ధరల పతనంతో దిగాలుపడ్డ యూకలిప్టస్, సుబాబుల్ రైతులు

ABN , First Publish Date - 2022-09-27T06:29:10+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలలోనూ, తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో పేపర్ పరిశ్రమకు కావలసిన యూకలిప్టస్, సుబాబుల్‌ను రైతులు గత మూడు దశాబ్దాల నుంచి...

ధరల పతనంతో దిగాలుపడ్డ యూకలిప్టస్, సుబాబుల్ రైతులు

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలలోనూ, తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో పేపర్ పరిశ్రమకు కావలసిన యూకలిప్టస్, సుబాబుల్‌ను రైతులు గత మూడు దశాబ్దాల నుంచి విరివిగా సాగు చేస్తున్నారు. 2014 సంవత్సరం వరకూ రైతులకు టన్ను కర్రకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.4,000 నుంచి 4,400 వరకూ గిట్టుబాటు ధరలు లభిస్తూ ఈ పంటల సాగు లాభదాయకంగా ఉండేది. కానీ 2014 నుండి ధరల పతనం ప్రారంభమై గత ఐదు సంవత్సరాలలో టన్నుకు రూ.1,800 నుంచి 2,200 ధరకే రైతులు నష్టానికి అమ్ముకోవలసి వస్తోంది.


ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలలోని రైతులు తమ సంఘాల ద్వారా తమ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, గతంలో మాదిరిగా రాష్ట్ర మార్కెట్ కమిటీ యార్డులలోనే విక్రయాలు, కొనుగోళ్లు జరగాలని ఐదారు సంవత్సరాలుగా చేసిన ఆందోళనలు, పోరాటాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విస్మరించాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ఎన్ని భరోసాలు ఇస్తున్నా, రాజకీయ నాయకులు పాదయాత్రలలో గతంలో లాగా రైతులకు టన్నుకు రూ.4400 వరకూ ఇప్పిస్తామని వాగ్దానాలను చేస్తున్నా రైతులకేమీ ప్రయోజనం కలగడం లేదు. రైతుల డిమాండ్లతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పేపర్ మిల్లు యాజమాన్యాలతో సమావేశాలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.


పేపర్ పరిశ్రమ అవసరాలకంటే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారని, పేపర్ తయారీ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగాయని, అందువల్ల టన్నుకు రూ.4,400 ఇవ్వటం సాధ్యం కాదని పేపర్ మిల్లుల యాజమాన్యాలు సాకులు చెబుతున్నాయి. కానీ ఈ పేపర్ మిల్లుల యాజమాన్యాలు రైతులకు టన్నుకు రూ.1,800 నుంచి 2,200 మాత్రమే ఇస్తూ, తమ రికార్డులలో రూ.4,400 ఇచ్చినట్లుగా రాసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక వంక గిట్టుబాటు ధర లేదని రైతులు బాధపడుతుంటే, మరోవంక కేంద్ర ప్రభుత్వం 2017లో రైతులు అమ్మే యూకలిప్టస్, సుబాబుల్ కర్రపై 12 శాతం జీఎస్టీ విధించి ధరల భారీ పతనానికి మరింత ఆజ్యం పోసింది.


దేశంలో ఈ పంటల ఉత్పత్తి అధికంగా వున్నదని, అందువలన ధరలు తగ్గుతున్నాయని చెబుతున్న పేపర్ మిల్లులు వారు 2018 కేంద్ర బడ్జెట్ సమయంలో తమ అసోసియేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక వినతిపత్రం సమర్పిస్తూ మన దేశంలో సరిపోయినంత యూకలిప్టస్, సుబాబుల్ ముడి సరుకు దొరకడం లేదని, అందువల్ల దిగుమతి చేసుకొంటున్న కాగితపు గుజ్జుపై సుంకాలు రద్దు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం కూడా ఎలాంటి విచారణ చేయకుండానే, అడిగిందే తడవుగా కాగితపు గుజ్జుపై దిగుమతి సుంకాలను పూర్తిగా రద్దుచేసింది. దీంతో ధరలు ఇంకా పతనమయ్యాయి. పేపర్ మిల్లుల యాజమాన్యం అధికార పార్టీకి భారీగా ముడుపులు చెల్లించడంతో ధరలు భారీగా పడిపోయి, తమకు అన్యాయం జరుగుతున్నదని రైతులు వాపోతున్నారు. ఈ కర్ర మీద విధిస్తున్న 12 శాతం జీఎస్టీని ఎత్తి వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక కాగితం గుజ్జు దిగుమతులపై సుంకాలను రద్దుచేయటం వల్ల దిగుమతులు బాగా పెరిగి దేశీయ ఉత్పత్తిదారులకు నష్టాలు వస్తున్నాయి కాబట్టి కాగితపు గుజ్జుపై మళ్లీ సుంకాలను విధించాలని కూడా కోరుతున్నారు. 


తమిళనాడులో పేపర్ మిల్లుల వారు రైతులకు మంచి ధరలు ఇస్తూ తయారు చేసిన పేపరును దేశ, విదేశీ మార్కెట్‌లలో అమ్ముతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం గత 20 ఏళ్లుగా అధిక లాభాలు సంపాదిస్తున్నది. కానీ మన రాష్ట్ర పాలకులు రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించటం లేదు. ప్రైవేటు రంగంలో కొత్త పేపరు మిల్లులు పెట్టించలేకపోతున్నారు. తమిళనాడులో లాగ ప్రభుత్వమే పెద్ద పేపరు మిల్లును స్థాపించి రైతులకు సాయం చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు.


కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయినా జోక్యం చేసుకొని సుబాబుల్, యూకలిప్టస్ రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సందర్భంలో సుబాబుల్, యూకలిప్టస్ పండించిన రైతులకు తాను ముఖ్యమంత్రి కాగానే టన్ను కర్రకు రూ. 4,400 ధర ఇప్పిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.

చలసాని నరేంద్ర

Updated Date - 2022-09-27T06:29:10+05:30 IST