విపక్షాల గుండెల్లో ఈడీ రైళ్లు

ABN , First Publish Date - 2022-08-02T06:10:36+05:30 IST

ప్రజల డబ్బును రకరకాలుగా దోచుకుని కోట్లాది రూపాయల సొమ్మును నిశ్శబ్దంగా అనేక మార్గాలద్వారా విదేశాలకు మళ్లించిన రాజకీయ నాయకుల భవిష్యత్తు అంధకార బంధురం...

విపక్షాల గుండెల్లో ఈడీ రైళ్లు

ప్రజల డబ్బును రకరకాలుగా దోచుకుని కోట్లాది రూపాయల సొమ్మును నిశ్శబ్దంగా అనేక మార్గాలద్వారా విదేశాలకు మళ్లించిన రాజకీయ నాయకుల భవిష్యత్తు అంధకార బంధురం కానున్నది. ఎన్నికల సమయంలో ఇదే డబ్బును విచ్చలవిడిగా పంచుతూ, ఓట్లను కొనుక్కునే నేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఐదు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నదనడంలో సందేహం లేదు. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల క్రింద అక్రమార్జనపరుల ఇళ్లు, కార్యాలయాలు సోదాలు చేసేందుకు, అవసరమైతే అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు విస్తృత అధికారాలను కల్పించడం సరైనదేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అవినీతిపరుల పట్ల ఏమాత్రం కనికరం చూపకూడదనే మోదీ ప్రభుత్వ విధానానికి ఆ తీర్పు బలం చేకూర్చింది.


1956లో విదేశీ మారకద్రవ్య సంబంధిత నేరాలను అరికట్టేందుకు ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ గురించి కాంగ్రెస్ హయాంలో ఎవరికీ పెద్దగా తెలియదు. వాజపేయి ప్రభుత్వం 1998లో మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టింది. నాటి కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని స్థాయీ సంఘం నివేదికను 1999 మార్చి 4న లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఆ వెంటనే వాజపేయి ప్రభుత్వం ఆ స్థాయీ సంఘం సిఫారసులను ఆమోదించింది. 2002లో మనీలాండరింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈడీకి విస్తృతాధికారాల్ని కల్పించింది. వాజపేయి తర్వాత అధికారంలోకి వచ్చిన మన్మోహన్ సింగ్ హయాంలో ఈ చట్టాన్ని ప్రయోగించిన దాఖలాలు లేవు. మనీలాండరింగ్‌కు సంబంధించి చర్య తీసుకునేందుకు దాదాపు 29 చట్టాలు, 160 సెక్షన్లు అందుబాటులో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మోదీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి. రాజకీయ నాయకులు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఎలా సమీకరించగలుగుతున్నారు, విదేశీ బొక్కసాల్లో వాటిని ఎలా భద్రపరచుకోగలుగుతున్నారు అన్న అంశంపై మోదీ దృష్టి పెట్టారు. అనేక మంది రాజకీయ నాయకులు పలువురు తమ నిధులను విదేశాలకు మళ్లించారని తేలడంతో ఈడీ 2019 నుంచి మనీలాండరింగ్ కేసులు పెట్టడం ప్రారంభించింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం క్రింద ఈడీ 25వేల కేసులు నమోదు చేస్తే అందులో 4వేల కేసులు విదేశాలకు డబ్బు మళ్లింపునకు సంబంధించినవేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత వారం పార్లమెంట్‌కు తెలిపింది.


అక్రమార్జనపరులపై ఈడీ చర్య తీసుకోవడం చాలా క్రూరమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి! మనీలాండరింగ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాదాపు 241 మంది ప్రతిపక్ష నేతలు, వ్యాపార సంస్థల ప్రతినిధులు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేయడంతో వారు ఎంత కలవరపడుతున్నారో అర్థం అవుతోంది. ప్రభుత్వం తమ వెంట పడుతూ వేటాడుతోందని వారు ఆక్రోశిస్తున్నారు. అయితే మనీలాండరింగ్ అక్రమాలపై చర్యలు తీసుకునే అన్ని అధికారాలు ఈడీకి ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయంతో ప్రభుత్వానికి, ఈడీకి నైతిక స్థైర్యం సమకూరినట్లయింది. విదేశాలకు డబ్బు మళ్లించేందుకు పాల్పడిన, సహాయం చేసిన, నిధులు మళ్లింపు విషయాన్ని తెలిసి దాచిపెట్టిన వారంతా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లేనని చట్టంలో పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. ఈడీ దాడుల వల్ల తమ జీవించే హక్కుకు ప్రమాదం కలుగుతోందని పిటీషనర్లు సుప్రీంకోర్టు ముందు వాదించడం హాస్యాస్పదం. వారి వాదనల్లో పస లేనందువల్ల సుప్రీంకోర్టు ఆ పిటీషన్లను తిరస్కరించింది.


ఇంతకీ మనీలాండరింగ్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు ముందు పిటిషన్లు దాఖలు చేసిన వారెవరో తెలుసా? మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ వారిలో ఒకరు. పంజాబ్‌లో ఒక విద్యుత్ ప్రాజెక్టులో పనిచేసేందుకై 300 మంది చైనా జాతీయులకు వీసాలు ఇప్పించి రూ.50 లక్షలకు పైగా లంచం తీసుకున్నందుకు ఈడీ ఆయనపై మనీలాండరింగ్ కేసు పెట్టింది. ఇందులో అక్రమం ఏమున్నది? ఇవాళ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, డికె శివకుమార్; నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, శివసేన నేత సంజయ్ రౌత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంధువు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీ, ఎన్‌సిపి నేతలు అజిత్ పవార్, నవాబ్ మాలిక్, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ అంతా ఈడీ కేసుల్లో ఇరుక్కున్నారు. తాము నిర్దోషులమని, ఎలాంటి నేరం చేయలేదని వాపోతూ వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేస్తే వారిని నమ్మేవారెవరు? ఎందుకంటే ఈ నేతల అక్రమార్జనల విషయం ప్రజలకు బాగా తెలుసు.


నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న పేరుతో బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ వేల కోట్లు ఆర్జించినట్లు తేలింది. దీనితో ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనడం మొదలుపెట్టారు. అలాగే తన బంధువు అభిషేక్ బెనర్జీ, ఆయన సతీమణి రుజిరా బెనర్జీలకు బొగ్గు స్మగ్లింగ్‌లో పాత్ర ఉన్నదని ఈడీ అనుమానించడం ప్రారంభించిన తర్వాత మమతా బెనర్జీ స్వరంలో మార్పు వచ్చింది.


బ్యాంకు ఖాతాల్లో అక్రమ నిధులు, విదేశాలకు డబ్బు మళ్లించిన దాఖలాలు, ప్రాజెక్టుల అమలులో వేల కోట్ల ముడుపులు చేతులు మారిన సమాచారం, ఉద్యోగాల ప్రలోభాలు, పథకాలకు నిధుల పేరుతో భారీ ఎత్తున అక్రమార్జనల గురించి సాక్ష్యాలు లభించిన తర్వాతే ఈడీ దృష్టి సారిస్తుంది. తమను ఎవరూ పట్టించుకోరని, ఎన్ని వేల కోట్లు వెనకేసినా ఎవరికీ తెలియదని, ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరిగి అధికారంలోకి రావచ్చునని ఎవరైనా భావిస్తే మోదీ ప్రభుత్వం మౌనంగా ఊరుకునే ప్రసక్తి లేదు. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అక్రమ సంపాదన చేసిన అనేక మంది రాజకీయ నాయకుల గుట్టురట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు గొంతెత్తి అరిస్తే, పార్లమెంట్‌ను కలిసికట్టుగా స్తంభింపచేస్తే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందా? ఎంత అమాయకత్వం! నరేంద్రమోదీ ప్రభుత్వం ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరే అవకాశమే లేదు.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Read more