డాబా పైన వాటర్ ట్యాంక్‌లో రెండేళ్ల బాలుడి మృతదేహం.. చంపింది ఎవరో తెలిసి నివ్వెరపోయిన పోలీసులు..!

ABN , First Publish Date - 2022-12-01T15:34:38+05:30 IST

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అక్టోబర్‌ 1వ తేదీన ఓ ఇంటి వాటర్‌ ట్యాంక్‌లో రెండేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. రెండు నెలల పాటు కేసును విచారించిన పోలీసులు ఎట్టకేలకు నిందితురాలిని కనిపెట్టారు.

డాబా పైన వాటర్ ట్యాంక్‌లో రెండేళ్ల బాలుడి మృతదేహం.. చంపింది ఎవరో తెలిసి నివ్వెరపోయిన పోలీసులు..!

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అక్టోబర్‌ 1వ తేదీన ఓ ఇంటి వాటర్‌ ట్యాంక్‌లో రెండేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. రెండు నెలల పాటు కేసును విచారించిన పోలీసులు ఎట్టకేలకు నిందితురాలిని కనిపెట్టారు. మేనత్త చేతిలోనే ఆ బాలుడు హతమైనట్టు తేల్చారు. తల్లి మీద కోపంతో రెండేళ్ల చిన్నారిని ఆ మహిళ చంపేసినట్టు కనుగొన్నారు. మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మీనా అనే మహిళ తన భర్త, రెండేళ్ల కొడుకు శివమ్‌తో కలిసి నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసిస్తోంది. అక్టోబర్‌ 1వ తేదీన శివమ్‌ను ఊయలలో వేసి మీనా గేదెలకు మేత వేసేందుకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఊయలలో బాలుడు కనిపించలేదు. శివమ్‌ కోసం మీనా తన ఇంటి చుట్టు పక్కలే కాకుండా, గ్రామమంతా వెతికింది. ఎక్కడా శివమ్ ఆచూకీ కనిపించలేదు. చివరకు డాబా మీద వాటర్ ట్యాంక్‌లో చూడగా అందులో శివమ్ విగత జీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

మీనాను విచారిస్తే ఆమె తన భర్త సోదరి పూనమ్‌పై అనుమానం వ్యక్తం చేసింది. పూనమ్ తనతో ప్రతి విషయానికి గొడవ పడుతుంటుందని చెప్పింది. దీంతో పోలీసులు పూనమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట బుకాయించిన పూనమ్ ఆ తర్వాత అసలు నిజం బయటపెట్టింది. తానే ఊయలలో నిద్రపోతున్న బాలుడిని డాబా పైకి తీసుకెళ్లి ట్యాంక్‌లోకి విసిరేసినట్టు అంగీకరించింది. మీనాతో గొడవ వల్లే శివమ్‌ను చంపేశానని ఒప్పుకుంది. పూనమ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-12-01T15:34:40+05:30 IST