ఫుడ్‌ పాయిజనపై సమగ్ర విచారణ

ABN , First Publish Date - 2022-12-03T23:57:00+05:30 IST

కేజీబీవీలో ఫుడ్‌ పాయిజన విషయంపై సమగ్ర విచారణ చేసి, బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు.

ఫుడ్‌ పాయిజనపై  సమగ్ర విచారణ

ఆహార వస్తువుల శాంపిల్‌ ల్యాబ్‌కు పంపాం.. బాధ్యులపై చర్యలు తప్పవు: కలెక్టర్‌

శింగనమల, డిసెంబరు 3: కేజీబీవీలో ఫుడ్‌ పాయిజన విషయంపై సమగ్ర విచారణ చేసి, బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. శింగనమల కేజీబీవీలో శుక్రవారం స్నాక్స్‌ తిన్న తరువాత 80 మంది విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ శనివారం శింగనమలకు వెళ్లి కేజీబీవీ విద్యార్థులు, వంట ఏజెన్సీ, ఎస్‌ఓతో సమగ్రంగా విచారించారు. వంట గది, మరుగు దొడ్లు, వసతిగృహం, బోధన క్లాస్‌లు, స్టాక్‌ వివరాలు, పాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల వివరాలను అడిగి, వారి పరిస్థితిని తెసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఫుడ్‌ పాయిజనతో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులందరి అరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఫుడ్‌ పాయిజనకు పాలు, పెరుగు కారణమని అనుమా నిస్తున్నామని, పాఠశాలోని పాలు, పెరుగు, ఆయిల్‌, ఇతర వస్తువుల శాంపుల్‌ను ల్యాబ్‌కు పంపామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తప్పవని అన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షణ ప్రాజెక్ఠు పీఓ విద్యాసాగర్‌, డీఎంహెచఓ యుగంధర్‌, ఆర్డీవో మధుసూదన, తహసీల్దార్‌, ఈశ్వరమ్మ, ఎంపీడీవో నిర్మలాకుమారి, మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యాశాఖ ఉలికిపాటు

కేజీబీవీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన విద్యాశాఖను ఉలిక్కిపడేలా చేసింది. శింగనమల కేజీబీవీలో ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో 80 మంది విద్యార్థులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్ర విద్యాశాఖ నుంచి జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారులు ఉలిక్కిపడ్డారు. విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, కమిషనర్‌, ఎస్పీడీ సైతం శుక్రవారం రాత్రి నుంచి ఆరా తీస్తూనే ఉన్నారు. శనివారం ఉదయం సైతం కేజీబీవీల స్టేట్‌ సెక్రెటరీ నాగమణి వెబెక్స్‌ నిర్వహించి సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారులు, ఎస్‌ఓలతో సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. శింగనమల ఘటనపై సమగ్రశిక్ష ప్రాజెక్టు స్టేట్‌ ఉన్నతాధికారులు సైతం సీరియ్‌సగా ఉన్నారు. ఇప్పటికే కేజీబీవీలో ఫుడ్‌ పాయిజన్‌కు కారణమైన ఆహార పదార్థాలను అధికారులు సేకరించి స్పెషల్‌ మిషన్‌ కింద గుంటూరులోని ల్యాబ్‌కు పంపారు.

ఏడుగురికి షోకాజ్‌ నోటీసులు : శింగనమల కేజీబీవీ సిబ్బందిపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. స్థానిక కేజీబీవీ స్టాఫ్‌ నిర్లక్ష్యంపై అధికారులు దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్‌, ఆర్‌జేడీ ఆదేశాల మేరకు ఏపీసీ తిలక్‌ విద్యాసాగర్‌ ఆ కేజీబీవీలోని సిబ్బంది ఏడుగురికి శనివారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కేజీబీవీ ప్రిన్సిపాల్‌ శ్రీలక్ష్మి, సోషల్‌ టీచర్‌, ఏఎన్‌ఎం, నలుగురు వంట మనుషులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో వీటికి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై ఏపీసీ తిలక్‌ విద్యాసాగర్‌ మాట్లాడుతూ షోకాజ్‌ నోటీసులకు వివరణ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2022-12-03T23:57:29+05:30 IST