ప్రభుత్వాలు చెప్పే ఆర్ధిక అసత్యాలు!

ABN , First Publish Date - 2022-09-22T06:49:38+05:30 IST

దేశ ఆర్ధిక వ్యవస్తకి సంబంధించి, ఈ మధ్య పత్రికల్లో వచ్చిన వార్తలు కొన్ని: ‘ఐదవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్తగా భారత్’, ‘టాప్ గేర్‌లో జీడీపీ వృద్ధి రేటు’, ‘2025 నాటికి ఐదు లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్తే భారత్ లక్ష్యం’, ‘భారత్‌లో తలసరి ఆదాయం...

ప్రభుత్వాలు చెప్పే ఆర్ధిక అసత్యాలు!

దేశ ఆర్ధిక వ్యవస్తకి సంబంధించి, ఈ మధ్య పత్రికల్లో వచ్చిన వార్తలు కొన్ని: ‘ఐదవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్తగా భారత్’, ‘టాప్ గేర్‌లో జీడీపీ వృద్ధి రేటు’, ‘2025 నాటికి ఐదు లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్తే భారత్ లక్ష్యం’, ‘భారత్‌లో తలసరి ఆదాయం ఏడాదికి 2వేల 227 డాలర్లు’, ‘ఎల్ఐసీ ఆస్తులు 42లక్షల 30వేల కోట్లు’, ‘ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్తానానికి అదానీ గ్రూపు అధిపతి’.


ఇలాంటి వార్తలకు ఆధారం: ప్రభుత్వ ఆర్ధిక సంస్తలూ; వడ్డీ వ్యాపార సంస్తలైన ప్రపంచ బ్యాంకూ, అంతర్జాతీయ ద్రవ్య నిధీ (ఐ.యం.ఎఫ్.) వంటివి చేసే సర్వేలు. ఈ లెక్కలనే ఆర్ధికవేత్తలూ, మంత్రులూ వల్లిస్తూ వుంటారు. కానీ, ఇటువంటి వార్తలు సాధారణ ప్రజలకి ఏమాత్రం అర్ధం కావు. మేధాశ్రమలు చేసే విద్యావంతులకు కూడా అర్ధం కావు, పట్టవు. అవన్నీ ఆర్ధికవేత్తలకూ, ప్రభుత్వాలకూ సంబంధించిన వ్యవహారాలే అనుకుంటారు వాళ్ళు. అవి తమ నిత్య జీవితాలని శాసించే విషయాలేననీ; వాటి గురించి చదివి, వాటిల్లో నిజానిజాలేమిటో లోతుగా ఆలోచించాలనీ మేధావులు కూడా అనుకోరు. అందుకే, పాలకులు చెప్పే ఆర్ధిక అసత్యాలు వందల ఏళ్ళుగా నిరాటంకంగా సాగిపోతున్నాయి. మనుషుల మధ్య అసమానతలు కూడా పెరిగిపోతున్నాయి. సమస్యల్లో పడడమే గానీ, వాటికి కారణాలేమిటో, వాటినించీ విముక్తి పొందే మార్గం ఏమిటో రెండు క్షణాలు కూడా ఆలోచించరు.


మనం తరచూ వినే మాటలు కొన్ని: అభివృద్ధి (గ్రోత్), వృద్ధి రేటు (గ్రోత్ రేట్), స్తూల దేశీయ ఉత్పత్తి (జీ.డీ.పీ), తలసరి ఆదాయం (పెర్ కాపిటా ఇన్కమ్), దారిద్ర్య రేఖ (పావర్టీ లైన్), వినిమయం (కన్‍జంప్షన్). ఉదాహరణకి, ‘అభివృద్ధి’, ‘వృద్ధి రేటు’ అనే మాటల్నే తీసుకుందాం. కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం డబ్బులో అభివృద్ధి ఎక్కువైంది. అంటే, కొత్తగా తయారైన సరుకులు గానీ, ‘సేవలు’ పేరుతో జరిగే సదుపాయాలు గానీ, కిందటి సంవత్సరం కంటే పెరిగాయి అని అర్ధం. సరుకుల్నీ, సేవల్నీ మొత్తం ఉత్పత్తిగా అనుకుంటే, ఆ ఉత్పత్తి విలువని రూపాయిల్లో జీడీపీగా చెపుతారు. కానీ, ఉత్పత్తి విలువ అన్నప్పుడు, కేవలం ఉత్పత్తి కోసం అవసరమైన సాధనాల విలువా, శ్రామికులకు ఇచ్చే జీతాల విలువా మాత్రమే కాదు. సాధనాల విలువని 80 అనీ, జీతాల విలువని 20 అనీ అనుకుంటే, ఈ రెండూ కలిసే పెట్టుబడి విలువ. కానీ, సరుకుల్ని అమ్మినప్పుడు, వాటి కోసం పెట్టిన ఆ 100 పెట్టుబడి మాత్రమే వస్తే, ఏ యజమానీ ఉత్పత్తి చేయించే సరదాకి దిగడు. పెట్టిన పెట్టుబడి విలువ కన్నా ఎక్కువ విలువే రావాలి, వస్తుంది. ఆ ఎక్కువని 20 అనుకుందాం. అది శ్రామికుల శ్రమలనించీ వచ్చే అదనపు విలువ. ప్రతీ సంవత్సరమూ శ్రామికుల శ్రమల నించీ కొత్తగా వచ్చే అదనపు విలువే అభివృద్ధి.


కానీ, ‘అభివృద్ధి’ అనేది, దేశ జనాభా అంతటికీ ఒకే రకంగా అందదు. సరుకుల తయారీకి కావలిసిన ‘ఉత్పత్తి సాధనాలు’ ఎవరి చేతుల్లో వుంటాయో, ఆ యజమానుల వర్గానికే ఆ అభివృద్ధి అందుతుంది. ఆ సాధనాలను ఉపయోగించి, శ్రమలు చేసి, అదనపు విలువని ఇచ్చే శ్రామికవర్గ ప్రజలకు ఆ అభివృద్ధిలో ‘జీతాల’ పేరుతో అతికొద్ది మొత్తమే అందుతుంది. (కొన్ని ఉత్పత్తి శాఖలలో మేధా శ్రమలు చేసే వారికి పెద్ద జీతాలే అందినా, యజమానులకు మిగిలేదే ఎక్కువ. దీన్ని వివరంగా చెప్పుకోవడానికి ఇక్కడ చోటు చాలదు.) యజమానులకేమో, సాధనాల ఖర్చూ, కార్మికులకు ఇచ్చే జీతాలూ పోనూ కొంత అదనంగా మిగులుతుంది. ఇదీ అసలు విషయం. ఒక ఏడాది మిగిలింది 100 అనుకుందాం. మరుసటి ఏడాది 100 కంటే ఎక్కువ వస్తే అది వృద్ధి రేటులో అభివృద్ధి. ఉదాహరణకి, 110 వస్తే, ఈ సంవత్సరం జీడీపీ 10 శాతం పెరిగింది అని చెప్పుకుంటారు. ఇంకా పెరిగితే, ‘టాప్ గేర్‌లో జీడీపీ వృద్ధి రేటు’ అని ప్రభుత్వ గణాంకాల శాఖ ప్రకటిస్తుంది.


కుబేరుల జాబితాలో వున్న పరిశ్రమల అధిపతుల (ఉదా: అదానీ గ్రూప్) ఆస్తులు పెరగడానికి కారణం, ఆ కుబేరులకోసం శ్రమలు చేసే శ్రామికుల అదనపు విలువే! వడ్డీ వ్యాపారం చేసే ఇన్సూరెన్సు కంపెనీల ఆస్తులూ, బ్యాంకుల ఆస్తులూ ‘వృద్ధి’ చెందేది కూడా అదనపు విలువ ద్వారానే. (ఉదా: ‘ఎల్‍ఐసీ ఆస్తులు 42 లక్షల 30 వేల కోట్లు’ అని ఈ వ్యాసం మొదట్లో మనం చదివిన వార్తకి అర్ధం అదే). అది ఎలాగంటే, జనాల దగ్గిర ఇన్సూరెన్సు పేరుతోనో, బ్యాంకు డిపాజిట్ల పేరుతోనో  డబ్బులు తీసుకుని, వాటిని ఉత్పత్తులు చేయించే పరిశ్రమల యజమానులకు అప్పుగా ఇవ్వడం ద్వారానే వడ్డీలు సంపాయిస్తాయి. ఆ వడ్డీలను పరిశ్రమల యజమానులు, తమ శ్రామికుల నించీ లాగిన అదనపు విలువలోనించే బ్యాంకులకు చెల్లిస్తారు. కాకపోతే, ఆ యజమానులు గానీ, బ్యాంకులు గానీ, ‘అదనపు విలువ’ అనే ప్రమాదకరమైన మాటని వాడరు. ‘లాభం’ అని ముద్దు పేరుతో పిలుస్తారు. పెట్టుబడి పెడితే లాభం రావద్దా మరి– అనీ, డబ్బు అప్పిస్తే వడ్డీ రావద్దా మరి– అనీ, భూమి అద్దెకిస్తే కౌలు రావద్దా మరి– అనీ, యజమానులూ, వారి ఆర్ధికవేత్తలూ వాదిస్తారు. అదంతా ఎంతో సహజమైన విషయంగా శ్రామిక ప్రజలు కూడా భావిస్తారు. ‘ఒక యుగంలో, ప్రజల మెదళ్ళను పాలించే భావాలు పాలకవర్గ భావాలే’ అంటే అర్ధం ఇదే! శ్రామిక ప్రజలకి కొన్ని ఆర్ధిక సత్యాలు తెలియకపోతే అంతే మరి. కానీ, తెలియజెప్పడం పెద్ద కష్టం కాదు. యాబై ఏళ్ళ కిందట బొలీవియా అనే దేశంలో గని కార్మికులకు వాళ్ళ నాయకులు ఎంతో తేలికగా, శ్రమ దోపిడీ గురించి చెప్పినట్టు ఒక పుస్తకంలో చదివాను. కార్మిక నాయకుడు, ఒక పెద్ద కాయితం తీసుకుని, ‘మనం ఇంత పని చేస్తే, మన యజమాని, ఇంతే మనకు జీతం ఇస్తాడు’ అని, ఆ కాయితంలో ఒక చిన్న ముక్కని చింపి, చూపిస్తాడు. కాయితంలో మిగిలిన చాలా  పెద్ద భాగాన్ని చూపించి, ‘దీన్ని వాడు ఏ శ్రమా చెయ్యకుండానే, జేబులో వేసుకుంటాడు’ అని వివరించాడట! ఎంత తేలిగ్గా చెప్పాడో కదా?


‘తలసరి ఆదాయం’ అని కొన్ని లెక్కలు చెపుతారు. దేశంలో ఒక ఏడాదిలో కొత్తగా వచ్చిన ఆదాయాన్ని, దేశ జనాభాతో భాగిస్తే ఒక మనిషికి  సగటున అందే ఆదాయాన్నే తలసరి ఆదాయంగా ఆర్ధికవేత్తలు లెక్కకడతారు. మొదట్లో మనం చూసిన ఒక వార్త ప్రకారం, భారతదేశంలో తలసరి ఆదాయం ఏడాదికి లక్షా డెబ్బై వేల రూపాయలు (2 వేల, 227 డాలర్లు) – అని ప్రపంచ బ్యాంకు లెక్క కట్టింది. ఈ లెక్కలో వున్న మోసాన్ని అర్ధం చేసుకోవడానికి భారతదేశంలో, ఏదో ఒక పెద్ద పెట్టుబడిదారుణ్ణి ఉదాహరణగా తీసుకుందాం (ఉదా: ముఖేష్ అంబానీ). అతని జీతం ఒక ఏడాదిలో 15 కోట్లు! బైటి ఇళ్ళల్లో పాచిపని చేసుకుని బతికే ఒక మనిషికి, నెలకి 5 వేలు అనుకుంటే, ఏడాదికి 60 వేలు. అలాగే ఒక యూనివర్సిటీ ప్రొఫెసరుకి నెలకి లక్ష అనుకుంటే, ఏడాదికి 12 లక్షలు. కానీ, తలసరి ఆదాయం సూత్రం ప్రకారం, పెద్ద పెట్టుబడిదారుడూ, పాచిపని చేసుకు బ్రతికే పని మనిషీ, యూనివర్శిటీ ప్రొఫెసరూ అందరూ ఒకే ఆదాయం పొందుతారు! దీన్ని మించిన ఆర్ధిక అసత్యం ఉంటుందా?


‘దారిద్ర్య రేఖ’ అనీ, ‘వినిమయం (వాడకం)’ అనీ ఒక జంట అసత్యం వుంది. ఒక మనిషి లేదా ఒక కుటుంబం తన ఆదాయం లోనించీ నెలకి ఎంత ఖర్చు పెట్టగలరు – అనేదాన్ని బట్టి దారిద్ర్య రేఖని ప్రభుత్వాలు లెక్క కడతాయి. శ్రామిక జనాలకు జీతాలుగా అందేది, కేవలం ‘శ్రమ శక్తి విలువే’. అంటే, రోజు తర్వాత రోజు పనికి వెళ్ళడానికి కావల్సిన కనీస జీవనాధారాలు కొనుక్కోవడానికి అవసరమైన డబ్బు మాత్రమే! ఆ డబ్బుతో జీవనాధారాలు ఎంతో నాసిరకం అయినవే అందుతాయి. దారిద్ర్యానికి కారణం, శ్రామిక ప్రజలకు వారి శ్రమ విలువ అంతా అందకపోవడమే– అని మాత్రం ఆర్ధికవేత్తలు చెప్పరు. ఉచితాల పేరుతో, కొంత ముష్టి విసిరే పధకాలని ప్రవేశపెడతారు.


అలాగే ప్రభుత్వాలకి పన్నుల నించీ అందే ఆదాయం చూద్దాం. తాజా వార్త ప్రకారం: ఆగస్టులో జీ.ఎస్.టి. (పన్నులకు కొత్త పేరు) వసూళ్ళు 1 లక్షా, 43 వేల కోట్లు. ఈ పన్నులు ఎవరైనా ఎక్కడినించీ కడతారూ? సరుకులు తయారు చేసిన కార్మికుల అదనపు విలువల నించీ తప్ప వేరే మార్గం లేనే లేదు. అంటే, శ్రమ దోపిడీ ద్వారానే! కానీ, ఈ విషయం ఆర్ధిక మంత్రీ చెప్పదు, ప్రధాన ఆర్ధిక సలహాదారుడూ చెప్పడు, టీవీ చర్చల్లో పాల్గొనే ప్రొఫెసర్లూ చెప్పరు. అందుకనే శ్రామిక ప్రజలు పాలకులు చెప్పే ఆర్ధిక అసత్యాలను గ్రహించాలి– అని పదే పదే చెప్పడం. ప్రజలు అలా గ్రహించనంతకాలమూ, పెట్టుబడిదారీ ఆర్ధిక శాస్త్రమే రాజ్యమేలుతుందని, 150 ఏళ్ళ కిందట, మార్క్సు తన ‘కాపిటల్’లో వివరించాడు, ఇలా: ‘వర్గ పోరాటం ఇంకా గుప్తంగా ఉన్నంతకాలమూ, లేదా అది అక్కడక్కడా, అప్పుడప్పుడూ మాత్రమే బయట పడుతున్నంత కాలమూ,  రాజకీయ అర్ధ శాస్త్రం ఒక శాస్త్రంగా చలామణీ అవుతుంది.’

రంగనాయకమ్మ

Updated Date - 2022-09-22T06:49:38+05:30 IST