కాప్ 27 తిరోగమన బాట!

ABN , First Publish Date - 2022-12-09T00:51:21+05:30 IST

వాతావరణ మార్పును నిరోధించడంలో ప్రపంచం ‘కొంత’ పురోగతిని సాధించిందని చెప్పడం దుస్సాహసమే అవగలదు. నిజానికి అలా చెప్పడమనేది...

కాప్ 27 తిరోగమన బాట!

వాతావరణ మార్పును నిరోధించడంలో ప్రపంచం ‘కొంత’ పురోగతిని సాధించిందని చెప్పడం దుస్సాహసమే అవగలదు. నిజానికి అలా చెప్పడమనేది నైరాశ్యానికి ఒక ఆనవాలు కూడా.... గత నెలలో పక్షం రోజుల పాటు ఈజిప్షియన్ రేవు నగరమైన షర్మ్ ఎల్–షేక్లో అట్టహాసంగా జరిగిన ఐక్యరాజ్యసమితి వార్షిక వాతావరణ సదస్సు గురించి పై విధంగా కాకుండా మరెలా వ్యాఖ్యానించగలం?

మానవాళి శ్రేయస్సుకే కాకుండా ఈ ధరిత్రిపై జీవకోటి మనుగడకు అపార నష్టాన్ని కలుగజేస్తున్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు దోహదం చేసే మార్గాలను కనుగొనేందుకై 1995 నుంచి ఏటా (కొవిడ్ కారణంగా 2020లో మినహా) జరుగుతున్న అంతర్జాతీయ సంప్రతింపుల చర్చల చరిత్రలో కాప్ 27 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ – యునైటెడ్ నేషన్స్ ఫ్రేం వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్పై సంతకం చేసిన దేశాలు) ఒక చెత్త సదస్సుగా మిగిలిపోనున్నదనేది ఒక చేదు వాస్తవం. ఎడారిలో ఎండమావి వలే గోచరించిన అద్భుత సమావేశమది. మానవ మనుగడకే వాటిల్లుతున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో కాప్ సదస్సుల ద్వారా ఇంతవరకు సాధించిన స్పల్ప పురోగతిని సైతం నిష్ప్రయోజనం చేసిందనే అపకీర్తిని కాప్ 27 మూట కట్టుకోవడం ఖాయం. ఈ సదస్సుకు హాజయిన 45 వేల మందిలో నేనూ ఒకరిని. సంప్రతింపులు లక్ష్య సాధకంగా కాకుండా ఉండేలా సదస్సును నిర్వహించారనే భావన కలిగింది. ఇది నాకు తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది. సదస్సు నిర్వాహకులు– ఐక్యరాజ్యసమితి, ఆతిథేయి దేశం ఈజిప్ట్ ప్రభుత్వం– దేశాల వారీగా, పర్యావరణ సంస్థల వారీగా వందలాది మండపాలను ఏర్పాటు చేశారు. ప్రతి దానిలోనూ ఒక సమావేశ హాలు ఉన్నది. ప్రతిరోజూ ఆ హాలులో ఐదారు సమావేశాలు జరిగాయి. ప్రతి సమావేశంలోనూ ముప్పై నుంచి యాభై మంది ప్రతినిధులు హాజరయ్యేవారు. ప్రతీ రోజూ ప్రతీ చోటా ఎంతో సందడిగా ఉండేది. అయితే సదస్సు ప్రధాన లక్ష్యమైన సంప్రతింపులు దాదాపుగా అప్రధానమైపోయాయి. ఇక అవి ప్రభుత్వాలను ఎలా ప్రభావితం చేయగలుగుతాయి. ఒక సమున్నత లక్ష్య సాధనకు సమైక్యంగా ముందుకు సాగేలా ఎలా పురిగొల్పగలుగుతాయి? కాప్ 27 తుది నిర్ణయాలు అసలు నిర్ణయాలే కావు. లేదా, నిక్కచ్చిగా చెప్పాలంటే అవి పూర్తిగా తిరోగామి నిర్ణయాలు. అయితే ఈ వాస్తవాన్ని ఎలుగెత్తిచాటేందుకు మనకు ధైర్యం లేదు. ఉదాహరణకు కాప్ 27 సాధించిన గొప్ప పురోగతిగా చెప్పబడుతున్న నష్టం, హాని (లాస్ అండ్ డ్యామేజ్) అంశాన్నే తీసుకోండి.

అభివృద్ధి చెందిన దేశాల కారణంగా వాటిల్లుతోన్న వాతావరణ మార్పులతో వర్ధమాన దేశాలకు ఆర్థికంగా సంభవిస్తోన్న అపార నష్టాల పట్ల ‘షర్మ్ ఎల్–షేక్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పేద దేశాలకు ఆ నష్టాలను నివారించేందుకు ఒక సంస్థాగత యంత్రాంగాన్ని నెలకొల్పనున్నట్లు అది పేర్కొంది. తద్వారా వాతావరణ మార్పులతో ప్రతికూలంగా ప్రభావితమవుతున్న పేద దేశాలకు ఆర్థిక ఉపశమనంతో పాటు సాంకేతికతా సహాయం కూడా లభిస్తుందని ఆ ‘ఇంప్లిమెంటేషన్ ప్లాన్’ పేర్కొంది. అయితే ప్రతిపాదిత సంస్థాగత ఏర్పాటుకు అవసరమైన సెక్రటేరియట్ను నెలకొల్పేందుకు సకల సదుపాయాలను సమకూర్చే దేశాన్ని 2023లో ఎంపిక చేస్తామన్న ఒక్క ‘నిర్ణయాన్ని’ మాత్రమే కాప్ 27 తీసుకున్నది.

వాతావరణ మార్పులకు అమితంగా నష్టపోతున్న పేద దేశాల సహాయార్థం ఉపయోగించేందుకు ఒక పరిహార నిధిని సృష్టించాలని సదస్సు నిర్ణయించింది. గమనార్హమైన వాస్తవమేమిటంటే ఆ నిధి విషయమై ఒక సమగ్ర ఒప్పందం అనేది లేదు. ఏ దేశం, ఏ మేరకు ఆ నిధికి తోడ్పడుతుందనేది అసలే లేదు. అయితే వాతావరణ మార్పులకు అమితంగా నష్టపోతున్న పేద దేశాల సహాయార్థం ఉపయోగించేందుకు ఆ నిధిని ఉద్దేశించారు. ఇంతకూ ఆ పేద దేశాలు ఏవి? ఇక్కడే అసలు రాజకీయాలు ప్రారంభమవుతాయి. భారత్ లాంటి అగ్రగామి అభివృద్ధి చెందిన దేశం కూడా లాస్ అండ్ డ్యామేజీ నష్టాలకు లోనవుతున్న పేద దేశాలకు ఆర్థిక సహాయమందిస్తుందా? కాప్ 27లో ఈ ప్రశ్నను మళ్లీ మళ్లీ లేవనెత్తినా సరైన ప్రతిస్పందనే లేదు! ఈ అలక్ష్యానికి కారణమేమిటి?

మరి వాతావరణ మార్పులకు తీవ్రంగా నష్ట పోతున్న దేశంగా భారత్ను కూడా పరిగణిస్తారా? పర్వత ప్రాంతాలూ, తీర ప్రాంతాలూ అధికంగా ఉన్న దేశం కదా! కాప్ 28లో ఈ అంశంపై వాదోపవాదాలు జరిగే అవకాశం ఎంతైనా ఉన్నది. ప్రాకృతిక వైపరీత్యాలు ప్రాణనష్టం, ఆస్తినష్టం అపారంగా కలిగిస్తున్నప్పటికీ ఆ ప్రశ్నపై చర్చలకు ఫలశ్రుతి ఉండబోదనే చెప్పక తప్పదు. ఈ వాస్తవం దృష్ట్యా నియమాధారిత వాతావరణ పాలనా వ్యవస్థను మనం మళ్లీ ఆలంబన చేసుకోవాలి తరచూ సంభవిస్తున్న ప్రకృతి విపత్తులకు వాతావరణ మార్పులే కారణమన్న విషయం మనకు స్పష్టంగా తెలుసు. మరి ఆ విపరీత మార్పులు, వాతావరణంలోకి హరిత గృహ వాయువుల విడుదల వల్లేనన్న వాస్తవాన్ని కూడా మనం ఎట్టి పరిస్థితులలోనూ కొట్టివేయలేము. ఈ దృష్ట్యా ఏ దేశమైతే వాతావరణ కాలుష్యానికి ఎక్కువగా కారణమవుతుందో ఆ దేశం విధిగా అపార నష్టాలకు లోనవుతున్న దేశాలకు పరిహారం చెల్లించి తీరాలి. భారత్ సైతం, నిర్దిష్ట పరిమితులకు మించి హరిత గృహ వాయువుల ఉద్గారాలకు కారణమయితే తప్పసరిగా ‘పరిహార నిధి’కి చెల్లింపులు జరిపి తీరాలి.

వాతావరణ కాలుష్యానికి అధిక స్థాయిలో కారణమవుతున్న దేశాల ప్రయోజనాలకు నియమాధారిత వాతావరణ పాలన అనేది అనుకూలంగా ఉండదు. కనుకనే పారిస్ ఒప్పందంలో దాన్ని వివిధ అంశాలుగా విభజించారు. ఇప్పుడు కాలుష్యకారక దేశాల మధ్య తరతమ భేద భావం చూపేందుకు ఆస్కారం లేదు. దీనివల్ల లబ్ధి పొందుతున్న దేశం చైనా. వాతావరణ కాలుష్య కారక ఉద్గారాల విషయంలో చైనా నిన్నటి అమెరికా. తలసరి ఉద్గారాల విషయంలో చైనా 2030 నాటికి అమెరికాతో సమస్థాయికి చేరనున్నది. కాలుష్యకారక దేశంగా పరిగణన పొందవలసిన చైనా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాలో లబ్ధి పొందుతూ వాతావరణ సమతౌల్యత విషయంలో తన బాధ్యతను తప్పించుకొంటోంది.

కాప్ 27 తిరోగమన ఫలితాలను సాధించిందని నేను ఎందుకు చెప్పాను? ఈ సదస్సు ఒప్పందం ప్రప్రథమంగా శిలాజ ఇంధనాల మధ్య ఒక వ్యత్యాసాన్ని చూపింది. సహజవాయువు బొగ్గు కంటేతక్కువ బొగ్గు పులుసు వాయువును విడుదల చేస్తుంది గనుక అది చాలా స్వచ్ఛమైన ఇంధనంగా కాప్ 27 భావించింది. సహజవాయువును స్వచ్ఛ ఇంధనంగా ఐరోపా సమాఖ్య ప్రకటించినప్పుడు కూడా ఇదే వ్యత్యాసాన్ని చూపింది. ఇది సరి కాదు.

భూ ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కు మించిపోయే దిశలో ప్రపంచం వేగంగా సాగుతోంది. ఈ పెరుగుదల 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉన్న ప్రస్తుత దశలోనే అపార విధ్వంసం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని సమాజాలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నాయి. ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కోవడంలో ఇంకెంత మాత్రం జాప్యం తగనే తగదు. దృఢసంకల్పంతో ఎదుర్కోవాలి. భూ ఉష్ణోగ్రతల పెరుగుదలను నిరోధించేందుకు నిర్ణయాత్మకంగా కార్యాచరణకు పూనుకోకపోవడమనేది మన మహావైఫల్యం. అంతేకాదు, ఒక విషాద వైఫల్యం కూడా.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - 2022-12-09T00:51:35+05:30 IST