ఏడాదిన్నర ముందే వేడెక్కుతున్న దేశం!

ABN , First Publish Date - 2022-11-24T02:44:12+05:30 IST

చూడగా చూడగా, తెలంగాణ రాష్ట్రాన్ని జేబులో వేసుకోవడం వాళ్లకు అత్యంత అవసరంగా కనిపిస్తోంది. మునుగోడులో ద్వితీయస్థానమే రేపటి ప్రథమస్థానమన్న సంతృప్తితో ఉత్సాహపడతారని...

ఏడాదిన్నర ముందే వేడెక్కుతున్న దేశం!

చూడగా చూడగా, తెలంగాణ రాష్ట్రాన్ని జేబులో వేసుకోవడం వాళ్లకు అత్యంత అవసరంగా కనిపిస్తోంది. మునుగోడులో ద్వితీయస్థానమే రేపటి ప్రథమస్థానమన్న సంతృప్తితో ఉత్సాహపడతారని, తీరికగా వ్యూహరచన చేస్తూ, అంతిమ లక్ష్యం రెండువేల ఇరవై మూడా, లేక ఇరవై ఎనిమిదా అన్నది నిర్ణయించుకుంటారని అనుకున్నాము. కానీ, విచికిత్సా లేదు, విరామమూ లేదు. వెంటనే రంగంలోకి దిగారు. సమస్త జాతీయసంస్థల పటాలాలు మోహరించాయి. కొనుగోలు కుంభకోణం దర్యాప్తు కొంత రెచ్చగొట్టి ఉండవచ్చును కానీ, ఇంతటి వేగానికి అది కారణం కాదనిపిస్తుంది. మొత్తానికి వాళ్లకు చాలా తొందరగా ఉన్నది.

అందుకు రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి వేడిగా ఉన్నప్పుడే ఇనుమును వంచాలి. తెలంగాణలో రాజకీయ ఉష్ణోగ్రతలు బాగా తీవ్రంగా ఉన్నాయి. వారి అదృష్టవశాత్తూ, కాంగ్రెస్ ఇంకా గోరువెచ్చగానే మిగిలిపోయింది. ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత బాగానే ఉన్నది. అనువైన సమయం కాబట్టి అధికులమనవచ్చునని అనుకోవడంలో బిజెపి తప్పులేదు. మరొక కారణం, 2024 ఎన్నికలు. ఆనాటికి, బిజెపికి లెక్క తక్కువపడవచ్చు. పాత స్థానాలలో నష్టం జరిగితే, కొత్తస్థానాలతో భర్తీ చేసుకోవచ్చు. బిజెపి బలానికి కొత్త చేర్పు ఇవ్వగల రాష్ట్రంగా తెలంగాణ కనిపిస్తున్నది. ఈ రెంటిలోనూ రెండో కారణమే ప్రధానమయినది కావచ్చు. నిజానికి, స్నేహం కుదిరితే, కెసిఆర్ తన లోక్ సభ సీట్లతో బిజెపికి మద్దతు ఇస్తారు, గత వైఖరులను బట్టి చూస్తే, అందుకు ఆయనకు సైద్ధాంతిక అభ్యంతరాలేమీ ఉండవు కూడా. కానీ, అరువు బలం మీద బిజెపికి ఇప్పుడు ఆసక్తి లేదు. తమకు ఇప్పట్లో ఆశ లేని చోట్ల జగన్ మోహన్ రెడ్డి వంటి లొంగుబాటు మిత్రుడు కావాలి కానీ, తెలంగాణలో అవసరం లేదు. బిజెపితో కెసిఆర్ దూరం జరగడం కాదు, బిజెపి కూడా కెసిఆర్ను దూరం పెడుతున్నది, అందువల్లనే కెసిఆర్ తప్పనిసరి యుద్ధం చేయవలసిన పరిస్థితిలో పడ్డారు. అతి ప్రమాదకరమైన యుద్ధంలోకి అనివార్యంగా ప్రవేశించారు. బలాఢ్యుడితో తలపడివలసి వచ్చే బక్కమనిషి మీద జనానికి సానుభూతి ఏర్పడుతుందని బిజెపి గమనించాలి. ఎంపిక చేసిన వేటలు వికటించగలవని గుర్తించాలి.

ఇంతకీ 2024 బిజెపికి ఎందుకు ముఖ్యం? ‘మేం అయిదేళ్లు పాలించిపోవడానికి రాలేదు, యాభై ఏళ్లు పాలించడానికి వచ్చాం’ అని అమిత్ షా అంటుంటారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పటి ఎన్డిఎ -1 లాగా అధికారంలో ఉండడానికి మోదీ, షా లు ఇష్టపడరు. కనీసం 2014 నుంచి 2019 దాకా గడచిన ఎన్డిఎ 2 లాగా ఉండడం కూడా వారికి ఇష్టం లేదు. ప్రస్తుత హయాంలో లోక్ సభలో తిరుగులేని బలం ఉన్నదికానీ, అరకొర రాజ్యసభ ఇబ్బంది పెడుతూనే ఉన్నది. ఆ కొరవ కూడా ఉండకూడదు. కాంగ్రెస్కు ఆ యాభై మంది కూడా ఉండకూడదు. అప్పుడు మాత్రమే వారు అనుకున్న మరి కొన్ని లక్ష్యాలను నెరవేర్చుకోగలరు. 2025లో భారత రిపబ్లిక్ అమృతోత్సవాలు, అదే సంవత్సరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతవార్షికోత్సవాలు. దేశానికి కొత్త రాజ్యాంగం కాకున్నా, రాజ్యాంగానికి కొత్త దిశ, వీలైతే దేశాన్ని హిందూరాష్ట్రగా ప్రకటించడం వంటి పరిణామాలు జరగవచ్చు. అందుకు తిరుగులేని బలం కావాలి. తమ ఉనికి దక్షిణాదిలో కనీసం రెండు రాష్ట్రాలలో బలంగా ఉంటే, అది తాము సంకల్పించిన మౌలిక మార్పులకు విశ్వసనీయత అందిస్తుంది. అందుకని, 2023లో తెలంగాణ ఎన్నికలు బిజెపికి చాలా కీలకం.

సాధారణ ఎన్నికలు జరిగి మూడున్నర సంవత్సరాలు మాత్రమే అయింది. ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయం ఉండగానే, వాతావరణం వేడెక్కడం మొదలయింది. రాహుల్ గాంధీ పాదయాత్ర ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠను మరమ్మత్తు చేయడానికి, తద్వారా, కాంగ్రెస్ సంస్థపై ఆయన పట్టును పెంచి, అంతిమంగా పార్టీకి కొత్త బలం తేవడానికి ఉద్దేశించింది. జాతీయ మీడియా ఆయన ప్రయత్నాన్ని దారుణంగా అప్రధానం చేస్తున్నది. రాహుల్ యాత్ర, దేశంలోని ప్రజాస్వామిక వాదులందరూ ఆహ్వానించవలసిన అంశంగా చెబుతూ, సామాజిక శాస్త్రవేత్త, పాత్రికేయులు యోగేంద్రయాదవ్, పెనుప్రమాదాన్ని నివారించడానికి 2024 ఎన్నికలు తుది అవకాశమని, ఇప్పుడు కాకపోతే, మరెప్పుడూ ఆ అవకాశం రాదని అన్నారు. చివరి అవకాశమని ఆవేశతీవ్రత వల్ల ఆయన వక్కాణించి ఉండవచ్చును కానీ, అనేక ప్రయత్నాలు ఈ యాత్రలో భాగమైపోయి, నిజంగానే మెజారిటీవాద, ఆధిపత్య మతతత్వ శక్తులను బలహీనపరచడానికి అవకాశం దొరుకుతుందని యాదవ్ విశ్వసిస్తున్నారు. ఆయన ఆశిస్తున్నట్టుగానే, అన్నిరాష్ట్రాలలో పౌరసమాజం ప్రతినిధులు యాత్రలో భాగమై, సంఘీభావం చెబుతున్నారు.

యాత్రలో భాగంగా, హైదరాబాద్ వచ్చినప్పుడు, ప్రజాపక్ష మేధావులు కొందరితో కలిసి రాహుల్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం నాకు దొరికింది. చూసిన వెంటనే ఆయనలో వెంటనే గమనించిన అంశం, అలసట లేదు, ఆత్రుత లేదు, తాను చేస్తున్న చిన్న ప్రయత్నం దీర్ఘకాలికంగా ఫలితం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. జనంతో చేస్తున్న ఈ నడక ద్వారా ఆయన చాలా నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా వివిధ శ్రేణుల ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు, అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఎందుకు తెలంగాణలో కూడా యువకులు మతతత్వం వైపు ఆకర్షితులు అవుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. ప్రజావ్యవహారాలలో ఇంతటి అలక్ష్యాన్ని, అహంకారాన్ని ప్రదర్శించే రాష్ట్రప్రభుత్వాన్ని చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు ఎట్లా సహిస్తున్నారు అని ఆయన ఆశ్చర్యపోయారు. మతతత్వ వ్యాప్తి సాంస్కృతిక, సామాజిక మాధ్యమాల ద్వారా అధికంగా జరుగుతున్నప్పుడు, ఆ రంగంలో కాంగ్రెస్ కూడా నిబద్ధ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా అన్న సూచనతో ఆయన ఏకీభవించారు. రాహుల్ చేస్తున్న ప్రయత్నంలో 2024 గురించిన స్పృహ అంతర్లీనంగా ఉండవచ్చును కానీ, ఆ గడువుకు సంబంధించిన ఒత్తిడి ఉన్నట్టు లేదు. ఇంకా దాదాపు మూడునెలల పాటు సాగే యాత్రలోనూ, ఆ తరువాత ఏడాదికి పైగా ఉన్న వ్యవధిలోనూ చాలా జరగవచ్చు. ఆయన సమకూర్చుకున్న మిత్రులు, అనివార్యంగా చేరవలసివచ్చే పొత్తుదారులు ఎందరో సమీకృతమవుతారు. మీడియా వక్రీకరించిన తన ప్రతిబింబాన్ని ఆయన తన శ్రమ ద్వారా, నిబద్ధత ద్వారా సరిదిద్దుకుంటున్నారు. కుటిల విమర్శలు ఆయనకే మేలుచేస్తాయని తెలుసుకుని, సామాజిక మాధ్యమ వీరులు వెనక్కు తగ్గారు. ధైర్యం, ఆర్ద్రత, సంకల్పం నిండిన మాటలు అనేకం ఆయన మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ను నేరుగా ప్రస్తావిస్తూ విమర్శించడం, మోదీ ప్రభుత్వ కార్పొరేట్ మిత్రులను కూడా వేలెత్తి చూపించడం కాంగ్రెస్ నాయకుడిగా రాహుల్ చేస్తున్న సాహసమనే చెప్పాలి. అంతిమంగా ఆయన ఎట్లా పరిణమిస్తాడో తెలియదు కానీ, ఈ చారిత్రక సందర్భంలో మాత్రం, ప్రత్యామ్నాయవాదులకు ఒక ఆధారపడదగిన శక్తిగా రూపుదిద్దుకుంటున్నారు.

ప్రజారంగానికి సంబంధించిన మరొక ఆసక్తికరమైన వ్యక్తిని కలిసిన అనుభవాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఆయన దీపాంకర్ భట్టాచార్య. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ ప్రధానకార్యదర్శి. బిహార్ ఎన్నికల్లో 12 శాసనసభా స్థానాలను గెలుచుకుని దేశవ్యాప్తంగా వామపక్ష అభిమానులను ఉత్సాహపరిచింది ఆయన పార్టీయే. 2024 అన్నది జీవన్మరణ సమస్య ఏమీ కాదంటారు భట్టాచార్య. 2024 తప్పనిసరిగా ఒక అవకాశమే. సందేహం లేదు. కానీ, మళ్లీ బిజెపి గెలిచినంత మాత్రాన దేశమంతా లొంగిపోయి ఉండదు కదా, ప్రయత్నాలు కొనసాగుతాయి అన్నారాయన. ఒకవేళ నరేంద్రమోదీ 2024లో ఓడిపోయినా, పర్యవసానాలు ఏమంత సాఫీగా ఉండవని కూడా ఆయన హెచ్చరించారు. తాను ఓడిపోయిన ఎన్నికను ట్రంప్ అంగీకరించలేదు, కాపిటల్ మీదనే దాడికి ప్రోత్సహించాడు. అమెరికాలోని సమస్త వ్యవస్థలూ ఏకమై అతనిని కట్టడి చేయవలసి వచ్చింది. ప్రజాస్వామిక వ్యవస్థలు బలహీనంగా ఉన్న భారత్లో అంతకు మించిన పరిణామాలు జరగవచ్చునని భట్టాచార్య అన్నారు. ‘1977 నాటి పరిస్థితితో 2024 ను పోలుస్తున్నారు కొందరు, నాటికీ నేటికీ తేడా ఉన్నది. ఎమర్జెన్సీని సడలించి ఇందిరాగాంధీ ఎన్నికలు నిర్వహించారు, మనం అప్రకటిత ఎమర్జెన్సీలోనే 2024 ఎన్నికలను ఎదుర్కొనవలసి ఉన్నద’ని ఆయన హెచ్చరించారు. కలవకపోతే మనుగడ లేదని విభిన్న శక్తులు ఆనాడు సమీకృతమయ్యాయని, ఇప్పుడు కూడా బిజెపియేతర శక్తులు ఆ అవశ్యకతను గుర్తిస్తేనే ఉమ్మడి ప్రయత్నాలు సాధ్యమని భట్టాచార్య చెప్పారు. కాంగ్రెస్ లేని ప్రతిపక్ష ఐక్యతను కెసిఆర్ ఆశించడం సరికాదని అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఓడిస్తే సరిపోదని, వారు సమాజంలోకి జొప్పించిన వాతావరణంతో చాలా కాలం పోరాడాలని అన్నారాయన. ప్రజాస్వామ్యాన్ని అన్ని స్థాయిలలో, అన్ని రంగాలలో పటిష్టం చేయడమే మెరుగైన భవిష్యత్తుకు మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంతకూ, 2024 భారత ప్రజలకు ఏమిటి? ఏ రాజకీయపక్షమూ సుదీర్ఘకాలం అధికారంలో ఉండగలగడం కానీ, మౌలికాంశాలను యథేచ్ఛగా సవరించగలగడం కానీ వాంఛనీయం కాదు. ప్రత్యామ్నాయం, ప్రతిపక్షం ప్రజల హక్కు. విపరీత జనామోదం భయానకమైనదని జర్మనీ అనుభవం చెబుతున్నది. తనను తాను వివేకవంతమైన మార్గంలోకి మళ్లించుకోవడానికి భారతీయ సమాజం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందో, వాటికి లభించే సానుకూలతలు, ప్రతికూలతలు ఏమిటో రానున్న ఏడాదిన్నర ఉద్రిక్తకాలంలో పరిశీలించవచ్చు.

కె. శ్రీనివాస్

Updated Date - 2022-11-24T02:44:12+05:30 IST

Read more