‘సిర్పూర్కర్’ తవ్వితీసిన చేదు నిజాలు

ABN , First Publish Date - 2022-05-24T06:24:51+05:30 IST

దిశహత్యానంతరం జరిగిన పోలీసు కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఎట్టకేలకు తన నివేదికను సమర్పించింది. ఇప్పటికే కమిషన్ నిర్ధారించిన ముఖ్యమైన విషయాలను మీడియా ప్రస్తావించింది...

‘సిర్పూర్కర్’ తవ్వితీసిన చేదు నిజాలు

దిశహత్యానంతరం జరిగిన పోలీసు కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఎట్టకేలకు తన నివేదికను సమర్పించింది. ఇప్పటికే కమిషన్ నిర్ధారించిన ముఖ్యమైన విషయాలను మీడియా ప్రస్తావించింది. కానీ ఇంకొన్ని వివరాలను, వాటి స్వభావాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.


ఈ ఘటనలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిందితులను చంపాలనే ఆలోచనతోనే కాల్పులు చేశారు; కాల్పులు నిందితుల మరణానికి అనివార్యంగా దారితీస్తుందని ఎరుకతోనే చేసారు, ఈ ఘటనలో పాల్గొన్న పదిమంది పోలీసు అధికారులపై హత్యా నేరారోపణ కింద విచారణ జరపాలి– అనే అభిప్రాయాన్ని కమిషన్ వెలిబుచ్చింది. ఈ పదిమంది తమకు తాముగా నిర్ణయం తీసుకుని ఈ లాంటి చర్యకు పాల్పడే అవకాశం ఉందా అనే లోతుల్లోకి కమిషన్ పోలేదు. అది తనకు తానుగా విధించుకున్న పరిమితి కావచ్చు. ఈ పదిమంది పోలీసులకు మార్గదర్శకత్వం వహించి, వారిచేత ఈ పని చేయించి జేజేలు అందుకున్న రాజకీయ నాయకులు గానీ, పోలీసు అధికారులు గానీ ఈ జాబితాలో లేరు.


ఈ సంఘటనలో మరణించిన నలుగురు ఎదురు దాడి చేశారనేది అసంభవమైన ఆరోపణే కాక పూర్తిగా అబద్ధమని కమిషన్ అభిప్రాయ పడింది. ప్రస్తుత ఘటనలో మరణించిన నలుగురి శరీరాల పైభాగంలో, తల మీద తుపాకీ గాయాలు ఉన్నాయి. ఈ వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తున్నవారినే ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారని నమ్మడానికి అవకాశం కల్పిస్తున్నాయి. కాల్పుల స్వభావం వాటి ఉద్దేశాలను నిర్ధారిస్తుంది అనే ఒక ముఖ్యమైన సూత్రీకరణ చేసింది కమిషన్. ఇది కాల్పుల సంఘటనలో ఉద్దేశాలను అంచనా వేయడానికి పనికి వచ్చే ఒక ప్రమాణం.


పియుసిల్ వర్సెస్ స్టేట్ అఫ్ మహారాష్ట్ర కేసులో సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును తాము పాటించామని తెలంగాణ రాష్ట్రం చేసిన వాదనను కమిషన్ అంగీకరించలేదు. దాని ఉల్లంఘన అడుగడుగునా జరిగినట్లు కమిషన్ పేర్కొంది. మొదటగా, చంపబడే నాటికి జొల్లు శివ, చెన్నకేశవులు, జొల్లు నవీన్‌ల వయసు వరుసగా 17, 15, 15 ఏళ్లు అని కమిషన్ తేల్చింది. ఆధార్ కార్డు ఆధారంగా వాళ్ళ వయసు 18 ఏళ్ల కన్నా ఎక్కువ అని వాదించిన ప్రభుత్వ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. వారు చదువుకున్న బడి పంతుళ్లు రికార్డులను తారుమారు చేశారనే వాదనను కమిషన్ అంగీకరించలేదు. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన నాలుగు రోజులకు పోలీసులు వచ్చి స్కూలు రికార్డులు పరిశీలించి వెళ్లారు, కాబట్టి ఆ ముగ్గురి వయస్సు మీద వారికి ఎటువంటి సందేహం లేదు. అయినా ఈ నిజం మీద పోలీసు రికార్డులు పూర్తి మౌనం వహించాయి. కాబట్టి ఇదంతా వాళ్ళు మైనర్లు అనే నిజాన్ని ప్రయత్నపూర్వకంగా తొక్కిపెట్టడానికి చేసిన ప్రయత్నమనే నిర్ధారణకు రాక తప్పదని కమిషన్ వ్యాఖ్యానించింది. కమిషన్ ముందు వాదనలు జరుగుతున్న రోజుల్లో పోలీసుల తరపున వకాల్తా పుచ్చుకున్న ప్రభుత్వ న్యాయవాదులు ఇంకొక ప్రభుత్వ శాఖ అయిన విద్యాశాఖ మీద, అందులోని ఉపాధ్యాయుల మీద తప్పుడు సాక్ష్యాలు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ కమిషన్– స్కూలు రికార్డుల విశ్వసనీయతను ప్రభుత్వమే ప్రశ్నించడం ఆసక్తికరం అన్నది. పోలీసులను వెనకేసుకు రావడానికి ప్రభుత్వం ఎంత దూరం వెళ్తుందో అర్థం చేసుకోడానికి ఇది పనికి వస్తుంది.


నలుగురు నిందితులను రిమాండుకు పంపిన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పనితీరు మీద కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ముందుగా తయారు చేసిన రిమాండు రిపోర్టు మీద ఆయన సంతకం చేసాడని, వాళ్ళను ఎప్పుడు, ఏ సమయంలో నిర్బంధంలోకి తీసుకున్నారో ఆయన పరిశీలించలేదని, చట్టం ప్రకారం ఆయన చేయాల్సిన రికార్డుల పరిశీలన చేయలేదని, నిందితులకు ఉన్న హక్కుల గురించి చెప్పలేదని స్పష్టం చేసింది. ఈ విధులను నిర్వర్తించని పక్షంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కమిషన్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. జుడీషియల్‌ రిమాండు విధించే అధికారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటుకు ఉండటానికి వీలు లేదని సిఫారసు చేసింది. ఇది పోలీసు వ్యవస్థకు అతీతంగా వ్యవహరించని రెవెన్యూ యంత్రాంగం పనితీరు మీద వ్యాఖ్యానంగా పరిగణించాలి.


అదే విధంగా నిందితులను డిసెంబరు 2, 2019న పోలీసు కస్టడీకి ఇచ్చిన అదనపు సివిల్ జడ్జి పనితీరు గురించి చాలా చర్చించింది కమిషన్. కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు న్యాయమూర్తి ముందు ఎటువంటి పత్రాలు సమర్పించలేదు. ఆయన కూడా వాటిని సమర్పించాలని ఒత్తిడి చేయలేదు. జైలు రిమాండు విధించిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు ఆదేశాన్ని మాత్రమే న్యాయమూర్తి పరిశీలించాడు (ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు ఎంత బాధ్యతాయుతంగా రిమాండ్ విధించాడో పైన చూసాం). ఈ సందర్భంగా ఏ పోలీసు అధికారి కోర్టుకు హాజరు కాలేదు. కోర్టు కానిస్టేబుల్ మాత్రమే పోలీసు కస్టడీ పిటిషన్ సమర్పించాడు. నిందితులకు నోటీసు ఇచ్చారా అని న్యాయమూర్తి అడగలేదు. ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయమేమంటే ప్రభుత్వ న్యాయవాది కూడా హాజరు కాలేదు. అయినా ‘వాదనలు వినడమైనది’ అని రిపోర్టులో న్యాయమూర్తి రాశాడు. నలుగురు నిందితులను ఆయన ముందు అసలు అసలు ప్రవేశపెట్టనే లేదు, అయినా పిటిషన్‌లో నిందితుల సంతకాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ నిర్వాకం గురించి కమిషన్ ఆశ్చర్యపోయింది. కానీ నిజానికి నిందితులు జైల్లో ఉండగానే వారి పరోక్షంలో, వారికి నోటీసులు ఇవ్వకుండా, వారి తరపున న్యాయవాదులే లేకుండా పోలీసు రిమాండు ఇచ్చే దుర్నీతిని పేద నిందితుల విషయంలో న్యాయస్థానాలు చాలా కాలంగా కొనసాగిస్తున్నాయి. చట్టబద్ధ పాలనపైన విశ్వాసం న్యాయస్థానాలకే లేకపోతే, వాటి పనితీరుకు విశ్వసనీయత ఎక్కడ నుండి వస్తుంది? ఈ విశ్వసనీయత ఎంత తగ్గి పోతుంటే అంతగా నేరస్థుల పట్ల తక్షణ కఠిన వైఖరి (దీనికి ‘తక్షణ న్యాయం’ అని ముద్దు పేరు పెట్టుకున్నారు) ప్రదర్శించే హక్కు ప్రభుత్వానికి ఉండాలని వాదించే గళాలు పెరిగిపోతున్నాయి. ఇదంతా ప్రభుత్వాల నియంతృత్వానికి, కనీసం బలహీనుల విషయంలో, దారితీస్తుంది.


సంఘటనా స్థలానికి ఎప్పుడు చేరుకున్నారు అనే విషయంలో ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించడానికి పోలీసులు ప్రయత్నించారని కమిషన్ వ్యాఖ్యానించింది. నిందితులు చంపబడ్డ సమయానికి సంబంధించి ఘటనలో పాల్గొన్న పోలీసుల వాదనకు, పంచనామా నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇచ్చిన సమాచారానికి, ఆ తర్వాత పోలీసుల పరిశోధనలో తేలిన విషయాలుగా ప్రకటించిన వాటికి మధ్య పొంతనే లేదనే నిర్ణయానికి కమిషన్ వచ్చింది. ఇంత ప్రాథమికమైన విషయంలో మొత్తం యంత్రాంగం ఎందుకు విఫలమైనట్టు? ఏమి దాచిపెట్టడానికి ఈ వైఫల్యాన్ని ప్రదర్శించారు? తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణాలో వేల ఎదురు కాల్పులు జరిగాయి కదా? అవన్నీ వాస్తవంగా జరిగిన ఘటనలే అని వాదిస్తూ వచ్చారు కదా? ఈ ఒక్క ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన మీద, నేర న్యాయ వ్యవస్థలో 40 నుంచి 50 ఏళ్ల అనుభవం ఉన్న న్యాయమూర్తుల విచారణ జరగగానే, ఇన్ని అబద్ధాల కంకాళాలు బయటపడ్డాయంటే, ఇంతకాలం పోలీసు వ్యవస్థ ఏమి చేసినట్టు?


చనిపోయిన నిందితుల దాడిలో గాయపడిన ఇద్దరు పోలీసులు కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందారనే వాదనను కమిషన్ చాలా శ్రద్ధగా పరిశీలించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మెడికో లీగల్ రికార్డులు మాత్రమే మొదటగా పోలీసులు అందించారు. చికిత్సకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులను కేర్ హాస్పిటల్ ఇవ్వడానికి నిరాకరించిందని పరిశోధనాధికారి చెప్పారు. కానీ కేర్ హాస్పిటల్ వర్గాలు మొదటగా మొత్తం రికార్డులను జాతీయ మానవ హక్కుల సంఘానికి ఇవ్వడానికే నిరాకరించి, ఆ తర్వాత కొంత ఇచ్చాయి. ఆ తర్వాత సోమయ్య అనే అధికారికి ఇచ్చినట్టు కమిషన్ ముందు చెప్పాయి. జుడీషియల్‌ మేజిస్ట్రేటు కూడా తాను డాక్టర్లు ఇచ్చిన, గాయపడిన వారి మొత్తం రికార్డులను పరిశీలించి మొత్తం సవ్యంగా ఉన్నట్టు భావించానని కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. కానీ గాయపడ్డారన్న పోలీసులను మేజిస్ట్రేట్ ప్రత్యక్షంగా విచారించలేదని, తాము చెప్పిన విషయాలను ఎఎస్ఐ రికార్డు చేసుకుని మేజిస్ట్రేటుకు ఇచ్చారని, గాయపడ్డామన్న పోలీసులు చివరకు అంగీకరించారు. చివరకు కమిషన్ ఒత్తిడి చేయగా, అందించిన సీటీ స్కాన్, ఎక్స్‌రేలకు, పోలీసులు తమకు తగిలాయని చెప్పిన గాయాలకు ఎక్కడా పొంతన లేదని కమిషన్ పేర్కొంది. ఇద్దరు పోలీసులకు కేర్ హాస్పిటల్ ఐసిసియులో చికిత్స చేశారనే వాదనను సందేహించాల్సి వస్తుందని, ఎందుకంటే వారికి తగిలిన గాయాలకు హాస్పిటలులో చేర్చాల్సిన అవసరమే లేదని కమిషన్ అభిప్రాయపడింది. నిందితులైన పోలీసులు తమపై వచ్చిన అభియోగాలను కోర్టులలో తేల్చుకుంటాం అని ప్రకటించారు. ఆ అవకాశాన్ని దిశా కేసులో నిందితులకు వ్యవస్థ, మీడియా, సమాజం ఇచ్చిందా? తమ వాదన వినకుండా శిక్షించకూడదు అనే సూత్రం మీద మనకు నిజంగా విశ్వాసం ఉందా? లేదూ ఆచరణలో బలవంతులకు మాత్రమే ఉందనే ధీమానా?


జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బట్టి పోలీసు వ్యవస్థ మనసెరిగి పనిచేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు, జుడీషియల్‌ మేజిస్ట్రేటు, డాక్టర్లు, కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, గెస్ట్‌హౌసుల యజమానులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణులు చాలా సంసిద్ధంగా ఉన్నారని అర్థమౌతుంది. సకల సంస్థలు పోలీస్ యంత్రాంగానికి గులాంగిరి చేస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందనగలమా? గుడిగండ్ల గ్రామ బడిపంతులు నరసింహులు మాత్రమే మిణుకు, మిణుకు అనే సత్యం వైపు బలంగా నిలబడ్డాడు. ఆయనకు సెల్యూట్.

మురళి కర్ణం

‘నల్సార్‌’ యూనివర్సిటీ

Read more