మీ చెరువులు, కుంటలు క్షేమమేనా?

ABN , First Publish Date - 2022-09-30T06:17:12+05:30 IST

నగరంలో వాన –భావుకులైన పౌరుల ఊహాంచలాలలో కవిత్వ జల్లును వర్షించే రోజులు గతించాయి. సంపన్నులు, సామాన్యులను ఒకేలా భీతిగొలిపే పాడు రోజులు...

మీ చెరువులు, కుంటలు క్షేమమేనా?

నగరంలో వాన –భావుకులైన పౌరుల ఊహాంచలాలలో కవిత్వ జల్లును వర్షించే రోజులు గతించాయి. సంపన్నులు, సామాన్యులను ఒకేలా భీతిగొలిపే పాడు రోజులు దాపురించాయి. ఇటీవల ఎడతెగని వర్షాలకు హై–టెక్ సిటీ బెంగుళూరు లోనయిన దుస్థితే అందుకొక నిదర్శనం. ఎంతో మంది నగరవాసులు తమ గృహాలను వదిలివేసి వెళ్లవలసి వచ్చింది. దాదాపుగా మునిగిపోయిన వాహనాలను రోజుల పాటు అలానే ఉంచివేయక తప్పలేదు. కార్యాలయాలను మూసివేశారు. జీవనోపాధులు ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం వేల కోట్లలో సంభవించింది. ఇది, మన నవీన నాగరికులపై ప్రకృతి ప్రతీకారం సుమా. దీని గురించి నేను పదే పదే మొత్తుకుంటూనే ఉన్నాను. ప్చ్! ప్రయోజనమేముంది?


బెంగుళూరుకు ఈ దుర్గతి ఎందుకు పట్టింది? ‘చెరువు ఓడు, ఊరు పాడు’ అనే లోకోక్తి ఆ ప్రశ్నకు సమాధానమని నిష్కర్షగా చెప్పక తప్పదు. విపులీకరిస్తాను. ముందుగా మనం తెలుసుకోవల్సిన వాస్తవాలు: ఒకటి– వరదలు, కరువులు, కాటకాలు, చలిగాడ్పులు, వడగాడ్పులు మొదలైనవి మనం తరచు అనూహ్య రీతుల్లో చవిచూసిన, చూడనున్న ప్రాకృతిక వైపరీత్యాలు. మారుతున్న వాతావరణ పరిస్థితులే ఆ బీభత్సాలకు కారణమవుతున్నాయి. బాధ్యులు ఎవరు? మనమే. అందరమూ అపరిమిత ఆర్థికాభివృద్ధిని అభిలషిస్తున్నాం. అందుకు ఇంధనం సమృద్ధంగా కావాలి. ఇంధన అవసరాలను తీర్చుకునే క్రమంలో కాలుష్యకారక వాయువులను వాతావరణంలోకి ఉద్గారిస్తున్నాం. రెండు–దక్షిణాసియాలో వరదలు వెల్లువెత్తనున్నాయి భూతాపం పెరిగిపోతున్న దృష్ట్యా వాతావరణంలో తేమ అధికమవుతోంది. ఇది, కుండపోత వర్షాలకు మరింతగా దారితీస్తోంది. ఈ వైపరీత్యం ఇప్పటికే మన అనుభవంలోకి రాలేదూ? పొరుగు దేశం పాకిస్థాన్‌లో మూడింట రెండువంతుల భూభాగం ఇటీవల ఎందుకు వరదల పాలయ్యిందో అర్థమయిందా? మూడు– ప్రస్తుతం మన ముందున్న విపత్కర పరిస్థితికి వాతావరరణ మార్పు ఒక్కటే కారణం కాదు. ఉద్దేశపూర్వకంగా నగరాలలోని చెరువులు, కొలనులు, సరస్సులు, మడుగులు మొదలైన జలవనరులు అన్నిటినీ ధ్వంసం చేశాం.


తెలుసుకోవల్సిన వాస్తవాలా ఇవి? కాదు, బాగా తెలిసిన వాస్తవాలే. మరయితే ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు తోడ్పడే కార్యాచరణకు మనం ఎందుకు పూనుకోవడంలేదు? వాతావరణ మార్పు విషమ ప్రభావాల నుంచి బయటపడేందుకు మనం చేయవలసిన దానిని చేస్తున్నామా? లేదు. వర్షపునీటిని చుక్క చుక్క ఒడిసిపట్టుకుని సంరక్షించుకోవడం లేదా సరస్సులు, చెరువులు, ఇతర పరివాహక ప్రాంతా లను కాపాడుకునేందుకు ఆర్థిక వనరులను మరింతగా ఉపయోగించవలసిన అవసరాన్ని మనం గుర్తించడంలేదు. ఎందుకని? స్థానిక పరిసరాల నుంచి మనం పూర్తిగా వేరుపడిపోయాం!


నగరాల సుందరీకరణలో భాగంగా మన సరస్సులు విహార, వినోద నెలవులుగా మాత్రమే ఉపయోగపడుతున్నాయి. చెరువులు, సరస్సులు ఉన్న ప్రదేశాన్ని తనకు అవసరమైన, అందుబాటులో ఉన్న భూమిగా ఒక బిల్డర్ పరిగణిస్తాడు. దాంతో ఆ చెరువులు, సరస్సులు మాయమవుతాయి! హైదరాబాద్ మెగాసిటీలో కొత్త విమానాశ్రయాన్ని ఆ నగర ప్రధాన జలవనరు పరివాహక ప్రాంతంలో నిర్మించారు కాదూ?! అహ్మదాబాద్‌లో 100 సరస్సులు అంతరించిపోయాయి. వాటి నెలవుల్లో ఆకాశ హర్మ్యాలు వెలిశాయి. ప్రతి నగరానిదీ ఇదే విషాదగాథ. నీటిని సరఫరా చేస్తున్న జలవనరు కలుషితమయి పోయిందనో లేక అది సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదనో తదితర కారణాలతో నగరాలు ఆ జలరాశులను వదిలివేస్తున్నాయి. ఇప్పుడు నగరాలు తమకు అవసరమైన నీటిని తెచ్చుకోవడానికి ఎంత దూరమయినా వెళ్లుతున్నాయి.


దేశవ్యాప్తంగా 71 నగరాల జల–వ్యర్థ గాథలను వివరిస్తూ 2012లో Excreta Matters అన్న పుస్తకాన్ని వెలువరించాము. ప్రతి నగరమూ తన స్థానిక జలవనరును నిర్లక్ష్యం చేస్తూ సుదూర ప్రాంతాలలోని జలవనరుల నుంచి నీటిని ఎలా తెచ్చుకుంటోందో సమగ్రంగా వివరించాం. ఉదాహరణకు బెంగళూరు తన సొంత నది అర్కావతిని ఏనాటి నుంచో పూర్తిగా ఉపేక్షిస్తూ వస్తోంది. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న, నగర మట్టానికి 1000 మీటర్ల దిగువన ఉన్న కావేరి నదినుంచి నీటిని సరఫరా చేసుకుంటోంది. ముంగిట యమునా నది ఉన్నా ఢిల్లీ నగరం 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెహ్రీడ్యాంపై ఆధారపడుతోంది. హైదరాబాద్ జలవనరులు మూసీ నది, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కాలుష్య కాసారాలు కావడమో లేక ఎండిపోవడమో సంభవించింది. ఈ కారణంగా 80 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంజీర, సింగూర్, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి నీటిని తెచ్చుకుంటోంది. ఇంతదూరం నుంచి నీటిని తెచ్చుకునేందుకు రవాణా ఖర్చులు భారీగా ఉంటాయి. దారిమధ్యలో నీరు ఒలికిపోవడమూ జరుగుతోంది. ఈ రూపేణా జరిగే నీటినష్టం అంత చిన్నదేమీకాదు. మొత్తం మీద అంతిమ వ్యయాలు అత్యధికంగా ఉండడం అనివార్యమవుతుంది. తీరా సరఫరాలో అవకతవకలు, అసమానతలు ఎంతగా ఉంటాయో మరి చెప్పనవసరం లేదు.


సుదూర ప్రాంతాల నుంచి రవాణా చేసి  తీసుకొచ్చిన నీటిని సరఫరా చేసేందుకు అవుతున్న వ్యయాన్ని తమ పౌరుల నుంచి రాబట్టుకునేందుకు నగరాలు చాలా ప్రయాసపడుతున్నాయి. ఫలితంగా పటిష్ఠ మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధిపరచుకోలేక పోతున్నాయి. దీనివల్ల వాటి స్థానిక జలవనరులు కలుషితమైపోతున్నాయి. ఎంత దూరంనుంచి అయితేనేం, ఎంత వ్యయమయితేనేం నీటిని తెచ్చుకుంటున్నాం కనుక స్థానికంగా ఉన్న జల రాశులను పునరుద్ధరించుకోవల్సిన అవసరం నగరాలకు కన్పించడం లేదు. ఇదెంతైనా శోచనీయం. వాతావరణ మార్పు పర్యవసనాలు అంతకంతకూ వికృతంగా మన అనుభవంలోకి వస్తోన్న ప్రస్తుత తరుణంలో కూడా స్థానిక జలవనరుల వ్యవస్థను ఉపేక్షించడం సబబేనా? కాదు. వాటి విలువను గుర్తించి తీరాలి. అవి వ్యర్థమైనవి ఎంత మాత్రం కాదు. వాటి ఉపయోగాలు ఊహాత్మకమైనవికావు. ఈ సత్యాలను ఎంత వడిగా అర్థం చేసుకుంటే అంత మంచిది. సమస్యలను తొలగించుకునే కార్యాచరణకు మనం పూనుకోవాలి. లేనిపక్షంలో మన భవిష్యత్తు మరింత ఘోరంగా పరిణమిస్తుంది.


సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, 

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)


Read more