స్వతంత్ర భారతికి అక్షర దర్పణాలు

ABN , First Publish Date - 2022-09-10T06:48:02+05:30 IST

స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామిక సంస్థల విశ్లేషణాత్మక చరిత్రను గతంలో ఇదే కాలమ్ (ఆగస్టు 13, ‘స్వేచ్ఛా భారతంలో..

స్వతంత్ర భారతికి అక్షర దర్పణాలు

స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామిక సంస్థల విశ్లేషణాత్మక చరిత్రను గతంలో ఇదే కాలమ్ (ఆగస్టు 13, ‘స్వేచ్ఛా భారతంలో తెగని శృంఖలాలు’)లో సంక్షిప్తంగా సమకూర్చాను. ఇప్పుడు, మన రిపబ్లిక్ సాఫల్య వైఫల్యాలను అర్థం చేసుకోవడానికి నాకు ఉపయోగపడిన పుస్తకాల జాబితా నొకదాన్ని సమర్పిస్తున్నాను. నేను ఎంపిక చేసిన 50 పుస్తకాల జాబితా ‘భారతదేశ చరిత్ర’కు కాకుండా ‘స్వతంత్ర భారతదేశం’కు సంబంధించినది మాత్రమే. పుస్తక ప్రచురణ సంవత్సరాన్ని బ్రాకెట్‌లో పేర్కొన్నాను.


గ్రాన్ విల్లె ఆస్టిన్ ‘ది ఇండియన్ కానిస్టిట్యూషన్: కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ రిపబ్లిక్’ (1966)తో నా జాబితా ప్రారంభమవుతుంది. భారత రాజ్యాంగ సభ చర్చలపై ఇదొక ప్రసిద్ధ పుస్తకం. దీనితో పాటు, సామాజిక శాస్త్ర దృక్పథంతో నీరజా గోపాల్ జయాల్ రాసిన ‘సిటిజన్‌షిప్ అండ్ ఇట్స్ డిస్‌కంటెంట్స్: ఏన్ ఇండియన్ హిస్టరీ’ (2013) మరొకటి. స్వతంత్ర భారతదేశ మొదటి దశాబ్దంలో చోటుచేసుకున్న సంస్థానాల విలీనంపై ఇప్పటికీ అత్యుత్తమ పుస్తకం వి.పి.మీనన్ ‘ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్’ (1956). సర్దార్ పటేల్‌తో కలిసి పనిచేసిన సివిల్ సర్వెంట్ మీనన్. భాషా ప్రయుక్త రాష్ట్రాల విషయానికి వస్తే రాబర్ట్ డి. కింగ్ రాసిన ‘నెహ్రూ అండ్ ది లాంగ్వేజ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా’ (1977)ను చదవాలి. చరిత్ర నిర్మాతల జీవిత చరిత్రల్లో ముఖ్యమైనవి వాల్టెర్ క్రోస్కెర్ రాసిన ‘నెహ్రూ: ఏ కాంటెంపొరరీస్ ఎస్టిమేట్’ (1966), రాజ్‌మోహన్ గాంధీ ‘పటేల్ : ఏ లైఫ్’ (1990), కేథరిన్ ఫ్రాంక్ ‘ఇందిర : ది లైఫ్ ఆఫ్ ఇందిరా నెహ్రూ గాంధీ’ (2001), సి.పి. శ్రీవాస్తవ ‘లాల్ బహదూర్ శాస్త్రి’ (1955), ధనంజయ్ కీర్ ‘అంబేడ్కర్’ (రివైజ్‌డ్ ఎడిషన్ 1990), అలన్, వెండీ స్కార్ఫెల జె.పి: హిజ్ బయోగ్రఫీ (1975), ఎలెన్ కరోల్ డుబాస్, వినయ్ లాల్‌ల సంయుక్త సంపాదకత్వంలో వెలువడిన ‘ఏ ప్యాషనేట్ లైఫ్ : రైటింగ్స్ బై అండ్ ఆన్ కమలాదేవి ఛటోపాధ్యాయ’ (2017). స్వాతంత్ర్యం లభించిన కొద్ది నెలలకే కన్నుమూసిన మహాత్ముడి అజరామర ప్రభావంపై ఆసక్తి ఉన్నవారు రజని బక్షి ‘బాపు కుటి: జర్నీస్ ఇన్ రీ డిస్కవరీ ఆఫ్ గాంధీ’ (1998) గ్రంథాన్ని తప్పక చదవాలి.


అంబేడ్కర్, నెహ్రూలు స్వతంత్ర భారతదేశ విఖ్యాత రాజనీతిజ్ఞులు. వాలెరియన్ రోడ్రిగస్ సంపాదకత్వంలో వెలువడిన ‘ది ఎస్సెన్షియల్ రైటింగ్స్ ఆఫ్ బి.ఆర్. అంబేడ్కర్’ (2002), పురుషోత్తమ్ అగర్వాల్ సంపాదకత్వంలో వెలువడిన ‘హూ ఈజ్ భారత్‌మాత? హిస్టరీ, కల్చర్ అండ్ ది ఐడియా ఆఫ్ ఇండియా : రైటింగ్స్ బై అండ్ ఆన్ జవహర్‌లాల్ నెహ్రూ’ (2019)ను చదవాలి. ఇటీవలి కాలంలో ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఎమ్ఎస్ గోల్వాల్కర్ ప్రభావం బాగా పెరిగింది కనుక, ఆయన రచనల, ఉపన్యాసాల సంకలనం ‘ఏ బంచ్ ఆఫ్ థాట్స్’ (1966)ను కూడా ఈ జాబితాలో చేరుస్తున్నాను. స్వతంత్ర భారతదేశ రాజకీయ పరిణామాల గురించి ‘ఆక్స్‌ఫర్డ్ కంపానియన్ టు ఇండియన్ పాలిటిక్స్’ (2010) ప్రశస్తంగా సమీక్షించింది. వయోజన ఓటింగ్ హక్కు ఎందుకు కల్పించారనేది అర్థం చేసుకునేందుకు ఆర్నిట్ షాని ‘హౌ ఇండియా బి కేమ్ డెమోక్రాటిక్’ (2017) చదవాలి. ఎన్నికల రాజకీయాల భ్రష్ట ధోరణులను మిలాన్ వైష్ణవ్ ‘వెన్ క్రైమ్ పేస్ : మనీ అండ్ మజిల్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’ (2017) మన కళ్ళకు కట్టిస్తుంది. ఆరెస్సెస్‌పై ఇప్పటికీ అత్యుత్తమ గ్రంథం దేశ్‌రాజ్ గోయల్ రచన ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (1979).


స్వతంత్ర భారతదేశ ఆర్థిక విధాన చరిత్రను ఫ్రాన్సినె ఫ్రాంకెల్ తన ‘ఇండియాస్ పొలిటికల్ ఎకానమీ, 1947– 2004’ చక్కగా వివరించారు. వర్తమాన భారతదేశ ఆర్థిక సవాళ్లను నౌషాద్ ఫోర్బెస్ తన ‘ది స్ట్రగుల్ అండ్ ది ప్రామిస్ : రెస్టోరింగ్ ఇండియాస్ పొటెన్షియల్’ (2022) వివరించారు. రక్షణ, విదేశాంగ విధానాల ప్రశస్త సమీక్షలను వరుసగా శ్రీనాథ్ రాఘవన్ ‘వార్ అండ్ పీస్ ఇన్ మోడరన్ ఇండియా’ (2009)లోనూ, శివ శంకర్ మీనన్ ‘ఛాయిసెస్ : ఇన్‌సైడ్ ది మేకింగ్స్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ’ (2016)లో చూడవచ్చు. చైనాతో మన జటిల సంబంధాలను కాంతి బాజ్‌పాయి తన ‘ఇండియా వెర్సెస్ చైనా: వై దే ఆర్ నాట్ ఫ్రెండ్స్’ (2021)లో వివరించారు.


స్వతంత్ర భారత రాజ్య వ్యవస్థ పునాదులు పార్లమెంటు, సుప్రీంకోర్టు, సివిల్ సర్వీస్‌లు. ఈ సంస్థల, వ్యవస్థల పాత్రను దేవేష్ కపూర్, ప్రతాప్‌భాను మెహతా, మిలాన్ వైష్ణవ్‌లు ‘రీ థింకింగ్ పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా’ (2019)లో ప్రతిభావంతంగా విశ్లేషించారు. మన సాయుధ బలగాల గురించి స్టీవెన్ విల్కిన్సన్ ‘ఆర్మీ అండ్ నేషన్: ది మిలిటరీ అండ్ ఇండియన్ డెమోక్రసీ’ (2015) విశ్లేషించారు. నరేంద్ర మోదీ ప్రాభవాలకు పూర్వం మీడియా పరిణామాత్మక చరిత్రను రాబిన్ జెఫ్రీ ‘ఇండియాస్ న్యూస్ పేపర్ రివొల్యూషన్ : క్యాపిటలిజం, పాలిటిక్స్ అండ్ ది ఇండియన్ లాంగ్వేజ్’ (2000)లో విశ్లేషించారు.


గ్రామీణ భారతంలో కుల వ్యవస్థ పోకడలపై భారతీయ సామాజిక శాస్త్రవేత్త ఎమ్ఎన్ శ్రీనివాస్ రాసిన ‘ది రిమెంబర్డ్ విలేజ్’ (1977), డచ్ స్కాలర్ జన్ బ్రెమన్ గ్రంథం ‘ప్యాట్రనేజ్ అండ్ ఎక్సప్లాయిటేషన్’ (1974) ప్రామాణికమైనవి. ముస్లింల స్థితిగతులపై ముషిరుల్ హసన్ రాసిన ‘లెగసీ ఆఫ్ ఏ డివైడెడ్ నేషన్ : ఇండియాస్ ముస్లిమ్స్ సిన్స్ ఇండిపెండెన్స్’ (1977); ఆదివాసుల సమస్యలపై నందినీ సుందర్ సంపాదకత్వంలో వెలువడిన ‘ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ దైర్ ఇండియా’ (2016) ముఖ్యమైనవి. ఏ రాష్ట్రానికి సంబంధించీ సమగ్ర పరిశోధనాత్మక చరిత్రలు పెద్దగా వెలువడలేదు. అయితే రాబిన్ జెఫ్రీ పుస్తకం ‘పొలిటిక్స్, ఉమెన్, అండ్ వెల్–బీయింగ్ : హౌ కేరళ బికేమ్ ఏ మోడల్’ (1992), తమిళనాడు గురించి నరేంద్ర సుబ్రమణియన్ రాసిన ‘ఎథ్నిసిటీ అండ్ పాపులిస్ట్ మోబిలైజేషన్’ (1999) అందుకు మినహాయింపు.


సామాజిక ఉద్యమాలకు సంబంధించి డి.ఆర్.నాగరాజ్ ‘ది ఫ్లేమింగ్ ఫీట్ : ది దళిత్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియా’ (2010), మహిళా ఉద్యమంపై రాధాకుమార్ ‘ఎ హిస్టరీ ఆఫ్ డూయింగ్ : ఏన్ ఇల్లస్ట్రేటెడ్ ఎకౌంట్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఫర్ ఉమెన్స్ రైట్స్ అండ్ ఫెమినిజం’ (1993) వెనుకబడిన కులాల పోరాటాలపై క్రిష్టోఫె జెఫ్రిలాట్ ‘ఇండియాస్ సైలెంట్ రివొల్యూషన్’ (2003), పర్యావరణ ఉద్యమంపై శేఖర్ పాఠక్ ‘ది చిప్కో మూవ్‌మెంట్ : ఏ పీపుల్స్ హిస్టరీ’ (2020) ముఖ్యమైనవి.


కశ్మీర్ వివాదంపై ఐదు దశాబ్దాల క్రితమే వెలువడిన శిశిర్ గుప్తా పుస్తకం ‘కశ్మీర్ : ఏ స్టడీ ఇన్ ఇండియా–పాకిస్థాన్ రిలేషన్స్’ (1965) ప్రశస్తమైనది. ఈశాన్య రాష్ట్రాల వేర్పాటు ఉద్యమాలను సంజీవ్ బారువా రాసిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ ది నేషన్ : ఇండియా అండ్ ఇట్స్ నార్త్ ఈస్ట్’ (2020) లోతుగా విశ్లేషించింది. మావోయిస్టు తిరుగుబాట్లు, వాటి విస్తృత పర్యవసానాల గురించి నందినీ సుందర్ పుస్తకం ‘ది బర్నింగ్ ఫారెస్ట్’ (2016) చదవాలి.


జీవితకాల పరిశోధనలు, అధ్యయనాల ఆధారంగా ఇద్దరు విద్యావేత్తలు రాసిన రెండు పుస్తకాలను పేర్కొంటాను. అవి: ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజె రాసిన ‘సెన్స్ అండ్ సాలిడారిటీ : ఝోలావాలా ఎకనామిక్స్ ఫర్ ఎవిరివన్’ (2017); విఖ్యాత సామాజిక శాస్త్రవేత్త ఆండ్రె బెటిల్లె రాసిన ‘క్రానికల్స్ ఆఫ్ అవర్ టైమ్’ (2000). జర్నలిస్టులు రాసిన నాలుగు ఉత్తమ గ్రంథాలు : ముంబై మురికివాడపై కేథరీన్ బూ కథనం ‘బిహైండ్ ది బ్యూటిఫుల్ ఫరెవర్స్’ (2012); గ్రామీణ భారతంలో మనుగడ, సంఘర్షణలపై పాలగుమ్మి సాయినాథ్ విశ్లేషణ ‘ఎవిరిబడీ లవ్స్ ఏ గుడ్ డ్రాట్’; గత సార్వత్రక ఎన్నికలపై రాజ్‌దీప్ సర్దేశాయి విశ్లేషణాత్మక కథనం ‘2019: హౌ మోదీ వన్ ఇండియా’ (2020), విదేశీ పాత్రికేయుడు మార్క్ టుల్లీ వ్యాస సంకలనం ‘నొ ఫుల్‌స్టాప్స్ ఇన్ ఇండియా’ (1991).


నేను ఇష్టపడిన నాలుగు ఆత్మకథల్లో రెండు దళితులు రచించినవి. సుజాత గిడ్ల ఆంగ్లంలో రాసిన ‘యాంట్స్ ఎమాంగ్ ఎలిఫెంట్స్’ (2017) వాటిలో ఒకటి కాగా ఓం ప్రకాష్ వాల్మీకి హిందీలో రాసిన ‘జూథాన్’ మరొకటి. మిగతా రెండు, మధ్యతరగతి ప్రజల జీవన వాస్తవాలను వర్ణిస్తూ పద్మా దేశాయి ఆంగ్లంలో రాసిన ‘బ్రేకింగ్ ఔట్’ (2012), మరొకటి కార్మికవర్గ నేపథ్యంతో మాలికా అమర్ షైఖ్ మరాఠీలో రాసిన ‘ఐ వాంట్ టు డిస్ట్రాయ్ మై సెల్ఫ్’. జెర్రీ పింటో దీన్ని 2019లో ఆంగ్లంలోకి అనుదించారు. పై పుస్తకాలలో కొన్నిటినైనా చదవడానికి ఆసక్తి చూపుతారని నేను ఆశిస్తున్నాను. ఏవో కొన్ని మినహా అన్నీ ప్రింట్‌లో లభ్యమవుతున్నాయి.
Read more