Youtuber couple: వ్యాపారవేత్తకు యూట్యూబర్ కపుల్ హనీ ట్రాప్.. ఎంతలా ప్లాన్ వేశారంటే?

ABN , First Publish Date - 2022-11-27T19:14:42+05:30 IST

‘ఈజీ మనీ’కి అలవాటు పడిపోయిన చాలామంది చెమట చుక్క చిందించకుండానే డబ్బులు సంపాదించేయాలని

Youtuber couple: వ్యాపారవేత్తకు యూట్యూబర్ కపుల్ హనీ ట్రాప్.. ఎంతలా ప్లాన్ వేశారంటే?
couple

న్యూఢిల్లీ: ‘ఈజీ మనీ’కి అలవాటు పడిపోయిన చాలామంది చెమట చుక్క చిందించకుండానే డబ్బులు సంపాదించేయాలని కలలు కంటూ ఉంటారు. ఈ క్రమంలో తమ ప్లాన్లను అమలు చేసి ఏదో ఒక సందర్భంలో పట్టుబడి ఊచలు లెక్కపెట్టుకుంటూ ఉంటారు. తాము చేస్తున్నది తప్పని, దొరికిపోక తప్పదని తెలిసి కూడా డబ్బు ఆశ వారిని వక్రమార్గంవైపు నడిపిస్తూ ఉంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనే ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది.

యూట్యూబ్‌(Youtube)లో పాప్యులర్ అయిన ఓ జంట ఓ వ్యాపారవేత్తను హనీట్రాప్ (Honey Trape) చేసి రూ. 80 వేలు గుంజుకుంది. డబ్బులు ఇవ్వకుంటే అత్యాచారం కేసు పెడతామని బెదిరించడంతో వారు అడిగినంత సమర్పించుకోక తప్పలేదు. బాధితుడిది గురుగ్రామ్ జిల్లాలోని బడాషాపూర్‌. ఓ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయనకు ఢిల్లీలోని షాలిమర్ బాగ్‌కు చెందిన నామ్రా కాదిర్‌తో పరిచయం ఏర్పడింది. వర్క్ విషయంలో మాట్లాడుకుందామంటూ సోహ్నా రోడ్‌లోని ఓ హోటల్‌లో కొన్ని నెలల క్రితం కలుసుకున్నారు. ఆమె వెంట విరాట్ అలియాస్ మనీష్ బేనివాల్ కూడా వచ్చాడు.

బాధితుడి కథనం ప్రకారం.. వ్యాపార ప్రయోజనాల నిమిత్తం కాదిర్‌కు రూ. 2.50 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత పని ఎంత వరకు వచ్చిందని ఆమెను ప్రశ్నించాడు. ఆ విషయాన్ని పక్కనపెట్టిన ఆమె వ్యాపారవేత్త వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. ఆ తర్వాతి నుంచి ఇద్దరూ స్నేహితులుగా మారిపోయారు. ఆ పరిచయం మరింత ముదిరి పాకానపడింది. వ్యాపారవేత్త రాత్రిళ్లు కాదిర్ వద్ద గడిపేవాడు. వారిద్దరూ ఏకంతంగా ఉన్న సమయంలో రహస్యంగా విరాట్ వీడియోలు, ఫొటోలు తీసేవాడు.

ఆ తర్వాతి నుంచి ఆ జంట ఆ ఫొటోలను చూపించి వ్యాపారవేత్తను బెదిరించడం మొదలుపెట్టింది. అత్యాచారం కేసు పెడతానని బెదిరించి వ్యాపారవేత్త నుంచి నామ్రా రూ. 80 వేలకు పైగా వసూలు చేసింది. అయినప్పటికీ వారి ఆగడాలు మితిమీరడంతో ఇక లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారవేత్త ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్టోబరు 10న యూట్యూబర్ జంటకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ జంట మధ్యంతర బెయిలు కోసం గురుగ్రామ్ కోర్టును ఆశ్రయించింది. అయితే, ముందస్తు బెయిలు కోసం వారు పెట్టుకున్న దరఖాస్తును కోర్టు కొట్టేసింది. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-11-27T19:16:44+05:30 IST