సోషలిస్టుల కొత్త శత్రువు బీజేపీ

ABN , First Publish Date - 2022-10-14T06:21:04+05:30 IST

21వశతాబ్దంలో భారతీయ సమాజవాద (సోషలిస్ట్) సంప్రదాయం ఉపయుక్తత ఏమిటి? ములాయం సింగ్ యాదవ్ అస్తమయం ఈ గంభీర సమస్యపై ఆలోచనను పురికొల్పుతోంది....

సోషలిస్టుల కొత్త శత్రువు బీజేపీ

21వశతాబ్దంలో భారతీయ సమాజవాద (సోషలిస్ట్) సంప్రదాయం ఉపయుక్తత ఏమిటి? ములాయం సింగ్ యాదవ్ అస్తమయం ఈ గంభీర సమస్యపై ఆలోచనను పురికొల్పుతోంది. సోషలిస్టు ఉద్యమ వ్యవస్థాపకులలో అగ్రగణ్యుడు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి రోజు (అక్టోబర్ 11)నే ములాయం పార్థివ శరీరానికి అంత్యక్రియలు జరగడం ఒక విశేషం. అలాగే ములాయం రాజకీయ గురువు రామ్ మనోహర్ లోహియా 55వ వర్ధంతికి ఒక రోజు ముందు ఆ కర్మకాండ జరిగిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవడం అసందర్భమేమీ కాదు.


ములాయం రాజకీయ జీవితంలో స్థిరమైన విషయం ఏదైనా ఒకటి ఉందంటే అది ఆయన మొదటి నుంచీ చివరి వరకు సోషలిస్టు సంప్రదాయ బద్ధుడుగా ఉండడమే. ఆ విశిష్ట సంప్రదాయంతో ఆయన ఎంతగా మమేకమయ్యారంటే తాను స్థాపించిన రాజకీయ పార్టీకి ‘సమాజ్‌వాది’ అని నామకరణం చేశారు. సోషలిస్టు ఉద్యమ చిహ్నమైన ఎర్ర టోపీని పార్టీ శ్రేణులు నిత్యం ధరించి తీరాలని నిర్దేశించారు; ఆంగ్ల భాషా ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు; సమాజ్‌వాది పార్టీ విధానాలలో లోహియా స్ఫూర్తిని ప్రతిఫలింప చేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ములాయం జీవిత పర్యంతం ఒక ‘సోషలిస్టు’గా ఉన్నారు. అయితే ఆయన సోషలిజం సారరహితమైనదని పలువురు విమర్శించడం కద్దు. భారతీయ సోషలిస్టు సంప్రదాయం ప్రాసంగికత గురించి ఎందుకు చర్చించాలో ఆ విమర్శలూ ప్రేరేపిస్తున్నాయి మరి.


వర్తమాన యువ భారతీయులకు సోషలిస్టు రాజకీయ సంప్రదాయాల గురించి ఏమైనా తెలుసా? సందేహమే. వారికి నిత్యం ఎల్లెడలా ‘హిందూత్వే’ తటస్థిస్తుంది కదా. ఉదారవాదులు, వామపక్షవాదులు, నక్సలైట్లు, స్త్రీ వాదులు, గాంధేయవాదులు, పర్యావరణ ఉద్యమకారుల గురించి వారు తప్పక వింటూంటారు. అయితే సోషలిస్టుల గురించి అడగండి. వారి నుంచి శూన్య దృక్కులే మీకు ఎదురవుతాయి. మహా అయితే సోషలిజం అనేది కమ్యూనిజంకు ఒక పర్యాయపదమని వారు భావిస్తూండవచ్చు. విద్యాధిక భారతీయులు అయితే బెర్నీ శాండర్స్ (అమెరికన్ రాజకీయవేత్త, రచయిత, ఉద్యమకారుడు)తో ముడివడివున్న విషయంగా భావించే అవకాశముంది. అంతేగానీ, ఆధునిక భారతదేశ నిర్మాణంలో మహోన్నత పాత్ర నిర్వహించిన రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ, యూసఫ్ మెహరాలీ, మధులిమాయె, జార్జి ఫెర్నాండెజ్, కిషన్ పట్నాయక్‌లు ప్రభవించిన దేశీయ రాజకీయ సంప్రదాయమే సోషలిజమని వారికి తెలియనే తెలియదు.


కమ్యూనిజం కంటే సోషలిజం విలక్షణమైనదని గుర్తించిన వారు సైతం భారతీయ సోషలిస్టు ఉద్యమ విశిష్టతను అర్థం చేసుకున్న వారేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెమోక్రాటిక్ సోషలిస్టులవలే భారతీయ సోషలిస్టులు కూడా పెట్టుబడిదారీ అసమానతలు, కమ్యూనిస్టు నియంతృత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఐరోపాలోనూ మిగతా ప్రపంచంలోని డెమాక్రటిక్ సోషలిస్ట్ పార్టీల వలే భారతీయ సోషలిజం ఏ విధంగాను కమ్యూనిస్టు వామపక్షవాదం లాంటిది కానే కాదు. మహాత్మాగాంధీ నేతృత్వంలో భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న పోరాట యోధులు భారతీయ సోషలిస్టులు. వారి భావాలు, రాజకీయాలను గాంధీ మౌలికంగా ప్రభావితం చేశారు. ఆ స్ఫూర్తిదాయక ప్రభావంతోనే సామాజిక న్యాయంతో కూడిన ఆర్థిక సమానత్వం, రాజకీయ, ఆర్థిక వికేంద్రీకరణ, సాంస్కృతిక విముక్తి, అహింసాత్మక ప్రతిఘటన ఇత్యాది విశిష్ట లక్షణాలతో కూడిన ప్రత్యేక రాజకీయ భావజాలంగా భారతీయ సోషలిజం పరిఢవిల్లింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే దేశీయత దాని విశిష్టత. గతించిన కాలం విస్మృత చరిత్రను మనం ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాలి? రాజకీయంగా బలహీనమైన, చీలికలు పీలికలు అయిన సోషలిస్టు ఉద్యమం నేటి అనివార్య ప్రతిఘటనాత్మక రాజకీయాలకు తప్పక తోడ్పడగలిగేదిగా ఉంది. ఇప్పుడు మన ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య (రిపబ్లిక్) మనుగడకు ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు మూడు మార్గాలను సమకూరుస్తోంది.


భారతీయ సోషలిస్టులు సునిశ్చిత జాతీయవాదులు. నిజానికి ఈ జాతీయ వాద దృక్పథమే వారికి, భారత కమ్యూనిస్టు పార్టీకి మధ్య ఉన్న మౌలిక వ్యత్యాసం. భారత స్వాతంత్ర్యోద్యమంతో కమ్యూనిస్టులది రాగద్వేషాల సంబంధం. అయితే సోషలిస్టులు కాంగ్రెస్ నాయకత్వంలో ఆ మహోజ్వల పోరాటంలో సంపూర్ణంగా పాల్గొన్నారు. సోషలిస్టులది ఎంతమాత్రం సంకుచిత జాతీయవాదం కానేకాదు. ప్రగతిశీల భారతీయ జాతీయవాదానికి వారు అగ్రగణ్య ప్రతినిధులు. ప్రపంచవ్యాప్తంగా వలసవాద వ్యతిరేక పోరాటాలతో సంపూర్ణంగా మమేకమయినవారు. స్వాతంత్ర్యానంతరం జాతి–నిర్మాణం, మత సామరస్యం, స్వతంత్ర విదేశాంగ విధానానికి సోషలిస్టుల జాతీయవాదం ప్రాధాన్యమిచ్చింది. అయితే 1962 పరాజయం సందర్భంలో నెహ్రూ విదేశాంగ విధానాన్ని విమర్శించేందుకు వారు సందేహించలేదు.


ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంటా బయటా ఊహాత్మక శత్రువులను చూపుతూ దురహంకార రాజకీయాలకు పాల్పడుతోంది. వాటిని సమర్థించుకునేందుకు జాతీయవాద భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. ఉదారవాదులు, వామపక్షాల వారు ఈ సంకుచిత రాజకీయాలను సమర్థంగా ఎదుర్కోలేక పోతున్నారు. బీజేపీ కలహశీల జాతీయవాదాన్ని మీరు అమూర్త అంతర్జాతీయవాదంతో ఎదుర్కోలేరు. ఆ పార్టీ మతోన్మాద జాతీయవాదానికి ప్రభావశీల ప్రతిక్రియ భారతీయ సోషలిస్టుల వాస్తవిక జాతీయవాదమే.


సాంస్కృతిక ఆత్మగౌరవ రాజకీయాలు ఆ వాస్తవిక జాతీయవాదానికి సంబంధించినవే. భారతీయ (హిందూ అని చదువుకోండి) నాగరికత, సంస్కృతి బీజేపీ జాతీయవాదానికి ప్రాతిపదికగా ఉన్నాయి. వలసవాద గతాన్ని తుడిచిపెట్టే ప్రతీకాత్మక చర్యల ద్వారా ప్రతి భారతీయుని మద్దతును పొందేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వలసవాద గతంలో ముస్లిం పాలకులను కూడా చేర్చింది! ఇదొక చారిత్రక వంచన. హేతుబద్ధత లేని చారిత్రక అక్రమం. పురాతన భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని కీర్తించేందుకు వాస్తవిక, ఊహాత్మక కారణాలను చూపుతోంది. ఆంగ్ల భాష ప్రాబల్యాన్ని త్రోసిపుచ్చడం ద్వారా ప్రజా మద్దతును మరింతగా సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ ప్రతీకాత్మకచర్యలు నిస్సారమైనవని, బూటకపు చరిత్రతో ప్రజలను మభ్య పెడుతుందని ఆ పార్టీ విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు. అయితే సాంస్కృతిక ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయ కారణాలను వారు చూపడం లేదు. ఆంగ్ల భాషను వారు సమర్థిస్తున్న తీరు వలసవాద ప్రయోజనాల ఆధారితమైనది కానప్పటికీ కులీన వర్గాల స్వప్రయోజనాలకు తార్కాణంగా ఉంటోంది. మన నాగరికతా వారసత్వాన్ని మన సొంత పద్ధతుల్లో బలోపేతం చేసే విధంగా భారతీయ సోషలిస్టులు ప్రతిస్పందించాలి. ఎలా? హిందీ ఆధిపత్యాన్ని అంగీకరించకుండానే ఇంగ్లీష్ ప్రాబల్యాన్ని విమర్శించాలి. ప్రత్యామ్నాయ సాంస్కృతిక రాజకీయాలకు ఇదే సరైన మార్గం. ఒక నాస్తికుడి వలే మతాన్ని తిరస్కరించడం కాకుండా ప్రజల మత మనోభావాలను అర్థం చేసుకుని గౌరవించాలి.


సామాజిక న్యాయం సోషలిస్టు రాజకీయాల మరో విశిష్టత. ముఖ్యంగా కులాధారిత అసమానతలను వ్యతిరేకించడంలో వారి కృషి అవిస్మరణీయమైనది. భారతీయ సమాజంలో అసమానతలకు కుల వ్యవస్థే ప్రధాన కారణమన్న సత్యాన్ని తొట్ట తొలుతనే గుర్తించిన వారిలో బాబాసాహెబ్ అంబేడ్కర్‌తో పాటు భారతీయ సోషలిస్టులు కూడా ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాల వారు, మైనారిటీలు, మహిళల అభ్యున్నతికి ప్రత్యేక సానుకూల చర్యలు చేపట్టాలని సోషలిస్టులు డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు సోషలిస్టు పార్టీలు ఉద్యమించాయి. సోషలిస్టుల ఉద్యమాలు, ఆందోళనల వల్లే దళితులు, బహుజనుల మధ్య సమైక్యత సుసాధ్యమయింది. ఇప్పుడు మన రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్యంపై జరుగుతోన్న దాడిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ సమైక్యత ఒక ఆలంబన అనడంలో సందేహం లేదు. మన సమాజంలోని సకల అణగారిన, ఆర్థిక, సామాజిక తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్న వర్గాల మధ్య ఐక్యతకు సైద్ధాంతిక, రాజకీయ ప్రాతిపదికను సోషలిస్టు ఉద్యమం సమకూర్చింది.


సోషలిస్టు ఉద్యమ వారసత్వం ప్రస్తుతం నడుస్తున్న చరిత్రలో ఒక కీలక పాత్ర నిర్వర్తించగలదనడంలో సందేహం లేదు. అయితే ఆ ఉద్యమ వారసులు ఈ చారిత్రక కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించగలరా? స్వతంత్ర భారతదేశంలో అన్ని రకాల అణచివేతలను, నిరంకుశ విధానాలను ప్రతిఘటించిన ప్రశస్త చరిత్ర సోషలిస్టుల సొంతం. సోషలిస్టు ఉద్యమం ప్రభావశీలంగా ఉన్న కాలంలో అధికార వ్యవస్థకు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుండేది. ఈ కారణంగానే అధికార వ్యవస్థ వ్యతిరేకత కాంగ్రెస్ వ్యతిరేక వాదంగా రూపుదిద్దుకుంది. తన సమకాలికులు అయిన అనేక మంది సోషలిస్టుల వలే ములాయం సింగ్ యాదవ్ కూడా కాంగ్రెస్‌కు బద్ధ వ్యతిరేకి. సోషలిస్టు ఉద్యమ నేటి వారసులు కాంగ్రెస్ వ్యతిరేకతను విడనాడాలి. ఇప్పుడు అధికార వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్యాన్ని కాలరాచివేసి, భారతదేశ సమైక్యతా పునాదులను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నవ భారతదేశంలో తన చారిత్రక పాత్రను నిర్వర్తించేందుకు భారతీయ సోషలిస్టు ఉద్యమం ఒక కొత్త అవతారమెత్తాలి.


యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Read more