భగీరథ అద్భుతం మల్లన్నసాగర్‌

ABN , First Publish Date - 2022-02-23T06:07:45+05:30 IST

సమాజం సంపద చుట్టూ తిరుగుతుంటే.. సంపద నీటి చుట్టూ తిరుగుతుందనేది ఆర్థికవేత్తల మాట. నీరు పుష్కలంగా ఉన్న చోటే సంపద వృద్ధి చెంది సకల రంగాల పురోగతికి బాటలు వేస్తుంది....

భగీరథ అద్భుతం మల్లన్నసాగర్‌

సమాజం సంపద చుట్టూ తిరుగుతుంటే.. సంపద నీటి చుట్టూ తిరుగుతుందనేది ఆర్థికవేత్తల మాట. నీరు పుష్కలంగా ఉన్న చోటే సంపద వృద్ధి చెంది సకల రంగాల పురోగతికి బాటలు వేస్తుంది. పారే నదులకు ప్రాజెక్టుల నిర్మాణంతో కళ్లెం వేసి పొలాలకు మళ్లిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం, వివక్ష మూలంగా పూర్వీకుల నుంచి వారసత్వంగా లభించిన చెరువులు, కుంటలు నిర్వహణ లేక దెబ్బతిన్నాయి. నెర్రెలు వారిన కట్టలు, శిథిలమైన అలుగులు, తూములతో పూడిక తీసే నాథుడు లేక చెరువులు బట్టలు ఉతకడానికే కాదు, కనీసం బతుకమ్మలు కూడా వేయలేని దుస్థితికి చేరుకున్నాయి. ఫలితంగా వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతిని రైతాంగం ఆర్థికంగా దివాళా తీసి ఆత్మహత్యల బాట పట్టింది.


వనరుల పరంగా చూస్తే దక్కను పీఠభూమిలో అంతర్భాగమైన మెతుకు సీమ వెనుకబడిన ప్రాంతమేమీ కాదు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్‌ నియోజకవర్గాల మీదుగా మంజీరా నది 120 కిలోమీటర్లు ప్రవహించి నిజాంసాగర్‌కు చేరుతుంది. వీటితో పాటు గంగకత్వ, నారింజా, హల్దీ, కూడవెళ్లి, అక్కెనపల్లి, పెద్దవాగు, నందివాగు, దబ్బవాగు, నక్కవాగు, పాములవాగులు మెతుకు సీమ అంతటా జలకళను నింపేవే. వాగులు, వంకలకు జీవం పోసే వందలాది గొలుసుకట్టు చెరువులు, వేలాది కుంటలు అడుగడుగునా మెదక్‌ నేలన కనిపిస్తాయి.


మెదక్‌ జిల్లాలోని జల వనరులన్నీ గోదావరి పరివాహక ప్రాంతం పరిధిలోకే వస్తాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టు, ఘనపురం ఆనకట్టను ఇసుక మేటల నుంచి కాపాడే లక్ష్యంతో 1970వ దశకంలో 40 వేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి మంజీరా నదిపై సింగూరు ప్రాజెక్టు నిర్మితమైంది. కానీ ఉమ్మడి పాలకుల నిర్లక్ష్య వైఖరితో కాలక్రమంలో హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు తీర్చే రిజర్వాయర్‌గా మాత్రమే సింగూరు మిగిలిపోవడంతో ప్రాజెక్టు లక్ష్యం పూర్తిగా దెబ్బతింది. ఉమ్మడి రాష్ట్ర పాలకులకు దూరదృష్టి, సరైన సాగునీటి విధానాలు లేకపోవడం, జల వనరులపై నిర్లక్ష్యం, వివక్ష తదితరాల మూలంగా ‘మెతుకు’ సీమ ఆకలిచావులు, ఆత్మహత్యలకు చిరునామాగా మారింది. మంజీరా నదికి చేరువగా ఉన్న నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం బొంబాయి, భివండి, షోలాపూర్‌లకు వలసలు కొనసాగాయి. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, రామాయంపేట, నర్సాపూర్‌ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి.


కొత్త ఆలోచనలు, దృక్పథాలు ఆకాశం నుంచి ఊడిపడవు. ప్రజలతో నిత్యం మమేకమయ్యే దీర్ఘ దృష్టి కలిగిన కె.చంద్రశేఖర్‌రావు వంటి జన నేతల హృదయం నుంచే పుట్టుకొస్తాయి. మానవ తప్పిదాల వల్లే నీటి సంక్షోభం పుట్టుకొస్తుందని బలంగా గుర్తించిన పర్యావరణవేత్త సీఎం కేసీఆర్‌. ఈ సంక్షోభాన్ని బహుముఖ కార్యాచరణతోనే ఎదుర్కొనగలమని భావించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఆయన నడుం బిగించారు. పక్కా కార్యాచరణ రూపొందించి అమలు దిశగా ఏడేండ్లకు పైగా వేస్తున్న అడుగులు ఇప్పుడు ఎటు చూసినా పచ్చదనం రూపంలో దర్శనమిస్తున్నాయి. మిషన్‌ కాకతీయతో చెరువులు, కుంటలు పునరుద్ధరణ, హరితహారంతో పచ్చదనం పెంపు, అర్బన్‌ ఎకోపార్కులు, పల్లె ప్రకృతి వనాలు పేరిట మానవ తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నాలు పకడ్బందీగా సాగుతున్నాయి.


తెలంగాణ దశాబ్దాల దాస్య శృంఖలాలను తెంపిన ఉద్యమనేత కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా పాలనా దక్షతతో చేసిన ప్రణాళికలు ఒకటొకటిగా ఆచరణ రూపం దాల్చుతున్నాయి. లక్షా 20వేల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం సుమారు 80శాతానికి పైగా తెలంగాణలోనే ఉంది. మెదక్‌ జిల్లా జల వనరులన్నీ ఈ పరివాహక ప్రాంతానికి చెందినవే. గోదావరి నది మీద చేపట్టిన బహుళ దశల కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇప్పటికే మెతుకు సీమను ముద్దాడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో చేపట్టిన రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్‌ జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల నుంచి విడుదలైన నీటితో సిద్దిపేట వాగు, కూడవెళ్లి వాగు, హల్దీ వాగులు నిండు వేసవిలోనూ జల సవ్వడి వినిపించగా, చెరువులు, కుంటలు నిండు గర్భిణిని తలపిస్తున్నాయి. తడారిపోయిన ఎడారుల లాంటి బీడు భూములను సస్యశ్యామలం చేసే దిశగా గోదావరి పరుగులు పెడుతోంది. ఇన్నాళ్లూ పాతాళ గంగపై ఆధారపడి కన్నీటి సేద్యం చేసిన రైతాంగం ఇకపై ప్రవహించే నీళ్లతో బంగారు సిరులు పండించే రోజులొచ్చాయి.


‘వృధాగా పోతుంటే మంజీరా.. రైతన్నల కండ్ల నిండ కన్నీరా..’ అని పాడుకునే రైతుల వేదన తీర్చేలా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టును గోదావరి జలాలతో నింపి.. అక్కడ నుంచి నీటిని ఎగువ ప్రాంతానికి లిఫ్ట్‌ చేసే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సోమవారం నాడు తెలంగాణ అభివృద్ధి ప్రదాత, అపర భగీరథుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 3.90లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకాల పనులు ఏడాదిన్నరలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడో 70 మీటర్ల దిగువన ప్రవహిస్తున్న గోదావరిని జహీరాబాద్‌ నియోజకవర్గంలోని మొగుడంపల్లి వద్ద 665 మీటర్ల పైకి ఎత్తిపోయడం అపర భగీరథుడు కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమని రుజువైంది.


సంగమేశ్వర, బసవేశ్వర రెండు ప్రాజెక్టులు కాదు.. రెండు దేవాలయాలు వాటిని నిర్మిస్తున్న అపర భగీరథుడు కేసీఆర్. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సంగారెడ్డి జిల్లా నేడు అభివృద్ధికి చిరునామాగా మారనున్నది. నారాయణఖేడ్, జహీరాబాద్ ఇకపై మారుమూల ప్రాంతాలు కావు, కేసీఆర్ పాలనలో అభివృద్ధికి చిహ్నాలుగా మారుతాయి. సంగారెడ్డి జిల్లాలో కొంత ప్రాంతం పరిశ్రమలకు నిలయం, సంగమేశ్వర- బసవేశ్వర ప్రాజెక్ట్‌తో ఇకపై పాడి పంటలకు నిలయంగా మారుతుంది.


కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా తెలంగాణ నడినెత్తిన నిండుకుండను తలపించేలా 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ‘మల్లన్నసాగర్‌’ రిజర్వాయర్‌ నేడు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఎడారిలో ఒయాసిస్సును తలపిస్తున్న మల్లన్నసాగర్‌ ప్రారంభంతో తెలంగాణలో మరో అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమవుతోంది. 18లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ భారీ రిజర్వాయర్‌ కేసీఆర్‌ మదిలో పురుడు పోసుకున్న అద్భుత ఇంజనీరింగ్‌కు ప్రతిరూపం. ఈ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొన్ని ప్రతీప శక్తులు చేసిన ప్రయత్నాలను తుత్తునియలు చేసి ఈ ప్రాంత కరువును శాశ్వతంగా రూపుమాపుతున్న జల విప్లవకారులు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్‌రావుకు ఈ నేల శిరసు వంచి నమస్కరిస్తోంది. ఈ జలయజ్ఞంలో భాగస్వాములైన ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, ఇంజనీరింగ్‌ నిపుణులు, అధికారులు, కార్మికులకు అభినందనలు. తెలంగాణకు అభివృద్ధి బాటలు వేసే భారీ రిజర్వాయర్ల నిర్మాణానికి తమ భూములు అప్పగించిన రైతాంగానికి శతకోటి దండాలు.

డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, అభివృద్ధి సంస్థల చైర్మన్

Read more