అందరిదీ అనిపించే అభివృద్ధి ఏదీ?

ABN , First Publish Date - 2022-10-04T06:58:01+05:30 IST

గతపదేళ్లలో తెలంగాణా రాష్ట్ర జనాభా పొందికలో విపరీతమైన మార్పులు వచ్చాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మూడు కోట్ల 50లక్షల జనాభా ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన...

అందరిదీ అనిపించే అభివృద్ధి ఏదీ?

గతపదేళ్లలో తెలంగాణా రాష్ట్ర జనాభా పొందికలో విపరీతమైన మార్పులు వచ్చాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మూడు కోట్ల 50లక్షల జనాభా ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన 2020 స్టాటిస్టికల్ రిపోర్టు అంచనా ప్రకారం రాష్ట్ర జనాభా ఇప్పుడు మూడు కోట్ల 77 లక్షలకు పెరిగింది. 


వీరిలో 0 నుంచి 4 సంవత్సరాల వయసు శిశువులు 31 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరి అవసరాలు ప్రధానంగా ఐ‌సి‌డి‌ఎస్ పథకాల ద్వారా, అంగన్ వాడీ సెంటర్ల ద్వారా తీరాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటి వరకూ ఈ వయసు పిల్లల కోసం రూపొందించిన పథకాలు చాలా తక్కువ. ఈ వయసు పిల్లలలో మెదడు ఎదుగుదల వేగంగా ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఈ వయసు పిల్లలలో కూడా రక్తహీనత, బాడీ మాస్ ఇండెక్స్‌ (బీఎమ్‌ఐ) సరిగా లేకపోవడం లాంటి లక్షణాలు ఉన్నట్లు సమగ్ర కుటుంబ ఆరోగ్య సర్వే 5వ రౌండ్‌లో బయటపడింది. సరైన పరిసరాలు, పోషకాహారం, అవసరమైన వైద్యం అందుబాటులో ఉంటే ఈ పిల్లలందరూ ఆరోగ్యంగా ఎదుగుతారు. 


ఐదేళ్ళ నుంచి 19 ఏళ్ల వయస్సు వరకూ రాష్ట్రంలో 86 లక్షల మంది ఉన్నారు. ఈ వయసు పిల్లలు బాల కార్మికులుగా మారకుండా, అందరికీ నాణ్యమైన ఉచిత విద్య అందించడం విద్యా హక్కు చట్టం ప్రకారమూ, రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారమూ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. ఉన్న స్కూళ్ళను మూసేయడం కాకుండా, పిల్లలలో డ్రాపౌట్స్ లేకుండా ప్రతి ఆవాస ప్రాంతంలోనూ ప్రభుత్వ స్కూలు ఉండేలా చూసే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అమ్మాయిల చదువులు ఆగిపోకుండా ఉండటానికి ఇది తక్షణ అవసరం. ఇప్పటికయితే స్కూళ్లలో విద్యా సామర్థ్యాలు బాగా లేవని నివేదికలు వస్తున్నాయి. మారుతున్న తెలంగాణా సామాజిక, ఆర్థిక పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా సిలబస్, విద్యా బోధనా పద్ధతులను అభివృద్ధి చేస్తూ, పిల్లలలో విద్యా సామర్థ్యాలను పెంచడం కీలకం.


ఈ స్కూళ్లలోని పిల్లలకు మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటి వరకూ కేటాయిస్తున్న నిధులు అతితక్కువ. నాణ్యత లేని నాసి రకం ఆహారంతో జబ్బుపడుతున్న హాస్టల్ పిల్లల వార్తలు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఇస్తున్న నిధులతో కనీసం మామూలు భోజనం కూడా అందదు. ఈ వయసు పిల్లలకు సురక్షితమైన, పౌష్టికాహారం అందించడానికి, ప్రభుత్వం బడ్జెట్లో నిధులను పెంచాలి. సన్న వరిబియ్యం ఆధారిత ఆహారం మాత్రమే పౌషకాహారం కాదు. పోర్టిఫైడ్ ఫుడ్ పేరుతో కంపెనీలు ఉత్పత్తి చేసే పదార్థాల వైపు మోజు పెంచుకోకుండా, స్థానికంగా దొరికే చిరుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, మాంసం ఆధారిత ఆహారాన్ని ఈ పిల్లలకు అందించాలి. 


ఎక్కడికక్కడ రైతులు విష రసాయనాలు వాడకుండా వీటిని పండించి, స్థానిక స్కూళ్లకు, అంగన్ వాడీ సెంటర్లకు సరఫరా చేసేలా రైతు సహకార, ఉత్పత్తిదారుల సంఘాలతోనూ, ఈ ఆహార ఉత్పత్తుల ముడి సరుకులతో బిస్కట్లూ, లడ్లు వంటి ప్రాసెస్డ్ ఉత్పత్తులను స్కూళ్లకు సరఫరా చేసేలా స్థానిక మహిళా సంఘాల సభ్యులతోనూ విద్యా శాఖ ఒప్పందాలు కుదుర్చుకోగలిగితే ఇటు పిల్లలకు బలవర్ధక ఆహారం, అటు మహిళలకు జీవనోపాధి ఏక కాలంలో అందుతాయి. 


రాష్ట్రంలో 20 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసులో శారీరక శ్రమ చేయగలిగిన వాళ్ళు 2 కోట్ల 25 లక్షల మంది ఉన్నారు. వీరిలో 68 లక్షల మంది ఉన్నత విద్య పొందడానికి అనువైన వయసులో ఉన్నారు. రాష్ట్ర యువతీ యువకులు తప్పకుండా, తమ ఆసక్తులకు అనుగుణంగా ఉన్నత విద్యను పొందడానికి అవసరమైనన్ని విద్యా సంస్థలను రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో నెలకొల్పి ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎవరైనా కొందరు విద్యార్థులు బయట ప్రాంతాలకు, బయట దేశాలకు విద్యాభ్యాసం కోసం వెళ్లాలని అనుకుంటే అటువంటి వారికి ఉచిత విద్య అందించడానికి లేదా బ్యాంకుల నుంచి విద్యా ఋణం ఇప్పించడానికి పూనుకోవాలి. ప్రస్తుతం బ్యాంకులు విద్యార్థులకు ఇస్తున్న విద్యా ఋణాలపై గ్యారంటీ అడుగుతున్నాయి. గ్యారంటీ చూపించలేని సందర్భాలలో పేద కుటుంబాల పిల్లలు చదువును ఆపేస్తున్నారు. వీరికి ప్రభుత్వమే బ్యాంకులకు కౌంటర్ గ్యారంటీ ఇవ్వడానికి సిద్ధం కావాలి. 


వివిధ కారణాల వల్ల చదువులను మధ్యలోనే ఆపేసిన, లేదా చదువు పట్ల ఆసక్తిలేని యువతీ యువకులకు జీవనోపాధికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు ఉండటం లేదు. ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండటం లేదు. వీరికి స్థానికంగా ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు దొరకాలంటే ఆదివాసీ గూడేలు, గ్రామాలు, నగరాల్లోని బస్తీ స్థాయిలో అవసరమైన శిక్షణలను ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకూ అమలవుతున్న ‘‘స్కిల్ బిల్డింగ్’’ శిక్షణలు యువత ఉపాధి పొందడానికి పెద్దగా ఉపయోగపడడం లేదు. పైగా తాము నేర్చుకున్న అంశాలతో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన పెట్టుబడులు, మౌలిక వసతులు వారికి ఉండడం లేదు. అందుకే వడ్డీ రాయితీతో కూడిన పెట్టుబడి కూడా వారికి అందించాలి. 


గ్రామీణ ప్రాంతంలో భూమి లాంటి స్వంత వనరులు లేని అనిపుణ, నిరాక్షరాస్య శ్రమజీవులకు జీవనోపాధులు పొందడానికి అవసరమైన నైపుణ్యాలను అందించి, శ్రమను సులువు చేసే పనిముట్లు, యంత్రాలను వారికి సమకూర్చాలి. గ్రామీణ స్థాయిలో చిన్న పెద్ద యంత్రాలతో కూడిన కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, కేరళ తరహాలో వ్యవసాయ కూలీలను, సన్న చిన్నకారు రైతులను గ్రీన్ ఆర్మీగా నిర్మించాలి. వారికి ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లను నిర్వహించే బాధ్యతను అప్పగిస్తే గ్రామీణ నిరుద్యోగం తగ్గుతుంది. 


వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తక్షణం తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర స్థానిక యువతీ యువకులకు ఇక్కడే ఉపాధి అవకాశాలు దొరికేందుకు, ఇక్కడి నుండి వలసలు ఆగేందుకు అన్ని వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక సంస్థలలో స్థానికులకు 80శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలి. ఆ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేయాలి.


ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే కార్మికులు తక్కువ వేతనానికి, కట్టు బానిసల్లా పని చేస్తారు అనే ధోరణితో ఎక్కువ సంస్థలు ఇతర రాష్ట్రాల వారిని ఉద్యోగులుగా, కార్మికులుగా నియమించుకుంటున్నాయి. ఈ ధోరణిని నిరుత్సాహపరిచేలా రాష్ట్రంలో కనీస వేతనాలను ఎప్పటికప్పుడు సవరించాలి. ఇప్పటివరకూ వీటిని పర్యవేక్షించాల్సిన కార్మిక శాఖ పూర్తిగా బలహీనంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనుగుణంగా కార్మిక శాఖను బలహీన పరిచారు. కార్మిక శాఖకు కార్మిక చట్టాలను అమలు చేసే విస్తృత అధికారాలను ఇవ్వాలి. లేనట్లయితే రాష్ట్ర శ్రమజీవులు ఆధునిక కట్టు బానిసలుగా మిగిలిపోతారు. 


రాష్ట్రంలో 60 నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్కులు 40 లక్షల మంది ఉన్నారు. జీవితాంతం కష్టపడి పనిచేసి, అలసిపోయిన వృద్ధులు వీళ్ళు. వీరి కోసం ఇప్పటికీ ప్రభుత్వానికి ఒక నిర్దిష్ట విధానమే లేదు. నెలకు రెండువేలు వృద్ధాప్య పింఛను ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నది. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు వృద్ధులున్నా, కేవలం ఒక్కరికి మాత్రమే వృద్ధాప్య పింఛను ఇస్తూ అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నది. 


పేద, మధ్యతరగతి కుటుంబాలలో వృద్ధులకు సరైన నివాస వసతి, ఆహారం, ఆదరణ దొరకని సందర్భాల్లో వారిని అక్కున చేర్చుకోవడానికి వీలైన వసతిగృహాలు ప్రభుత్వ రంగంలో అతి తక్కువగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులను చేర్చుకోవడానికి వైద్య సదుపాయాలు ఉన్న వసతి గృహాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో, నగరాల్లోని పేదల బస్తీలలో తక్కువగా ఉన్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నవి కూడా వనరుల కొరతను ఎదుర్కుంటున్నాయి. రాష్ట్ర అనిపుణ కార్మికుల కనీస వేతనంలో కనీసం సగం మొత్తాన్ని పింఛనుగా నిర్ణయిస్తూ, కుటుంబంలో ఉన్న అందరు వృద్ధులనూ పింఛనుకు అర్హులుగా గుర్తించేలా నిబంధనలు మార్చాలి. 


సమాజంలో అందరి అవసరాలూ ఒకటి కావు. కాబట్టి పరిష్కారాలు కూడా విభిన్నంగా ఉండాలి. సహజ వనరులకు, రాష్ట్ర బడ్జెట్టులో ఆర్థిక వనరులకు ఉండే పరిమితులను దృష్టిలో ఉంచుకుని, లబ్ధిదారుల ఎంపిక సవ్యంగా జరగాలి. మాకు ఇష్టం వచ్చిన వారికి పథకాలు ఇచ్చుకుంటాం అని మంత్రులే బాహాటంగా ప్రకటించడాన్ని చూస్తున్నాం. ఈ ధోరణి విడనాడి పాలకులు అభివృద్ధి నమూనాకు సాధారణ ప్రజలను కేంద్రంగా ఉంచుకోవాలి.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక


Read more