కుదేలవుతున్న చేనేతరంగం

ABN , First Publish Date - 2022-10-12T06:22:42+05:30 IST

చేనేత రంగం తక్కువ పెట్టుబడితో, కరెంటుతో పనిలేకుండా, పర్యావరణ హితంగా, తక్కువ ఉత్పత్తితో, సృజనాత్మకత జోడించి మార్కెట్ డిమాండుకు అనుగుణంగా ఒక సాంప్రదాయ కులవృత్తిగా...

కుదేలవుతున్న చేనేతరంగం

చేనేత రంగం తక్కువ పెట్టుబడితో, కరెంటుతో పనిలేకుండా, పర్యావరణ హితంగా, తక్కువ ఉత్పత్తితో, సృజనాత్మకత జోడించి మార్కెట్ డిమాండుకు అనుగుణంగా ఒక సాంప్రదాయ కులవృత్తిగా కొనసాగుతోంది. అయినా దేశంలో మనిషికి బట్టకట్టించి నాగరికత నేర్పిన నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడడం మానవతావాదులను ఆందోళనపరుస్తోంది. 2019–20లో చేపట్టిన నాల్గవ ఆల్ ఇండియా హాండ్లూమ్ సెన్సెస్ ప్రకారం, దేశంలో 35లక్షల చేనేత కార్మికులు ఉండగా, వారిలో 89 శాతం మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. అంటే చేనేత రంగం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత ప్రధాన వృత్తిగా కొనసాగుతూ, కుటీర పరిశ్రమగా మహిళలకు ఉపాధి మార్గాలు కల్పిస్తున్నదన్నమాట. కుటుంబం మొత్తం పనిచేసినా కూడా, వీరి సంపాదన నెలకు ఐదు వేల రూపాయల కంటే తక్కువగా ఉంటుంది. రాష్ట్రాలపరంగా చూస్తే అస్సాం 10 లక్షల నేత కార్మికులతో మొదటి స్థానంలో ఉండగా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2 లక్షలకు పైగా నేత కార్మికులు ఉన్నారు. 


2009–10లో చేపట్టిన మూడవ ఆల్ ఇండియా హాండ్లూమ్ సెన్సెస్ ప్రకారం, 1995–2010 మధ్య కాలంలో దాదాపు మూడు లక్షల నేత కార్మికులు తగ్గిపోయారు. కానీ నాల్గవ ఆల్ ఇండియా హాండ్లూమ్ సెన్సెస్ ప్రకారం, చేనేతపై ఆధారపడ్డ కుటుంబాలు మూడు లక్షలకు పైగా పెరిగాయి. ఇక మగ్గాలపై జరిగిన వస్త్రోత్పత్తికి వస్తే, 2013–14లో 7,104 మిలియన్ చదరపు మీటర్లు ఉండగా, 2018–19 నాటికి 5,134 మిలియన్ చదరపు మీటర్లకు తగ్గింది.


ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలు వివిధ రకాల చేనేత వస్త్రాలకు ప్రసిద్ధిగాంచాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి, బందరు, బందరులంక, మంగళగిరి, చీరాల, మాధవరం ప్రాంతాలు పట్టు చీరలకు ప్రఖ్యాతి కాగా, పోలవరం, పెడన కళంకారి చీరలకు; ఏలూరు కార్పెట్లకు; పొందూరు ఖద్దరు చీరలు, వస్త్రాలకు; ఎమ్మిగనూరు, కొడుమూరు ప్రాంతాలు లుంగీలు, బెడ్ షీట్లు, షర్టింగ్ వస్త్రాలకు పేరెన్నికగన్నాయి. తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్ చీరలకు, గద్వాల పట్టుచీరలకు, నారాయణపేట కాటన్ చీరలకు, వరంగల్, కరీంనగర్ తువ్వాళ్ళు, లుంగీలు, బెడ్ షీట్లకు ప్రసిద్ధికెక్కాయి. తెలంగాణ నుంచి తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి చేరే ఏకైక కానుక గద్వాల (ఏరువాడ) జోడు పంచెలు ఒక్కటే. వీటిని గత 400 ఏళ్ల నుంచి గద్వాల సంస్థాన రాజులు స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దసరాలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో, మొదటిరోజున స్వామివారి మూలవిరాట్టుకు ఈ ఏరువాడ పంచెలనే ధరింపజేస్తారు. వీటిని ఐదుగురు నేత కార్మికులు 45 రోజులు అత్యంత నిష్ఠతో నామాల మగ్గంపై నేస్తారు. 11 గజాల పొడవు, 22 ఇంచుల వెడల్పుగల ఈ జోడు పంచెలను బ్రహ్మోత్సవాలకు ముందే ఒక నేతకార్మికుడు ఆలయ ప్రధానార్చకులకు అప్పగిప్తాడు. ఇది పద్మశాలీలకు, ముఖ్యంగా చేనేత వృత్తికి, నేతన్నలకు దక్కిన ఒక అరుదైన వరం, అవకాశం, గుర్తింపు, గౌరవం. ఇలా తెలుగుప్రాంతాలు భౌగోళికంగా ఈ మధ్యనే రెండు రాష్ట్రాలైనప్పటికీ, ఏడుకొండల వెంకన్నకు గద్వాల నేతన్నకు మాత్రం ఆ ఆధ్యాత్మిక అనుబంధం ఎప్పటినుంచో ఉంది.


ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 72 రకాల చేనేత ఉత్పత్తులకు, ఆరు రకాల లోగోలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జి‌ఐ) గుర్తింపును ఇచ్చింది. అరవయ్యేళ్ళు పైబడి, ఒక లక్ష కంటే తక్కువ సంవత్సర ఆదాయం కలిగి పద్మశ్రీగానీ, సంత్ కబీర్ గానీ, ఇంకా ఏదైనా జాతీయ/రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన నేత కార్మికులకు నెలకు 8వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. యుపిఏ ప్రభుత్వ హయాంలో నేత కార్మికులకే ప్రత్యేకంగా రూపొందించి, అమలుపరిచిన ‘మహాత్మాగాంధీ బున్కర్ భీమా యోజన’ స్థానంలో, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం 2017 నుంచి కొత్తగా రెండు పథకాలను తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘ముద్ర’ పథకం కింద 23 శాతం నేత కార్మికులకు మాత్రమే బ్యాంకులు లోన్ మంజూరు చేశాయి. చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులుచూస్తే, అసలు ప్రభుత్వం ఆ రంగాన్ని గాలికి వొదిలేసినట్లేనని అనిపిస్తుంది. 2014–15లో చేనేత రంగానికి కేంద్రం రూ.621 కోట్లు కేటాయించగా, 2018–19 నాటికి కేవలం రూ.386 కోట్లు విదిలించింది. ఆనాడు బ్రిటిష్ కాలంలో చేనేతరంగాన్ని బతికించడానికి మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని తీసుకువస్తే, నేడు 75 వసంతాల స్వతంత్ర భారతావనిలో ‘ఆజాదీకా అమృత్ మహోత్సవాల’ వేళ, చేనేతరంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం 5శాతం జి‌ఎస్‌టీ విధించి ఆయువుతీసేలా వ్యవహరిస్తోంది. అసలే అంతంత మాత్రంగా కొనుగోళ్ళు జరిగే చేనేత వస్త్రాలపై జి‌ఎస్‌టీ వల్ల సమీప భవిష్యత్తులో లక్షలాది నేతకార్మికులు రోడ్డునపడే దుస్థితి రానున్నది. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి పథకాలతో స్వదేశీ వస్తువులను విరివిగా వాడాలని చెప్పే కేంద్ర ప్రభుత్వమే చేనేత వస్త్రాలపై పన్ను వేయడం నేత కార్మికులను విస్మయానికి గురిచేసింది. ఈ పరిస్థితిలో ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతపై వేసిన జి‌ఎస్‌టీ రద్దయ్యేవరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి. అప్పుడే రెండు రాష్ట్రాల్లో కుదేలవుతున్న చేనేతరంగం బతికి బట్టకడుతుంది.

శ్రీరాములు గోసికొండ

నర్సీ మోంజీ డీమ్డ్ యూనివర్సిటీ, హైదరాబాద్

Updated Date - 2022-10-12T06:22:42+05:30 IST