ఈ అప్పుల బాగోతం కేంద్రం కంటపడదా?

ABN , First Publish Date - 2022-12-02T02:38:28+05:30 IST

ఢిల్లీలో చలిపెడుతున్నా పరవాలేదు, అప్పు మాత్రం కావాల్సిందే అంటూ, ఆంధ్రా ఆర్థిక మంత్రి, కార్యదర్శితో సహా నిర్మలాసీతారామన్ గారి ముందు...

ఈ అప్పుల బాగోతం కేంద్రం కంటపడదా?

ఢిల్లీలో చలిపెడుతున్నా పరవాలేదు, అప్పు మాత్రం కావాల్సిందే అంటూ, ఆంధ్రా ఆర్థిక మంత్రి, కార్యదర్శితో సహా నిర్మలాసీతారామన్ గారి ముందు మళ్ళీ హాజరయ్యారు. నవంబరు నెలాఖరు, డిసెంబరు మొదటి మంగళవారాల్లో, మీరు ఆంధ్రా అప్పు పుట్టేలా రిజర్వ్ బ్యాంకులో అనుమతించకపోతే, రాష్ట్రాన్ని నడపలేము మహాప్రభో అంటూ ఆంధ్రా ఆర్థిక శాఖ సారథులు ఢిల్లీలో కాచుకొని ఉన్నారు.

అసలు రాష్ట్రంలో ఏమి జరుగుతోంది? ఆంధ్ర ప్రదేశ్‍లో నిజంగానే డబ్బులు లేవా? ప్రభుత్వానికి పన్నులు రావటం లేదా? ఆ మేరకు రాష్ట్రంలో ఉత్పత్తి, క్రయ విక్రయాలు జరగటం లేదా? మరి అక్టోబరు కాగ్ నివేదికలో గత 2021–22సంవత్సరం ఆరు నెలల ఆదాయం రూ.64,871కోట్లతో పోలిస్తే ఈ సంవత్సరం ఆరు నెలల ఆదాయం రూ.72,958కోట్లు ఉన్నదని, అంటే మొత్తం రూ.8000కోట్లు పెరిగిందని చెప్తోంది!? కేంద్ర పన్నుల వాటా ఆదాయం మూడు వేల కోట్లు, జీఎస్టీ ఇంకో మూడు వేల కోట్లతో ఇది సాధ్యం అయిందని చెప్తోంది. అదే కాగ్ తన రిపోర్టులో గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ మార్కెట్ నుంచి రూ.39,933కోట్ల అప్పు తీసుకొంటే, ఈ సంవత్సరం సెప్టెంబరు దాకా రూ.49,278కోట్లు అప్పు చేసిందని కూడా చెప్తోంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఆరు నెలల్లోనే, రూ.17,000 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని కాగ్ చెప్తోంది. మరి ఈ అప్పుల బాధేంటి? ఢిల్లీకి వెళ్లి ఆర్థిక మంత్రి దగ్గర వేచివుండటం, వేడుకోవటం ఏంటి? అసలు రాష్ట్రం ఈ డబ్బులన్నీ ఏం చేస్తోంది? ఇది కాకుండా కేంద్రానికి చెప్పకుండా చేసిన ఎక్సైజ్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు వగైరాలు. ఇంత డబ్బులున్నా ఈ అప్పుల ఖర్మేంటి రాష్ట్రానికి?

ఆంధ్రా ప్రభుత్వం ఆరు నెలల్లో రూ.49,263.34కోట్ల మార్కెట్ అప్పులు చేసిందని సెప్టెంబరు కాగ్ నివేదిక చెబుతున్నది. కానీ తొమ్మిది నెలల్లో, అంటే డిసెంబరు నెలాఖరు దాకా, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన అప్పు పరిమితి రూ.43,803కోట్లు మాత్రమే. మరి ఆరునెలల్లో ఆరువేల కోట్లు అదనంగా ఎలా అప్పు చేసారు? ఏమి ఖర్చు పెట్టారు? నిజానికి పెద్ద రహస్యం ఏమీ లేదు. కార్పొరేషన్ల నుంచి ఎక్సయిజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాదాపు తొమ్మిది వేల కోట్ల పైచిలుకు అప్పులు చేశారు. ఆ అప్పులను కేంద్రానికి చూపలేదు. ఎందుకు చూపలేదని కేంద్రం అడగలేదు. అలా సాగిపోతోంది అంతే!

ఆరు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.17వేల కోట్లు అదనపు ఆదాయంగా వచ్చింది అని కాగ్ చెప్పింది కదా. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఎందుకు పడకేసింది? ప్రతి రాష్ట్రం తన ఆదాయంలో కనీసం 25శాతం భవిష్యత్తు పెట్టుబడుల మీద పెడితేనే రాగల కాలంలో అధిక ఆదాయం సాధ్యం అవుతుంది. కాగ్ నివేదిక ప్రకారమే చూసుకొంటే గత ఆర్థిక సంవత్సరంలో రూ.6,419కోట్ల పెట్టుబడి ఖర్చు పెడితే, ఈ ఆర్థికంలో కూడా అంతే (రూ.6,829కోట్లు) ఖర్చు పెట్టారు. దీనిలో కూడా ఆదాయం ఆర్జించే ఎకనామిక్ సెక్టార్ లో రూ.4215కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు. మరి మిగతా ఆదాయం ఏమవుతోంది? చెత్త మీద కూడా బలవంతపు పన్ను వసూలు చేసే స్థితికి ఎందుకొచ్చాం?

ఆరు నెలల్లో హైకోర్టు పలుమార్లు చెప్పినా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వటం లేదు? పంచాయితీలకు కేంద్రం ఇచ్చిన సొమ్ములు కూడా తీసేసుకొంటున్నారు? రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నమైన స్థితిలో ఉన్నాయి. మూడున్నరేళ్లుగా రోడ్లు వేయలేదు. కొత్తగా చేపట్టిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేదు. పోలవరం సరేసరి, 2024 లోపల కట్టలేమని దాదాపు తేల్చేసారు. అమరావతి రాజధానిని ఒక పదివేల కోట్లు ఉంటే పూర్తి చెయ్యవచ్చు, కానీ డబ్బులు లేవంటారు. అమరావతి – అనంతపూర్ రహదారి కాగితాల్లోనే ఉంది. అమరావతిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన సచివాలయంలోనే అసెంబ్లీలు పెట్టుకొంటూ గడిపేస్తున్నారు. అప్పుడు కట్టిన హైకోర్టే. పోనీ వైజాగులో ఏమన్నా చేసారా అంటే ఋషి కొండను తవ్వేయడం తప్పించి ఏమీ చేయలేదు. పైగా అక్కడ ఉండే పలు ప్రభుత్వ ఆస్తులు అప్పుల హామీ కోసం తనఖా పెట్టారు. రాయలసీమపై ఏమైనా ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారా అంటే అదీ లేదు. ఉక్కు ఫ్యాక్టరీ అసలు మొదలే కాలేదు. కేంద్ర రైల్వే శాఖేమో తమకు రాష్ట్రం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వనందుకే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు వెనుకబడ్డాయని చెప్తోంది. ఆక్వా పరిశ్రమ తప్ప, వ్యవసాయం తీవ్రంగా దిగజారిపోతోంది. ఉద్యోగులకు పీఆర్సీలు అతితక్కువ ఇచ్చారు. డీఏ బకాయిలు కొండల్లా పేరుకుపోయాయి. ఒకటి అరా చిన్న పరిశ్రమలు తప్ప, పెద్ద ఎత్తున పరిశ్రమలూ రాలేదు. అయిదు వందల ఇంజినీరింగ్ కాలేజీల్లోంచి లక్షా నలభై వేల మంది, మేనేజ్ మెంట్ కాలేజీల్లోంచి ఇరవై వేల మంది విద్యార్థులు ప్రతి ఏటా బయటికి వస్తారు. డిగ్రీ, ఇతర విభాగాలు అదనం. వీళ్ళందరికీ ఉపాధి చూపించాల్సిన బాధ్యత రాష్ట్రానిదే కదా. సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అన్నాడు నెహ్రూ. అదెంత నిజమో, వాటితో పాటుగా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించే పెద్ద కంపెనీలు అంతే అవసరం. ఉపాధి కావాలంటే, పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు ఆంధ్రాని ఎంచుకోవాలి అంటే, ఇప్పుడు రాష్ట్రాల మధ్య ఉన్న పోటీలో, అత్యున్నత స్థాయి మౌలిక సౌకర్యాలను కల్పించాలి. ఉపాధి దొరికితే, జీవనోపాధులు కల్పిస్తే, ఆ డబ్బులు ఇక్కడే మన రాష్ట్రంలోనే ఖర్చు పెడితే, ఆదాయం అదే వస్తుంది.

ఆరు నెలల్లో రూ.17,000 వేలకోట్లు ఆదాయం వస్తే కూడా, రెవెన్యూలోటు 240 శాతం ఎందుకు ఉంది? అంటే ఆదాయాన్ని మించి రోజు వారీ ఖర్చు అంత మేరకు పెరిగింది. మౌలిక సౌకర్యాలపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు! కారణమేంటో తెలుసా? ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కొన్ని ఎంపిక చేసిన స్కీములకు డైరెక్ట్ బెనిఫిట్ బదిలీ కింద డబ్బును ప్రజలకు బదిలీ చేయటం. ఇదో గొప్ప అన్నట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. మరి దేశంలో ఏ రాష్ట్రమూ ఈ విధంగా తన ఆదాయాన్ని మించి నూరు శాతం పైగా అప్పు చేసి, ఇలా తలా కొంచం అప్పుడప్పుడు ఇచ్చే ప్రక్రియ ఎందుకు చేయటం లేదు? మధ్య దళారీలని నివారించడానికి డైరెక్ట్ బెనిఫిట్ బదిలీ కొత్తదేమీ కాదు. కానీ రాష్ట్ర స్వంత రెవెన్యూ కంటే వంద శాతం ఎక్కువగా, అధిక వడ్డీరేట్లతో అప్పులు చేసి ప్రజలకు కొంత మొత్తంలో డబ్బులు పంచే ఆర్థిక విధానం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే, ‘ప్రజలకు డబ్బులు ఇస్తే మీకు నష్టమేమిటి, ఇవ్వద్దా?’ అంటూ సెంటిమెంటుతో అలా అడిగినవారివైపు ప్రజలను ఎగదోస్తున్నారు. జీడీపీలో 4 శాతం అప్పు సౌలభ్యం రాష్ట్రాలకు ఇచ్చింది సమ్మిళిత అభివృద్ధిలో ఏర్పడే లోటును పూడ్చుకోవడం కోసం. అంతే కానీ, డబ్బులు ఇలా పంచడానికి కాదు.

లేదూ, మాది కొత్త ఆర్థిక విధానం, ఇష్టం వచ్చినంత అప్పులు చేస్తాం, మౌలిక సౌకర్యాలను పట్టించుకోం, పరిశ్రమల గురించి ఆలోచించం, వ్యవసాయం వైపు చూడం, ఉద్యోగాలను సృష్టించే ప్రణాళికలు మాకు పట్టవూ; మాక్కావాల్సిందల్లా ఉన్న డబ్బులను కొంతమంది ప్రజలకు బదిలీ చేసి ఓట్లు రాబట్టడమే అంటారా... కేంద్రం ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు మన రాష్ట్రం ఉంది.

ప్రభుత్వం అలవిమాలిన అప్పులతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోందనేది సుస్పష్టం. కానీ కేంద్రం కూడా శీతకన్ను వేస్తే ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకమే! రాష్ట్రం అమలు చేస్తున్న విధ్వంసకర ఆర్థిక విధానాలు, కనీసం రోడ్లు కూడా వెయ్యలేని దుస్థితి, మౌలిక సౌకర్యాల లేమి, పరిశ్రమలు రాకపోగా వచ్చినవి పారిపోవడం... ఇవన్నీ కేంద్రం దృష్టికి రావా? ఆదాయానికంటే వంద శాతం ఎక్కువ అప్పులతో, ఆ అప్పు చేసి తెచ్చిన సొమ్ములో కొంత ప్రజలకు నేరుగా బదిలీ చేసి వాళ్లకేదో ప్రయోజనం చేసేస్తున్నాను అని భ్రమింపజేస్తూ... ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తున్న దృశ్యం ప్రజలకు విస్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రం ఇకనైనా భారతదేశంలోని ఒక ప్రధాన రాష్ట్రంలో జరుగుతున్న ఈ అప్పుల బాగోతాన్ని చూడాలి, గుర్తించాలి, చర్యలు తీసుకోవాలి.

నీలాయపాలెం విజయకుమార్

తెలుగుదేశం పార్టీ

Updated Date - 2022-12-02T02:38:37+05:30 IST