భావికాల మహోదయం !

ABN , First Publish Date - 2022-08-13T06:47:09+05:30 IST

తెగిపడిన నిగళాల ధ్వనులను తలదన్నే గళాల ప్రతిధ్వనులతో..

భావికాల మహోదయం !

తెగిపడిన నిగళాల ధ్వనులను

తలదన్నే గళాల ప్రతిధ్వనులతో

జనులందరూ జాతీయతా స్ఫూర్తితో

ఘన జీవన సుఖ ప్రాప్తికై

జపించిన మహా మంత్రోపాసనా దినం!

సత్యం ధర్మం అహింసలే అనాదిగా

సమసమాజ స్థాపనకు పునాదికాగా

జాతి మొత్తం యేకమై జగజ్జేగీయ శక్తిగా

మనోభీష్టాల సుభిక్ష పాలనకు మనసారా

పుణ్యాహవాచన చేసుకున్న పుణ్యదినం!

జాతీయ నేతలందరూ కలిసి

జనాభ్యుదయమే తమ ధ్యేయంగా తలచి

సమాజానికి స్వస్తివాచకాలు పలుకుతూ

మహదాశీర్వచనం చేసిన

మహిమాన్విత మధూదయం!

ధర్మ చక్ర చిహ్నాంకిత

భారత జాతీయ త్రివర్ణ జయపతాక

తలయెత్తుకుని తటిత్ప్రభలతో

ఎగిరే, యెద పొంగే శుభోదయం!

గతవైభవ ఘనకీర్తుల

నుతియిస్తూ భవితవైపు

పయనించే దివ్య పథపు

ప్రణాళికలు రచించే

యువశక్తుల ధీయుక్తుల

భావికాల మహోదయం!

విశ్వనేత్రి జగద్ధాత్రి

విశాల భారతదేశం

ఆనందంగా జరుపుకుంటున్న

ఆజాదీ కా అమృత మహోత్సవ దినం!


– వడ్లమాని నరసింహమూర్తి

Read more