మర్లబడ్డ పాటల కబాలి

ABN , First Publish Date - 2022-10-08T10:31:13+05:30 IST

నల్లగొండ జిల్లా ఆలేరు మండలం రాఘవాపురంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన మట్టిబిడ్డ ఎర్ర ఉపాలి. బడికి దూరమై పుట్టెడు వడ్లకు జీతం ఉండి, ఎడ్లను కాశాడు.

మర్లబడ్డ పాటల కబాలి

నల్లగొండ జిల్లా ఆలేరు మండలం రాఘవాపురంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన మట్టిబిడ్డ ఎర్ర ఉపాలి. బడికి దూరమై పుట్టెడు వడ్లకు జీతం ఉండి, ఎడ్లను కాశాడు. బాల్యంలో ఉన్నప్పుడే పెద్దలాడే బాగోతాలను బాణీలుగా అల్లుకొని నేర్చుకున్నాడు. అలా క్రమక్రమంగా ఎర్ర ఉపాలి పాటల ఊటగా మారాడు. అసమానతల గుట్టును అర్థం చేసుకుని కుల కోరలను తన కలంతో, గళంతో విరిచేశాడు. నువ్వు ఎవరని అడిగితే ‘‘నిశబ్దాల అవనిలోన శబ్దం సృష్టించినోన్ని, శతాబ్దాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినోణ్ణి, జంబుద్వీపాన్ని ఏలి, కీర్తిని అంబరాన సాటినోణ్ణి, మాదిగోణ్ణి మహా ఆదివాణ్ణి, ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోణ్ణి’’ అంటాడు. 


సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించడంలో ఎర్ర ఉపాలి తరువాతే ఎవరైనా. జాంబవపురాణ సారాన్ని ఔపోసన పట్టాడు ఉపాలి. భూమికంటే ఆరునెలల ముందు పుట్టిన ఆది జాంబవంతుడు నావాడే, బాబిలోనియా యానాం నాగరికతలను నిర్మించింది మా జాతే. అందమైన ఆ లంకను నిర్మించింది మా తాత రావణుడే అంటూ ఈ దేశంలో మాదిగల సాంస్కృతిక చరిత్రను గొప్పగా చెప్పుకున్నాడు. శ్రమకు జీవం పోసి, మొట్టమొదట భూమిలో ఇత్తనం నాటి, బుక్కెన తొండమై పంటకు ప్రాణం పోసి ప్రపంచానికి బువ్వ పెట్టిన జాతి నాది. భూమి దున్నడం నేర్పినం. విత్తనం నాటడం మేమే నేర్పినం. పంటలు కోయడం నేర్పినం అంటూ తన తాతల చరిత్రను కళ్లముందుంచాడు. రాజ్యాలను పాలించిన రాజుల చరిత్రకు ఏమాత్రం తీసిపోదు తన చరిత్ర అంటాడు ఉపాలి. అసలు రాజులం మేమే అంటాడు. మనువు ఆడింది తొండి ఆట అంటాడు. మనువు సృష్టించిన నాలుగు వర్ణాలను ఉపాలి తన పాటలతో మాటలతో కవిత్వంతో చీల్చి చెండాడాడు. మనిషి మనిషి ఏకమై కలుసుకుంటే కొత్త మనిషి పుట్టునన్న మర్మము తెలవదా?! తల, భుజము, తొడలు, కాళ్ల నుంచి మనిషి ఎలా ఉద్భవించాడు?? అని ప్రశ్నించాడు. అదే నిజమైతే మనువా మళ్లీ పుట్టిరారా...మా జాతి సత్తా ఏంటో చూపిస్తా అని సవాల్‌ విసిరాడు. మనుధర్మంతో విభేదిస్తూ ఉపాలి చెప్పుకొచ్చిన సాహిత్యం ప్రజలను ఆలోచింపజేసింది.


కేవలం దళిత కులాలపై మాత్రమే కాకుండా బహుజన కులాలన్నింటి పట్ల కూడా ఉపాలి తన అనుబంధాన్ని చాటుకున్నాడు. వారి విముక్తి కూడా తన బాధ్యతగానే భావించాడు. అందుకే ‘‘అమ్మ ఈ బతుకు బతకలేనమ్మ, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మ’’ అంటూ ఔరంగజేబును గడగడలాడించిన సర్దార్‌ సర్వాయి పాపన్నను కొనియాడుతూ పాట రూపంలో పాపన్నను తలుచుకున్నాడు. అలాగే ‘‘ఎరుక చెప్పుతనమ్మ ఎరుక, ఈ లోకాన మీకేమి ఎరుకో ఎరుక’’ అంటూ ఎరుక చెప్పుకొని జీవనం సాగించే ఎరుకల కులం మీద లోతైన అధ్యయనం సాగించాడు. ఇక రజకుల గురించి ‘‘ఇంటింటిలో ప్రతి మనిషి మైల బట్టలు ఉతికేటోణ్ణి’’ అనే పాటను, మంగలి కుల శ్రమను గురించి ‘‘పెరిగిన సవరం నెత్తి గడ్డాలు చేసేటోణ్ణి’’ పాట, అలాగే ‘‘గొర్ల మేకల పెంచి గొంగళ్లు నేసేటోణ్ణి’’ అంటూ గొల్ల కులం గొప్పతనాన్ని చెప్పుకొచ్చాడు. 


‘‘కళతో భవిష్యత్తుకు వారధి నిర్మించుకున్న మహాజనుణ్ణి ఈ లోకంలో సేవ చేసే కులంలో పుట్టినోన్ని, కటిక పేదనైనా కాకి బలగం కలిగినోడ్ని, బతుకు పాటనై దరివేస్తున్న వాడిని, కూటికి లేక తిప్పలే కానీ నాకు చక్కని జనబలం ఉన్నాక, నాకేం తక్కువ, నాకేం తక్కువ’’ అని కాలర్‌ ఎగరేశాడు. నేడు సాంస్కృతిక ఉద్యమాలు నడిపే దళిత బహుజనులకు ఆదర్శం ఉపాలి. ఆయన అక్షరం, బహుజనుల ఆయుధం లాంటిది. ఆయన పాట బహుజనులకు రాజ్యాధికార బాట. సమాజంలో అసమానతలను చీకటి కోణంలో నుంచి చూసి, అణిచివేయబడిన అవమానించబడిన అన్నింటికి రంగులద్ది అందంగా వర్ణించి కాకి కష్టాన్ని గుర్తించాడు. ఆకలి బాధలు ఎన్నివున్నా...నీతి మీద నిలబడ్డాడు. పాటను అమ్ముకోలేనితనం వల్ల ఆఖరి శ్వాసదాకా కటిక పేదరికం అనుభవించాడు ఉపాలి. ఆస్తులు సంపాదించుకునే అవకాశాలను తృణపాయంగా తోసిపుచ్చాడు.


చివరిదాకా ఉపాలి కుల వివక్ష మీద, మనువాదం మీద తన అక్షర ఆయుధాన్ని ఎక్కుపెట్టాడు. కుటుంబానికి కాసింత కూడా ఆస్తి సంపాదించలేదు. కానీ కోట్ల మంది దళిత బహుజనులు కళ్లు తెరిపించే సాహిత్యాన్ని అందించాడు. ఉపాలి సాహిత్యం కొనసాగింపు జరగపోతే మనువాదం మళ్లీ పుంజుకుంటుంది. బ్రాహ్మణవాదానికి ప్రతివాదం చెప్పకపోతే అంటానితనం మర్లపడుతుంది. మనువును ప్రశ్నించకపోతే మళ్ళీ పాత రోజులు వస్తాయి అంటూ ధిక్కరించిన మూగబోని జాతి గుండెగొంతుక ఉపాలి.


– మాచారం వెంకటేష్‌

(అక్టోబర్‌ 10న ఆలేరు రాఘవపురంలో

ఎర్ర ఉపాలి సంస్మరణ సభ)

Updated Date - 2022-10-08T10:31:13+05:30 IST