డ్వాక్రా మహిళలకు టోకరా

ABN , First Publish Date - 2022-10-05T06:48:55+05:30 IST

కొత్తఋణాలు అందక, పాత ఋణాలు చెల్లించలేక డ్వాక్రా సంఘాల నిర్వహణ గాడి తప్పుతోంది. పకడ్బందీగా నడిచిన ఈ వ్యవస్థ క్రమంగా బీటలు వారుతోంది...

డ్వాక్రా మహిళలకు టోకరా

కొత్తఋణాలు అందక, పాత ఋణాలు చెల్లించలేక డ్వాక్రా సంఘాల నిర్వహణ గాడి తప్పుతోంది. పకడ్బందీగా నడిచిన ఈ వ్యవస్థ క్రమంగా బీటలు వారుతోంది. లక్షల మంది మహిళలు గ్రూపులుగా ఏర్పడి, చెమట చిందించి సంపాదించిన దాని నుంచి పొదుపు చేసుకున్న దానికి తోడు ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని భావించిన డ్వాక్రా సంఘాలకు నిరాశ ఎదురవుతోంది. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ఉద్దేశించిన డ్వాక్రా మహిళా సంఘాలను ప్రభుత్వమే క్రమంగా నిర్వీర్యం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సున్నా వడ్డీ కింద సంఘాలకు రూ.5,200కోట్లను ఋణాలుగా ఇవ్వాల్సి ఉన్నా, కేవలం రూ.1160 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి.


డ్వాక్రా సంఘాలకు ఇచ్చే ఋణ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచడంతో పాటు వారి పొదుపు ఖాతాలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని ఆర్బీఐ స్పష్టం చేసినా ఋణ పరిమితిని రూ.3లక్షలకే కుదించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న ఋణాలను సకాలంలో తిరిగి చెల్లించే డ్వాక్రా మహిళలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించే పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమలులో ఉంది. ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ డబ్బులు చెల్లించ లేదు. దీంతో డ్వాక్రా సంఘాలే ఈ వడ్డీని చెల్లించాల్సి వస్తోంది. సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వకపోవడంతో ఒక్కో డ్వాక్రా సంఘం ఇప్పటికే బ్యాంకులకు వడ్డీ రూపంలో అదనంగా రూ.60 వేల నుంచి రూ.70 వేలు చెల్లించాల్సి వచ్చింది. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) ఋణాల్లో జాతీయస్థాయిలో 30శాతం వాటా కలిగిన రాష్ట్రంలో కొత్త ఋణాలు క్రమంగా తగ్గుతున్నాయి. 


గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం 3.13 లక్షల గ్రూపులు ఋణాలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నాటికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 4,05,269 గ్రూపులకు బ్యాంకులు రూ.18,192 కోట్ల ఋణాలను బట్వాడా చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 3.13 లక్షల గ్రూపులు తగ్గగా, ఋణ విలువ రూ.1,900 కోట్లు తక్కువగా ఉంది. ప్రభుత్వ తీరు వల్లనే వేలాది సంఘాలు వెనుకబడిపోయాయి.


బ్యాంకులు ఎంత వడ్డీకి అప్పు ఇచ్చినా, మహిళలపై పావలా మించి భారం పడకుండా, మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లించే విధానాన్ని గతంలో అమలు చేశారు. తక్కువ వడ్డీకే ఋణాలు మంజూరు అవుతుండటంతో అప్పట్లో మహిళలు పెద్దసంఖ్యలో పొదుపు సంఘాల్లో చేరారు. ఇప్పుడు డ్వాక్రా మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8.71 లక్షల పొదుపు సంఘాలు ఉండగా వాటిలో 98 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకూ డ్వాక్రా సభ్యులు తమకు అవసరమైన ఋణాలను పొదుపు, స్త్రీ నిధి, పెట్టుబడి నిధి, బ్యాంకు లింకేజీల ద్వారా పొందేవారు. కొత్తగా తెచ్చిన సింగిల్ విండో విధానంలో అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఇకపై డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు ఋణాలు పొందాలంటే వారి మూలధన నిధి నుంచి మంజూరు చేసేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. చివరి ఆప్షనుగా బ్యాంకు లింకేజీకి వెళతారు. ఇన్నాళ్లూ బ్యాంకులు రూ.8,702 కోట్ల మూలధన నిధిని చూసే విరివిగా డ్వాక్రా సభ్యులకు ఋణాలు ఇచ్చేవి. డ్వాక్రా సంఘాలు ఫలానా అవసరానికే వినియోగించాలనే షరతులు కూడా బ్యాంకులు ఎప్పుడూ విధించలేదు. 


98 లక్షల డ్వాక్రా మహిళలు రాష్ట్రంలో ఉంటే 72 లక్షల మందికి ఆసరా పథకం ఇస్తున్నారు. ఆసరాతో ఎంతో ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, కొన్ని గ్రూపులకు గరిష్ఠంగా రూ.25వేలు కూడా అందలేదు. అంటే ఒక్కో మహిళకు రూ.1500మాత్రమే. 45 ఏళ్ల మహిళలకు పెన్షన్‌ ఇస్తానని చెప్పి అమలు చెయ్యలేదు. కొత్తగా తెచ్చిన సింగిల్ విండో విధానం వల్ల పొదుపు సొమ్ము మొత్తం ఖాళీ అయ్యాకే బ్యాంకులు డ్వాక్రా గ్రూపులకు కొత్తగా ఋణాలు ఇచ్చే పరిస్థితి ఉంది. వృద్ధాప్యంలో అండగా నిలుస్తుందనే ఆశతో పొదుపు మహిళలు అభయహస్తం కింద ఎల్ఐసీలో దాచుకున్న రూ.2వేల కోట్ల నిధిని స్వాహా చేశారు జగన్ రెడ్డి. తన మూర్ఖపు నిర్ణయాలతో మహిళల ఆర్థిక స్వేచ్ఛను, ఆర్థిక పరిపుష్టిని హరించేస్తున్నారు. 


2014 నాటికి రూ.12,516 కోట్లుగా ఉన్న డ్వాక్రా ఋణాలు, ఆ తర్వాత (2014–19) ఇచ్చిన రుణాలు కలిపి రూ.25.517 కోట్లుగా చెబుతున్న జగన్మోహన్ రెడ్డి సున్నా వడ్డీ కింద గత ప్రభుత్వ బకాయిలపై మాత్రం తనకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది మహిళలను మోసం చేయడం కాదా? ఓటీఎస్ మాటున డ్వాక్రా మహిళలకు జగనన్న టోకరా వేస్తున్నాడు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో డ్వాక్రా మహిళల ఖాతాలు ఖాళీ చేస్తున్నాడు. లబ్ధిదారుల కుటుంబాల్లో ఎవరైనా పొదుపు సంఘాల్లో ఉంటే, వారు దాచుకున్న సొమ్ము నుంచి డ్రా చేసి ఓటీఎస్‌కు చెల్లింపులు చేసుకోవడం దారుణం. సెర్ప్‌ అధికారుల సహకారంతో గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. ఇంత పెద్దఎత్తున ఒక్కసారిగా బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేస్తే భవిష్యత్తులో పొదుపు సభ్యుల అత్యవసరాలకు డబ్బు ఎలా అందుతుంది? మెప్నా ద్వారా డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి సంక్షేమ, అభివృద్ధి పథకాలను గత ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేయగా జగన్‌ ప్రభుత్వం గత పథకాలన్నింటికీ పేర్లు మార్చిందే కానీ అభివృద్ధి ఫలాలు ఇవ్వలేకపోయింది. 


అధికార పార్టీ సభలకు మహిళలను నిర్బంధంగా తరలించటం, సభకు హాజరు కాని మహిళలకు ఫైన్లు వేయటం అన్నది ఇప్పుడు డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వ కానుకగా మారింది. సీఎం సభకు హాజరు కాకపోతే భవిష్యత్తులో వాళ్లకు లోన్లు ఇవ్వరని అధికారులే బెదిరిస్తున్నారు. ఇది ప్రభుత్వ అమానవీయ చర్య. గ్రామాలు, పట్టణాల్లోని స్వయం సహాయక గ్రూపులకు ఋణాలు ఇప్పించడంలోను, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడంలోను కీలకపాత్ర పోషించే యానిమేటర్లు తగ్గించేందుకు సర్య్కూలర్‌ 64ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి అమలు చేస్తోంది. ఒక్కో యానిమేటర్‌ పరిధిలో 30కన్నా తక్కువ సంఘాలున్న వారిని విధుల నుంచి తొలగిస్తున్నారు. ఐడీ కార్డుల పేరుతో డబ్బులు వసూలు చేయడం, డ్వాక్రా మహిళలకు కోళ్లను అంటగట్టడం వంటి చర్యలు డ్వాక్రా మహిళల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యానికి దోహదపడేలా తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను తీర్చిదిద్దితే, జగన్ రెడ్డి వాటి ఆర్థిక స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారు. అవి ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడేలా, వాలంటీర్ల పెత్తనం కింద నలిగేలా చేస్తున్నారు.

ఆచంట సునీత

తెలుగునాడు అంగన్వాడీ-డ్వాక్రా సాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు

Read more