భిన్న పార్టీల విజయం, ఓ వెలుగు రేఖ!

ABN , First Publish Date - 2022-12-10T01:39:34+05:30 IST

ప్రజల్లో సహజ సిద్ధంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, గత ఐదున్నర దశాబ్దాలుగా ఎన్నికల ఫలితాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తోంది.

భిన్న పార్టీల విజయం, ఓ వెలుగు రేఖ!

ప్రజల్లో సహజ సిద్ధంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, గత ఐదున్నర దశాబ్దాలుగా ఎన్నికల ఫలితాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తోంది. అధికార పక్షానికి అది అనేక సమస్యలను సృష్టిస్తోంది. 1967లో భారత జాతీయ కాంగ్రెస్ సర్వాధిపత్యం ముగిసిన తరువాత రాష్ట్రాలలో అనేక ప్రభుత్వాలు పరాజయం పాలయ్యాయి. ప్రాంతీయ, కాంగ్రేసేతర పార్టీల ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలో కాంగ్రేసేతర ప్రభుత్వాల యుగం 1977లో ప్రారంభమయింది.

ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను ఎన్నుకోవడమనేది కేరళలో ఆరంభమయింది. 1990ల నుంచీ రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడడాన్ని మనం చూశాము. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి వరుసగా మళ్లీ, మళ్లీ అధికారానికి వచ్చిన సమున్నత నాయకులూ ఉన్నారు. కీర్తిశేషుడు ఎమ్.జి.రామచంద్రన్ అటువంటి వారిలో ఒకరు. ఆయన నేతృత్వంలోని అన్నాడిఎంకె తమిళనాడులో 1977–87 సంవత్సరాల మధ్య వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. జయలలిత నేతృత్వంలో కూడా అన్నాడిఎంకె వరుసగా రెండుసార్లు ఎన్నికలలో విజయం సాధించింది. ఒడిషాలో నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ 2000 సంవత్సరం నుంచీ వరుసగా ఐదు పర్యాయాలు జయపతాక నెగురవేసింది. గుజరాత్లో 1998 నుంచీ భారతీయ జనతా పార్టీయే అధికారంలో (2002 నుంచి ముఖ్యమంత్రి గానూ, ఆ తరువాత వాస్తవంగా రాష్ట్రాధికారాన్ని చెలాయిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలోనూ తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది) ఉన్నది.

నిశ్చిత పరిస్థితులలో, నిర్దిష్ట నాయకుల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఒక బలహీనతగా కాకుండా ఒక సానుకూల శక్తిగా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ రాజకీయ దృగ్విషయాలను రాజకీయ పరిశీలకులు, సామజిక మనోవైజ్ఞానికులు, ఎన్నికలలో ప్రజలు ఓటు వేస్తున్న తీరు తెన్నులను అధ్యయనం చేసే సెఫాలజిస్ట్లు జాగ్రత్తగా విశ్లేషించవలసిన అవసరమున్నది. ఇటీవల గుజరాత్, హిమాచల్ప్రదేశ్ శాసనసభా ఎన్నికల; ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల మీద నా అభిప్రాయాలు, ఆలోచనలు మీతో పంచుకోదలుచుకున్నాను. అవి:

(1) అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు తమ ఐదేళ్ల పాలనలో, తదుపరి ఎన్నికలలో వ్యయాలకు గాను భారీ మొత్తాలలో నిధులు సంచయించుకుంటున్నాయి. రాజకీయ దురంధరులు, పాలనాదక్షులు అయిన కామరాజ్ నాడార్, ఎస్. నిజలింగప్ప, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఇఎమ్ఎస్ నంబూద్రిపాద్, హితేంద్ర దేశాయి, వైబి చవాన్, మోహన్లాల్ సుఖాడియా, జ్యోతిబసు మొదలైన వారి పాలనలో అటువంటి వ్యవహారాలు జరిగేవి కావు. (2) పాలక పక్షాలు ఉద్యోగులు, అధికారులను ముఖ్యంగా పోలీసు సిబ్బందిని తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు సంకోచించడం లేదు. అటువంటి అధికార దుర్వినియోగం సాధారణమై పోయింది. గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్లలో ఈ చట్ట విరుద్ధ తతంగాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఇటీవల ఉత్తర్ప్రదేశ్లోని రాంపూర్ శాసనసభా ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఇంచుమించు 32 కాగా అదే రాష్ట్రంలోని ఖటౌలి శాసనసభా నియోజకవర్గ ఉప ఎన్నికలో పోల్ అయిన ఓట్లు దాదాపుగా 56 శాతంగా నమోదయింది. మెయిన్ పూరి లోక్సభా నియోజకవర్గ ఉపఎన్నికలోనూ 56 శాతం పోలింగ్ నమోదయింది. రాంపూర్లో పోలింగ్ శాతం అతి తక్కువగా ఉండడానికి కారణం పోలీసు దళాల నిర్వాకాలేనని సమాజ్వాది పార్టీ ఆరోపించింది.

(3) తెలివైన, దూరదృష్టి గల రాజకీయ పక్షాలు తమ సంస్థాగత వ్యవహారాలను సమర్థంగా నిర్వహించుకునేందుకు అధునాతన సాంకేతికతలను విరివిగా వినియోగించుకుంటున్నాయి. ఎన్నికల వ్యవహారాల సూక్ష్మ నిర్వహణకు, ముఖ్యంగా పోలింగ్ రోజున అనివార్య కార్యకలాపాల నిమిత్తం బీజేపీ, మరి కొన్ని ఇతర పార్టీలు పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. బీజేపీ అయితే మరో అడుగు ముందుకేసి ఈ సూక్ష్మ నిర్వహణను ఓటర్ల జాబితాలోని ప్రతీ పేజీలో ఉన్న ప్రతీ ఓటరు స్థాయికి విస్తృతపరిచింది. (4) పటిష్ఠ సంస్థాగత వ్యవస్థ ఉన్న పాలక పక్షాలు తమ పార్టీకి ‘భౌతిక బలం’ను కూడా సమకూరుస్తున్నాయి. ఎన్నికల సందర్భంలో ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. చట్ట సభల సభ్యులు, అపఖ్యాతి పాలయిన బలవంతులు కూడా అధికార పక్షంలో చేరడం సాధారణమైపోయింది. వివిధ ప్రలోభాలకు వారు లొంగిపోతున్నారు. డబ్బుకు ఆశపడని వారెవరు? ధన లాభం కంటే ఎక్కువగా ‘క్షమాభిక్ష’ను ఆశించి ఫిరాయింపులకు తెగిస్తున్నారు. తమపై ఉన్న వివిధ కేసుల నుంచి బయటపడేందుకు అధికార పార్టీ పంచన చేరుతున్నారు. ఇది జరిగిన వెంటనే సదరు ‘పెద్ద మనుషుల’పై ఉన్న సకల నేరారోపణల దర్యాప్తును ఒక్కసారిగా నిలిపివేయడం జరుగుతోంది!

(5) అధికార పక్షం గత కొద్ది సంవత్సరాలుగా ప్రజల మధ్య చీలికలను సృష్టించేందుకు మతపాచికను ప్రయోగిస్తోంది. ఇది పలు విధాల సంభవిస్తోంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు మతాన్ని నిస్సిగ్గుగా, చతురంగా వాడుకుంటున్నారు. గుజరాత్లో 2012 నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా మైనారిటీ వర్గమైన ముస్లింల నుంచి ఒక్క అభ్యర్థినీ నిలబెట్టలేదు. ఉత్తర్ప్రదేశ్లో సైతం ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులలో ముస్లిం మతస్తుడు ఒక్కరూ లేరు. మరి గుజరాత్ జనాభాలో 9.7 శాతం, ఉత్తర్ప్రదేశ్ జనాభాలో 20శాతంగా ఉన్న ముస్లింల నుంచి ఒక్కరినీ తమ అభ్యర్థిగా నిలబెట్టకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందునా ఒక జాతీయ రాజకీయ పక్షం ఇలా వివక్షతో వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ముస్లింల అభ్యర్థులను నిలబెట్టకపోవడం ద్వారా ఇతర మత, సామాజిక వర్గాలకు ఒక స్పష్టమైన సందేశాన్ని బీజేపీ పంపింది. ఫలితంగానే ఓటర్లలో మతపరమైన చీలికలు అనివార్యంగా సంభవిస్తున్నాయి. (6) సుపరిపాలన నందించడంలో తమ ఘోర వైఫల్యాన్ని ఉధృత ప్రచారం ద్వారా కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖస్తుతి పరాయణులు అయిన పాత్రికేయులు పాలక పక్షానికి అన్ని విధాల తోడ్పడుతున్నారు. స్వతంత్ర మీడియా అనేది పూర్తిగా గతించిన విషయమై పోయింది. ఇప్పుడు మీడియా సంస్థలు (టీవీ చానెల్స్, వార్తాపత్రికలు) పూర్తిగా కార్పొరేట్ కుబేరుల నియంత్రణలో ఉన్నాయి. సామాజిక మాధ్యమాలు స్వేచ్ఛాయుతంగా ఉన్నప్పటికీ నకిలీ వార్తలు, నకిలీ వీడియోలు, పోకిరీ వ్యాఖ్యలతో నిండిపోతున్నాయి.

ప్రస్తావిత అంశాలతో పాటు ఇంకా మన సువిశాల సమాజంలోని వేయిన్నొక్క విషయాలు, మరీ ముఖ్యంగా ప్రతి రాష్ట్ర విలక్షణ చరిత్ర, సంస్కృతి ఎన్నికల ఫలితాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. గుజరాత్, ఉత్తర్ప్రదేశ్లను ఒక విచిత్ర శాంతి, ఒక వింత మౌనం ఆవహించాయని నేను భావిస్తున్నాను. అమెరికా రాజనీతిజ్ఞుడు జాన్ ఎఫ్ కెనడీ చాలా ముందు చూపుతో వ్యాఖ్యానించినట్టు ఆ అసాధారణ పరిణామాలు ‘సమాధి ప్రశాంతి బానిస మౌనమా’? కాదనే నేను నిజంగా నమ్ముతున్నాను. భిన్నాభిప్రాయాలను రాజ్య వ్యవస్థ పూర్తిగా అణచివేసింది. మీడియా అయితే వాటికి ఎటువంటి చోటునివ్వడం లేదు. ఇవే ధోరణులు భయగ్రస్త మౌనం, శాంతికి దారితీస్తే?! ఒక రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థగా కాకుండా కేవలం ఎన్నికలు జరిగే ప్రజాస్వామ్య సమాజంగా భారత్ మిగిలిపోయే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఇదొక భయావహ, అనివార్యంగా నిష్ఠుర సత్యం.

గుజరాత్, హిమాచల్ప్రదేశ్ శాసనసభ, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు విజేతలకు, పరాజితులకు విలువైన పాఠాలు నిర్దేశిస్తున్నాయి. విజేతకు ఒక శక్తిమంతమైన పార్టీ వ్యవస్థ, అంకిత భావంతో పని చేసే కార్యకర్తలు, స్ఫూర్తిదాయక ప్రచారసరళి, సూక్ష్మ నిర్వహణా సామర్థ్యం ఉన్నాయన్నది ఒక ఉమ్మడి పాఠం. గుజరాత్లో ఒక్క బీజేపీకి మాత్రమే ఈ నాలుగు సానుకూలతలు ఉన్నాయి. తత్ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేకతను విజయవంతంగా అధిగమించింది. హిమాచల్ప్రదేశ్లో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్కు, ఢిల్లీలో ముఖ్య సవాల్దారు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఆ నాలుగు అంశాలు పని చేశాయి. అధికార పక్షం పట్ల ప్రభుత్వ వ్యతిరేకత వినాశనకరమైనదిగా రుజువు అయింది. ఏ రాజకీయ పక్షం ఎక్కడ గెలిచిందీ, ఎక్కడ ఓడిపోయిందీ అన్న విషయంతో సంబంధం లేకుండా ఒక వాస్తవాన్ని వక్కాణిస్తాను: ఆ మూడు ఎన్నికలలో మూడు భిన్న పార్టీల విజయం దట్టమవుతున్న చీకటి నడుమ సూర్యకాంతిలాంటిది.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-12-10T01:39:35+05:30 IST