ఇంకెన్నాళ్లీ అక్రమ నిర్బంధం?

ABN , First Publish Date - 2022-06-07T06:11:31+05:30 IST

భీమాకోరేగాం – ఎల్గార్ పరిషద్ కేసులో మొట్టమొదటి అరెస్టులు జరిగి జూన్ 6కు నాలుగు సంవత్సరాలు. ఈ కేసు అనేక రకాలుగా ప్రత్యేకమైనది.

ఇంకెన్నాళ్లీ అక్రమ నిర్బంధం?

భీమాకోరేగాం – ఎల్గార్ పరిషద్ కేసులో మొట్టమొదటి అరెస్టులు జరిగి జూన్ 6కు నాలుగు సంవత్సరాలు. ఈ కేసు అనేక రకాలుగా ప్రత్యేకమైనది. అది భీమా కోరేగాం గ్రామంలో జరిగిన స్థానిక హింసాకాండ మీద కేసుగా మొదలయింది గాని ఆ హింసాకాండతో ఎటువంటి సంబంధమూ లేని, ఆ ప్రాంతానికే ఎప్పుడూ వెళ్లని సామాజిక కార్యకర్తల మీద, ప్రజా మేధావుల మీద దేశవ్యాప్త కేసుగా మారింది. హింసాకాండకు బాధ్యులైనవారిని పూర్తిగా వదిలేసి, ఆ హింసాకాండలో బాధితులైన దళితుల మీద, వారి సమర్థకుల మీద కేసుగా మారింది. హింసాకాండకు ముందురోజు ముప్పై కి.మీ. దూరంలో జరిగిన సభలోని ఉపన్యాసాలను, పాటలను నేరారోపణలుగా చూపుతూ, అక్కడి నుంచి విస్తరించి ఆ సభే మావోయిస్టుల కుట్రలో భాగంగా జరిగిందనే ఆరోపణకు మారింది. దర్యాప్తులో నిందితుల ఎలక్ట్రానిక్ సాధనాలను స్వాధీనం చేసుకుని వాటిని పరిశోధించినప్పుడు, ప్రధానమంత్రి హత్యతో సహా ప్రభుత్వ వ్యతిరేకతకు కుట్ర జరిగిందనే ఆధారాలు దొరికాయని పోలీసులు ఆరోపించారు. కాని అంతటి ‘మహా నేరాల’పైన నాలుగు సంవత్సరాలు గడిచినా, దాదాపు పదివేల పేజీల చార్జిషీట్లు పెట్టినా, ఇంతవరకూ విచారణే ప్రారంభం కాకపోవడం హాస్యాస్పదం.


కాగా, ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ కేసు అనేక మలుపులు తిరిగింది. అవకతవకలు, అబద్ధాలు, మాట మార్చడాలు, దర్యాప్తు సంస్థ మార్పు చోటు చేసుకున్నాయి. కేసు ప్రారంభమయిన పూణే ప్రత్యేక కోర్టు నుంచి ఇప్పుడు చూస్తున్న ఎన్ఐఎ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. బొంబాయి, ఢిల్లీ, పంజాబ్–హర్యానా, తెలంగాణ హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసుకు సంబంధించిన వేర్వేరు వ్యవహారాలను కనీసం ఇరవై ఐదు మంది న్యాయమూర్తులు పరిశీలించారు, కనీసం పది మంది న్యాయమూర్తులు ‘ఈ కేసు మాముందు కాదు’ (నాట్ బిఫోర్ మి) అని ఉపసంహరించుకున్నారు. కొండలకు కొండలనే తవ్వేశారు, కాని నేరపు చిన్నారి ఎలుక కూడ దొరకలేదు. కాని ఈ కేసు నిర్బంధకాండ ఇప్పటికే జనమేధావుల్లో ఒకరిని పొట్టన పెట్టుకుంది, మరొక పదహారు మంది రెండేళ్ల నుంచి నాలుగేళ్లుగా నిష్కారణంగా, అన్యాయంగా జైళ్లలో మగ్గిపోయేలా చేస్తున్నది.


2018 జనవరి 1న 200 సంవత్సరాల భీమా కోరేగాం‌ ప్రత్యేక విజయోత్సవాల మీద శంభాజీ భిడే, మిళింద్ ఎక్బోటే నాయకత్వంలో సంఘ్ పరివార్ శక్తులు దాడి చేసి, అక్కడికక్కడే ఒకరిని చంపి, అనేక మందిని గాయపరిచారు. ఇళ్లు, వాహనాలు ధ్వంసం చేశారు. వెంటనే ఆ ఇద్దరి పేర్లతో ఫిర్యాదు దాఖలయి, ఎఫ్ఐఆర్ నమోదయింది. ఆ ఎఫ్ఐఆర్ మీద ఏ చర్యా తీసుకోని పోలీసులు, వారం తర్వాత పూణేలో ఒక స్థానిక వ్యాపారి చేసిన మరొక ఫిర్యాదు మీద మరొక ఎఫ్ఐఆర్ తయారు చేసి దాని మీద మాత్రం వెంటనే చర్యలు ప్రారంభించారు. స్థానిక దొమ్మీ కేసును, పెద్ద కేసుగా మార్చడానికి మార్చ్‌లో దానిలో నేరపూరిత కుట్ర (సెక్షన్ 120 బి) చేర్చి, దేశవ్యాపిత కుట్ర అనే కట్టుకథ ప్రారంభించారు.


ఆ కట్టుకథలో భాగంగా మొట్టమొదటి అరెస్టులుగా జూన్ 6న నాగపూర్‌లో న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌ను, ఇంగ్లిష్ ప్రొఫెసర్ షోమా సేన్‌ను, ఆదివాసి అధ్యయనాల పరిశోధకుడు మహేష్ రౌత్‌ను, ముంబయిలో సాంస్కృతిక కార్యకర్త సుధీర్ ధావ్లేను, ఢిల్లీలో పరిశోధక విద్యార్థి రోనా విల్సన్‌ను అరెస్టు చేశారు. ఆ ఐదుగురూ విచారణలో ఉన్న ఖైదీలుగా ఇప్పటికి నాలుగు సంవత్సరాలు (పద్నాలుగు వందల అరవై రోజులు) చీకటి కొట్లలో నిర్బంధంలో గడిపారు. వారిని అరెస్టు చేసినప్పుడు పోలీసులు పత్రికా సమావేశాలు పెట్టి మరీ ప్రకటించిన భారీ నేరారోపణల మీద కనీస విచారణ కూడ ప్రారంభం కాలేదు. అసలు పత్రికా సమావేశాల్లో ప్రకటించిన సంచలనాత్మక ఆరోపణలు ఆరు నెలల తర్వాత సమర్పించిన చార్జిషీట్ లోకే ఎక్కలేదు. ‘దేశ భద్రతకు ఎంతో ప్రమాదకరమైన వ్యక్తులు’గా అభివర్ణించిన ఆ నిందితుల నేరాలేమిటో దర్యాప్తు చేసి, నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో న్యాయస్థానాలలో రుజువు చేయడానికి ప్రభుత్వానికీ, పోలీసులకూ, ప్రాసిక్యూషన్‌కూ ఇంకా సమయమే దొరకలేదు. ‘నేరం రుజువయ్యేవరకూ నిందితులు నిరపరాధులే’ అని చెప్పే సహజ న్యాయసూత్రాలు, భారత న్యాయశాస్త్ర తాత్విక దృక్పథం అమలులోకి రాలేదు. ‘ఒక్క నిరపరాధి కూడ శిక్ష అనుభవించగూడదు’, ‘విచారణలో ఉన్న నిందితులకు బెయిల్ సాధారణం, జైలు అసాధారణం’ అనే భారత న్యాయశాస్త్రం ఆమోదించే మౌలిక సూత్రాలు ఈ కేసులో గాలికి ఎగిరిపోయాయి.


ఈ ఐదుగురు నిరపరాధులు నాలుగు సంవత్సరాలుగా ‘శిక్ష కాని శిక్ష’ అనుభవిస్తూ ఉండవలసి వచ్చింది. ఆ ఐదుగురు మాత్రమే కాదు, కాలక్రమంలో మరొక పదకొండు మందిని కూడ ఈ కేసులో అరెస్టు చేశారు. వాళ్లలో ఒకరైన 84 సంవత్సరాల వృద్ధుడు, జెసూయిట్ ఫాదర్, ఆదివాసుల కోసం జీవితమంతా ధారపోసిన ఫాదర్ స్టాన్ స్వామి మీద ఏ శిక్షా పడకుండానే, విచారణ కూడా జరగకుండానే మరణశిక్ష ‘అమలయింది’. మిగిలిన పది మంది ఒక్కొక్కరు రెండు సంవత్సరాల నుంచి మూడున్నర సంవత్సరాల వరకు ఈ అన్యాయమైన నిర్బంధంలోనే మగ్గిపోవలసి వస్తున్నది.


ఇంతకూ ఈ కేసులో నేరారోపణలకు సాక్ష్యాధారాలుగా చూపినవి నిందితుల కంప్యూటర్లలో దొరికాయని చెపుతున్న పత్రాలు, ఉత్తరాలు. ఒక్కటంటే ఒక్క చర్య, క్రియ లేదు. ఏ ఒక్కరి శరీరానికో, ప్రాణానికో, ఆస్తికో హాని జరిగిన ఘటన లేదు. నేరమే లేదు. కేవలం అక్షరాలు మాత్రమే ‘నేరాలు’. ఇంకా హాస్యాస్పదమైన విషయమేమంటే ఆ ఉత్తరాలు, పత్రాలు ఆ నిందితులే రాశారని చెప్పే ఆధారమేదీ లేదు. వారి కంప్యూటర్లలోకి ఆ పత్రాలు ఎలా వచ్చి చేరాయో అంతర్జాతీయ ప్రామాణిక సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు రుజువు చేశాయి. మాల్‌వేర్తో దొంగచాటుగా కంప్యూటర్‌లోకి చొరబడి వినియోగదారుకు తెలియకుండా అందులోకి నేరారోపణలు చేయడానికి వీలైన పత్రాలను రహస్య అరలలో దాచిపెట్టారని అంతర్జాతీయ డిజిటల్ ఫోరెన్సిక్ పరిశోధనా సంస్థల నివేదికలు ప్రకటిస్తున్నాయి. దాచిన వస్తువును కనిపెట్టడం దాచినవారికి మాత్రమే సాధ్యమవుతుంది గనుకనే దర్యాప్తు సంస్థలు నేరుగా వారి ఇళ్లకు వెళ్ళి, వారి కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని, తాము దాచిపెట్టిన నేరారోపణకు అనువైన పత్రాలను తామే వెలికి తీసి సాక్ష్యాధారాలుగా న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టాయి.


అలా పూణే పోలీసుల కట్టుకథలతో ప్రారంభమైన ఈ కేసు తప్పులతడక అనీ, నిజమైన నేరస్థుల మీద కేసు పెట్టకుండా, నిరపరాధులైన సామాజిక కార్యకర్తల మీద పెట్టారనీ, తాము దర్యాప్తు అధికారుల మీద దర్యాప్తు చేయిస్తామనీ, 2019 నవంబర్ ఎన్నికల్లో అధికారానికి వచ్చిన కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ పూణేలో జరిగిన బహిరంగ సభలో పోలీసు అధికారుల పేరు చెప్పి మరీ నిప్పులు చెరిగారు. వెంటనే కేంద్ర హోం మంత్రిత్వశాఖ రంగంలోకి దిగి కేసును మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పించి, తన అధీనంలో నడిచే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది. ఒకవైపు దుర్మార్గమైన యుఎపిఎ కేసు, మరొకవైపు నాగరిక దర్యాప్తు పద్ధతులకూ ఆమడ దూరం ఉండే ఎన్ఐఎ దర్యాప్తు కలిసి ఈ కేసు మరింత జటిలమైపోయింది.


ఖైదీల కనీస ప్రాథమిక హక్కులను ఎన్ఐఎ కాలరాస్తున్నది. ఉత్తర ప్రత్యుత్తరాలు, ములాఖాత్‌లు, జైల్లో చదువుకునే, రాసుకునే సౌకర్యాలు, కళ్లజోళ్లు, మంచినీళ్ల సీసాలు, చెయ్యి వణుకుతున్నది గనుక గ్లాసులోంచి నీళ్లు పీల్చుకునే సిప్పర్, జైలు ప్రాంతంలో డెంగ్యూ, మలేరియా వ్యాపిస్తున్నాయి గనుక దోమతెర వంటి అత్యంత సాధారణ మానవ సహజ అవసరాలకు కూడా కోర్టులకు దరఖాస్తు చేసుకోవలసి వస్తున్నది. నెలల తరబడి వాయిదాలతో కాలయాపన జరుగుతున్నది. చావు బతుకుల పరిస్థితి ఏర్పడ్డాక, జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికిన తర్వాత వరవరరావుకు బొంబాయి హైకోర్టు ఆరోగ్య కారణాలపై షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కాని ఈ జూలైలో మళ్లీ జైలుకు వెళ్లవలసిందేనని ఇటీవలనే తీర్పు ఇచ్చింది. ఎనిమిది మందికి సమానంగా వర్తించే కారణాలుండగా, ఒక్క సుధా భరద్వాజ్‌కు మాత్రం బెయిల్ ఇచ్చి, మిగిలిన ఏడుగురికి నిరాకరించింది. మిగిలిన నిందితులలో ఒక్కొక్కరికి ఎన్ని కోర్టులు ఎన్నిసార్లు బెయిల్ నిరాకరించాయో లెక్కలేదు. యుఎపిఎలోని 43(డి)(5) అనే నిబంధన వల్ల బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదనే సాకుతో న్యాయస్థానాలు బెయిల్ నిరాకరిస్తున్నాయి.


కేసులో ప్రాథమిక ఆరోపణలు అబద్ధం. సాక్ష్యాధారాలుగా చూపుతున్నవి అబద్ధం. దర్యాప్తు సంస్థను మార్చడం అక్రమం. ఆ దర్యాప్తు సంస్థ తన పరిధి దాటి మిగిలిన అన్ని సంస్థల మీద పెత్తనం చలాయించడం అక్రమం. నాలుగు సంవత్సరాలుగా విచారణ కొనసాగకపోవడం అన్యాయం. విచారణ సాగుతున్నప్పుడు బెయిల్ ఇవ్వకపోవడం దారుణం. ఈ అన్యాయాల, అబద్ధాల, అక్రమాల, దారుణాల చరిత్రలో ఖైదీల, వారి కుటుంబ సభ్యుల దుస్సహ వేదన ఒక్కటి మాత్రమే నిజం. 


ఇప్పటికైనా న్యాయస్థానాలు, అధికార వ్యవస్థలు ఈ అక్రమాన్ని ఆపుతాయా? ఈ అక్రమాన్ని ఆపే ప్రజాభిప్రాయం రూపొందుతుందా? పౌరసమాజం సంఘటితమవుతుందా?


ఎన్.వేణుగోపాల్

Read more