ఘనవిజయాలు

ABN , First Publish Date - 2022-12-09T00:47:58+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రంలో బీజేపీ విజయం ఊహించిందే కానీ, అది ఇంత ఘనంగా ఉంటుందని అనుకోలేదు. ఆరుసార్లు అధికారంలో ఉన్న తరువాత...

ఘనవిజయాలు

ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రంలో బీజేపీ విజయం ఊహించిందే కానీ, అది ఇంత ఘనంగా ఉంటుందని అనుకోలేదు. ఆరుసార్లు అధికారంలో ఉన్న తరువాత, ఇలా ఏడోసారి యాభైశాతాన్ని దాటిన ఓట్లతో గతరికార్డులన్నీ బద్దలుకొడుతూ అధికారంలోకి రావడం ఆశ్చర్యకరమైన విషయం. స్వరాష్ట్రంలో మోదీ ప్రాభవం చెక్కుచెదరలేదనడానికి ఇది నిదర్శనం. హిమాచల్ లో అధికారంలో ఉన్న బీజేపీని పాతికస్థానాలకు పరిమితం చేసి, నలభైస్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ విజయం మరింత విశేషమైనది. నాలుగేళ్ళ క్రితం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలను గెలుచుకొని, ఆ తరువాత గోవా, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ లలో బీజేపీ చేతుల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ కు ఈ విజయం పెద్ద ఉపశమనం. బీజేపీ అధ్యక్షుడు నడ్డా స్వరాష్ట్రంలో తమ విజయపతాకకు ప్రియాంకవాద్రా కారకురాలని కాంగ్రెస్ సగర్వంగా చెప్పుకుంటోంది.

గుజరాత్ లో బీజేపీ అఖండ విజయానికి మోదీ కంటే కేజ్రీవాల్ ను ఎక్కువగా మెచ్చుకోవాలన్న రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలను అటుంచితే, ఈ మారు బీజేపీ రాష్ట్రంలోని అన్ని దిక్కుల్లోకీ, పట్టణ గ్రామీణ తేడాలేకుండా అన్ని చోట్లకూ చొచ్చుకుపోయింది. ఆమ్ ఆద్మీ ముఖ్యమంత్రి అభ్యర్థితో సహా ఆ పార్టీకి చెందిన ప్రముఖులందరినీ ఓడించింది. సహజ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తూ వరుసగా ఆరుసార్లు అధికారంలో సాగడం, ఏడోమారు 1985లో కాంగ్రెస్ సాధించిన 149స్థానాల రికార్డును కూడా చెరిపివేయడం చిన్న విషయం కాదు. మూడేళ్ళనాటి లోక్ సభ ఎన్నికల్లో 62శాతం ఓట్లతో 173 అసెంబ్లీ స్థానాలకు సమానమైన 26 పార్లమెంటు స్థానాలను బీజేపీకి కట్టబెట్టిన గుజరాతీయులు ఇప్పటికీ అదే స్థాయిలో ఆ పార్టీకి, గుజరాత్ అంటే మోదీయే అన్న భావనకు కట్టుబడి ఉన్నారు. మోదీ, హిందూత్వ, విపక్ష చీలికలు కలగలిసి ఈ విజయాన్ని అందించాయి. మోదీ దేశానికి ప్రధాని కావచ్చుగానీ, గుజరాత్ కు మాత్రం ఆయన జీవితకాలపు ముఖ్యమంత్రి అని ఫలితాలు చెబుతున్నాయి. 182 అసెంబ్లీస్థానాలున్న గుజరాత్ లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టకుండా, ముస్లిం జనాభా ఆధిక్యం ఉన్న 19 అసెంబ్లీస్థానాల్లో 17 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ౨7 ఆదివాసీ స్థానాల్లో 23 గెలుచుకుంది. వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీ వాటా పెరగడం వెనుకా, ఓట్లలోనూ సీట్లలోనూ కాంగ్రెస్ దెబ్బతినడం వెనుకా కొత్తగా రంగప్రవేశం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పాత్ర స్పష్టంగానే కనిపిస్తోంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని వరుసగా మూడుసార్లు ఏలిన కాంగ్రెస్, ఏమాత్రం గట్టిపోటీ ఇవ్వకుండా చతికిలబడిపోతున్న స్థితిలో, ఇక్కడ తెచ్చుకున్న ఓట్లతో ఆప్ జాతీయపార్టీగా అవతరించబోతున్నది.

అధికారపక్షాన్ని ఓడించడం హిమాచల వాసుల సంప్రదాయమని అనుకున్నప్పటికీ, మోదీ హవాకు పరిమితులుంటాయని ఈ రాష్ట్ర ఫలితాలు చెబుతున్నాయి. మోదీ పలుమార్లు హిమాచల్ వచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. అభ్యర్థిని చూడకుండా కమలం గుర్తుకు ఓటేస్తే అది తనకు వేసినట్టేనని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. అయినా, దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. స్వరాష్ట్రం గుజరాత్ ను అటుంచితే, యూపీలో యోగి మాదిరిగా స్థానికంగా ఓ బలమైన నాయకుడు ఉంటేనే మోదీ హవా మరింత పనిచేస్తుందని హిమాచల్ గుర్తుచేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సమస్య, యాపిల్ రైతుల బాధలు వంటివి ఇక్కడ పనిచేశాయి తప్ప మోదీ హవా, డబుల్ ఇంజన్ నినాదాలు వారిని ప్రభావితం చేయలేకపోయాయి. జోడోయాత్రలో ఉన్న రాహుల్ హిమాచల్ వైపు కన్నెత్తిచూడకపోయినా, ప్రియాంక చాలా సభల్లో పాల్గొని, స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. వరుస ఓటములు, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో చేజేతులా చేసుకున్న పాపాల తరువాత, హిమాచల్ విజయం కాంగ్రెస్ కు పెద్ద ఉపశమనం. రాష్ట్రస్థాయి బలమైన నాయకుడు లేనప్పటికీ, గుజరాత్ లో మాదిరిగా చేతులెత్తేయకుండా, అధికారపక్షంమీద వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుంటూ, గట్టి పోటీ ఇచ్చి నలభైస్థానాలు గెలుచుకున్నందుకు అది తనను తాను అభినందించుకోవాలి.

ఈ రెండు రాష్ట్రాల ఫలితాలతో ఈ ఏడాది ముగిసిపోయినా, వచ్చే ఏడాది నాలుగు ఈశాన్య రాష్ట్రాలతోపాటు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలు ఎన్నికలకు పోబోతున్నాయి. సార్వత్రక ఎన్నికల్లో మోదీ ప్రభావం ఉన్నా, రాష్ట్రాల ఎన్నికలకు వచ్చేసరికి ఇతరత్రా అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయన్న నమ్మకంతో విపక్షాలు ఆ ఎన్నికలకు సంసిద్ధం కావచ్చు.

Updated Date - 2022-12-09T00:48:09+05:30 IST