ముందు రూ.50 వేలు కట్టు.. ఆ తర్వాత మీ ప్రేయసిని రప్పిస్తాం.. ప్రియుడికి తేల్చిచెప్పిన కోర్టు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-11-21T15:32:18+05:30 IST

ఓ యువకుడు తన ప్రేయసి కోసం రాజస్థాన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ముందు రూ.50 వేలు డిపాజిట్ చేయాల్సిందిగా పిటిషనర్‌ను ఆదేశించింది.

ముందు రూ.50 వేలు కట్టు.. ఆ తర్వాత మీ ప్రేయసిని రప్పిస్తాం.. ప్రియుడికి తేల్చిచెప్పిన కోర్టు.. అసలు కథేంటంటే..

రాజస్థాన్‌లోని పాలి జిల్లాకి చెందిన ఓ యువతికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. అనంతరం ఆమెకు సోషల్ మీడియా ద్వారా మరో యువకుడు పరిచయమయ్యాడు. అతడితో ప్రేమాయాణం సాగించిన యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అతడితో పెళ్లికి సిద్ధమైంది. ఆ యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు యువతిని పట్టుకున్నారు. ఆమె స్టేట్‌మెంట్ తీసుకుని తల్లిదండ్రులతో పంపించారు. అయితే ఆ యువకుడు రాజస్థాన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ముందు రూ.50 వేలు డిపాజిట్ చేయాల్సిందిగా పిటిషనర్‌ను ఆదేశించింది.

పాలి జిల్లా సిరియారి గ్రామానికి చెందిన బాలికకు మహేంద్ర అనే యువకుడితో వివాహమైంది. అయితే అతడిని వివాహం చేసుకోవడం ఇమెకు ఇష్టం లేదు. తల్లిదండ్రుల బలవంతం వల్ల ఆమె ఆ వివాహం చేసుకుంది. అనంతరం ఆమెకు సోషల్ మీడియా ద్వారా దినేష్ చౌదరితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. దినేష్‌ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. రిజిస్టర్ వివాహం చేసుకునేందుకు మొత్తం సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువతిని అరెస్ట్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో దినేష్ హైకోర్టును ఆశ్రయించాడు.

తన ప్రియురాలిని ఆమె బంధువులు బందీగా ఉంచారని హైకోర్టులో దినేష్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషనర్ యాభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తే తదుపరి విచారణ తేదీ డిసెంబర్ 2న బాలికను కోర్టులో హాజరు పరుస్తారని ధర్మాసనం తెలిపింది. ఐదు రోజుల్లోపు పిటిషనర్ యాభై వేల రూపాయలు హైకోర్టు రిజిస్ట్రార్‌ వద్ద డిపాజిట్ చేసి ఆ రసీదును అడిషనల్ అడ్వకేట్ జనరల్‌కు చూపించాలని సూచించింది. ఆ రసీదును చూసి సంబంధిత పోలీసు అధికారిని డిసెంబర్ 2వ తేదీన బాలికను కోర్టులో హాజరుపరచవలసిందిగా ఆయన ఆదేశిస్తారని పేర్కొంది.

Updated Date - 2022-11-21T15:32:18+05:30 IST

Read more