బాలగోపాల్ ఇప్పుడుంటే, ఏ ప్రశ్నలు వేసేవాడు?

ABN , First Publish Date - 2022-10-08T10:33:56+05:30 IST

మానవ హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్ మరణించి 13 ఏళ్ళు. సుమారు 30 ఏళ్ళు హక్కుల ఉద్యమంలో భాగంగా సమాజంలో ప్రజాతంత్ర విలువలు పెంపొందించడానికి ఆయన చేసిన కృషి అసామాన్యమైంది.

బాలగోపాల్ ఇప్పుడుంటే, ఏ ప్రశ్నలు వేసేవాడు?

మానవ హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్ మరణించి 13 ఏళ్ళు. సుమారు 30 ఏళ్ళు హక్కుల ఉద్యమంలో భాగంగా సమాజంలో ప్రజాతంత్ర విలువలు పెంపొందించడానికి ఆయన చేసిన కృషి అసామాన్యమైంది. ఆయన భాగమైన హక్కుల సంఘాలలో చురుకైన కార్యకర్తలు అందరూ కలిసి ఎంత పని చేసేవారో, బాలగోపాల్ ఒక్కరే అంత కంటే ఎక్కువ చేశారు. ఆయన సామాజిక కార్యాచరణ విస్తృతి కూడా ఆ సంస్థల పరిధి కంటే చాలా ఎక్కువ. ప్రజాతంత్ర రాజకీయాల కోసం ఆరాటపడే ప్రతి సంస్థా (ఉపాధ్యాయ సంఘాలు, ట్రేడ్ యూనియన్, ఆదివాసీ, దళిత సంఘాలు, సాహిత్య సంస్థలు, మైనారిటీ, విద్యార్థి సంఘాలు) ఆయనతో కలిసి పని చేసింది. తాము పనిచేసే రంగంలో హక్కుల దృష్టి కోణం గురించి నేర్చుకోవడానికి అవి ఆయన సహకారం తీసుకున్నాయి. వారి నిజనిర్ధారణ కార్యక్రమాలలో, చర్చలలో ఆయన చురుకైన పాత్ర వహించేవాడు. ప్రజాస్వామిక కార్యాచరణలో ఎన్నో వేల మందికి ఆయన ప్రత్యక్షంగా స్ఫూర్తి నిచ్చాడు. కానీ ఆ సంస్థలు ఆయన అందించిన స్ఫూర్తిని తరుచు మననం చేసుకుంటున్నట్టు కనిపించడం లేదు. 


ఆయన సామాజిక నిబద్ధత, శక్తిసామర్ధ్యాలు అనితర సాధ్యం. తెలుగు రాష్ట్రంలో బలహీనులపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా దరిదాపు మొదటగా స్పందించిన గొంతుక ఆయనదే. నకిలీ ఎన్‌కౌంటర్లతో మొదలుకొని, కరువు, జలాల పంపిణీ నుంచి, అన్ని రకాల నిర్వాసితుల సమస్యల వరకు అన్నింటిలో హక్కుల కోణాన్ని ఆవిష్కరించడానికి ఆయన ప్రయత్నించారు. జాతి ప్రయోజనాల వల్ల ఈ ప్రాజెక్టు కట్టక తప్పదు అని అధికారులు అంటే అందువల్ల నిర్వాసితులకు జరిగే నష్టాన్ని జాతినష్టంగా ఎందుకు పరిగణించకూడదు అని ప్రభుత్వాన్ని, న్యాయస్థానాలను నిలదీసేవారు. 


సామాజిక ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించడానికి సమయాన్ని, శక్తిని కేటాయించడానికి తటపటాయించే మనుషులున్న ఈ రోజుల్లో అయన నిబద్ధతను గురించి స్మరించుకోవడం అవసరం. 1985లో కాకతీయ యూనివర్సిటీలో లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో హక్కుల కార్యకర్తగా, పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా మారిన తర్వాత, పదమూడేళ్ల పాటు ఆయన దరిదాపు ప్రతిరోజు రైల్లోనో, లేక బస్సులోనో నిద్రపోయాడు. తానెప్పుడూ కనీస సౌకర్యాలను కోరుకోలేదు. తనలాగా పూర్తిస్థాయి హక్కుల కార్యకర్తగా పని చేయమని ఆయన ఎవరిని ప్రోత్సహించలేదు. కుటుంబ పోషణ, సంపాదన సగటు మనుషులకు తప్పదు కాబట్టి పూర్తిస్థాయి హక్కుల కార్యకర్త కావడం అసాధ్యం, ఆ అవసరం కూడా లేదనేవారు. కుటుంబానికి, పోషణకు వెచ్చించిన తర్వాత మిగిలిన సమయాన్ని, శక్తిని సామాజిక కార్యాచరణకు కార్యకర్తలు కేటాయించాలని ఆశించేవారు. 46 ఏళ్ల వయసులో న్యాయవాది అయిన తర్వాత మరణం వరకు ఏదో ఒక హక్కుల సమస్యపై నిజానిర్ధారణకు ఆయన ప్రతి శని, ఆది వారాలు మారుమూల ప్రాంతాలకు వెళ్ళేవాడు. పలానా వారికి అన్యాయం జరిగిందని ఆయన ఇచ్చిన నిరసన ప్రకటన పత్రికలో చూసి ఆయన ఎక్కడున్నాడో గుర్తించేవాళ్ళం. ఒకరోజు కడప జిల్లాలో లాకప్ మరణం మీద నిజనిర్ధారణ చేస్తుంటే రెండవ రోజు మెదక్ జిల్లాలో బాణామతి మరణాల మీద తిరుగుతున్నాడని అర్థం చేసుకునేవాళ్ళం. ఒక బస్సు దిగి మరో బస్సు ఎక్కే మధ్యలో బస్టాండ్‌లో దోమల మధ్య అర్ధరాత్రి కూర్చుని ఆయన పత్రికలకు వ్యాసాలు రాసిన సందర్భాలు చూసి విస్తుపోయేవాళ్ళం. ఏ నాడు మంచి తిండి కావాలని కోరుకోలేదు. బస్టాండ్లలో రాతి చప్టాల మీద కరపత్రాల కట్టను తలకింద ఉంచుకుని హాయిగా నిద్రపోతుంటే ఆర్టీసీ కార్మికులు గుర్తించిన సందర్భాలు ఎన్నో. ఆయన సామాజిక ఆచరణ విస్తృతి, నిబద్ధత అలాంటిది. తాను ప్రసంగించే సభలో పదిమంది ఉన్నా, పదివేల మంది ఉన్నా ఒకటే నిబద్ధత. సమయానికి వెళ్లడం, సమావేశం ప్రారంభం అయ్యేవరకు ఒక మూల కూర్చోవడం, ప్రసంగంలో తీక్షణమైన స్వరంతో కొత్త కోణాల్ని ఆవిష్కరించడం, సమావేశం తర్వాత తన పుస్తకాల సంచితో సమూహంలోకి మాయమైపోవడం. అలా కూడా పనిచేయడం సాధ్యమే అని చెప్పడమే నా ఉద్దేశం.


లక్షల కాపీల సర్క్యులేషన్ ఉన్న పత్రికకు రాసిన నిబద్ధత స్థాయిలోనే, చిన్న పత్రికలలో కూడా వ్యాసాలు రాసేవారు. ఇంగ్లీష్ జర్నల్స్‌కు ఎంత సామాజిక శాస్త్ర ప్రమాణాలతో వ్యాసాలు రాసే వారో అంతే ప్రమాణాలతో తెలుగు పత్రికలకు విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. 1985 నుంచి 2009 మధ్య కాలంలో తెలుగు సమాజంలో ఒక ప్రజాస్వామిక మేధోమధనం చేసిన వారిలో బాలగోపాల్ ముందు వరసలో ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో మేధావులుగా చలామణి అవుతున్న వారికి కూడా ఒక నైతిక దిక్సూచిగా పనిచేశాడు. తాము వేసే అడుగులు స్వార్థంతో, అధికారంతో లాలూచి పడేవిగానో ఉంటే బాలగోపాల్ ఏమంటాడో అనే నైతిక బెరుకు సామాజిక జీవితంలో ఉండే వారిలో ఉండేది. ఆయన మరణం తర్వాత ప్రజా జీవితంలో ఉన్న మేధావులు ఎంచుకున్న మార్గాల పట్ల బాలగోపాల్ తీవ్రమైన నైతిక విమర్శ చేసి ఉండేవాడనుకుంటాను. అధికారం, సంపాదన రెండే నీతిగా చలామణి అవుతున్న పాలనా సంప్రదాయాన్ని న్యాయస్థానం లోపలా బయటా బోనులో తప్పక నిలబెట్టి ఉండేవాడు. నిస్సహాయంగా దాడులకు గురౌతున్న మైనారిటీల గొంతుకై నినదించేవాడు. విద్వేష రాజకీయాలు మెజారిటీ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు శత్రువని ఊరు వాడా సమావేశాలు పెట్టి ఉండేవాడు. దౌర్జన్య రాజకీయాలతో రాజీ పడుతున్న విధానాలను తూర్పారపట్టేవాడే. ప్రజాస్వామిక వ్యవస్థలు నాశనమౌతుంటే నిశ్శబ్దంగా ఉన్న మేధావుల నిర్వ్యాపకత్వం గురించి బాహాటంగా విమర్శించి ఉండేవాడు. హక్కుల లేమికి గురైన వారు జీవితానికి పరిపూర్ణతను సాధించుకోడానికి అమూర్తమైన జాతి అనే భావనలో భాగం కావడం సహజమే కావచ్చు, కానీ వారిని హిందుత్వ ప్రాజెక్టులో భాగం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ఒట్టి సంకల్పం సరిపోదని, దానికి తగినంత సామాజిక నిబద్ధత, శక్తిసామర్ధ్యాలు ఉన్నాయా అని ప్రజాస్వామిక వాదులను హెచ్చరించేవాడే. 


ఆయన అసాధారుణుడే. అలాంటి వాళ్ళు నిజమైన అర్థంలో కొద్దిమందే ఉంటారు. కానీ వాళ్ళు సామాన్యుల నుంచి వస్తారని నమ్మాడు. ‘ఆ హక్కుల కార్యకర్త తన కళ్ళ ముందే జరిగిన హత్య గురించి సాక్ష్యం చెప్పడానికి భయపడి ఉంటాడు’ అని ప్రస్తావిస్తే, ‘భయం లేని మనిషి మనిషే కాడు, ఒప్పుకుంటాను. మరి న్యాయం గతేమి కావలి? అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడండి అని నిరంతరం ఇతరులకు చెప్తామే మరి?’ అని ప్రశ్నిస్తాడు. తమ వ్యక్తిగత జీవితాన్ని, ప్రయోజనాల్ని ఎంతో కొంత కోల్పోకుండా ఎవరూ హక్కుల ఉల్లంఘనలను ప్రతిఘటించలేరనే దృఢమైన నైతిక కోణాన్ని సమాజానికి నేర్పించడానికి తన జీవితాచరణ ద్వారా ప్రయత్నించాడు. 


సమాజం పట్ల మన బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా ప్రతి వ్యవస్థీకృత అన్యాయాన్ని నిరసించే శక్తిసామర్ధ్యాలు అందరికి లేకపోవచ్చు. కానీ ఆలాంటి అన్యాయంలో భాగం కాకుండా ఉండే నైతిక బాధ్యత మాత్రం హక్కుల స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికి ఉందని బాలగోపాల్ భావించేవాడు. డొంక తిరుగుడుతనంతో, విశ్లేషణా చాతుర్యంతో వాదనల సందుగొందుల్లోకి తప్పించుకు తిరగాలనుకోకుంటే వ్యవస్థలోని అన్యాయం ప్రతిచోటా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సత్యాన్ని అంగీకరించాలంటే ధైర్యం ఉండాలి. భౌతికంగా అత్యంత సాదాసీదాగా జీవించడానికి సిద్ధపడిన బాలగోపాల్‌కు సామాజిక అన్యాయాలు స్పష్టంగా కనిపించడమే కాక నిర్భీతితో నిలదీసే నైతిక సాహసం ఉండింది. ఆ స్థాయిలో కాకపోయినా ఆలాంటి కార్యాచరణ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సాధ్యమే. కానీ, ప్రతి ఒక్కరు హక్కులు స్వార్థ ప్రయోజనాలతోనే అడుగుతారు అనే దృష్టిని ఆధిపత్య వర్గాలు, నయా ఉదారవాద మార్కెట్ గత పదేళ్లలో చాలా పెంచి పోషించాయి. 


బాలగోపాల్ జీవించి ఉంటే ప్రతి రంగంలో లోపిస్తున్న ఈ నైతిక దృష్టికోణం గురించి పదేపదే గుర్తు చేయడమే కాక అది అంతిమంగా ప్రజాస్వామ్య విలువలకే ప్రమాదకారి అని హెచ్చరించేవాడు. ఆయన లేని లోటును ఎంతోకొంత పూరించగలిగే శక్తిని పెంపొందించుకోవడమే ప్రజాస్వామ్యవాదులు ఆయనకు ఇవ్వగలిగే నివాళి.


మురళి కర్ణం

నల్సార్ యూనివర్సిటీ

(నేడు బాలగోపాల్ వర్థంతి. రేపు హైదరాబాద్ 

సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఉదయం 10గంటలనుంచి జరిగే సంస్మరణ సదస్సులో అరుంధతీ రాయ్, 

మిహిర్ దేశాయ్ తదితరులు పాల్గొంటారు.)

Updated Date - 2022-10-08T10:33:56+05:30 IST