మగబిడ్డ కోసం రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అయినా కొడుకు పుట్టకపోవడంతో ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-11-07T15:20:38+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి మగ బిడ్డ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొదటి భార్యకు ముగ్గురూ ఆడపిల్లలే పుట్టడంతో రెండో వివాహం చేసుకున్నాడు. చివరకు..

మగబిడ్డ కోసం రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అయినా కొడుకు పుట్టకపోవడంతో ఏం చేశాడంటే..

సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా లింగ వివక్ష అనేది ఇంకా పూర్తిగా తొలిగిపోలేదు. మగ బిడ్డే కావాలనుకునే తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి మగ బిడ్డ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొదటి భార్యకు ముగ్గురూ ఆడపిల్లలే పుట్టడంతో రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు అసలు పిల్లలే పుట్టలేదు. దీంతో గుళ్లు, బాబాలు, ఆశ్రమాలు చుట్టూ తిరిగాడు. అయినా ఫలితం లేకపోవడంతో దొంగగా మారాడు. రోడ్డు పక్కన నిద్రపోతున్న మహిళ కొడుకును ఎత్తుకెళ్లిపోయాడు. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.

సహరాన్‌పూర్‌కు చెందిన ఓంపాల్ అనే వ్యక్తి రేషన్ డీలర్‌గా పని చేస్తున్నాడు. అతని మొదటి భార్యకు ముగ్గురు కుమార్తెలు పుట్టారు. కొడుకు కావాలనే కోరికతో ఓంపాల్ చాలా చోట్ల తిరిగాడు. పండిట్ నుంచి మౌల్వీ వరకు అందరి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. అనేక ఆశ్రమాలకు కూడా వెళ్ళాడు. కొడుకు కోసం ఓంపాల్ రెండో వివాహం చేసుకున్నాడు. అయితే అతనికి రెండో భార్య నుంచి సంతానం కలగలేదు. దీంతో ఆ రెండో భార్య మనస్థాపానికి గురైంది. ప్రతిరోజూ ఏడుస్తూనే ఉండేది. బిడ్డను దత్తత తీసుకోవాలని పట్టుబట్టింది. దీంతో ఓంపాల్ ఓ ప్లాన్ వేశాడు. భిక్షం ఎత్తుకుని జీవించే మహిళ కొడుకును కిడ్నాప్ చేసి పెంచుకోవాలనుకున్నడు.

బాలుడిని కిడ్నాప్ చేసే పని కోసం రూ.లక్షకు ఓ వ్యక్తితో డీల్ మాట్లాడుకున్నాడు. శుక్రవారం అర్థరాత్రి 12 గంటలకు మిషన్ కాంపౌండ్ క్యాంప్ కాలనీ ఫుట్‌పాత్‌పై పడుక్కున్న హీనా అనే మహిళ 7 నెలల కొడుకును దుండగుడు లాక్కొని పారిపోయాడు. భిక్షం ఎత్తుకునే వారి ఫిర్యాదును పోలీసులు సీరియస్‌గా తీసుకోరని భావించారు. అయితే దొంగ బిడ్డను ఎత్తుకుని పారిపోతుండడం సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. కేవలం 48 గంటల్లో బిడ్డను, అతడిని కిడ్నాప్ చేసిన వారిని పట్టుకున్నారు. బిడ్డను తల్లికి అప్పగించి, నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-11-07T15:20:38+05:30 IST

Read more