తుపాకీతో కాల్చుకుని Police ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-19T14:10:37+05:30 IST

కడలూరు జిల్లా చిదంబరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడలూరు జిల్లా చిదంబరం సమీపం చంద్రకిలై గ్రామానికి

తుపాకీతో కాల్చుకుని Police ఆత్మహత్య

పెరంబూర్‌(చెన్నై): కడలూరు జిల్లా చిదంబరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడలూరు జిల్లా చిదంబరం సమీపం చంద్రకిలై గ్రామానికి చెందిన పెరియస్వామి (26) జిల్లా సాయుధ దళంలో పోలీసుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న 10,11,12 పబ్లిక్‌ పరీక్షల బందోబస్తు విధుల్లో పెరియస్వామి పాల్గొంటున్నాడు.  చిదంబరం తిల్లై నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు ఉంచిన గది వద్ద విధులు నిర్వహిస్తుండగా, బుధవారం ఉదయం హఠాత్తుగా తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ శక్తిగణేశ్‌ పరిశీలించి, పెరియస్వామితో కలసి విధులు నిర్వహిస్తున్న రాజ్‌కుమార్‌ను విచారించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పెరియస్వామికి నిశ్చితార్థమై వచ్చే నెల 10వ తేదీ వివాహం జరుగనుందన్నారు. కొద్దిరోజుల క్రితం ప్రమాదానికి గురైన అతడు సెలవుపై ఉంటూ రెండు రోజుల కిత్రం విధుల్లో చేరారని తెలిపారు. అతడి ఆత్మహత్యకు ప్రేమ, వివాహం కారణమని ప్రాథమి విచారణలో తెలిసిందని ఎస్పీ తెలిపారు.


దిండుగల్‌లో ఎస్‌ఐ..

దిండుగల్‌ జిల్లా నత్తం సమీపం వత్తిపట్టికి చెందిన జీవరాజ్‌ (45) పళని 14వ బెటాలియన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు తరచూ భార్యతో గొడవలు పడుతుండడం, విధులకు కూడా మద్యం సేవించి రావడంతో అధికారులు సస్పెండ్‌ చేశారు. మనస్తాపం చెందిన జీవరాజ్‌ ఈ నెల 14న ఇంట్లో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు, బంధువులు అతడిని దిండుగల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్సలు ఫలించక బుధవారం  మృతిచెందాడు. ఈ ఘటనపై నత్తం పోలీసులు కేసు నమోదుచేశారు.


సిరుముగైలో కానిస్టేబుల్‌..

చెన్నై: తూత్తుకుడి జిల్లా విలాంకురిచ్చికి చెందిన దామోదరన్‌ అనే కానిస్టేబుల్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మేట్టుపాళయం డీఎస్పీ కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న దామోదరన్‌ కుటుంబ సభ్యులతో కలిసి సిరుముగై ప్రాంతంలో నివసిస్తున్నాడు. కొద్ది రోజులుగా అతడు విరక్తిగా గడుపుతుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం వేకువజామున దామోదరన్‌ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దామో దరన్‌కు ప్రియ అనే భార్య, ప్రేమిత అనే కుమార్తె, కార్తీక్‌ అనే కుమారుడు ఉన్నారు. పనిభారం ఎక్కువైనందువల్ల దామోదరన్‌ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. సిరుముగై పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Read more