దళిత చరిత్రకు ఒక మ్యూజియం కావాలి

ABN , First Publish Date - 2022-07-28T10:23:40+05:30 IST

తనచరిత్రను తాను చదువుకుంటున్నప్పుడు ధరిత్రికి కేవలం నవ్వు మాత్రమే వస్తుందా, కవి చెప్పినట్టు ‘‘తన గాధను తనె స్మరించి భోరున’’ ఏడుస్తుంది కూడా....

దళిత చరిత్రకు ఒక మ్యూజియం కావాలి

తనచరిత్రను తాను చదువుకుంటున్నప్పుడు ధరిత్రికి కేవలం నవ్వు మాత్రమే వస్తుందా, కవి చెప్పినట్టు ‘‘తన గాధను తనె స్మరించి భోరున’’ ఏడుస్తుంది కూడా. మానవచరిత్ర ఎంతటి ఉత్కృష్టమైనదో అంతటి నీచమైనది, దుర్మార్గమైనది. సాటి మానవుల రక్తమాంసాలతోనే, కంకాళాలతోనే, అవమానాలతోనే ఈ నాగరికతా సౌధాల పునాదులు నిర్మాణమయ్యాయి. కిరీటాలను, విజయకేతనాలను పెట్టినట్టు, మన చీకటి చరిత్రను ప్రదర్శనకు పెట్టగలమా? ఒక సమాజం, ఒక దేశం నిలువుటద్దం ముందు నిలబడి తనను తాను చూసుకోగలదా?


మ్యూజియాలకు, మాన్యుమెంట్లకు పేరుపొందిన వాషింగ్టన్ డీసీలో, ఆఫ్రికన్ అమెరికన్ల చరిత్ర సంస్కృతుల మ్యూజియాన్ని చూసినప్పుడు, ఈ ప్రశ్నలన్నీ మరోసారి దాడిచేశాయి. గతంలో మూలవాసీ అమెరికన్ల మ్యూజియంను చూసినప్పుడు, కొలంబస్ నుంచి మొదలుపెట్టి యూరోపు శ్వేతజాతీయులు దేన్ని మరుగుపరచి దేన్ని కనిపెట్టారో, దేన్ని తుడిచిపెట్టి దేన్ని నిర్మించారో తెలిసి, దుఃఖం ఉబికివచ్చింది. మూలవాసుల చర్మాన్ని వలుచుకున్నట్టు బంగారాన్ని వలుచుకుని పోయారు. నిలబడ్డ నేల నుంచి, మరణం అంచుల దాకా తరిమి తరిమి కొట్టారు. యూదుల మీద హిట్లర్ సాగించిన జాతిహననాన్ని ప్రదర్శించే ‘హోలోకాస్ట్ మ్యూజియం’లో వలె అది భయభ్రాంత ఆక్రోశమో, వెంటాడి వెంటాడి బాధాగ్నిని ప్రజ్వరిల్లజేసే అశ్రుగీతమో కాదు. లాభం, స్వార్థం, స్వర్ణం రథచక్రాల కింద నలిగిపోయి సమసిపోయిన మూలవాసుల మూలుగులు మనసు పెట్టి ఆలకిస్తే తప్ప వినిపించవు.


యూదు హననం దుర్మార్గమైన చరిత్రే, కానీ, దానికి కర్త అమెరికా కాదు. పైగా, ఆ దుర్మార్గం మీద గెలిచిన విజేతలలో అమెరికా కూడా ఉన్నది. గత బాధిత చరిత్రతో యూదు రాజ్యం, యూదు మిత్ర రాజ్యమూ ఏమి చేస్తున్నాయో ప్రస్తావించకుండా హోలోకాస్ట్ మ్యూజియం మౌనం వహిస్తుంది. అనేక మంది సందర్శకులు, బహశా అధికులు యూదులు, గుండెలు బాదుకుంటూ, రోదిస్తూ మ్యూజియం నుంచి వెలుపలికి నడుస్తుంటారు. కొందరు మాత్రం, పాలస్తీనాతో కలుపుకుని కన్నీటిని బరువెక్కించుకుంటారు. 


యూదు హనన ప్రదర్శనశాల కంటె మూలవాసీ మ్యూజియంలో మరింత నిజాయితీ కనిపిస్తుంది. ఉండవలసినంత తీవ్రత, ఉద్వేగశీలత మ్యూజియం నిర్మాణంలో లేదేమో కానీ, తమ పూర్వీకుల దుర్మార్గాన్ని మరుగుపరచడానికి ప్రయత్నం కనిపించదు. మూలవాసులు ఇప్పుడు అమెరికాలో అతి తక్కువ మంది మిగిలారు. రాజకీయాలను ఏ రకంగానూ ప్రభావితం చేయగలిగే సంఖ్యలో లేరు. నైతికంగా కూడా, నేటివ్ అమెరికన్ల శక్తి పరిమితం. 1992లో ముప్పై ఏండ్ల కిందట, కొలంబస్ రాకడకు 500 సంవత్సరాలైన సందర్భంగా, చరిత్రను పునర్దర్శించాలనే డిమాండ్ బలంగా వచ్చింది. కొలంబస్ తెల్లవారికి మూలపురుషుడు కావచ్చును కానీ, యూరోపియన్ల కోసం అమెరికాను ‘కనిపెట్టిన’వాడు కావచ్చను కానీ, అతను మూలవాసులకు హంతకుడేనన్న వాదన, అమెరికన్ సామాజిక వేదికల మీద దద్దరిల్లింది. కానీ, అది బుద్ధిజీవుల అవగాహనను మూలవాసుల పట్ల సున్నితత్వాన్ని పెంచింది కానీ, భౌతికంగా పెద్ద సాధించింది లేదు. బిల్ క్లింటన్ 1993లో అప్పటికి వందేళ్ల కిందట హవాయి మూలవాసుల రాజరిక పాలనలో అమెరికా కల్పించుకున్నందుకు అధికారిక క్షమాపణ కోరారు. దానికే శ్వేతజాతీయుల నుంచి, ముఖ్యంగా రిపబ్లికన్స్ నుంచి పెద్ద అభ్యంతరం వచ్చింది. మొత్తంగా మూలవాసీ అమెరికన్లకు అమెరికా ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పే తీర్మానాలు ఒబామా కాలంలో ప్రవేశపెట్టారు కానీ, అవి కడదాకా సాగలేదు. ఉదారవాదుల, ప్రగతిశీలుర ప్రయత్నాలే తప్ప మూలవాసులు జనసంఖ్య రీత్యా కానీ, ఇతర ప్రాబల్యాల రీత్యా కానీ శక్తిశాలురు కారు. బానిస వ్యాపారానికి, నల్లవారితో అమానుషంగా వ్యవహరించడానికి చర్చి కల్పించిన ఆమోదం, ప్రోత్సాహం చిన్నవి కావు. పోప్ ఫ్రాన్సిస్ సోమవారం నాడు కెనడాలో మాట్లాడుతూ మూలవాసీల విషయంలో చర్చి అన్యాయంగా వ్యవహరించినందుకు క్షమాపణ కోరారు.


ఆఫ్రికన్ అమెరికన్ల పరిస్థితి అది కాదు. బానిసత్వం, వర్ణవివక్షలలో కూడా నైతిక అంశం ఉన్నది కానీ, పదిశాతానికి మించిన జనాభాతో ఆఫ్రికన్ అమెరికన్లు బలమైన మైనారిటీలు కావడం, అంతర్జాతీయమైన ఉనికి కలిగిన జనవర్గం కావడం, తమ సగౌరవ అస్తిత్వం కోసం పోరాడుతూ రావడం– వారిని ఒక శక్తిగా మలచాయి. గత మూడు దశాబ్దాలలో ఆఫ్రికన్ అమెరికన్ల అస్తిత్వ చైతన్యం, పోరాట పటిమ, సామాజిక భాగస్వామ్యం గణనీయంగా పెరిగాయని చెప్పవచ్చు. అందుకు ఒకానొక సంకేతం, ఫలితం ఆఫ్రికన్ అమెరికన్ చరిత్ర సంస్కృతుల ప్రదర్శనశాల.


బానిసత్వం నుంచి, మనుషులను అమ్మి కొనే పద్ధతి నుంచి లాభపడడమే కాదు తన ఉనికే నిర్మితమయిందని, నల్లవారి చెమటారక్తమూ నేటి సంపన్నతకు కారణమయ్యాయని అంగీకరిస్తూ, అమెరికా నాలుగు వందలేళ్ల తన హీనచరిత్రను తానే ప్రదర్శించుకునే చోటు ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియం. వివిధ యూరోపియన్ దేశాలు అమెరికా స్వర్ణఫలాన్ని అందుకోవడానికి ఎగబడి, అందుకు అవసరమైన శ్రమశక్తి కోసం ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల నుంచి, ముఖ్యంగా పశ్చిమ తీరదేశాల నుంచి నల్లవారిని అపహరించి నౌకలలో తరలించారు. ఆఫ్రికన్ల తరలింపు, ఆఫ్రికన్ల బానిసకాలం, బానిసత్వం తొలగిన తరువాత కూడా తెల్లవారికి నల్లవారికి నడుమ అనేక సామాజిక అగాధాలున్న కాలం, నల్లవారి పోరాటచైతన్యం పెరిగిన కాలం, సమాజంలోని వివిధ క్షేత్రాలలో భాగస్వామ్యం పెరుగుతూ ఉన్నకాలం.. ఇటువంటి విభజనతో అద్భుతమైన అమరికతో, నిర్మాణ కౌశలంతో, దృశ్య శ్రవణ సాధనాల సమ్మేళనంతో, అన్నిటికీ మించి ఒక సజీవత, ఆర్తితో రూపొందించిన ఈ ప్రదర్శనశాలను చూసిన భారతీయులెవరికైనా కలగవలసిన ఆకాంక్ష, మన దేశంలో ఇటువంటిది ఎందుకు ఉండకూడదు? అవర్ణ, చండాల, అస్పృశ్య, దళిత చరిత్రను ఎందుకు ప్రదర్శించకూడదు? మన ముఖాన్ని మన అద్దంలో చూసుకునే ధైర్యం మనకు లేదా? పోప్ ఫ్రాన్సిస్ లాగా, మన దేశంలోని వర్ణ వ్యవస్థ రక్షకులు, పీఠాధిపతులు దళితులకు, బహుజనులకు క్షమాపణ చెప్పవలసిన రోజు రాలేదా?


భారతదేశంలోని వర్ణ వ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలను, దాని దౌష్ట్యాన్ని, అమానుషత్వాన్ని, దళితుల చారిత్రక దీనస్థితిని, వారి చైతన్యాన్ని, పోరాటాలను, పురోగమనాన్ని చిత్రించే ఒక ప్రదర్శనశాల కావాలి. అది మన సామాజిక చరిత్రను మనకు నలుపుతెలుపులలో పరిచయం చేయగలగాలి. విద్యార్థులకు కొత్త ఎరుకను ఇవ్వాలి. బాధితులకు స్ఫూర్తిని, పీడకులకు భయాన్ని కలిగించాలి. చరిత్రలో దేనికి గర్వపడాలో, దేనికి సిగ్గుపడాలో నేర్పాలి. సమాజం తలదించుకోవలసిన అత్యాచారాలను హత్యాచారాలను పటం కట్టాలి. ఒక పశ్చాత్తాపస్వరంతో భవిష్యత్తు మీద ఆశను పలికేట్టు ఉండాలి. ఈ దేశనిర్మాణంలో భాగస్వాములైన దళిత తత్వవేత్తలు, ఉద్యమకారులు, నాయకులు ఇచ్చే సందేశాలతో ఆ ప్రదర్శన మారుమోగాలి.


బాబా సాహెబ్ అంబేడ్కర్‌ స్మారకాల గురించి అనేక మంది డిమాండ్ చేస్తుంటారు, ప్రభుత్వాలూ ఎత్తైన విగ్రహాల స్థాపన గురించీ వాగ్దానాలు చేస్తుంటాయి, ఎందుకంటే, విగ్రహాల నిర్మాణం సాపేక్షంగా సులువు. మ్యూజియం ఏర్పాటు, ఎంతో బౌద్ధికమైన, సాంకేతికమయిన ప్రయత్నం అవసరమైనది. ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియం ప్రణాళికారచనలో అందరూ నల్లవారే పాల్గొన్నారట. అంబేడ్కర్‌ కృషిని, దోహదాన్ని అమితంగానే గౌరవిస్తూనే, చెప్పవలసిందేమిటంటే, చరిత్రలో మహా వ్యక్తులు భాగమే తప్ప, వ్యక్తులే చరిత్ర కాదు. అంబేడ్కర్‌ జీవిత చిత్రణతో, ఆయన గ్రంథాలయంతో, ఆయన ఉపయోగించిన వస్తువులతో ఒక జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయవలసిందే. అటువంటి మ్యూజియంలో కూడా దేశ సామాజిక నిర్మాణం గురించి, దళిత ఉద్యమ చరిత్ర గురించి ఉండాలి. దళిత మ్యూజియం పరిధి, మహా నాయకుల స్మారకాల కంటె విస్తృతమైనదిగా, చారిత్రకమైనదిగా ఉంటుంది. జాతీయ స్థాయిలో దళిత మ్యూజియం ఏర్పడితే, అందులో అంబేడ్కర్‌ కోసం ఒక అంతస్థు అంతా ప్రత్యేకమైన గేలరీ ఉండి తీరుతుంది.


జూనియర్ బుష్ హయాంలోనే సంకల్పం, నిర్మాణం మొదలై, ఒబామా కాలంలో ప్రారంభమైన ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియంను చూసి మునుపే అనేకులు దళిత మ్యూజియం ప్రతిపాదన చేశారు. అంతేకాదు, వాషింగ్టన్ మ్యూజియానికంటె ముందే 2007లో మొదలైన బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో ఏర్పాటయిన అంతర్జాతీయ బానిసత్వ ప్రదర్శనశాలను చూసి, మన దేశంలో ప్రదర్శనశాలల నిపుణులు కొందరు దళిత మ్యూజియం ప్రతిపాదన చేశారు. నేపాల్‌లో ఒక స్వచ్ఛంద సంస్థ ఒక గ్రామంలో చిన్న దళిత మ్యూజియంను నిర్వహిస్తోంది. దళిత మ్యూజియం నిర్మాణంలో ముఖ్యమైన అంశాలు, మౌఖిక చరిత్రలు. సజీవులుగా ఉన్న సీనియర్ సిటిజన్ల నుంచి దళిత అనుభవాలను మునుపటి కాలంవి కూడా సేకరించే అవకాశం ఉంది. కాలం గడుస్తున్న కొద్ది కొన్ని చారిత్రక అనుభవాలు కోల్పోతాము.


దళిత మ్యూజియమే కాదు, మన సామాజిక చరిత్రకు సంబంధించిన అనేక అంశాలపై చారిత్రక ప్రదర్శనశాలలు అవసరం. ప్రధానంగా, పురావస్తు సంచయంతో మన దగ్గర ప్రదర్శనశాలలు నిర్మిస్తున్నారు. చారిత్రక, పురాతత్వ స్థలాలలోనూ అక్కడి విశేషాలను ప్రదర్శిస్తున్నారు. కానీ, భారతీయ సమగ్ర చరిత్రను చెప్పే మ్యూజియంలు లేవు. కొన్ని అటవీ ప్రాంతాలలో ఉన్న గిరిజన ప్రదర్శనశాలల్లో విల్లంబులు, వాయిద్యాలు, కట్టు బొట్టు వంటి అంశాలనే తప్ప చారిత్రక అవగాహన కల్పించేవాటిని చేర్చడం లేదు. దేశవిభజనకు సంబంధించిన ప్రదర్శనశాల నిర్మాణం చురుకుగా సాగుతోంది. అంతటి సున్నితమైన అంశం మీద కూడా మ్యూజియంలను ఏర్పాటు చేయగలుగుతున్నప్పుడు, దళిత మ్యూజియం నిర్మించడానికి సంకోచం ఎందుకు? దళిత, ఆదివాసీ రాష్ట్రపతులను ఎంపిక చేసి, ప్రపంచానికి ప్రదర్శిస్తున్నప్పుడు, చరిత్ర మేడిపండును విప్పి చూపడానికి వెనుకాడడమెందుకు?-‘‘మనమిప్పుడు పైపూతలు లేని నిజాలను చెప్పవలసి ఉన్నది’’ (జాన్ హోప్ ఫ్రాంక్లిన్, 2005, ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియంలో ప్రదర్శించిన ఒక ఉటంకింపు).


కె. శ్రీనివాస్

Updated Date - 2022-07-28T10:23:40+05:30 IST