అడుగులు తడబడనివ్వకండి, రాహుల్!

ABN , First Publish Date - 2022-09-15T10:35:46+05:30 IST

సోషల్ మీడియా అంతా రాహుల్ గాంధీ ఫోటోలతో, ఎడాపెడా కామెంట్లతో సందడిగా ఉంది. కొందరికయితే, అతను ఆపద్బాంధవుడిలాగా, దైవదూత లాగా కనిపిస్తున్నాడు....

అడుగులు తడబడనివ్వకండి, రాహుల్!

సోషల్ మీడియా అంతా రాహుల్ గాంధీ ఫోటోలతో, ఎడాపెడా కామెంట్లతో సందడిగా ఉంది. కొందరికయితే, అతను ఆపద్బాంధవుడిలాగా, దైవదూత లాగా కనిపిస్తున్నాడు. మరి కొందరు, ఉందీలే మంచీకాలం ముందూముందూనా అనీ పాడుకుంటున్నారు. ఇందులో రాహుల్ గొప్పదనం ఎంత ఉన్నదో తెలియదు కానీ, ఒక చిన్న విభిన్నత కోసం, ఒక చిన్న ఊరట కోసం భారతీయ సమాజం లేదా కనీసం అందులో ఒక భాగం ఎంతగా మొహం వాచి ఉన్నదో, ఆలంబన కాగలిగే ఆశ కోసం ఎంతగా నిరీక్షిస్తున్నదో తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏమీ బాగాలేకపోవడమే కాక, వీటికి ముగింపు కూడా కనుచూపు మేరలో కనపడడం లేదని కుంగిపోతున్న వారికి, ఇదొక ఒయాసిస్సు సమయం. నిజంగా, ఈ పాదయాత్రలో అంతటి వాగ్దానం ఉన్నదా? అభిమానుల ఆనందాతిరేకంతో పాటు, ముప్పేటగా ముసురుకుంటున్న విమర్శకుల దాడిని ఈ యాత్రికుడు అధిగమించగలడా?


రాహుల్ గాంధీ అనే నేటి రాజకీయ వ్యక్తిని ఆయన నేపథ్య చరిత్ర, సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలు, మీడియా అంతా కలసి నిర్మించాయి. గత ఎనిమిదేళ్లుగా, సకల మాధ్యమాల ద్వారా జనవశీకరణ విద్యను ప్రయోగిస్తున్న జాతీయ అధికార పార్టీ, రాహుల్ వ్యక్తిత్వాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్వచించింది. రాహుల్, ఒక నిరాసక్త మానవుడు. ఉన్నట్టుండి విదేశాలకు వెళ్లే చపలచిత్తుడు, నైట్ క్లబ్‌లో చైనా గూఢచారితో మంతనాలు చేయగల అనుమానాస్పదుడు, బాధ్యత తీసుకోవాలంటే భయపడే అర్భకుడు. పార్టీ పడవ మునిగిపోతుంటే నిమ్మకు నీరెత్తిన వేదాంతి, చాకొలేట్ బాయ్. పప్పు. ఇన్ని రకాల విశేషణాలతో సంబోధనలతో రాహుల్‌ను పక్కకు పెట్టిన ప్రధాన స్రవంతి, ఇప్పుడు ఒక్కసారిగా అతన్ని పట్టించుకోవలసి వస్తోంది. పైన చెప్పిన ఆపాదనలు కూడా, అతని దగ్గరేదో ప్రభావ శీలత ఉండబట్టే అవసరమయ్యాయి. నెహ్రూ కుదురు, గాంధీ ఇంటిపేరు. ఇందిర మనవడు, రాజీవ్ తనయుడు. కాంగ్రెస్ అనే ఒక సువిశాల సకల జనవేదికకు ఇరుసు కాగలిగిన శక్తి కలిగినవాడు. కాలం కలసిరాక, హీన స్థితికి వెళ్లినప్పటికీ ‘కాంగ్రెస్ గ్రాస్’ తిరిగి ఎప్పుడైనా మొలకెత్తగలుగుతుంది, విత్తనం మిగిలి ఉంటే.


బిజెపి భయం అదే. 2014లో మొదటిసారి గెలిచినప్పుడు, ఆ పార్టీ ఊహించలేదు, అంతటి ఘనవిజయం వస్తుందని, కాంగ్రెస్ అంతగా పడిపోతుందని. హిందూత్వను తీవ్రస్థాయికి తీసుకువెళ్ల గలిగితే, అధికారం సుస్థిరంగా కొనసాగుతుందని కూడా ఆ పార్టీ నాడు అనుకోలేదు. అట్లా అనుకుని ఉంటే, 2014 ఎన్నికల కోసం అచ్ఛేదిన్ నినాదానికి తోడు, మత అంశాలను కూడా జోడించి ఉండేది. తరువాతి ఎన్నికలలో కూడా వరుస విజయాలు సాధించాలంటే, కాంగ్రెస్‌ను మరింతగా నామమాత్రం చేయాలి కాబట్టి, కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న నినాదం తీసుకున్నది. ఆ లక్ష్యం చాలా వరకు నెరవేరింది కాబట్టి, కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్న రాష్ట్రాల మీద, ప్రాంతీయ పార్టీల మీద గురిపెట్టాలన్న తాజా వ్యూహంలోకి దిగింది. ఈ సమయంలో ఈ నేల మీద తన ప్రాసంగికతను మరొసారి పరీక్షించుకుందామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ అంటే, శేష కాంగ్రెస్. విడిచివెళ్లేవారు, వెళ్లబోయేవారు అందరూ పోగా మిగిలే కాంగ్రెస్. నూటా యాభై రోజుల ఆరోహణ యాత్రలో చివరకు రాహుల్ పక్కన, వెనుక నిలిచే వారే ఆ కాంగ్రెస్.


ప్రజల దృష్టి నుంచి చూసినప్పుడు, ప్రధాన ప్రతిపక్షం అంటూ ఒకటి, తగినంత గొంతున్నది, ఉండడం అవసరం. ఒకే పార్టీకి తిరుగులేని అధికారం ఉండడం, అది ఎడతెగకుండా కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజాసంక్షేమానికీ మంచిది కాదు. ప్రత్యామ్నాయం ఒకటి ఉండాలి అనుకున్నప్పుడు, అది కాంగ్రెస్ పార్టీయే కానక్కరలేదు. దేశంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు ఏవైనా జాతీయస్థాయికి విస్తరించవచ్చు, లేదా అనేకపార్టీలు కూటమి కట్టి అధికారపార్టీతో పోటీ పడవచ్చు. అయితే, ఇప్పటికీ సాధారణ ఎన్నికలలో అతి ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటున్న రెండో పార్టీగా కాంగ్రెసే ఉన్నది. కాంగ్రెస్‌కు మునుపటి ఎన్నికలలో 19 శాతం ఓట్లు రాగా, తరువాతి స్థానంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు 4 శాతం ఓట్లు వచ్చాయి. జాతీయ అధికారపార్టీని ఢీకొట్టగల స్థాయి తనకు మాత్రమే ఉన్నదని ఏదైనా ఒక పార్టీ చెప్పుకోవాలంటే అది కాంగ్రెసే. ఓట్ల సంఖ్య పక్కన పెట్టినా, ఎక్కువ రాష్ట్రాలలో ఉనికి కలిగిన జాతీయ పార్టీ కూడా కాంగ్రెసే. ఆ హోదాలో, విజయావకాశాలున్న ఏదైనా ప్రతిపక్ష కూటమి ఏర్పడాలంటే కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదు. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం వెనుక బిజెపి లక్ష్యం, మరొక జాతీయస్థాయి పార్టీ లేకుండా చేయడం, మిగిలిన ప్రాంతీయ పార్టీలను కూటమి కట్టకుండా లొంగదీసుకోవడం. 


అయితే, కాంగ్రెస్ శుష్కించిపోతే, ఆ స్థానాన్ని భర్తీ చేయాలని, లేదా, ఏదో కూటమితో ఒక బేరమాడగల శక్తిగా మారాలని ప్రయత్నిస్తున్న పార్టీలు లేకపోలేదు. వాటికి కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర చిరాకు పుట్టిస్తున్నది. కాంగ్రెస్ పని అయిపోయిందని కేజ్రీవాల్ గుజరాత్‌లో ప్రకటించేశాడు. బిజెపి ముందు నంగినంగిగా ఉంటూ పబ్బం గడుపుకుంటున్న ‘ఆప్’ పార్టీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకును మాత్రం కబళిస్తున్నది. ఢిల్లీ, పంజాబ్ తరువాత, ఇప్పుడు గుజరాత్. రేపు వీలయితే గోవా. రాహుల్ యాత్ర ఆరంభ సమయంలోనే, కెసిఆర్‌కు ‘జాతీయ’ ఆవేశం వచ్చింది. దేవతా వస్త్రాలను ఎవరూ ప్రశ్నించరు కాబట్టి సరిపోయింది కానీ, కెసిఆర్ జాతీయ ప్రయత్నాలకు అర్థమే లేదు. ఆయన దేశరాజకీయాలలోకి వెడుతున్నారా, జాతీయ పార్టీ పెడుతున్నారా? పార్టీ పెట్టకుండా కూడా జాతీయ రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించవచ్చు. ఎన్టీయార్ భారతదేశం పార్టీ ఆలోచనను విరమించుకున్నాక కూడా నేషనల్ ఫ్రంట్ నాయకుడిగా జాతీయ పాత్ర పోషించారు. అఖిల భారత అన్నాడిఎంకె వలె నామమాత్రపు జాతీయపార్టీ అయితే ఉపయోగమేమిటి? ఇతర జాతీయ పక్షాల నడుమ మాత్రం తెలంగాణ జాతీయపార్టీకి దొరికే అదనపు ప్రతిపత్తి ఏమిటి? తమ పార్టీ నేతల చేతనే ప్రకటనలు ఇప్పించుకుని జాతీయపార్టీ పెట్టాలనుకోవడం హాస్యాస్పదంగా ఉన్నది. చివరకు ఒక్కడు, పాపాల భైరవుడు, పక్కరాష్ట్రం నుంచి కుమారస్వామి గౌడ వచ్చి, జాతీయపార్టీ పెట్టమని ప్రోత్సహించాడు, అంతే తప్ప, ఆ పార్టీలో తాను చేరతానని అనలేదు. ఇద్దరూ కూర్చుని, మధ్యలో కాంగ్రెస్‌ను విమర్శించారు. ప్రత్యామ్నాయం కాగలిగిన శక్తి కాంగ్రెస్‌కు పోయిందట. పాదయాత్ర, కర్ణాటక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని తప్ప, బిజెపిపై పోరులో కాంగ్రెస్ వేట ఎందుకు? ప్రాంతీయ పార్టీలు అన్నీనో కొన్నో ఒక జట్టుగా ఏర్పడితే కూడా, కేంద్రం దూకుడును నిరోధించవచ్చును అనుకున్నా, కాంగ్రెస్‌ను విడిచిపెట్టడానికి శరద్ పవార్, స్టాలిన్, తేజస్వి, కొత్తగా నితిశ్ ఎవరూ సిద్ధంగా లేనప్పుడు, ఈ ‘జాతీయ’ ప్రయత్నాలు సందేహాస్పదం అవుతాయి, అనుమానాస్పదం కూడా అవుతాయి.


పాదయాత్రకు కార్పొరేట్ జాతీయ మీడియా కూడా ఎంతో కొంత ప్రచారం ఇవ్వక తప్పనిస్థితి ఏర్పడడంతో, ప్రత్యర్థులకు వెనువెంటనే ప్రతికథనాలు రూపొందించక తప్పడం లేదు. బుధవారం నాడు మోదీ మీద రాహుల్ ‘చైనా విమర్శ’ చేసిన వెంటనే విరుగుడుగా బిజెపి గోవాలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మింగింది. ప్రజలతోను, వాస్తవికతతోనూ సంబంధం లేని రాచబిడ్డ అని నిన్న నిందించినవారే ఇప్పుడు, రాహుల్ యాత్ర అవసరమా అని దీర్ఘాలు తీస్తున్నారు. రాహుల్ రానున్న ఐదు నెలల పాటు రోడ్ల మీద ఉంటాడని, ప్రతిరోజూ వార్తలలో ఉంటాడని గమనించినప్పుడు, పర్యవసానాలను అంత తేలికగా తీసిపారేయలేము. అన్నిటికి మించి, ఇది భారత్ జోడో యాత్ర. ఎన్నికల యాత్ర కాదు. గుజరాత్‌లో యాత్ర ఎందుకు లేదు, యూపీలో రెండు రోజులే ఎందుకు అని ప్రశ్నిస్తున్నవారు, దీన్ని ఎన్నికల సన్నాహక యాత్ర అనుకుంటున్నారు. కానీ, రాహుల్ గాంధీ తాను ఈ యాత్రను ఒక విలువను, సందేశాన్ని ప్రచారం చేయడానికి ఉద్దేశించినట్టు చెబుతున్నారు. ఆ సంకల్పం మంచిది. ప్రధాని నరేంద్రమోదీ జనంలో సంచరించరని, విలేఖరులను ముఖాముఖి కలుసుకోవడానికి కూడా సంకోచిస్తారని తెలుసు. అటువంటప్పుడు, ఒక రాజకీయ నాయకుడు జనం మధ్యలో ఇంత సుదీర్ఘకాలం మెలగడం, సంభాషించడం తప్పనిసరిగా ప్రత్యేకమే. జనంతో ప్రత్యక్ష సాన్నిహిత్యం, రకరకాల మీడియా సృష్టించే అభిప్రాయాలను దాటి జనంలో నాటుకుంటుందని చరిత్ర చెబుతుంది.


రాజకీయార్థిక విధానాలలో తన ప్రత్యేకత ఏమిటో ఈ యాత్రలో రాహుల్ చెప్పాలి. ఇతరులకు భిన్నమైనవే కాదు, తన పార్టీ పాత విధానాలకు భిన్నమైనవి తానేమి ముందుకు తెస్తాడో చెప్పాలి. ఆశించినంత తేడా ఏమీ ఉండదని, అంతిమంగా ఆశాభంగాలు తప్పవనీ అనిపించవచ్చు కానీ, ప్రయత్నాల మధ్యనే ప్రస్థానం సాగుతుంది. భ్రమో, ఆశో లేకపోతే రేపటిలోకి ప్రయాణమే ఉండదు. విభజన రాజకీయాలను, విద్వేష సాంస్కృతిక వాతావరణాన్ని వ్యతిరేకించడంతో పాటు, రాహుల్ సానుకూల, నిర్మాణాత్మక ప్రతిపాదనలు ఏమిటో చెప్పాలి. అసమ్మతి మీద, జనాందోళనల మీద తొక్కిపెట్టిన ఉక్కుపాదాన్ని తొలగిస్తానని చెప్పాలి. ఇవన్నీ ఎన్నికల వాగ్దానాల్లాగా చెప్పనక్కరలేదు, ప్రజాస్వామిక ఆకాంక్షలుగా గుర్తించి యాత్రలో ప్రచారం చేయాలి. యాత్ర సాగుతుంటే, హీన రాజకీయ ప్రకటనలు కాకుండా ఉదాత్తమైన విలువల గురించి సంభాషిస్తుంటే, ప్రజావ్యతిరేక పరిణామాలను నిలదీస్తుంటే, గాలి అదే మళ్లుతుంది. పార్టీలో కూడా తాలూతప్పా చెదిరిపోతుంది. విద్యావంతులు, సంస్కారవంతులు, ద్వేషరాజకీయాలను వాంఛించనివారు, అభాగ్యులు, బాధితులు తన మీద పెట్టుకున్న ఆశలను గుర్తించి ముందుకు నడిస్తే, 1970లలో జయప్రకాశ్ నారాయణ్ అంత ప్రభావశాలి అవుతారు. జాతీయోద్యమం నాటి కాంగ్రెస్ వారసత్వానికి అర్హత సంపాదిస్తారు. చరిత్ర ఇస్తున్న అవకాశం ఇది.


కె. శ్రీనివాస్

Read more