కటకటాలు, ‘కర్తవ్య’ బోధలు..!

ABN , First Publish Date - 2022-10-02T06:51:22+05:30 IST

ప్రధాని మోదీ ఇటీవల ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోసు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బ్రిటిష్ రాజ్యాన్ని గుర్తుచేసే ‘రాజ’పథ్ రూపురేఖలు మార్చి ‘కర్తవ్య’పథ్ అని పేరు పెట్టారు...

కటకటాలు, ‘కర్తవ్య’ బోధలు..!

ప్రధాని మోదీ ఇటీవల ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోసు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బ్రిటిష్ రాజ్యాన్ని గుర్తుచేసే ‘రాజ’పథ్ రూపురేఖలు మార్చి ‘కర్తవ్య’పథ్ అని పేరు పెట్టారు. అక్కడ గతంలో తొలగించిన కింగ్ జార్జ్ విగ్రహం స్థానంలో బోసు విగ్రహాన్ని నెలకొల్పటం, ఈ ‘కర్తవ్య’పథ్ అన్న పేరు మార్పు– రెండూ బానిసత్వం నుంచి విముక్తికి సంకేతాలన్నారు. ‘గంగ ఉదకము తెచ్చి.. పూజలు చేతమంటే... ఎంగిల’ని గుర్తు చేసినట్టుగా, ఎంత వదిలించుకుందామన్నా బీజేపీకి కాంగ్రెస్ ‘ఎంగిలి’ పోవటం లేదు! లోగడ పటేల్, ఇప్పుడు బోసు... రెండూ కాంగ్రెస్ నాయకుల విగ్రహాలే. అంతేకాదు, ఇద్దరూ హిందూత్వ రాజకీయాల వల్ల హతుడైన గాంధీని మహాత్ముడన్నవారే.


అయినా ఆ విగ్రహాలకు కొత్త భాష్యం, కొత్త సంకల్పం చెప్పుకోవాలి కదా. వీటి విశిష్టతని మోదీ వివరిస్తూ– ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తరుణంలో ‘కర్తవ్య’పథానికి బాటలు వేస్తున్నాం అన్నారు. ఈ కర్తవ్య బాట కూడా నిజానికి కాంగ్రెసు ప్రధాని ఇందిరాగాంధీ మొదలుపెట్టిందే. ప్రాథమిక హక్కులు మాత్రమే ఉంటే చాలదని, ప్రాథమిక కర్తవ్యాల్ని కూడా చేర్చుతూ రాజ్యాంగానికి 42వ సవరణ చేసింది ఇందిరాగాంధీనే. ఆమె ఎమర్జెన్సీ కాలంలో ప్రజల హక్కుల్ని కాలరాసి, పత్రికల నోరునొక్కి, లక్షమందిని జైలుపాలు చేశారు. ఆమె తర్వాత కర్తవ్యాల్ని మళ్ళీ అంత గట్టిగా నొక్కి చెప్పింది మోదీగారే : ‘స్వతంత్రం వచ్చాక 75ఏళ్ల పాటు మన అందరికీ ఒక జబ్బు పట్టుకుంది. మనం హక్కుల గురించి మాట్లాడుతూ, కర్తవ్యాల్ని విస్మరించాం, కాలాన్ని వృథా చేశాం. కర్తవ్యాన్ని అశ్రద్ధ చేసి దేశాన్ని బలహీన స్థితికి తెచ్చాం. ఈ లోటుని వచ్చే పాతికేళ్ళు పూరించుకుందాం’ అంటూ, జనవరిలో ఒక కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. అందుకు తగ్గట్టుగానే హక్కుల్ని నొక్కి చెప్పేవారి ఆజాదీని రద్దుచేసి, చార్జి షీటు కూడా లేకుండానే జెయిల్లోపెట్టి, అత్యున్నత కోర్టుల సహకారంతో ‘కర్తవ్య’పథంలో సాగుతున్నారు. అర్బన్ నక్సల్ మేధావులే నక్సల్స్ కన్నా ప్రమాదకరం అని హోం మంత్రి అమిత్ షా నొక్కి చెప్పి, మనని ‘కర్తవ్య’పథంలో నడిపిస్తున్నారు. ఇది కాంగ్రెసు వలె ‘మాటల’ ప్రభుత్వం కాదు. అందువల్ల కర్తవ్యమెరిగి, ఒళ్లు దగ్గిర పెట్టుకొని, చాలామంది మీడియాని నడుపుతున్నారు. అడుసు తొక్కనేల, కాలు కడగనేల? ఎవరో నోరు నొక్కేస్తున్నారని అనుకోటమెందుకు? మనమే ప్రీ సెన్సార్షిప్ పాటిస్తే పోలా? పత్రికా స్వేచ్ఛని లెక్కించే ప్రపంచ ర్యాంకింగులో మన దేశం 150 స్థానానికి పడిపోయిందని మనల్ని అపఖ్యాతి పాలుచేయటానికి విదేశీ సంస్థలు చెప్తున్న మాటల్ని పట్టించుకొని జాతి వ్యతిరేకులం కావటం ఏమంత శ్రేయస్కరం కాదు కదా!


నెహ్రూ వ్యతిరేకత ‘పరివార్’ భాషే అని కొట్టిపారేయకుండా, బోసు విగ్రహ ప్రాశస్థ్యాన్ని తెల్సుకోవాలి. పాశ్చాత్య విద్యతో నెహ్రూ బ్రిటిష్ మానస పుత్రులయ్యారని అంటారు గానీ, బోసు కూడా కేంబ్రిడ్జి విద్యా సంపన్నుడే. ఇద్దరూ సోషలిస్టులే అయినా మహాత్మగాంధీ శిష్యులే. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దారులు వేరయ్యాయి. నెహ్రూ ఫాసిస్టు వ్యతిరేకిగా ఇంగ్లాండు వైపు నిల్చి, 1946లో బ్రిటిష్ హయాంలోనే తాత్కాలిక ప్రధాని అయ్యారు. బోసు జర్మనీ–జపాన్ నేతృత్వంలోని ఫాసిస్టు కూటమి మద్దతుతో జపాన్ ఆక్రమిత అండమానులో ప్రవాస ప్రభుత్వ నేత అయ్యారు. సైనిక శిక్షణ లేని కాంగ్రెస్ రాజకీయ నేత ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడెలా అయ్యారన్న ప్రశ్న కూడా చాలామందికి రాదు! బోసు హిట్లరుని 1942మేలో స్వయంగా కలిసారు. బోసుకి హిట్లరు బెర్లినులో ఉన్న ఫాసిస్టు ప్రచార రేడియో కేంద్రాన్ని, యూరపులో తనకి లొంగిన భారతీయుల్ని ఒప్పగించారు. అలాంటి మూడువేల మంది ‘ఫ్రీ ఇండియా లెజియన్’ పేరుతో జర్మనీ సేనల్లో ఉండేవారు. 1944 తర్వాత వారు నాజీ పార్టీ పోరాట విభాగంలో (Waffen–SS) భాగమయ్యారు. జర్మన్లు కాకపోయినా వారిని ‘ఆర్య సంతతి’గా చేర్చుకొన్న హిట్లరు బోసుని తమ జలాంతర్గామిలో భద్రంగా పంపగా, 1943 మేలో జపాన్ ఆక్రమణలోని దీవుల్లో దిగారు. సింగపూరు యుద్ధంలో లొంగిన భారతీయుల్ని జపాను ఆర్మీ ఆఫీసర్ల నేతృత్వంలో బోసుకి ఇచ్చారు. వలస పాలకుల తర్ఫీదులో ఎదిగిన బ్రిటిష్ ఇండియా యుద్ధ ఖైదీల్ని జైల్లో కూర్చోబెట్టి పోషించటం కన్నా తమ పక్షాన వాడుకొందామని జర్మనీ–జపాను భావించాయి. ఆ ఖైదీల్ని సేనా నాయకులతోపాటు బోసుకి అప్పగించాయి.


కాంగ్రెసు బైటికి వచ్చిన విభీషణుడు, బ్రిటన్‌కి వ్యతిరేకంగా సాయుధంగా పోరాడాలన్న, జనాకర్షణకల నేత బోసు. కఠోర సత్యం ఏమంటే బ్రిటిష్ ‘సేవక’ చైతన్యం నుంచి వచ్చి బ్రిటిష్ వ్యతిరేక సేనలైన వారంతా పొట్టకూటికోసం యుద్ధ కాలంలో వలస సైన్యంలో చేరిన పేద రైతాంగ జనం. జై కిసాన్‌లే అత్యధికంగా జై జవానులవుతుంటారు, నాడైనా నేడైనా. ‘దేశభక్తి డ్రెస్సు’లో కొన్నేళ్ళు పనిచేసి రిటైరయ్యాక, ఎవరిదగ్గరో సెక్యూరిటీ డ్యూటీయే వారి ‘అగ్నిపథం’. యుద్ధంలో ఫాసిస్టు వ్యతిరేక కూటమి గెలవటంతో, 1945 జూన్‌లో మణిపూర్ సమరంలో బోసు సేనలు, జపాన్ సేనలు ఓడిపోయాయి. 30వేల మంది చనిపోగా మిగతావారు మలయాకి తరలివెళ్ళి, లొంగిపోయారు. బోసు జపాన్లో తలదాచుకోటానికి వెళ్లారు. అలాటి కొందరు బ్రిటిషువారి దృష్టిలో యుద్ధ నేరస్థులయ్యారు. వారి పక్షాన చివరికి బ్రిటిష్ మానస పుత్రులైన నెహ్రూ తదితరులే కేసులు వాదించారు.


బోస్ విగ్రహం నెలకొల్పటం, రాజ్‌పథ్ పేరు మార్పు ద్వారా బానిసత్వం నుంచి విముక్తి అని మోదీ చెప్తుండగానే 96ఏళ్ల ఎలిజబెత్ మరణం వార్త వచ్చింది. ఆ రాణిని కలిసిన వైనాన్ని మోదీ తన్మయంతో చెప్పారు. నేటికీ కామన్ వెల్తులో కొనసాగుతున్న మన ప్రభుత్వం అధికారిక సంతాపాన్ని ప్రకటించింది. విగ్రహాలు, పేర్లు ఎన్ని మార్చినా, మన చట్టాలు, ఐపీసీ, సీఆర్పీసీ, కోర్టులు, జైళ్లు, నల్లకోట్లు, గవర్నర్లు, పార్లమెంటు పద్ధతులు.. వెరసి మన ప్రజాస్వామ్యంలో అన్నీ బ్రిటిష్ పద్ధతులే. మన రాజ్యాంగంలో 75శాతం క్లాజులు 1935 వలస చట్టం నుంచి యథాతథంగా తీసుకున్నవే. నేటి ఆజాదీలో నాటి రాజద్రోహ చట్టం కింద కేసులు చాలా పెరిగిపోయాయి.


బ్రిటిషు వారసత్వాన్ని వదిలేసాం అని మోదీ చెప్పారు కానీ బోసు విగ్రహంపైన పాత బ్రిటిషు వలస కాలం నాటి ఛత్రఛాయ (కెనోపీ), కామన్వెల్తు సభ్యత్వం అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు అమెరికా నయా వలస కనుసన్నల్లో,  ఇందిరమ్మ నిర్దేశించిన ‘కర్తవ్య’పథంలో మోదీ ముందుకు సాగుతున్నారు. నెహ్రూ బదులు బోసు ప్రధానైతే దేశం ఎంతో ముందుకు పోయేది అన్నారు మోదీ. బోసు తాయెత్తు పని చేస్తుందేమో చూడాలి. మనది విగ్రహారాధకుల దేశం. ఆ బొమ్మలకి వేర్వేరు పురాణకథలు చెప్పుకుంటుంటాం.

ఎమ్. జయలక్ష్మి

రిటైర్డ్ ఏజీఎం, ఆప్కాబ్

Read more