ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి నష్టం చేయవద్దు!

ABN , First Publish Date - 2022-11-11T00:53:43+05:30 IST

ఈ నెల 12వ తేదీన మన ప్రధానమంత్రి తెలంగాణలోని రామగుండం పట్టణంలో ప్రతిష్ఠాత్మకంగా పునరుద్ధరించిన ఎరువుల కర్మాగార ప్రారంభోత్సవానికి వస్తోన్న...

ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి నష్టం చేయవద్దు!

తెలంగాణ శ్రేయోభిలాషుల బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి,

ఈ నెల 12వ తేదీన మన ప్రధానమంత్రి తెలంగాణలోని రామగుండం పట్టణంలో ప్రతిష్ఠాత్మకంగా పునరుద్ధరించిన ఎరువుల కర్మాగార ప్రారంభోత్సవానికి వస్తోన్న సందర్భంగా తెలంగాణ సీఎంగా మీరు స్వాగతం పలికి, ఆ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ ప్రజల గౌరవం పెరుగుతుందని మేము భావిస్తున్నాము. తెలంగాణ రైతుల పాలిట కల్పతరువైన ఈ ఎరువుల కర్మాగారం మన రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల రైతులకు అవసరమైన ఎరువులను తెలంగాణ గడ్డ నుంచి ఉత్పత్తి చేయడం మనందరికీ గర్వకారణం. రెండు దశాబ్దాల క్రితం మూతపడ్డ ఎరువుల కర్మాగారాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడితో పునరుద్ధరించి, జాతికి అంకితం చేస్తున్న శుభతరుణం తెలంగాణ ప్రజలందరికీ గర్వించదగ్గరోజు.

ప్రధానిగా నరేంద్ర మోదీ దేశంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు ఎరువుల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడానికి, విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పునరుద్ధరించిన ఎరువుల కర్మాగారాలలో రామగుండం ఒకటి. ఒక దశాబ్దం క్రితం వరకు రోజుల తరబడి రైతన్నలు ఎండనక, వాననక పడిగాపులు కాసి బ్లాక్ మార్కెట్‌లో ఎరువులను అధిక ధరలకు కొన్న దుర్భర పరిస్థితి నుంచి తెలంగాణ రైతాంగానికి అవసరమైన, నాణ్యమైన ఎరువులు మన దగ్గరే ఉత్పత్తి అయి, సకాలంలో తక్కువ ధరకు ఇవ్వగలిగే అద్భుత స్థాయికి చేరడం మనందరికీ గర్వకారణం.

మరిన్ని నిధులు, కర్మాగారాలు, కేంద్ర విద్యాసంస్థలను తెలంగాణకు తెచ్చుకునేందుకు ప్రధానితో కలిసి చర్చించే అవకాశాన్ని, ప్రజాముఖంగా ప్రధానిని అడిగే అవకాశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దని తెలంగాణ ప్రజానీకం తరఫున విన్నవించుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందనేది మా ప్రగాఢ విశ్వాసం. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి వల్ల తెలంగాణ ప్రజానీకానికి ఒనగూరే ప్రయోజనం లేకపోగా, కేంద్రం నుంచి రావాల్సిన, తెచ్చుకోవాల్సిన అనేక నిధులు, ప్రాజెక్టులు ఆలస్యమవడం వల్ల నాలుగు కోట్ల మన తెలంగాణ ప్రజలే నష్టపోతారని మీకు తెలియని విషయం కాదు.

ప్రభుత్వ అధికారిక అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా లేదా హాజరు కాకపోవడం ద్వారా జరిగే నష్టాన్ని, భవిష్యత్తులో ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులను కోరి తెచ్చుకోవడం అవసరమా? రెండు పార్టీల మధ్య జరిగే రాజకీయ విభేదాలను రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రెండు ప్రభుత్వాల మధ్య రుద్దడం ద్వారా నష్టపోయేది కూడా మన తెలంగాణ సకల జనులే.

కరిగిన కాలం తిరిగి రాదు. అనవసరపు పట్టింపుల వల్ల చేజేతులా మనమే ప్రజల భవిష్యత్తును అనవసరపు రాజకీయాలకు బలి చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని స్వాగతిద్దాం. తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి బుద్ధిజీవులుగా మేం మీకు సహకరిస్తాం. కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల భవిష్యత్తును నష్టపర్చొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ మేధావులుగా ఈ సిద్ధాంత రాద్ధాంతాన్ని పక్కన పెట్టి ఉద్యమంలో కలిసి పనిచేశాం. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణలో ప్రజాస్వామ్యం మరింత పరిఢవిల్లాలంటే భారత రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు అధికారం కోసం జరిపే ఎత్తులు పైఎత్తులలో తెలంగాణ ప్రజలను బలి చేయొద్దని మిమ్మల్ని కోరుతున్నాం.

బట్టు సత్యనారాయణ, వినోద్ అగర్వాల్,

ఎల్. వి. సుబ్రహ్మణ్యం, కృష్ణప్రసాద్, ఎ. నరసింహారెడ్డి, సి.ఉమామహేశ్వరరావు, చంద్రవదన్,

ఎస్. సత్యనారాయణ, వీరబాబు తదితరులు

Updated Date - 2022-11-11T00:53:53+05:30 IST