెళ్ళాయి. మోదీ పాలనలో సాంకేతిక అభివృద్ధి కంటే మూఢనమ్మకాలవృద్ధి చాలా పెరిగింది. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని, ఆకలి, అవినీతి లేని భారతదేశాన్ని నిర్మిస్తానని, వంద రోజుల్లో నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తానని శపథం చేసిన బిజెపి ప్రభుత్వం తన హయాంలో ఒక పెట్టుబడిదారుడిని ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చి, ఆకలికేకలలో భారతదేశాన్ని 107వ స్థానానికి చేర్చింది. దీన్ని బట్టి తెలుస్తుంది వారి ఆర్థిక ప్యాకేజీలు ప్రజలకా, పెట్టుబడిదారులకా అని.

దేశీయ ఉత్పత్తికి మొదటి ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన మోదీ అభివృద్ధి పవనాలు ఎటువైపు వీస్తున్నాయో సామాన్యునికి అంతుపట్టని విషయం. గ్రామాల అభివృద్ధేదేశ అభివృద్ధిని నిర్ణయిస్తుంది కానీ కంపెనీల అభివృద్ధి దేశ ఆర్థికవృద్ధి కాదు. గ్రామస్థాయిలో చిన్న పరిశ్రమలను స్థాపించి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి స్థానికంగా మార్కెట్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఎగుమతి చేసే విధంగా ప్రభుత్వ పథకాలు ఉండాలి కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంస్కరణ దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన వారికి ఉపయోగపడింది తప్ప పేదలకు కాదు. స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దాలలో చాలా వస్తువుల ఉత్పత్తి గ్రామాలలో జరిగేది. ఇప్పుడు వస్తువుల ఉత్పత్తి అంతా పెట్టుబడిదారీ విధానాల వల్ల పెద్ద పెద్ద నగరాలలో కేంద్రీకృతం కావడం వల్ల మారుమూల గ్రామీణ ప్రాంతాలలోని యువత ఉపాధిని కోల్పోయింది. సొంత ఊరును, ఉన్న భూమిని, కుటుంబాలను వదిలి జీవనోపాధి కోసం వలస వెళ్తున్నారు. అక్కడ దుర్భరమైన జీవితాలు గడుపుతూ కూలీ పనులు చేసుకుంటున్నారు. కొవిడ్ అనంతరకాలంలో వలస కూలీల పరిస్థితి ఇప్పటికీ మారలేదు. వారి ఉపాధికి హామీ ఇవ్వలేని విధంగా ప్రభుత్వ చర్యలున్నాయి.

దేశంలోని అన్ని రాష్ట్రాలను ఐక్యంగా ఉంచుతూ, ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేయాలని నవభారత నిర్మాణానికి గట్టి పునాదులు వేశారు అలనాటి కాంగ్రెస్ పరిపాలకులు. కానీ ప్రస్తుతం అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేస్తూ మతాలు, కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ మోదీ పాలన కొనసాగుతున్నది. మోదీ ప్రభుత్వం ప్రజల ఆర్థిక అభివృద్ధి గురించి ఆలోచించకుండా, కేవలం భక్తినే అభివృద్ధిగా ప్రచారం చేస్తూ, మనుధర్మ శాస్త్రాన్ని అమలుపరుస్తున్నది.

కాంగ్రెస్ పార్టీ కొన్ని చారిత్రక తప్పిదాలు చేసినా, బలమైన ప్రజాస్వామిక విధానాలను అనుసరించడం వల్లనే ఈ దేశంలో కులాలు, మతాలు, పార్టీలు, సామాజిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, రిజర్వేషన్లు నిలబడగలిగాయి. ఇప్పటి పాలకుల్లాగా వ్యవస్థల విధ్వంసకర విధానాలను అప్పట్లో అనుసరించి ఉంటే ఈ దేశంలో నియంతృత్వ తరహా పాలన రావడం క్షణంలో పని.

దేశంలో పన్ను కట్టేవారి డబ్బునంతా ఉచిత పథకాల పేరుతో ప్రజలకు పంచుతున్నారనీ, ఇందుకు పన్ను చెల్లించేవారు బాధపడుతున్నారనీ మోదీ ఇటీవల చేసిన ప్రకటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరు పన్నులు కడుతున్నారు ఎవరు అనుభవిస్తున్నారనేది మోదీకి తెలియదా? దక్షిణ భారతదేశం నుంచి అత్యధిక ఆదాయం వస్తున్న సంగతి ఆయన మర్చిపోయినట్టున్నారు. మరి, దక్షిణ భారతం నుంచి వచ్చే అత్యధిక ఆదాయం ఉత్తర భారతదేశంలో ఖర్చుపెడితే దక్షిణ భారతీయులు బాధపడరా? ఆయన ఈ ప్రకటన పెట్టుబడిదారుల మెప్పుకోసమో లేదా దేశంలో మిగిలిపోయిన ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టాలనే ఉద్దేశంతోనో చేసినది. ఈ దేశంలో 90 శాతం ఉన్న అట్టడుగువర్గాలు కట్టే పన్నుల మీదనే ఈ దేశ పరిపాలన వ్యవస్థ నడుస్తున్నది. నిజానికి, సామాన్యుడు కొనే ప్రతి వస్తువు పైన టాక్స్ వేసి ప్రజలను అవమానించారు మోదీ.

గిట్టుబాటు ధర కోసం రైతులు చేస్తున్న ఉద్యమాలు రైతుల ప్రాణాలను బలి తీసుకున్నది తప్ప ఇప్పటికీ గిట్టుబాటు ధరను సాధించలేకపోయింది. పైగా, కొత్త వ్యవసాయ చట్టాల పేరుతో రైతుల భవిష్యత్తును తొక్కేస్తున్నారు. దేశంలో సరైన నాణ్యమైన వైద్యం అందని మారుమూల గ్రామీణ ప్రాంతాలు, గూడేలు, ఆదివాసుల అటవీ ప్రాంతాలు, తండాలు ఎన్ని ఉన్నాయో లెక్కకు అందని పరిస్థితి. ప్రభుత్వరంగ సంస్థలు అనతికాలంలోనే కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితులు మారే విధంగా రాహుల్ గాంధీ జోడోయాత్ర కొనసాగాలని బాధిత సమాజం ఎదురుచూస్తున్నది. అన్ని రంగాల్లోనూ అనేక సమస్యలు దేశాన్ని రాచపుండులా వెంటాడుతూనే ఉన్నాయి భారత్ జోడోయాత్ర ఆ రాచపుండును నయం చేసే మందు కావాలి. దేశంలోని అట్టడుగువర్గాలకు ఒక ఆశాజ్యోతి కావాలి.

రేమద్దుల మండ్ల రవి

ఉస్మానియా యూనివర్సిటీ

Updated Date - 2022-11-03T03:58:23+05:30 IST