Rajasthan: కుమార్తెను కోచింగ్ సెంటర్‌కు తీసుకెళ్లిన తండ్రి.. మరీ ఇంత దారుణ మరణమా?

ABN , First Publish Date - 2022-12-03T22:01:09+05:30 IST

కోచింగ్ సెంటర్‌లో కుమార్తెను చేర్పించేందుకు అడ్మిషన్ కోసం వెళ్లిన ఓ తండ్రి గ్యాంగ్‌స్టర్ల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి

Rajasthan: కుమార్తెను కోచింగ్ సెంటర్‌కు తీసుకెళ్లిన తండ్రి.. మరీ ఇంత దారుణ మరణమా?
Gangsters

జైపూర్: రాజస్థాన్‌(Rajasthan)లో దారుణం జరిగింది. కోచింగ్ సెంటర్‌లో కుమార్తెను చేర్పించేందుకు అడ్మిషన్ కోసం వెళ్లిన ఓ తండ్రి గ్యాంగ్‌స్టర్ల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శికర్ పట్టణంలోని పిప్రాలి రోడ్డులోని ఉంటున్న కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ రాజు థేట్ (Raju Theth ) ఇంటి వద్దకు శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వచ్చిన నలుగురు దుండగులు అతడిని కాల్చి చంపారు. అయితే, దుండగుల కాల్పుల్లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతడిని తారాచంద్ కద్వసారా (Tarachand Kadwasara)గా గుర్తించారు.

ఓ కోచింగ్ సెంటర్‌లో తన కుమార్తెను చేర్పించేందుకు అడ్మిషన్ కోసమని ఆ ప్రాంతానికి వెళ్లిన తారాచంద్ దుండగుల తూటాలకు బలయ్యాడు. ఈ ఘటనలో ఆయన కజిన్‌కు గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో పలు కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ థేట్ సోదరుడు ఇక్కడ ఓ హాస్టల్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

కాల్పుల ఘటనలో నలుగురు దుండగులు పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాంగ్‌స్టర్ థేట్‌కు షెఖావత్ ప్రాంతానికి చెందిన ప్రత్యర్థి గ్యాంగ్‌తో శత్రుత్వం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు అదే కారణమని భావిస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో నలుగురు వ్యక్తులు తుపాకులతో వీధిలోనే కాల్పుల జరపడం కనిపించింది. ఆ తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పులు జరుపుతున్న సమయంలో ఓ నిందితుడు గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు.

కాగా, థేట్‌ను కాల్చిచంపినది తామేనని గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ప్రకటించాడు. గ్యాంగ్ సభ్యులు ఆనంద్‌పాల్, బల్బీర్ బనుడను చంపినందుకు ప్రతీకారంగా ఈ హత్య చేశామని చెప్పారు. లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్‌‌ సభ్యుడిగా గోదారా ఉన్నాడు. ఆనందపాల్ గ్యాంగ్‌ సభ్యుడైన గ్యాంగ్‌స్టర్ బనడును 2014 జూలైలో బికనెర్ జైలులో మట్టుబెట్టారు.

Updated Date - 2022-12-03T22:01:11+05:30 IST