ఆంధ్ర కుట్రలపై అప్రమత్తమవ్వాలి

ABN , First Publish Date - 2022-12-10T01:20:43+05:30 IST

ఏ అవకాశం దొరికినా ఏపీ ఉమ్మడిగా ఉండాలని కోరుతామని, అదే మా పార్టీ విధానమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయం.

ఆంధ్ర కుట్రలపై అప్రమత్తమవ్వాలి

ఏ అవకాశం దొరికినా ఏపీ ఉమ్మడిగా ఉండాలని కోరుతామని, అదే మా పార్టీ విధానమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయం. తెలంగాణను ఏదో పద్ధతిలో దోచుకోవాలని ఇప్పటికీ ఆంధ్ర రాజకీయ నాయకత్వం ప్రయత్నిస్తూనే ఉంది. నది జలాల వాటా, 9, 10వ షెడ్యూల్లోని సంస్థల విభజన పట్ల ఇప్పటికీ పీటముడి వేసి జటిలం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదిన్నరేళ్లు పూర్తయ్యాయి. ఇంకా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ అందుకోసం కృషి చేయడం లేదు. కానీ ప్రధాని మోదీ అప్పుడప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు.

అంతేకాదు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు కేసీఆర్పై, ఆయన కుటుంబసభ్యులపై, మంత్రులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తెలంగాణ నాయకత్వాన్ని అవమానించడమే లక్ష్యంగా ఆమె ప్రస్థానం సాగుచున్నది. కానీ షర్మిల అరెస్ట్‌పై ప్రధాని, గవర్నర్‌, బీజేపీ నేతలు సానుభూతి వ్యక్తం చేయడంతో ఆమె ఆంధ్ర, కేంద్ర ప్రభుత్వాల బాణమని తేలిపోయింది.

అలాగే ఇంతకాలం ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న తాము తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టమని చెప్పుకొచ్చిన వైసీపీ మెల్లమెల్లగా తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం, ఇక్కడ పాదయాత్ర చేయడం, ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటో తాజాగా సజ్జల వ్యాఖ్యలతో అవగతమవుతున్నది. అప్పట్లో విభజనకు కాంగ్రెస్‌, టీడీపీలు అనుకూలంగా వ్యవహరించాయని, వైసీపీ విభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచి పోరాటం చేసిందని సజ్జల చెప్పుకొచ్చారు. అంతేకాదు మళ్లీ ఉమ్మడి ఏపీ అయితే స్వాగతించేది తమ పార్టీనే అన్నారు. అంటే ఏపీ మూలాలు ఉన్నవారంతా ఇక్కడ రాజకీయాలు చేయడం వెనుక కుట్రలు మెల్లమెల్లగా బైటపడుతున్నాయి.

తెలంగాణ రాజకీయాలతో మాకు సంబంధం లేదంటూనే.. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ సమైక్యరాగం వినిపిస్తున్నారు. ఆంధ్ర ప్రజలు తమకంటూ ఒక రాజధాని కావాలని కోరుతున్నారు. అయితే అక్కడి నేతలు మాత్రం ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. పైగా ప్రజలను మళ్లీ తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకో ఏడాదిన్నరలో ఉమ్మడి రాజధాని గడువు కూడా పూర్తవుతుంది. అక్కడ ప్రస్తుతం రాజధాని గొడవ జరుగుతున్నది. మూడు రాజధానుల పేరుతో వైసీపీ రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేసింది. గత ఎన్నికల్లో టీడీపీ వైఫల్యాలను ఎండగట్టి తమకు అవకాశం ఇస్తే అద్భతమైన పాలన అందిస్తామన్న వైసీపీ మళ్లీ తిరిగి పూర్వపు ఆంధ్రప్రదేశ్‌ పునరుద్ధరణ కోసం తాము ఓటు వేస్తామనడం విడ్డూరంగా ఉన్నది. తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటు వేదికగా ఏపీ ఎంపీలు, ప్రధాని చేసిన వ్యాఖ్యలను తేలికగా తీసుకోవద్దని ఇక్కడి ఉద్యమకారులు మొదటి నుంచి చెబుతున్నారు. ఏపీ నేతల వ్యవహారశైలిని, వారి వ్యాఖ్యలను, వారికి వంత పాడుతున్న బీజేపీ అధిష్ఠాన పెద్దల కుట్రలను తిప్పికొట్టాలి.

– ఎర్రోజు శ్రీనివాస్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వికాస సమితి

Updated Date - 2022-12-10T01:20:45+05:30 IST