ఆత్మీయతలు పోలేదు, మారాయంతే!

ABN , First Publish Date - 2022-09-25T05:41:04+05:30 IST

‘ఏవీఆ ఆప్యాయతలూ అనురాగాలూ?’ అని నేటి సమాజం వాపోతోంది. మానవ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలలో చోటుచేసుకుంటోన్న విపరీత మార్పులపై...

ఆత్మీయతలు పోలేదు, మారాయంతే!

‘ఏవీఆ ఆప్యాయతలూ అనురాగాలూ?’ అని నేటి సమాజం వాపోతోంది. మానవ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలలో చోటుచేసుకుంటోన్న విపరీత మార్పులపై ఇటీవల మరీ ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి కుటుంబాల కోసం కాగడా పెట్టి వెతికినా కనిపించడంలేదని, బంధుత్వాల్లో అనుబంధాలు సన్నగిల్లిపోతున్నాయని, మనుషుల మధ్య మమతానురాగాలు మాయమైపోతున్నాయని ఎంతో మంది బాధపడుతున్నారు.


మూడు దశాబ్దాల కిందట ఉన్న కుటుంబ సంబంధాలు ప్రస్తుతం లేవన్నది అందరి ఆవేదన. అయితే అప్పటికి మరో ముప్పయ్యేళ్ల కిందట అంటే 1960ల నాటి కుటుంబ అనురాగాల్లోని చిక్కదనం లోపించిందన్న నిష్ఠూరం 1990 దశకం పెద్దవాళ్లలో ధ్వనించేది. ఏతావాతా, గుర్తించాల్సింది ఏమంటే ఏ దశకానికి ఆ దశకంలో కుటుంబ బాంధవ్యాలు పలచన అవుతున్నాయి.


ఈ కాలభ్రమణ వైపరీత్యానికి తగిన ప్రాతిపదిక ఉంది. మనం వ్యవసాయ ఆధారిత (అగ్రేరియన్‌) సమాజం నుంచి పారిశ్రామిక ఆధారిత (ఇండస్ట్రియల్‌) సమాజం మీదుగా సర్వీసెస్‌ (సేవారంగం) ఆధారిత సమాజంలోకి వచ్చాం. అంటే సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ – ఉద్యోగ కల్పన –  ఆదాయ వనరులు, ఆలోచనాసరళి మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంటుంది.


నాటి వ్యవసాయ ఆధారిత సమాజాలు చిన్నచిన్న సమూహాలు, కలిసికట్టు జీవనం, కష్టసుఖాలు పంచుకునే కుటుంబాల కలయికగా ఉండేవి. అవి మమతానురాగాల సంగమం. ఒకరికోసం మరొకరన్న త్యాగనిరతికి సామాజిక దర్పణాలు. అదే పారిశ్రామిక ఆధారిత సమాజాలు కొంత భిన్నం. పరిశ్రమలు ఉత్పత్తికి, మానవశక్తి వినియో గానికి యాంత్రికశక్తి ప్రత్యామ్నాయం. యజమాని, కార్మిక స్పర్థలు, కుటుంబ జీవనంలో ఆ చికాకుల ప్రవేశంతో సహజంగానే మానసిక ఒత్తిడి, స్వార్థ చింతన, స్వలాభాపేక్ష ప్రవేశించాయి. ఆత్మీయ బంధాలకు బీటలు పడ్డాయి.


1990వ దశకంలో ప్రపంచీకరణ పేరుతో విదేశీ సంస్థలు దేశంలోకి ప్రవేశించాయి. వాటితో పాటే అపరిచిత మంచీ చెడులు జమిలిగా మన సమాజంలోకి వచ్చాయి. అప్పటివరకు రూపాయి – రూపాయి లెక్కల్లో చూసుకునే కంపెనీలకు డాలర్లలో ఆర్జింజే మహర్జాతకం పట్టింది. తాము డాలర్లలో గడించి, ఉద్యోగులకు రూపాయల్లో ఇవ్వడంతో నెల వేతనాలు కాస్తా యాన్యువల్‌ ప్యాకేజీలుగా మారాయి. సాంకేతిక విద్యతో యువత ఆదాయాలు ఆకాశానికి ఎగబాకాయి. మధ్య తరగతి ఇళ్లు కళకళలాడాయి పెంకుటిళ్లు సౌధాలయ్యాయి. నైట్‌ పైజమా, లుంగీలు ధరించే తండ్రులు ఓసారి విదేశాలు చుట్టివచ్చి షార్ట్‌ల్లోకి మారారు. కోల్పోయిందేమిటి? టైమ్! సమయం లేదు. ఎవరికీ దేనికీ టైమ్‌ ఉండనంతగా జీవితాలు బిజీ అయ్యాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపకాలు ముగించుకున్న తరువాత మిగిలిన కాస్త సమయాన్ని సొంత భార్యా బిడ్డలకే పరిమితం చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. మమతానురాగాలు మాయం కాలేదు కానీ గుండెలోతుల్లో నిక్షిప్తమయ్యాయి.


సొంత ఊళ్లో నాన్న అస్వస్థతకు లోనయినప్పుడు డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌కై బోస్టన్‌ నుంచి క్యాబ్‌ బుక్‌ చేస్తున్న కొడుకులు – కూతుళ్లు ఎందరో. నాన్న చేయి పట్టుకొని వైద్యుడి దగ్గరకు కుమారుడు తీసుకువెళ్లే 1960 దశకం నాటి రోజులను పునరావృతం ఎలా చేయగలం? అమ్మానాన్నల్లో ఎవరికైనా ప్రాణాలకు ముప్పు ఏర్పడితే పనిచేస్తున్న కంపెనీల్లో బాస్‌లను, టార్గెట్‌లను, అదే పనిగా వచ్చే కాల్స్‌ని పట్టించుకోకుండా ఆగమేఘాలపై బిక్కుబిక్కుమంటూ ఇండియా వచ్చి కార్పొరేట్‌ హాస్పిటల్‌ కారిడార్స్‌లో తిరుగుతున్న కొడుకు, కూతుళ్ల బంధాన్ని ఏమని నిర్వచించగలం?


సమయమే సవాలు. సమయం, భావోద్వేగాలు రెండూ ఒకదానితో ఒకటి ముడివడి ఉన్నాయి. సమయం అపరిమితంగా ఉంటే భావోద్వేగాలు (ఎమోషన్స్‌) విస్తరిస్తాయి. స్వపరివారమంతా వ్యాపిస్తాయి. గతంలో ఇదే చూసాం. ఉమ్మడి కుటుంబాల్లో ఇది సాధ్యమయ్యేది. అయితే సమయం అమూల్యమైనప్పుడు ఆ ప్రేమానురాగాల విస్తరణ భార్యాపిల్లలకే పరిమితమవుతుంది. అవసరం, అవకాశం ఏర్పడినప్పుడే అవి ఇతర పరివారానికి విస్తరిస్తాయి. అందుకే 1960 దశకం నాటి రోజులను ఇప్పుడు మళ్లీ ఊహించలేం. ఇదొక పరిణామక్రమం. కట్టెలపొయ్యిలు పోయి గ్యాస్ స్టౌవు వెలిసినట్టు, ఫిక్స్‌డ్‌ ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌ పోయి మొబైల్‌ వచ్చినట్టు, ఉత్తరాలు చిత్తగించి ఈ– మెయిల్స్‌ ప్రవేశించినట్టు, సైకిల్‌ రిక్షాలు మాయమై క్యాబ్‌లు ప్రవేశించినట్టు... ఈ పరిణామం భవిష్యత్తులోకి నడక. ఇందులో స్వర్గలోక ప్రియాలు ఉంటాయి, నరకలోక అప్రియాలూ అనుభవంలోకి వచ్చేస్తాయి.


గ్రామాలకు గ్రామాలు పట్టణాల పరిష్వంగంలోకి వెళ్లిపోయాయి. కమతాలు కుంచించుకుపోయాయి. కమర్షియల్‌ వెంచర్లకు లొంగిపోయాయి. ఇప్పటి స్వగృహాలు అపార్ట్‌మెంట్‌ సంస్కృతిలో ఇమిడిపోయాయి. మనుషులు విశాల హృదయులు అయినా విశాల గదులు లేని అర్బన్‌ కల్చర్‌లో చుట్టాలు వచ్చి, వేసవి విహారంగా, పట్టుమని పదిరోజులు ఉండగలగడం సాధ్యమా? అదే ఏ వైద్య అవసరాలకో వస్తే గదుల బదులు గుండెల్లో పెట్టుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేదాకా సొంత సౌకర్యాలను వదులుకొని చూసి పంపే మధ్యతరగతి మనుషులు మనమధ్యే ఉన్నారు.


జనరేషన్‌ గ్యాప్‌ అని మనం చెప్పుకునే తరాల మధ్య అంతరాలు ఇప్పుడు బాగా పెరిగాయి. అరవయ్యో దశకం, తొంభయ్యవ దశకాలను నేటి దశకంతో పోల్చి చూస్తే ఈ అగాధం ఇప్పుడే ఎక్కువ. ఆహారం, ఆహార్యం, ఆలోచనా విధానంలో ఇప్పటి తరాన్ని తప్పుపట్టలేం కానీ తమ ముందు తరం కంటే వారు బాగా ముందుకెళ్లిపోయారు. అందుకే అంతరం అమాంతం పెరిగింది. గ్లోబల్‌ కల్చర్‌ ప్రభావమే ఇందుకు కారణం. పుస్తకపఠనం సంస్కృతి నుంచి సామాజిక మాధ్యమాల క్రీనీడల్లోకి నేటితరం వెళ్లిన ఫలితమే కావచ్చు. అందుకే అమ్మానాన్న, కొడుకు–కోడలు, కూతురు–అల్లుడు, మనవళ్లు, మనవరాళ్లు ఒకే గూడు కింద ఉండలేని అనివార్య స్థితి చూస్తున్నాం. రెండు వర్గాలు స్వేచ్ఛ కోరుకుంటున్నప్పుడు ఒకే ముడి వేయడం సమంజసమేనా? దీన్ని అహానికి, మొండితనానికి సర్దుబాటు లేమికి కట్టబెట్టడం సరికాదుగా.


ప్రస్తుత తరుణంలో మనం ఆకాంక్షించాల్సింది ఏమిటి? అమ్మమ్మ, నానమ్మ రోజుల అనురాగ వైభవాలు మళ్లీ సాక్షాత్కరించాలని కాదు. వర్తమానాన్ని చులకనగా చూడటం మానివేయాలి. వర్తమానం పట్ల నిరాశాపూరిత ధోరణి వదలి వేయాలి. మనుషుల మధ్య పెరిగిన దూరాన్ని స్కేలుపెట్టి కొలవకుండా, మానసికంగా సన్నిహితంగా ఉండాలి. సొంతవారితో సంబంధాలను సానుకూల భావాలతో చూడాలి. అప్పుడే అసలైన సమాజం కనువిందు చేస్తుంది. మనసుకు ప్రశాంతి సమకూరుతుంది. ‘మనకు ఎవ్వరూ దూరం కాదు. అందరూ దగ్గరే’ అన్న విశాల భావన హృదిని ఉల్లాసపరుస్తుంది.

ఎస్‌.వి. సురేష్‌

Read more