ఉద్యోగాలున్నా నియామకాలేవీ?

ABN , First Publish Date - 2022-02-19T07:30:26+05:30 IST

ఇటీవల ఒక వార్త నా దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. అది, తమిళనాడులో ఉద్యోగ సూచక కార్యాలయాలలో తమ పేర్లను నమోదు చేయించుకున్న వారి సంఖ్య! నమోదయిన మొత్తం ఉద్యోగార్థులు...

ఉద్యోగాలున్నా నియామకాలేవీ?

ఇటీవల ఒక వార్త నా దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. అది, తమిళనాడులో ఉద్యోగ సూచక కార్యాలయాలలో తమ పేర్లను నమోదు చేయించుకున్న వారి సంఖ్య! నమోదయిన మొత్తం ఉద్యోగార్థులు: 75,88,359. వీరిలో 18 ఏళ్ళ వయసు లోపువారు: 17,81,695; 19–23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు: 16,14,582; 24–35 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్నవారు: 28,60,359; 36–57 ఏళ్ళ మధ్య వయస్సున్న వారు 13,20,337; 58 ఏళ్ళకు మించిన వయస్సు ఉన్నవారు: 11,386.


ఈ నిరుద్యోగ గణాంకాలు మిమ్ములను నిరుత్సాహపరచడం లేదూ? ఉపాధి, ఉద్యోగరహిత జీవితాల వాస్తవాలు మీ మనస్సులను కుంగదీయడం లేదూ? అభివృద్ధి చెందిన రాష్ట్రమని సహేతుకంగా చెప్పగలిగే తమిళనాడులోనే పరిస్థితి ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్, బిహార్‌ల మాటేమిటి? జనాభా సంఖ్యలో అగ్రగాములుగా ఉన్నా అభివృద్ధిలో అధోస్థానంలో ఉన్న ఆ రెండు ఉత్తరాది రాష్ట్రాలలో నిరుద్యోగుల సంఖ్యను మీరు ఊహించలేరేమో?! వారే గనుక తమ రాష్ట్రాలలోని ఉద్యోగ సూచక కార్యాలయాలలో పేర్లను నమోదు చేయించుకుంటే ఆ నిరుద్యోగుల నిజసంఖ్య మిమ్ములను నిరుత్తరులను చేస్తుంది సుమా!


నిరుద్యోగులకు అవసరమైన ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? మన కళ్ళెదుటే నిగూఢంగా ఉన్నాయి! 2021 మార్చి 31న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్న ఉద్యోగ ఖాళీలు 8,72,243. వీటిలో కేవలం 78,264 ఖాళీలను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. దాదాపు 8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.


ఉద్యోగాలు మన కళ్ళెదుటే నిగూఢంగా ఉన్నాయని చెప్పాను. అవును. ఉద్యోగాలు సర్వత్రా ఉన్నాయి. అయితే వాటిని కనిపెట్టే ప్రయత్నం మనం చేయడం లేదు! హృద్రోగ చికిత్సలో అంతర్జాతీయంగా సుప్రసిద్ధుడు, ప్రతిష్ఠాత్మక ‘నారాయణ’ ఆసుపత్రుల వ్యవస్థాపకుడు డాక్టర్ దేవి శెట్టి ఇటీవల వెలువరించిన ఒక ప్రసంగాన్ని విన్నాను. అందులోని కొన్ని భాగాలను ఈ సందర్భంగా సముచితంగా ఉటంకిస్తాను. 


‘మన దేశంలో అండర్ -గ్రాడ్యుయేషన్, పోస్ట్ -గ్రాడ్యుయేషన్ సీట్లలో తీవ్ర కొరత ఉందని డాక్టర్ దేవి శెట్టి పేర్కొన్నారు. ఆయన ఇంకా ఇలా చెప్పారు: ‘కరేబియన్ దేశాలకు వెళ్ళండి. అక్కడ 35 వైద్య కళాశాలలు అమెరికాకు అవసరమైన వైద్యులను సమకూర్చేందుకై యువ డాక్టర్లకు శిక్షణ ఇస్తున్నాయి. ఒక షాపింగ్ మాల్‌లో 50,000 చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని అద్భుతమైన డాక్టర్లను రూపొందిస్తున్నారు. మరి మనం ఒక్కో వైద్యకళాశాలకు రూ.400 కోట్లు వినియోగిస్తున్నాం! ఎంత హాస్యాస్పదం! 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు వైద్య కళాశాలలకు 140 మంది అధ్యాపకులు అవసరం లేదు. 140 మంది అధ్యాపకులతో 1000 మంది విద్యార్థులు గల ఒక వైద్య కళాశాలను నడపవచ్చు. యావత్ప్రపంచం మారిపోయినా మనం మారలేదు’. 


డాక్టర్ దేవి శెట్టి తన ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు: ‘ప్రతి 12 నిమిషాలకు ఒక ప్రసూతి మరణం ఎందుకు సంభవిస్తుంది? మూడు లక్షల మంది బాలలు పుట్టిన రోజునే ఎందుకు చనిపోతున్నారు? పన్నెండు లక్షల మంది బాలలు తమ మొదటి పుట్టిన రోజుకు ముందే ఎందుకు చనిపోతున్నారు? ఈ పరిస్థితి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. మనకు రెండు లక్షల మంది గైనకాలజిస్టులు అవసరముంది. అయితే ప్రస్తుతం యాభై వేల కంటే తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కూడా సగం మంది ప్రసూతి వైద్యం తెలియనివారే. అలాగే మనకు రెండు లక్షల మంది అనెస్థిటిస్ట్ (శస్త్రచికిత్సలో మత్తును కలిగించే ప్రక్రియను నిర్వహించే వ్యక్తి)లు అవసరం కాగా యాభై వేల కంటే తక్కువ మంది మాత్రమే ఉన్నారు. శిశు వైద్య నిపుణులు రెండు లక్షల మంది అవసరమయితే వారు యాభై వేల కంటే తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వికిరణ చికిత్సా నిపుణులు (రేడియాలజిస్ట్స్) కనీసం 1,50,000 మంది అవసరం కాగా ఉన్నవారు 10,500 మంది మాత్రమే’. వైద్య, నర్సింగ్, పారా మెడికల్ విద్యను విముక్తపరచవలసిన అవసరం ఈ దేశానికి ఎంతైనా ఉంది’. ఒక చిన్నపాటి ప్రయత్నంతో ఆరోగ్యభద్రతా రంగంలో వేలాది ఉద్యోగాలను సృష్టించవచ్చని డాక్టర్ దేవి శెట్టి పేర్కొన్నారు. ఇదే తర్కాన్ని విద్య, పట్టణాభివృద్ధి, నదులు, జలవనరులు, అడవుల పెంపకం, పశుగణాభివృద్ధి, వ్యవసాయ పరిశోధన, విస్తరణ, ఆహార ప్రాసెసింగ్ మొదలైన రంగాలకు కూడా వర్తింపచేయండి. లక్షలాది ఉద్యోగాలను సృష్టించడం సుసాధ్యమవుతుంది. ఆ ఉద్యోగాలు తిరిగి మరెన్నో లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తాయి.


‘మనం మహా స్మారక కట్టడాలను నిర్మిస్తున్నామే గానీ స్వయం సమృద్ధ వైద్య కళాశాలలను అభివృద్ధిపరచడం లేదని డాక్టర్ దేవి శెట్టి నిశితంగా విమర్శించారు. సరైన సదుపాయాలు కొరవడి, అవసరమైన చికిత్స సకాలంలో అందకపోవడం వల్లే చాలా మంది మహిళలు, శిశువులు చనిపోవడం జరుగుతోంది. ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించడం లేదు. ప్రజల హక్కులను కాపాడటం లేదు ప్రభుత్వాలు చేస్తున్న వ్యయాలు ఏ రంగంలోనూ సహేతుకంగా ఉండడం లేదు. ప్రస్తుత సువ్యవస్థిత మార్గాలకు భిన్నంగా కొత్త మార్గాలలో పయనించే సాహసికులు ప్రభవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరేబియన్ దేశాలలో వలే ‘షాపింగ్ మాల్స్‌లో 50 వేల చదరపు అడుగుల వైశాల్యంలో వైద్యకళాశాలను మనమూ నడపగలగాలి’ అని డాక్టర్ దేవి శెట్టి అన్నారు.


ఉద్యోగాలు! ఉద్యోగాలు!! ఇవే వర్తమాన భారతదేశ అత్యంత ముఖ్యావసరం అనడంలో మరో మాట లేదు. నేను ప్రస్తావించిన వివిధ రంగాలకు లక్షలాది ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యమున్నది. ఉపాధ్యాయులు, లైబ్రేరియన్లు, లలితకళల బోధకులు, వృత్తికళల నిపుణులు, కోచ్‌లు, ల్యాబ్ టెక్నీయన్లు, డిజైనర్లు, వాస్తుశిల్పులు, పట్టణ ప్రణాళికాకర్తలు, ఇంజనీర్లు, అడవులు పరిరక్షకులు, పాల ఉత్పత్తిదారులు, పౌల్ట్రీ వ్యవసాయదారులు. ఇలా కొన్ని వందల విభాగాలలో లక్షలాది ఉద్యోగాలను సృష్టించగల శక్తి సామర్థ్యాలు ఆయా రంగాలకు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించగలవు. తత్ఫలితంగా ఆదాయాలు పెరుగుతాయి. సంపద సంచితమవుతుంది. ప్రభుత్వాలకు పన్ను రాబడి పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధ మిక్కుటమవుతుంది. దాతృత్వ కార్యకలాపాలు పుంజుకుంటాయి. సాహిత్య, కళారంగాలకు ఆదరణ అధికమవుతుంది. 


మరి ఉద్యోగాల సృష్టి గురించి ఆలోచించేదెవరు? కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయమై దృష్టి పెట్టిందా? లేదు. ఆ మంత్రిత్వ శాఖ కార్యాలయాల వెలుపల ఉద్యోగాల సృష్టికి ఒక గొప్ప అవకాశం వేచి ఉన్నది. దానిని మనం కనిపెట్టి సద్వినియోగం చేసుకోవాలి. సరే, నరేంద్ర మోదీ ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ అయినా ఉద్యోగాల సృష్టి గురించి ఆలోచిస్తుందా? ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 90 నిమిషాల పాటు వెలువరించిన 157 పేరాల బడ్జెట్ ప్రసంగంలో ‘ఉద్యోగాలు’ అనే మాట కేవలం మూడు చోట్ల మాత్రమే ప్రస్తావితమయింది!‌


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Read more