దళిత మహిళ గళమెత్తే సందర్భం!

ABN , First Publish Date - 2022-11-25T02:29:03+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నారు. కానీ మన దేశంలో ప్రభుత్వాలు దాని ప్రాధాన్యతను సవ్యంగా గుర్తించటం లేదు...

దళిత మహిళ గళమెత్తే సందర్భం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నారు. కానీ మన దేశంలో ప్రభుత్వాలు దాని ప్రాధాన్యతను సవ్యంగా గుర్తించటం లేదు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి స్త్రీలపై జరుగుతున్న హింసను రూపుమాపడం కోసం నవంబర్‌ 25 నుంచి డిసెంబరు 10 వరకు 16 రోజుల పాటు అంతర్జాతీయ ప్రచారోద్యమాన్ని రూపొందించింది. దీన్ని ‘16 days activism’ అని పిలుస్తున్నారు. ఈ పదహారు రోజుల్లో ‘స్త్రీలపై హింసను రూపుమాపేందుకు అంతర్జాతీయ దినోత్సవం’గా (International Day for Elimination of Violence Against Women) జరుపుకొనే మొదటి రోజు నవంబరు 25వ తేదీ, ‘మానవ హక్కుల దినోత్సవం’ (Human Rights Day)గా జరుపుకొనే ఆఖరి రోజు డిసెంబరు 10వ తేదీ కీలకమైనవి. ఈ పదహారు రోజుల ప్రచారోద్యమం చాలా ప్రత్యేకమైనది అయినప్పటికీ మన దేశంలో దీనికి ఎక్కడా ప్రాధాన్యత కనిపించటం లేదు. కారణం స్త్రీలపై హింసను రూపుమాపడంలో మన ప్రభుత్వాలకు ఉన్న నిర్లక్ష్యమే.

స్త్రీల స్థితిగతులు మారాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగు పడాలన్నా, స్త్రీ పురుష సంబంధాలు స్నేహపూరిత సంబంధాలుగా ఉండాలన్నా, అసమానతలు, అంటరానితనం పోయి సమసమాజ స్థాపన జరగాలన్నా, విలువలతో కూడిన రాజ్యాంగం అమలు కావాలి. మహనీయుడు అంబేద్కర్‌ ఆలోచనా విధానమే శరణ్యంగా ప్రజలను చైతన్య పరచడం, అవగాహన కల్పించడం ఒక్కటే ఇందుకు మార్గం. అందుకే ఐక్యరాజ్యసమితి ఇచ్చిన పిలుపు మేరకు ‘దళిత స్త్రీ శక్తి’ నవంబరు 25వ తేదీ నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో, పది జిల్లాల్లోని గ్రామాల్లో, వాడల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మానవహారాల రూపంలో కార్యక్రమాలను రూపొందించింది. దీనిలో భాగంగా ఈ నెల 25న లక్డీకాపూల్‌, హైదరాబాదులోని అంబేడ్కర్ రిసోర్స్‌ సెంటరులో ఈ సంవత్సరం జరిగిన 30 హింసాత్మక సంఘటనల్లోని బాధితులను, సాక్షులను ప్రభుత్వ అధికారులు, కమీషన్లు, ప్రొఫెసర్లు, లాయర్లు, వివిధ సంఘాల నాయకులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో హాజరు పరిచి లీగల్‌ క్లినిక్‌ పేరుతో ప్రారంభ సభను నిర్వహిస్తుంది. డిసెంబర్‌ 10న విజయవాడ ప్రెస్‌ క్లబ్బులో మానవ హక్కుల దినోత్సవం రోజు ముగింపు సభ జరుగుతుంది. భావసారూప్యం కలిగిన వ్యక్తులు, సంఘాలు ఈ ప్రచారోద్యమంలో పాల్గొని దళిత ఆదివాసీ స్త్రీలపైన, బాలికలపైన జరుగుతున్న హింసను రూపుమాపాలని ప్రతిజ్ఞ చేద్దాం.

ఝాన్సీ గెడ్డం

జాతీయ కన్వీనర్‌, దళిత స్త్రీ శక్తి

Updated Date - 2022-11-25T02:29:03+05:30 IST

Read more